
ఇటీవలి కాలంలో చాలామంది భారత క్రికటర్లు యోయో టెస్ట్‌లో(ఫిట్‌నెస్ టెస్ట్) విఫలమైన కారణంగా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించే సువర్ణావకాశాన్ని కోల్పోయారని టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పేర్కొన్నాడు.
న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో చాలామంది భారత క్రికటర్లు యోయో టెస్ట్‌లో(ఫిట్‌నెస్ టెస్ట్) విఫలమైన కారణంగా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించే సువర్ణావకాశాన్ని కోల్పోయారని టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పేర్కొన్నాడు. క్రికటర్ల ఎంపిక అనేది నైపుణ్యం ఆధారంగా జరగాలని, ఫిట్‌నెస్ టెస్ట్ కొలమానంగా కాదని ఆయన అభిప్రాయపడ్డాడు. క్రికెటర్లు జాతీయ జట్టుకు ఎంపిక కావాలంటే యోయో టెస్ట్ తప్పనిసరి అన్న విధానంపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇది చాలదన్నట్టుగా బీసీసీఐ గత నెలలో యోయో టెస్ట్ నియమాలను మరింత కఠినతరం చేయడంపై ఆయన మండిపడ్డాడు. కనీస అర్హతను 16:1 నుండి 17:1 చేయడం, నిర్ణీత సమయంలో రెండు కిలోమీటర్ల పరుగును పూర్తి చేయడం వంటి సరికొత్త నిబంధనలపై ఆయన అసహనం వ్యక్తం చేశాడు.
నైపుణ్యంతో ఏమాత్రం సంబంధంలేని ఈ ఫిట్‌నెస్ టెస్ట్ వల్ల అంబటి రాయుడు, సంజు సాంసన్, మహ్మద్ షమీ, తాజాగా రాహుల్ తెవాతియా, వరుణ్ చక్రవర్తి లాంటి ఆటగాళ్లు జాతీయ జట్టుకు ఎంపికయ్యే అవకాశాలను తృటిలో చేజార్చుకున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశాడు. ఆటగాళ్లకు మొదటగా అవకాశాలు కల్పించి ఆతరువాత వారి ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టాలని ఆయన బీసీసీఐకి సూచించారు. ఇలాంటి టెస్ట్‌లు తమ జమానాలో జరిగి ఉంటే సచిన్, గంగూలీ, లక్ష్మణ్ లాంటి దిగ్గజ ఆటగాళ్లకు అసలు అవకాశాలే వచ్చేవి కావని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆటగాళ్లు ఫిట్‌గా ఉండి నైపుణ్యం లేకపోతే, అది జట్టుకు ఏమాత్రం ఉపయోగకరం కాదని ఆయన వాదించాడు. కాగా, ఆటగాళ్లు జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలంటే యోయో టెస్ట్ తప్పనిసరిగా క్లియర్ చేయాలన్న నియమాన్ని బీసీసీఐ 2018 నుంచి అమలులోకి తెచ్చింది.
చదవండి: ఢిల్లీ క్యాపిటల్స్ నూతన సారధిగా రిషబ్ పంత్