అధికారులతో సమావేశంలో మాట్లాడుతున్న దానకిశోర్
సాక్షి, సిటీబ్యూరో: స్వచ్ఛ హైదరాబాద్ అమలులో భాగంగా రోడ్లపై భవన నిర్మాణ వ్యర్థాలు, చెత్త వేసే వారిపై, 50 మైక్రాన్ల కన్నా తక్కువ ప్లాస్టిక్ కవర్లనువినియోగించేవారికి, పారిశుద్ధ్య కార్యక్రమాలకు భంగం కలిగించే వారికి, బహిరంగ మూత్రవిసర్జన చేసేవారికి భారీఎత్తునజరిమానాలు విధించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఎం.దానకిశోర్ ఆదేశించారు. స్వచ్ఛత కోసం ఎన్ని కార్యక్రమాలు చేపడుతున్నా, ఎన్ని నిధులు వెచ్చిస్తున్నా పరిస్థితి మూణ్నాళ్ల ముచ్చటే అవుతుండటంతో ఇక భారీ పెనాల్టీలే మార్గమని భావించిన ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు. బుధవారం ‘స్వచ్ఛ సర్వేక్షణ్–2019’ పై అడిషనల్, జోనల్ , డిప్యూటీ కమిషనర్లు, తదితరులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆయా ఉల్లంఘనలకుపాల్పడిన వారికి ఒక్కో సర్కిల్‌లో కనీసం 500 మందికి తగ్గకుండా భారీ పెనాల్టీలు విధించాలని ఆదేశించారు.
భారీగా నీటి వృథా..
నగరంలో ఉదయం పూట ఇళ్లను, వాహనాలను తరచూ కడుగుతూ ఎంతో నీటిని వృథా చేయడమే కాకుండా ఆ నీటిని రోడ్లపై వదలడం ద్వారా రోడ్లు పాడవుతున్నాయన్నారు. నగరానికి ప్రతిరోజు 400 మిలియన్ గ్యాలన్ల నీరు సరఫరా అవుతుండగా , అందులో పది శాతం (40 ఎంజీడీల) నీరు ఇలా వృథా అవుతోందని, తద్వారా దాదాపు రూ. 250కోట్ల విలువైన నీరు వృథా అవుతోందని, రోడ్లు దెబ్బ తింటున్నాయని కమిషనర్ దానకిశోర్ వివరించారు. ఇలా రోడ్లపై నీటిని వదిలేవారితోపాటు వివిధ ఉల్లంఘనలకు పాల్పడేవారిపై కఠినంగా వ్యవహరించాలని, భారీ పెనాల్టీలు విధించాలని సూచించారు. మురికివాడల సుందరీకరణ పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని, బహిరంగ మూత్రవిసర్జన జరగకుండా తగిన చర్యలు చేపట్టాలని కోరారు. వీటితోపాటు మురికివాడల్లో ప్రధాన మార్గాల్లోని గోడలపై అందమైన పెయింటింగ్‌లు వేయించాలని, చెత్త నిల్వ ప్రాంతాల్లో చెత్తను పూర్తిగా తొలగించాలని ఆదేశించారు. నగరంలోని గార్బేజ్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్లను సుందరీకరించాలని, ప్రతి ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌కు గ్రీన్ టార్పాలిన్ ఫెన్సి ంగ్‌ను వేయించి ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌లో ఔషధ మొక్కలు, తీగజాతి మొక్కలను నాటడంతో పాటు టాయ్‌లెట్లను ఏర్పాటు చేసి సక్రమంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలన్నారు.
ఆ హోటళ్లను సీజ్ చేయండి..
నగరంలో ఆహార వ్యర్థాలు, హోటల్ వ్యర్థాలను సివరేజి, నాలాల్లో వేస్తుండటంతో పొంగిపొర్లుతూ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు. అలాంటి హోటళ్లను గుర్తించి సీజ్ చేయాలని ఆదేశించారు. అధిక పరిమాణంలో వ్యర్థాలను ఉత్పత్తిచేసే హోటళ్లలో కంపోస్ట్ యూనిట్లు ఏర్పాటు చేసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. యాభై మైక్రాన్ల కంటే తక్కువ మైక్రాన్ల ప్లాస్టిక్ నిషేధంపై తగినచర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా, పూల బొకేలకు ప్లాస్టిక్ కవర్లను వాడటాన్ని పూర్తిగా నిషేధించాలని, అందుకు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. జనవరి 4వ తేదీ నుండి 31వ తేదీలోగా స్వచ్ఛ సర్వేక్షణ్ బృందాలు నగరంలో ఎప్పుడైనా పర్యటించే అవకాశం ఉన్నందున ఆ బృందం అడిగే ఏడు ప్రశ్నలపై పెద్ద ఎత్తున నగర ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment