టొరాంటో: కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో పార్లమెంటు ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయాన్ని సాధించారు. అయితే మెజార్టీ సీట్లు సాధించాలన్న ఆయన కలలు కల్లలుగానే మిగిలిపోయాయి. ప్రపంచంలో మరే దేశం సాధించలేని విధంగా కరోనా కొమ్ములు వంచిన ఆయన దానినే ఎన్నికల అస్త్రం చేసుకొని రెండేళ్లు ముందుగానే ఎన్నికలకు వెళ్లారు. ఈ సారి మెజార్టీ ప్రభుత్వం ఏర్పడితే విధాన పరమైన నిర్ణయాలు స్వేచ్ఛగా తీసుకోవచ్చునని ఆశించారు. కానీ ఇంచుమించుగా 2019 నాటి ఎన్నికల ఫలితాలే పునరావృతమయ్యాయి.
338 స్థానాలున్న కెనడా హౌస్ ఆఫ్ కామన్స్‌లో అధికార లిబరల్ పార్టీ 156 స్థానాలను గెలుచుకోగా, కన్జర్వేటివ్ పార్టీ 121 స్థానాలకు పరిమితమైనట్టుగా ప్రాథమిక ఫలితాలు వెల్లడిస్తున్నాయి. మేజిక్ మార్కు 170 దాటుతుందనుకున్న ట్రూడో ఆశలు నిరాశయ్యాయి. 27 స్థానాలను దక్కించుకున్న న్యూ డెమొక్రాటిక్ పార్టీ మద్దతుతో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న ప్రధాని జస్టిన్ ట్రూడో థాంక్యూ కెనడా అంటూ వినమ్రంగా ఓటు వేసిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. అయితే, ముందస్తు ఎన్నికలతో కెనడా ప్రజలపై ఎన్నికలు ఆర్థిక భారాన్ని మోపడం మినహా ప్రయోజనమేదీ లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ముందుగా ఎన్నికలకు వెళ్లి ట్రూడో సాధించిందేమిటో చెప్పాలన్న డిమాండ్లు వస్తున్నాయి.
ఓటమి అంగీకరించిన ఎరిన్..
ప్రతిపక్ష కన్జర్వేటివ్ నాయకుడు ఎరిన్ ఒ టూలే తన ఓటమిని అంగీకరించారు. మూడోసారి ప్రధాని అయిన ట్రూడోని అభినందించారు. అయితే ఎన్నికల్లో ఆయన ట్రూడోకి గట్టి పోటీయే ఇచ్చారు.
హ్యాట్రిక్ కొట్టిన ట్రూడో
Published Wed, Sep 22 2021 4:58 AM | Last Updated on Wed, Sep 22 2021 4:58 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment