పటాన్‌చెరు : అలసత్వంతో పనిచేస్తే చర్యలు తప్పవని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి వైద్యులను, సిబ్బందిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. గురువారం పటాన్‌చెరులో ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. మంత్రి హరీశ్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డితో సహ జిల్లా వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యశాఖ పనితీరు మందగమనంతో సాగుతోందన్నారు. కష్టపడి పనిచేయకపోతే చర్యలు తీసుకుంటామన్నారు. సమీక్షలో మంత్రి హరీశ్‌రావు, పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లా ఆసుపత్రుల్లో నెలకొన్న సమస్యలను మంత్రికి వివరించారు.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి జగన్నాథ్ మాట్లాడుతూ జిల్లాలో 42 మంది అవుట్‌సోర్సింగ్ సిబ్బందిని నియమించాలని కోరారు. అలాగే ఐసీయూ కేంద్రాల ఆవశ్యకతను వివరించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడూతూ పటాన్‌చెరు, సదాశివపేట, గజ్వేల్‌కు ఐసీయూ కేంద్రాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. జోగిపేట, నర్సాపూర్, నారాయణఖేడ్‌లో ఆసుపత్రుల భవనాల నిర్మాణాలను వేగవంతం చేయాలని ఇంజనీరింగ్ విభాగం ఈఈ ఎం.రఘును ఆదేశించారు. జిల్లాకు 18 మంది వైద్య నిపుణులు కావాలని సూచించారు. ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ట్రామాకేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని కోరారు.
పటాన్‌చెరు ఆసుపత్రి పనితీరుపై అసంతృప్తి
పటాన్‌చెరు ఆసుపత్రిలో వైద్యుల పనితీరుపై మంత్రి హరీశ్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. జహీరాబాద్‌లో ఒకే గైనకాలజిస్టు ఉన్నా నెలకు 400వరకు ప్రసవాలు చేస్తున్నారని అన్నారు. పటాన్‌చెరులో హైరిస్క్ కేంద్రం ఉన్నా ప్రసవాలు ఎందుకు జరగడం లేదని ప్రశ్నించారు. పటాన్‌చెరు ఆసుపత్రి ప్రాంగణంలోనే ఉన్న రూరల్ హెల్త్ సెంటర్ వైద్యులు వందపడకల ఆసుపత్రిలో పనిచేయాలని మంత్రులు ఆదేశించారు. అందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేయించాలని మంత్రి లక్ష్మారెడ్డికి విజ్ఞప్తి చేశారు.
డీసీహెచ్‌ఎస్‌పై హరీశ్ ఫైర్
ఏపీ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల కోఆర్డినేటర్ నరేందర్‌బాబుపై మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సమీక్ష సమావే శానికి ఇలాగేనా వచ్చేది. ఆప్రాన్ ఏది? చేతిలో పెన్ను పుస్తకం ఏది? మేం ముఖ్యమంత్రి సమీక్షకు వెళ్తే పెన్ను పుస్తకాలు తీసుకుని వెళ్తాం. చెప్పింది రాసుకుంటాం’ అని ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలను వివరించడంలో నరేందర్‌బాబు విఫల్యం చెందడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎంపీ, ఆర్డీవో పాల్గొన్నారు.
అలసత్వం వీడండి
Published Thu, Aug 6 2015 11:34 PM | Last Updated on Sun, Sep 3 2017 6:55 AM
Advertisement
Advertisement