చెరువులను కాపాడుకుందాం | Deputy Speaker Padma devendar reddy about Ponds Restoration | Sakshi
Sakshi News home page

చెరువులను కాపాడుకుందాం

Published Thu, May 21 2015 11:36 PM | Last Updated on Mon, Sep 17 2018 8:04 PM

Deputy Speaker Padma devendar reddy about Ponds Restoration

పునరుద్ధరణ పనులు ఉద్యమంలా చేపడదాం
జర్నలిస్టులు చెరువులు దత్తత తీసుకోవడం అభినందనీయం
డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి
కవలంపేటలో చెరువు పనులు ప్రారంభం

 
 సంగారెడ్డి రూరల్ : గ్రామాలకు జీవనాధారమైన చెరువులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి ఉందని డిప్యూటీ స్పీకర్ పద్మాదే వేందర్‌రెడ్డి అన్నారు. సంగారెడ్డి మండలం క వలంపేట ఊదం చెరువు పునరుద్ధరణకు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(టీయూడబ్ల్యూజే) దత్తత తీసుకొంది. ఈ చెరువు పూడికతీత పనులను గురువారం డిప్యూటీ స్పీకర్ ప్రారంభించారు. టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ... గత 60 ఏళ్ల పాలనలో చెరువులు నిర్లక్ష్యానికి గురయ్యాయన్నారు.

ఫలితంగా చెరువుల ఆధారిత పనులు, వృత్తులు కుంటుపడి వలసలకు దారితీశాయన్నారు. చెరువులను పునరుద్ధరించాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ మిషన్ కాకతీయకు శ్రీకారం చుట్టారన్నారు. ఒక్కప్పుడు తెలంగాణలో 262 టీఎంసీల నీరు 18 లక్షల ఎకరాలకు సాగయ్యేదని, చెరువులు నిర్లక్ష్యానికి గురవడంతో ఆ సంఖ్య కేవలం 3 లక్షల ఎకరాలకు పడిపోయిందన్నారు. దీన్ని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం రాష్ర్టంలో 45 వేల చెరువుల పునరుద్ధరణకు రూ.20 వేల కోట్లను మంజూరు చేసిందన్నారు.

పనులు ఉద్యమంలా సాగాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే పోలీసు శాఖ కిసాన్‌సాగర్ చెరువును దత్తత తీసుకోగా జర్నలిస్టులు ఊదం చెరువును దత్తత తీసుకొనేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. కవలంపేటలో 33/11 కేవీ సబ్‌స్టేషన్ ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

 సమైక్య పాలనలో చెరువుల విధ్వంసం: అల్లం నారాయణ
 సమైక్య పాలనలో చెరువుల విధ్వంసమైనట్టు ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక వాటి పునరుద్ధరణ యజ్ఞంలా సాగుతోందన్నారు. ప్రత్యేక రాష్ర్ట ఉద్యమంలో పనిచేసిన స్ఫూర్తితో చెరువుల పునరుద్ధరణలో కూడా జర్నలిస్టులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

 చెరువుల దత్తతకు జర్నలిస్టులు ముందుకు రావడం సంతోషకరమని కలెక్టర్ రాహుల్ బొజ్జా అన్నారు. పనులు పారదర్శకంగా జరిగేలా పర్యవేక్షించాలన్నారు. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ... రూ.14.50 కోట్లతో నియోజకవర్గంలో 36 చెరువుల పనులు కొనసాగుతున్నాయన్నారు. అనంతరం జర్నలిస్టు వెంకటేశ్‌గౌడ్ రూపొందించిన మిషన్ కాకతీయ పాటల సీడీని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తదితరులు ఆవిష్కరించారు.

కార్యక్రమంలో టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు మురళీధర్ యాదవ్, సంగారెడ్డి జడ్పీటీసీ సభ్యుడు మనోహర్‌గౌడ్, కవలంపేట గ్రామ ఇన్‌చార్జి సర్పంచ్ రవికుమార్, ఎంపీటీసీ విజయలక్ష్మి, టీయూడబ్ల్యూజే రాష్ర్ట ఉపాధ్యక్షుడు పల్లె రవి, కోశాధికారి మారుతీసాగర్, టీ న్యూస్ ఎడిటర్ శ్రీనివాస్, జిల్లా నాయకులు యాదగిరి గౌడ్, జానకీరాం, పరుశరాం,యోగానంద్‌రెడ్డి, విష్ణు, వేణుగోపాల్‌రెడ్డి, ఆంజనేయులు, ధారాసింగ్, టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు శ్రీనివాస్‌చారి, విజయేందర్‌రెడ్డి, నరహరిరెడ్డి, మండల నాయకులు అశోక్, ప్రభాకర్, ఎంపీటీసీ సభ్యులు చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement