Swach hyderabad
-
స్వచ్ఛమే లక్ష్యం
సాక్షి,సిటీబ్యూరో: స్వచ్ఛ నగరం సాధనే లక్ష్యంగా పలు కార్యక్రమాలు అమలు చేస్తున్న జీహెచ్ఎంసీ.. నూరు శాతం ఫలితాలు సాధించేందుకు మరో కొత్త కార్యక్రమానికి సిద్ధమైంది. ఇందుకు అవసరమైన సాంకేతిక సహకారంతో పాటు, అమలు పర్యవేక్షణ బాధ్యతలను ‘ఆస్కి’కి అప్పగించనుంది. నగరంలో నాలుగేళ్లుగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టినప్పటికీ, ఇంటింటికీ రెండు రంగుల చెత్తడబ్బాలు పంపిణీ చేసినా ఆశించిన మేర ప్రయోజనం కనిపించలేదు. దీంతో ఆస్కి సహకారం తీసుకోవాలని జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ముఖ్యంగా చెత్తకు సంబంధించి ప్రజలకు తగిన సమాచారం, అవగాహన కల్పించడంతో పాటు వారి ప్రవర్తనలోనూ మార్పు తేవాలని, దాన్ని ఒకరి నుంచి మరొకరికి విస్తృతంగా వ్యాప్తి చేయాలని భావిస్తోంది. దీన్నే ‘ఇన్ఫర్మేషన్ఎడ్యుకేషన్ అండ్ బిహేవియరల్ చేంజ్ కమ్యూనికేషన్’ (ఐఈసీ అండ్ బీసీసీ)గా వ్యవహరిస్తోంది. ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు–2018కి అనుగుణంగా దీన్ని అమలు చేసేందుకు ‘ఆస్కి’ తగు కార్యాచరణ రూపొందించనుంది. ఇందులో భాగంగా స్వచ్ఛ భారత్ ర్యాంకింగ్స్‌లో దేశంలో అగ్రస్థానం పొందిన ఇండోర్‌లో స్వచ్ఛ కార్యక్రమాల అమలులో పాలుపంచుకున్న సంస్థల సేవలను సైతం వినియోగించుకోనుంది. దీంతోపాటు ఇప్పటికే దక్కించుకున్న ‘ఓడీఎఫ్ డబుల్ ప్లస్’ను నిలబెట్టుకోవడం కూడా కార్యాచరణలో భాగంగా ఉంది. పారిశుధ్య సేవల సక్రమ నిర్వహణ, ఐఈసీ అండ్ బీసీసీ అమలు, అవగాహన కార్యక్రమాల్లో భాగస్వాములయ్యే వారి సామర్థ్యం పెంపు ఆస్కి కార్యాచరణలో ఉన్నాయి. తొలుత అమీర్‌పేట,సోమాజిగూడలో అమలు ఐఈసీ అండ్ బీసీసీ అమలు కోసం స్థానిక ఎన్జీఓలు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ల వలంటీర్ల సేవలను వినియోగించుకుంటారు. ఈ గ్రూపులను స్వచ్ఛ వార్డు యాక్షన్ టీమ్(స్వాట్)గా వ్యవహరిస్తారు. పైలట్ ప్రాజెక్టుగా అమీర్‌పేట, సోమాజిగూడ వార్డుల్లో ఈ కార్యక్రమాన్ని మూడునెలల పాటు అమలు చేస్తారు. క్రమేపీ ఏడాది చివరినాటికి 60 వార్డులకు విస్తిరిస్తారు. ఈ ప్రాజెక్టు నిర్వహణ బాధ్యత అంతా ఆస్కిదే. ఇందుకు ఆస్కి ‘ఎకో ప్రో ఎన్విరాన్మెంటల్ సర్వీసెస్’, ‘బేసిక్స్ మున్సిపల్ వేస్ట్ వెంచర్స్ లిమిటెడ్’ సేవలను వినియోగించుకుంటుంది. వీటికి స్వచ్ఛ కార్యక్రమాల అమల్లో మంచి ట్రాక్ రికార్డు ఉందని, ఇండోర్ వంటి నగరాల్లో వీటి సేవలను వినియోగించుకున్నట్టు సమాచారం. కార్యక్రమాల అమల్లో భాగంగా సదరు ఏజెన్సీలు కనీసం ఏడుగురు నిపుణులను నియమిస్తాయి. ఆర్నెళ్ల పాటు వారు తగిన ప్రణాళికతో పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ మెరుగయ్యేందుకు తమ సేవలను వినియోగిస్తారు. మూడు మాసాల్లో రెండు వార్డుల్లో తగిన ఫలితాలు కనిపించేలా కృషి చేస్తారు. ఇందులో భాగంగా ఇళ్ల వద్దే తడి, పొడి చెత్త, ప్రమాదకర వ్యర్థాలు వందశాతం వేరయ్యేలా చూస్తారు. నగరంలోని అన్ని ఇళ్ల నుంచి చెత్త సేకరణ జరిగేలా పర్యవేక్షిస్తారు. ఇంకా పట్టణ పారిశుధ్యంపై ప్రజలకు తగిన అవగాహన, పారిశుధ్యానికి సంబంధించి ప్రజల వైఖరిలో మార్పు, రోడ్లపై ఎక్కడా చెత్త డబ్బా లేకుండా చేయడం, గార్బేజ్ వల్నరబుల్ పాయింట్ల ఎత్తివేత, పారిశుధ్య కార్మికుల పని సామర్థ్యం పెంపు, అధిక మొత్తాల్లోని చెత్త, డెబ్రిస్ వ్యర్థాల తరలింపులో నూతన విధానాలపై దృష్టి సారించి చర్యలు తీసుకుంటారు. గ్రేటర్‌లోని 150 వార్డుల్లోనూ స్వాట్ టీంలను ఏర్పాటు చేస్తారు. వీటి ద్వారా పారిశుధ్య నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు అమలుకు బాధ్యత వహించేలా చేస్తారు. మొత్తం రెండు దశల్లో ఈ కార్యక్రమాలను అమలు చేయాలనేది లక్ష్యం కాగా, తొలి ఆర్నెళ్లలో సాంకేతిక సహకారంతో పాటు 150 వార్డుల్లో ఐఈసీ అమలు చేస్తారు. వీటితో పాటు మూడునెలల పాటు రెండు వార్డుల్లో (సోమాజిగూడ, అమీర్‌పేట) పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తారు. -
పెనాల్టీ పడుద్ది
సాక్షి, సిటీబ్యూరో: స్వచ్ఛ హైదరాబాద్ అమలులో భాగంగా రోడ్లపై భవన నిర్మాణ వ్యర్థాలు, చెత్త వేసే వారిపై, 50 మైక్రాన్ల కన్నా తక్కువ ప్లాస్టిక్ కవర్లనువినియోగించేవారికి, పారిశుద్ధ్య కార్యక్రమాలకు భంగం కలిగించే వారికి, బహిరంగ మూత్రవిసర్జన చేసేవారికి భారీఎత్తునజరిమానాలు విధించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిశోర్ ఆదేశించారు. స్వచ్ఛత కోసం ఎన్ని కార్యక్రమాలు చేపడుతున్నా, ఎన్ని నిధులు వెచ్చిస్తున్నా పరిస్థితి మూణ్నాళ్ల ముచ్చటే అవుతుండటంతో ఇక భారీ పెనాల్టీలే మార్గమని భావించిన ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు. బుధవారం ‘స్వచ్ఛ సర్వేక్షణ్–2019’ పై అడిషనల్, జోనల్ , డిప్యూటీ కమిషనర్లు, తదితరులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆయా ఉల్లంఘనలకుపాల్పడిన వారికి ఒక్కో సర్కిల్లో కనీసం 500 మందికి తగ్గకుండా భారీ పెనాల్టీలు విధించాలని ఆదేశించారు. భారీగా నీటి వృథా.. నగరంలో ఉదయం పూట ఇళ్లను, వాహనాలను తరచూ కడుగుతూ ఎంతో నీటిని వృథా చేయడమే కాకుండా ఆ నీటిని రోడ్లపై వదలడం ద్వారా రోడ్లు పాడవుతున్నాయన్నారు. నగరానికి ప్రతిరోజు 400 మిలియన్ గ్యాలన్ల నీరు సరఫరా అవుతుండగా , అందులో పది శాతం (40 ఎంజీడీల) నీరు ఇలా వృథా అవుతోందని, తద్వారా దాదాపు రూ. 250కోట్ల విలువైన నీరు వృథా అవుతోందని, రోడ్లు దెబ్బ తింటున్నాయని కమిషనర్ దానకిశోర్ వివరించారు. ఇలా రోడ్లపై నీటిని వదిలేవారితోపాటు వివిధ ఉల్లంఘనలకు పాల్పడేవారిపై కఠినంగా వ్యవహరించాలని, భారీ పెనాల్టీలు విధించాలని సూచించారు. మురికివాడల సుందరీకరణ పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని, బహిరంగ మూత్రవిసర్జన జరగకుండా తగిన చర్యలు చేపట్టాలని కోరారు. వీటితోపాటు మురికివాడల్లో ప్రధాన మార్గాల్లోని గోడలపై అందమైన పెయింటింగ్‌లు వేయించాలని, చెత్త నిల్వ ప్రాంతాల్లో చెత్తను పూర్తిగా తొలగించాలని ఆదేశించారు. నగరంలోని గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లను సుందరీకరించాలని, ప్రతి ట్రాన్స్ఫర్ స్టేషన్‌కు గ్రీన్ టార్పాలిన్ ఫెన్సి ంగ్‌ను వేయించి ట్రాన్స్ఫర్ స్టేషన్లో ఔషధ మొక్కలు, తీగజాతి మొక్కలను నాటడంతో పాటు టాయ్లెట్లను ఏర్పాటు చేసి సక్రమంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఆ హోటళ్లను సీజ్ చేయండి.. నగరంలో ఆహార వ్యర్థాలు, హోటల్ వ్యర్థాలను సివరేజి, నాలాల్లో వేస్తుండటంతో పొంగిపొర్లుతూ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు. అలాంటి హోటళ్లను గుర్తించి సీజ్ చేయాలని ఆదేశించారు. అధిక పరిమాణంలో వ్యర్థాలను ఉత్పత్తిచేసే హోటళ్లలో కంపోస్ట్ యూనిట్లు ఏర్పాటు చేసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. యాభై మైక్రాన్ల కంటే తక్కువ మైక్రాన్ల ప్లాస్టిక్ నిషేధంపై తగినచర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా, పూల బొకేలకు ప్లాస్టిక్ కవర్లను వాడటాన్ని పూర్తిగా నిషేధించాలని, అందుకు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. జనవరి 4వ తేదీ నుండి 31వ తేదీలోగా స్వచ్ఛ సర్వేక్షణ్ బృందాలు నగరంలో ఎప్పుడైనా పర్యటించే అవకాశం ఉన్నందున ఆ బృందం అడిగే ఏడు ప్రశ్నలపై పెద్ద ఎత్తున నగర ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. -
స్వచ్ఛ హైదరాబాద్ పోలీస్ లోగో ఆవిష్కరణ
సాక్షి,హైదరాబాద్: ‘స్వచ్ఛ తెలంగాణ- స్వచ్ఛ హైదరాబాద్’ కోసం పోలీస్ శాఖ ప్రత్యేకంగా లోగో తయారు చేసింది. అదనపు డీజీపీ రాజీవ్ త్రివేది నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర స్పెషల్ పోలీస్ (టీఎస్ఎస్పీ) 1,8 బెటాలియన్లు డీజీ కార్యాలయంలో నిర్వహించిన స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో డీజీపీ అనురాగ్‌శర్మ ఈ లోగోను ఆవిష్కరించారు. అనంతరం డీజీపీ కార్యాలయంలో పోలీసు సిబ్బందిని 14 గ్రూపులుగా విభజించి ఆవరణలోని 14 ప్రాంతాల్లో శుభ్రం చేయించారు. ఈ సందర్భంగా అనురాగ్ శర్మ మాట్లాడుతూ పోలీస్ శాఖ స్వచ్ఛందంగా గత ఆరు రోజుల నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజలతో మమేకమైందన్నారు. -
ఇంట్లో కూర్చోని జీతాలు తీసుకుంటున్నారా?
►క్షేత్రస్థాయిలో సమస్యలు పట్టవా? ►జీహెచ్ఎంసీ ఉప కమిషనర్‌పై డిప్యూటీ స్పీకర్ ఫైర్ ►స్వచ్ఛ హైదరాబాద్‌లో పాల్గొన్న పద్మాదేవేందర్‌రెడ్డి రామచంద్రాపురం : ‘ప్రజా సమస్యలు పట్టవా?.. మీరు ఉన్నది ఎందుకు?.. ఇంట్లో కూర్చోని జీతాలు తీసుకోవడానికా?’ అంటూ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్‌పై డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి మండిపడ్డారు. తీరు మారకపోతే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ‘స్వచ్ఛ హైదరాబాద్’లో భాగంగా మంగళవారం రామచంద్రాపురంలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పర్యటించారు. మొదట పాత రామచంద్రాపురానికి వచ్చిన వారితో స్థానికులు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. అనేక ఏళ్లుగా డ్రైనేజీ సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని వాపోయారు. ఉపకమిషనర్‌కు అనేకసార్లు ఫిర్యాదు చేసినా కనీసం వచ్చి చూడలేదని, ఆమె కార్యాలయానికి ఆనుకొని ఉన్న తమ పరిస్థితే ఇలా ఉంటే.. మిగతా చోట్ల ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని వారు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆమె అక్కడే ఉన్న ఉపకమిషనర్ విజయలక్ష్మిపై మండిపడ్డారు. ‘మీరు ఇంట్లో కూర్చుని జీతాలు తీసుకుంటున్నారా?’ అంటూ ఫైర్ అయ్యారు. ప్రజలు రెండేళ్లుగా ఫిర్యాదు చేస్తూనే ఉన్న ఈ సమస్య పట్టలేదా? అని ఉపకమిషనర్‌ను నిలదీశారు.ఇప్పటికైనా ప్రవర్తన మార్చుకొని క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రజాసమస్యలు పరిష్కరించాలని సూచించారు. ‘ఎక్కడికెళ్లినా ప్రజలు జీహెచ్ఎంసీ అధికారులపై ఫిర్యాదు చేస్తున్నారని, మీ వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేలా ఉంది’ అని ఆమె వ్యాఖ్యానించారు. స్వయాన ముఖ్యమంత్రి కేసీఆర్ క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటున్న విషయాన్ని ఆమె గుర్తుచేశారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని డిప్యూటీ స్పీకర్ స్థానికులకు సూచించారు. బయట చెత్త వేసిన వారికి జరిమానా విధించాలని ఆమె అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఆమె ఎల్ఐజీ కాలనీలోని చెత్తను ట్రాక్టర్లో పోశారు. స్థానికుల వినతిపత్రాలను స్వీకరించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పుష్పనగేష్ యాదవ్, నాయకులు ఆదర్శ్‌రెడ్డి, కుమార్‌గౌడ్, మోహన్‌రెడ్డి, బురుగడ్డ నగేష్, పృథ్వీ, తారా సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
మహేశ్వరం, మలక్‌పేటలలో పర్యటించనున్న కేసీఆర్
హైదరాబాద్: స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మహేశ్వరం నియోజకవర్గంలో ఆర్కేపురం డివిజన్ ఎన్టీఆర్ నగర్లో బుధవారం పర్యటించనున్నారని ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తెలిపారు. సభ కోసం సరూర్‌నగర్ విక్టోరియా మెమోరియల్ పాఠశాల స్థలాన్ని పరిశీలించారు. ముప్పై ఏళ్లుగా ఎన్టీఆర్నగర్ రెగ్యులరైజేషన్ సమస్య పెండింగ్‌లో ఉందని, ఆ బస్తీ వాసులతో ముఖ్యమంత్రి సమావేశమవుతారని ఎమ్మెల్యే తెలిపారు. అదేవిధంగా మలక్‌పేట నియోజకవర్గం చావణీ డివిజన్లోని పిల్లిగుడిసెల ప్రాంతానికి ముఖ్యమంత్రి బుధవారం రానున్నారు. ఆ ప్రాంతంలోని సయీద్ ఫంక్షన్ హాలులో పిల్లగుడిసెల నివాసితులతో ఆయన సమావేశమై సమస్యలను తెలుసుకుంటారు. -
మురుగుకాల్వల నిర్మాణానికి రూ.300 కోట్లు
బంజారాహిల్స్(హైదరాబాద్): రాజధాని నగరంలో మురుగు కాల్వల నిర్మాణానికి రూ.300 కోట్లతో ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని శ్రీరాంనగర్‌లో పర్యటించి స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికీ వెళ్లి మహిళలతో సంభాషించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బస్తీవాసుల సమస్యలను తీర్చేందుకు ఇకపై నెలలో రెండు రోజులు కేటాయిస్తానని వెల్లడించారు. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో రాజకీయాలకతీతంగా అందరూ సహకరిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామనడంలో ఏ మాత్రం సందేహం లేదని పేర్కొన్నారు. వానాకాలం సమీపిస్తున్నందున మురుగు కాల్వల్లో పూడికను తొలగించే కార్యక్రమం చేపట్టాలని జీహెచ్ఎంసీ ఇంజనీర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
స్పాట్లోనే ఫించన్ మంజూరు
-
'రోడ్లు ఊడ్చేవాళ్లే నాకు దేవుళ్లు'
-
రేపట్నుంచే స్వఛ్ఛహైదరాబాద్