
ముంబై: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్స్ సర్వీసెస్ (ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్) షేర్‌హోల్డర్లతో శుక్రవారం జరగాల్సిన సమావేశాన్ని రిజర్వ్ బ్యాంక్ రద్దు చేసింది. ‘శుక్రవారం జరగాల్సిన సమావేశం రద్దయ్యింది. ఒక నియంత్రణ సంస్థగా ఆ కంపెనీ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక, తీసుకోబోయే దిద్దుబాటు చర్యల వివరాలను ఆర్‌బీఐ తెలుసుకోవాలనుకుంటోంది’ అని సంబంధిత వర్గాలు తెలిపాయి. తదుపరి సమావేశం తేదీ ఇంకా ఖరారు కాలేదని వివరించాయి.
సెప్టెంబర్ 29న ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ వార్షిక సర్వసభ్య సమావేశం జరగనుంది. కంపెనీలో ఎల్‌ఐసీకి అత్యధికంగా 25.34%, జపాన్ ఒరిక్స్ కార్పొరేషన్‌కి 23.54% వాటాలు ఉన్నాయి. అబుధాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ, హెచ్‌డీఎఫ్‌సీ, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్‌బీఐ వద్ద మిగతా వాటాలు ఉన్నాయి. దాదాపు రూ. 91,000 కోట్ల పైచిలుకు రుణభారం ఉన్న ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్ తీవ్ర లిక్విడిటీ సంక్షోభం కారణంగా ఆగస్టు 27 నుంచి పలు రుణాలు, వడ్డీలు చెల్లించలేక డిఫాల్ట్ అవుతోంది. కంపెనీ తక్షణ అవసరాల కోసం రైట్స్ ఇష్యూ ద్వారా రూ. 4,500 కోట్లు సమీకరించే ప్రయత్నాల్లో ఉంది.