ఆలోచన వచ్చింది.. మరుగుదొడ్డే రాలే! | swach bharath mission gos to slow down becouse special officers | Sakshi
Sakshi News home page

ఆలోచన వచ్చింది.. మరుగుదొడ్డే రాలే!

Published Wed, Feb 10 2016 2:17 AM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

ఆలోచన వచ్చింది.. మరుగుదొడ్డే రాలే! - Sakshi

ఆలోచన వచ్చింది.. మరుగుదొడ్డే రాలే!

జిల్లాలో నత్తనడకన ‘స్వచ్ఛ్‌భారత్ మిషన్’
ఇప్పటికీ పూర్తికాని ఎంపిక ప్రక్రియ
పథకాన్ని నీరుగారుస్తున్న ‘ప్రత్యేకాధికారులు’


‘ఆలోచన వస్తే మరుగుదొడ్డి వస్తుంది’.. ఇదీ స్వచ్‌‌ఛ భారత్ మిషన్ సరికొత్త నినాదం. ఈ మిషన్‌లో భాగంగా సంపూర్ణ పారిశుద్ధ్యం కింద కేంద్ర ప్రభుత్వం వేలకొద్ది మరుగుదొడ్లు మంజూరు చేసింది. నిర్మాణ బాధ్యతల్ని అధికారులకు కట్టబెట్టింది. కానీ వారిలో చిత్తశుద్ధిలోపం కారణంగా జిల్లాలో ఈ పథకం నత్త కంటే నెమ్మదిగా సాగుతోంది. 2015- 16 వార్షిక సంవత్సరంలో జిల్లాకు 25,210 మరుగుదొడ్లు మంజూరు కాగా.. వీటిలో ఇప్పటివరకు 1,428 మాత్రమే పూర్తికావడం అధికారుల పనితీరుకు అద్దంపడుతోంది.

సాక్షి, రంగారెడ్డి జిల్లా:  పారిశుద్ధ్యం అందరి బాధ్యత అంటూ కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన స్వచ్ఛ్‌భారత్ మిషన్ (ఎస్‌బీఎమ్) జిల్లాలో నత్తనడకన సాగుతోంది.ఈ మిషన్ కింద పేదలకు వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించేందుకు ప్రభుత్వం రాయితీలు కేటాయించింది. అర్హులైన నిరుపేదలు వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించుకుంటే ప్రభుత్వం రూ.12వేలు సదరు లబ్ధిదారుడికి చెల్లిస్తుంది. ఈ మరుగుదొడ్ల నిర్మాణాలను ఉపాధి హామీ పథకానికి అనుసంధానం చేయడంతోపాటు గ్రామీణ నీటి సరఫరా విభాగానికి కూడా బాధ్యతల్ని అప్పగించింది. ఈ క్రమంలో జిల్లాకు 25,210 మరుగుదొడ్ల యూనిట్లు మంజూరయ్యాయి. కానీ వీటి నిర్మాణంపై అధికారులు దృష్టి సారించకపోవడంతో జిల్లాలో గత నెలాఖరునాటికి కేవలం 1,428 మరుగుదొడ్లు మాత్రమే పూర్తయ్యాయి. మరో 682 యూనిట్లు వివిధ దశల్లో ఉండగా.. 23,100 మరుగుదొడ్ల నిర్మాణ పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు.

 కొలిక్కిరాని ఎంపిక ప్రక్రియ..
స్వచ్ఛ్‌భారత్ మిషన్ కింద లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఇప్పటికీ పూర్తికాలేదు. ఈ కార్యక్రమం కింద గతేడాది నవంబర్‌లో మరుగుదొడ్లు మంజూరయ్యాయి. జిల్లాలో 32 మండలాలను ఈ పథకం కింద ఎంపిక చేసిన యంత్రాంగం.. ఒక్కో మండలంలో ఐదు నుంచి ఆరు గ్రామాలను తీసుకుని ఆ మేరకు లక్ష్యాల్ని పూర్తి చేయాలని భావించింది. ఇందుకుగాను ప్రత్యేకాధికారులను సైతం నియమించింది. అయితే అప్పటినుంచి వరుసగా నవాబ్‌పేట జెడ్పీటీసీ, ఎమ్మెల్సీ ఎన్నికలు.. తాజాగా జీహెచ్‌ఎంసీ ఎన్నికలు వచ్చాయి.

దీంతో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఆదిలోనే నిలిచిపోయింది. ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ పూర్తికావడంతో త్వరలో లబ్ధిదారులను ఎంపిక చేసి యుద్ధప్రాతిపదికన పనులు పూర్తిచేస్తామని అధికారవర్గాలు చెబుతున్నాయి.

 లక్ష్యదూరంలో ఎన్‌బీఏ..
స్వచ్ఛ భారత్ మిషన్‌కు ముందు నిర్మల్ భారత్ అభియాన్(ఎన్‌బీఏ) కింద గత ప్రభుత్వం మరుగుదొడ్ల నిర్మాణాలను చేపట్టింది. ఇందులో భాగంగా 2013-14 సంవత్సరంలో జిల్లాకు 25,760 మరుగుదొడ్లు జిల్లాకు మంజూరయ్యాయి. వీటికి జిల్లా నీటి యాజమాన్య సంస్థ అధికారులు లబ్ధిదారులను ఎంపిక చేశారు.

 ఈ నిర్మాణాలకు సంబంధించి బిల్లుల చెల్లింపుల్లో అధికారులు జాప్యం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో అప్పటి లక్ష్యాలు సైతం పూర్తికాలేదు. మంజూరైన వాటిలో కేవలం 16,200 మరుగుదొడ్లు మాత్రమే పూర్తయ్యాయి. మిగతా 9,270 మరుగుదొడ్ల నిర్మాణాలు అతీగతీలేకుండా పోయాయి. రెండేళ్ల కిత్రం నాటి లక్ష్యాల్నే సాధించని అధికారులు.. తాజాగా మంజూరైన వాటిని రెండు నెలల్లో ఎలా పూర్తి చేస్తారో చూడాలి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement