రాజధాని నగరంలో మురుగు కాల్వల నిర్మాణానికి రూ.300 కోట్లతో ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు.
బంజారాహిల్స్(హైదరాబాద్): రాజధాని నగరంలో మురుగు కాల్వల నిర్మాణానికి రూ.300 కోట్లతో ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని శ్రీరాంనగర్‌లో పర్యటించి స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికీ వెళ్లి మహిళలతో సంభాషించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బస్తీవాసుల సమస్యలను తీర్చేందుకు ఇకపై నెలలో రెండు రోజులు కేటాయిస్తానని వెల్లడించారు.
స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో రాజకీయాలకతీతంగా అందరూ సహకరిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామనడంలో ఏ మాత్రం సందేహం లేదని పేర్కొన్నారు. వానాకాలం సమీపిస్తున్నందున మురుగు కాల్వల్లో పూడికను తొలగించే కార్యక్రమం చేపట్టాలని జీహెచ్‌ఎంసీ ఇంజనీర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.