ఆర్‌బీఐ చీఫ్ అధికారాలకు కత్తెర!?
♦ ఐఎఫ్‌సీ తాజా ముసాయిదా విడుదల
♦ అమలైతే..కమిటీ మెజారిటీ నిర్ణయం ప్రకారమే పాలసీ రేటు
న్యూఢిల్లీ : ఫైనాన్షియల్ రంగంలో కీలక సంస్కరణలు ప్రవేశపెట్టే దిశగా కేంద్రం గురువారం మరో ముందడుగు వేసింది. సవరించిన తాజాఇండియన్ ఫైనాన్షియల్ కోడ్ (ఐఎఫ్‌సీ) ముసాయిదాను విడుదల చేసింది. దేశంలో బ్యాంకింగ్ వడ్డీరేట్ల స్థాయికి సంకేతమైన పాలసీ రేట్ల నిర్ణయాన్ని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ (ఆర్‌బీఐ) ఏకపక్షంగాతీసుకునే అధికారానికి కత్తెరవేయడం ఈ ముసాయిదాలో ముఖ్యాంశం. మెజారిటీ ఓటు ప్రాతిపదికన ఆర్‌బీఐ ‘చైర్‌పర్సన్’ నేతృత్వంలోని పరపతి విధాన కమిటీ ఈ కీలక వడ్డీరేట్లపై నిర్ణయం తీసుకుంటుంది. ఈ ముసాయిదాపై ఆగస్టు 8వ తేదీ లోపు సంబంధిత వర్గాలు తమ అభిప్రాయాలను తెలపాలని ఆర్థికమంత్రి మంత్రిత్వశాఖ ముసాయిదాలో కోరింది. ముఖ్యాంశాలు..
{పతి మూడేళ్లకు ఒకసారి ఆర్‌బీఐతో సంప్రదింపులు జరిపి, వార్షిక వినియోగ ద్రవ్యోల్బణం (సీపీఐ) లక్ష్యాన్ని కేంద్రం నిర్ణయిస్తుంది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి ఆర్‌బీఐ తన వంతు తగిన ప్రయత్నాలు చేయాలి.
ముసాయిదా ‘ఆర్‌బీఐ చైర్‌పర్సన్’ అనే పదాన్ని వాడింది తప్ప... ‘గవర్నర్’ అనే పదాన్ని వాడకపోవడం గమనార్హం. ప్రస్తుతం రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే స్వల్పకాలిక రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు- ప్రస్తుతం 7.25 శాతం) నిర్ణయంపై సలహాలను ఇవ్వడానికి టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఒకటి ఉంటుంది. కానీ ఆ కమిటీ మెజారిటీ సూచనను కూడా ఆర్‌బీఐ చీఫ్ తోసిపుచ్చి, సొంతంగా ఒక నిర్ణయం తీసుకునే వీలుంది.
► ఆర్‌బీఐ చైర్‌పర్సన్ నేతృత్వంలోని కమిటీలో ఆర్‌బీఐ బోర్డ్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు ఒకరు ఉంటారు. ఆర్‌బీఐ ఉన్నత ఉద్యోగి ఒకరు కమిటీలో సభ్యులుగా ఉంటారు. ప్రభుత్వం నియమించిన నలుగురు సభ్యులు కూడా కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ రెండు నెలలకు ఒకసారి సమావేశమవుతుంది. మెజారిటీ నిర్ణయం ప్రకారం పాలసీ రేటు నిర్ణయం జరుగుతుంది. మెజారిటీ అభిప్రాయాన్ని ఆర్‌బీఐ చీఫ్ వీటో చేసే హక్కు వుండదు.
► ఐఎఫ్‌సీ ముసాయిదా కోడ్‌ను ఆర్థిక మంత్రిత్వశాఖ సైట్‌పై అందుబాటులో ఉంచారు.
ఐఎఫ్‌సీ నేపథ్యం: 2011లో జస్టిస్ శ్రీకృష్ణ నేతృత్వంలో ఏర్పాటయిన ఫైనాన్షియల్ సెక్టార్ లెజిల్లేటివ్ రిఫార్మ్ కమిషన్ (ఎఫ్‌ఎస్‌ఎల్‌ఆర్‌సీ) ఇండియన్ ఫైనాన్షియల్ కోడ్‌ను 2013లో సిఫారసు చేసింది. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ఫైనాన్షియల్ రంగంలో సంస్కరణలు ఈ సిఫారసుల్లో ప్రధానాంశాలు. ఈ ముసాయిదా తుది నిర్ణయం కోసం సవరిస్తున్నారు. తుది సవరణ ముసాయిదా గత ఏడాది వెలువడింది. ఈ క్రమంలో వచ్చిందే- తాజా సవరణ ముసాయిదా. ఫైనాన్షియల్ ఏజెన్సీల రెగ్యులేటరీ పరమైన బాధ్యతలు, కేపిటల్ నియంత్రణలు, పేమెంట్ల వ్యవస్థలో క్రమానుగుణ నియంత్రణలు తత్సబంధ అంశాలపై సైతం అభిప్రాయాలను తాజా ముసాయిదా కోరుతోంది.