సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణ పనులకు రుణం ఇచ్చేందుకు నాబార్డ్ ముందుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ వినతి మేరకు ప్రాజెక్టు నిర్మాణం పనులను పూర్తి చేయడానికి రూ. 4,600 కోట్ల రుణం ఇవ్వనుంది. దీనిపై ప్రభుత్వం నాబార్డ్‌తో త్వరలోనే ఒప్పందం చేసుకోనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన మల్లన్నసాగర్ రిజర్వాయర్ పనులను రూ.6,805 కోట్లతో ఆరంభించారు. 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న ఈ రిజర్వాయర్ పనుల్లో ఏకంగా 13 కోట్ల క్యూబిక్ మీటర్ల మేర మట్టి పని, 60 మీటర్ల ఎత్తుతో కట్ట నిర్మాణం చేయాల్సి ఉంది. ఈ రిజర్వాయర్ కింద అన్ని ప్రధాన చానళ్ల ద్వారా మొత్తం 13 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించే ప్రణాళిక ఉంది. ఈ నేపథ్యంలో రిజర్వాయర్ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఇప్పటికే ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయి. 9.2 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి పనులు పూర్తయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment