సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. 18 ఏళ్ల నుంచి 44 ఏళ్ల మధ్య వయసున్న వారికి శనివారం టీకాల పంపిణీ ప్రారంభించారు. మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. రాష్ట్రంలో సూపర్ స్ప్రెడర్స్‌గా ఉన్నవారికి యుద్ధ ప్రాతిపదికన కోవిడ్ టీకాలు ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఆయా రంగాలను గుర్తించి క్రవారం నుంచి కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. కానీ ఈ జాబితాలో ఆర్టీసీని చేర్చకపోవటంతో, శుక్రవారం వివిధ టీకా కేంద్రాలకు వెళ్లిన ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లను అనుమతించలేదు. తక్కువ మంది ప్రయాణికులను తరలించే ఆటో డ్రైవర్లను గుర్తించి, ఎక్కువ మంది ప్రయాణికుల మధ్య ప్రమాదకరంగా విధులు నిర్వర్తిస్తున్న ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లను గుర్తించకపోవటాన్ని ప్రస్తావిస్తూ శనివారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది.
‘ఆటో డ్రైవర్లకిచ్చే.. ఆర్టీసీ డ్రైవర్లను మరిచే’శీర్షికతో ప్రచురితమైన కథనానికి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు స్పందించారు. వెంటనే ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు కూడా టీకాలు వేయాలని, మూడు రోజుల్లో వారందరికీ వ్యాక్సిన్లు ఇవ్వాలంటూ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు చకచకా ఏర్పాట్లు చేసి, శనివారం మధ్యాహ్నం నుంచి టీకాల పంపిణీ ప్రారంభించారు. మొదటి రోజు ఒక్క హైదరాబాద్‌లోనే పంపిణీ చేయగా, ఆదివారం నుంచి జిల్లాల్లో కూడా ప్రారంభిస్తున్నారు. మొదటి రోజు 2,600 మందికి నగరంలోని 15 కేంద్రాల్లో టీకాలు పంపిణీ చేశారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి 12 గంటల వరకు నగరాల్లో, ఉదయం 8 గంటల నుంచి ఒంటి గంట వరకు జిల్లాల్లో టీకాల పంపిణీ ఉంటుందని సమాచారం. మంత్రి హరీశ్‌రావు వెంటనే స్పందించి టీకాల పంపిణీ ప్రారంభించినందుకు కార్మిక సంఘాల నేతలు రాజిరెడ్డి, తిరుపతి, కమాల్‌రెడ్డి, నరేందర్, హన్మంతు, శ్రీనివాసరావు తదితరులు హర్షం వ్యక్తం చేశారు. కార్మికుల కుటుంబసభ్యులకు కూడా టీకాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
Telangana: ఆర్టీసీ సిబ్బందికీ వ్యాక్సినేషన్..
Published Sun, May 30 2021 2:36 AM | Last Updated on Sun, May 30 2021 2:37 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment