ఆర్థిక సేవలకు పేదరిక
ముంబై: దేశంలో పేదరికం నిర్వచనంపై చాన్నాళ్లుగా చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో... ఇప్పుడు ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ కూడా దీనిపై తనదైన శైలిలో స్పందించారు. ఆర్థిక సేవల విషయానికొస్తే అసలు ఈ విధమైన నిర్వచనాలతో పనిలేదన్నారు. ‘దేశంలో భారీ సంఖ్యలో ప్రజలకు ఇంకా ఆర్థిక సేవలు పూర్తిగా అందుబాటులోలేవు. డిమాండ్ చాలానే ఉంది. అందువల్ల కొందరికి అవసరం.. మరికొందరికి అక్కర్లేదని చెప్పలేం. అందరికీ ఆర్థిక సేవలు అవసరమే’ అని రాజన్ పేర్కొన్నారు. అందరికీ ఆర్థిక సేవల కల్పనకోసం తగిన పరిస్థితులను సృష్టించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
అంతేకానీ, వీటిని అందించే విషయంలో ప్రజలను విభజించాల్సిన పనిలేదు. ఎవరైతే ఈ ప్రయోజనాలు కోరుకుంటే వాళ్లే దక్కించుకుంటారని కూడా రాజన్ వ్యాఖ్యానించారు. బుధవారం నెదర్లాండ్స్ రాణి మ్యాక్సిమా ఇక్కడి ఆర్‌బీఐ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన అనంతరం మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ప్రత్యేక దూత(ఇన్‌క్లూజివ్ ఫైనాన్స్ ఫడ్ డెవలప్‌మెంట్)గా కూడా మ్యాక్సిమా వ్యవహరిస్తున్నారు.
మీ ప్రయత్నం భేష్: డచ్ రాణి
అందరికీ బ్యాంకింగ్ సేవల కల్పన(ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్) లక్ష్య సాధనకు భారత్ చేపడుతున్న చర్యలను క్వీన్ మ్యాక్సిమా కొనియాడారు. ముఖ్యంగా ప్రీపెయిడ్ కార్డుల వినియోగాన్ని ఆమె ఉదహరించారు. అల్పాదాయ కుటుంబాలకు ఫైనాన్షియల్ సేవలన్నీ అందించేందుకు మరిన్ని వినూత్న చర్యలు అవసరమని ఆమె పిలుపునిచ్చారు.