►క్షేత్రస్థాయిలో సమస్యలు పట్టవా?
►జీహెచ్‌ఎంసీ ఉప కమిషనర్‌పై డిప్యూటీ స్పీకర్ ఫైర్
►స్వచ్ఛ హైదరాబాద్‌లో పాల్గొన్న పద్మాదేవేందర్‌రెడ్డి
రామచంద్రాపురం : ‘ప్రజా సమస్యలు పట్టవా?.. మీరు ఉన్నది ఎందుకు?.. ఇంట్లో కూర్చోని జీతాలు తీసుకోవడానికా?’ అంటూ జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్‌పై డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి మండిపడ్డారు. తీరు మారకపోతే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ‘స్వచ్ఛ హైదరాబాద్’లో భాగంగా మంగళవారం రామచంద్రాపురంలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పర్యటించారు. మొదట పాత రామచంద్రాపురానికి వచ్చిన వారితో స్థానికులు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. అనేక ఏళ్లుగా డ్రైనేజీ సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని వాపోయారు.
ఉపకమిషనర్‌కు అనేకసార్లు ఫిర్యాదు చేసినా కనీసం వచ్చి చూడలేదని, ఆమె కార్యాలయానికి ఆనుకొని ఉన్న తమ పరిస్థితే ఇలా ఉంటే.. మిగతా చోట్ల ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని వారు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆమె అక్కడే ఉన్న ఉపకమిషనర్ విజయలక్ష్మిపై మండిపడ్డారు. ‘మీరు ఇంట్లో కూర్చుని జీతాలు తీసుకుంటున్నారా?’ అంటూ ఫైర్ అయ్యారు. ప్రజలు రెండేళ్లుగా ఫిర్యాదు చేస్తూనే ఉన్న ఈ సమస్య పట్టలేదా? అని ఉపకమిషనర్‌ను నిలదీశారు.ఇప్పటికైనా ప్రవర్తన మార్చుకొని క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రజాసమస్యలు పరిష్కరించాలని సూచించారు.
‘ఎక్కడికెళ్లినా ప్రజలు జీహెచ్‌ఎంసీ అధికారులపై ఫిర్యాదు చేస్తున్నారని, మీ వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేలా ఉంది’ అని ఆమె వ్యాఖ్యానించారు. స్వయాన ముఖ్యమంత్రి కేసీఆర్ క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటున్న విషయాన్ని ఆమె గుర్తుచేశారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని డిప్యూటీ స్పీకర్ స్థానికులకు సూచించారు. బయట చెత్త వేసిన వారికి జరిమానా విధించాలని ఆమె అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఆమె ఎల్‌ఐజీ కాలనీలోని చెత్తను ట్రాక్టర్‌లో పోశారు.
స్థానికుల వినతిపత్రాలను స్వీకరించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పుష్పనగేష్ యాదవ్, నాయకులు ఆదర్శ్‌రెడ్డి, కుమార్‌గౌడ్, మోహన్‌రెడ్డి, బురుగడ్డ నగేష్, పృథ్వీ, తారా సింగ్ తదితరులు పాల్గొన్నారు.
ఇంట్లో కూర్చోని జీతాలు తీసుకుంటున్నారా?
Published Tue, May 19 2015 11:33 PM | Last Updated on Sat, Aug 11 2018 8:09 PM
Advertisement