ఎన్ని ఎదురు దెబ్బలు తింటున్నా మన దేశంలో కార్పొరేట్ గవర్నెన్స్ వ్యవస్థను చక్కదిద్దడానికి అవసరమైన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్(ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్) సంక్షోభం బట్టబయలు చేసింది. ఆ సంస్థ తీసుకున్న రూ. 91,000 కోట్ల మేర రుణాలకు అది కనీసం వడ్డీ కూడా కట్టలేని స్థితికి చేరుకున్నట్టు వెల్లడయ్యాక కేంద్ర ప్రభుత్వం స్పందించి దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. జాతీయ కంపెనీ లా బోర్డు అనుమతితో ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్, దాదాపు 160 వరకూ ఉన్న దాని అనుబంధ సంస్థల యాజమాన్య అధికారాలు స్వీకరించింది. పాత బోర్డును రద్దు చేసి కొటక్ మహీంద్రా బ్యాంకు ఎండీ ఉదయ్ కొటక్ సారథ్యంలో కొత్త బోర్డును నియమించింది. ఉన్నంతలో ఇప్పుడు ప్రభుత్వం ఇంతకుమించి చేయగలిగింది లేదు. మరో ఆరేడు నెలల్లో సార్వత్రిక ఎన్నికలకు సిద్ధపడబోయే ఏ ప్రభుత్వానికైనా ఇలాంటి సంక్షోభం ఒక దుర్వార్తే. ఎందుకంటే ఒక దిగ్గజ సంస్థ ఉన్నట్టుండి సంక్షోభంలో పడిందంటే అది దానికి మాత్రమే పరిమితమై ఉండదు. దాంట్లో పెట్టుబడులు పెట్టిన సంస్థలు, దానికి అప్పులిచ్చిన సంస్థలు, ఇతరత్రా లావాదేవీల్లో ఉన్న సంస్థలు ఒక్కసారిగా కుదేలవుతాయి.
ఒక్కొక్కటే పేకమేడల్లా కూలుతాయి. స్టాక్ మార్కెట్‌పై దాని దుష్ప్రభావం పడుతుంది. ముఖ్యంగా విదేశాల్లో మన పరువు ప్రతిష్టలు దెబ్బతింటాయి. భవిష్యత్తులో పెట్టుబడులు పెట్టేందుకు ఏ విదేశీ సంస్థా ముందుకు రాదు. ఇది ఆర్థిక వ్యవస్థలో పెను సంక్షోభాన్ని తీసుకొస్తుంది. కనుకనే ఒక కార్పొరేట్ రంగ నిపుణుడన్నట్టు ఈ తాజా పరిణామం ‘మినీ లేమాన్ బ్రదర్స్ సంక్షోభం’. ప్రభుత్వం ఇప్పుడు తీసుకున్న చర్యల పర్యవసానంగా సంక్షోభం కాస్త సద్దుమణుగుతుంది. సంస్థ చేపట్టిన మౌలికరంగ ప్రాజెక్టులకు ఆటంకం కలగకుండా చూడటం, అది గట్టెక్కడానికి సంస్థ ఆస్తుల్ని విక్రయించటం, రుణాల పునర్వ్యవస్థీకరణ, కొత్తగా నిధులు సమకూర్చడం వగైరా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇస్తోంది. ఆదరా బాదరాగా జనం సొమ్మును తరలించి సంక్షోభాన్ని నివారించేకంటే అసలు వాటిని మొగ్గలోనే తుంచేవిధంగా పటిష్టమైన వ్యవస్థల్ని నిర్మించటంలో మనం పదే పదే విఫలం కావటం విస్మయం కలిగిస్తుంది. మన దేశంలో కార్పొరేట్ కుంభకోణాలు కొత్తగాదు. అత్యద్భుతమైన పని తీరు ప్రదర్శిస్తున్నాయని కితాబులందుకున్న కంపెనీలు హఠాత్తుగా కళ్లు తేలేయడం, వాటి నిర్వాహకులు విదేశాలకు ఉడాయించడం తరచు జరుగుతూనే ఉంది. అవకతవకల్లో, అసమర్ధతల్లో ఆ సంస్థలు ప్రభుత్వ రంగ సంస్థల్ని మించిపోతున్నాయి. కార్పొరేట్ గవర్నెన్స్ పటిష్టంగా ఉంటే ఇలాంటి తెరచాటు బాగోతాలకు వీలుండదు.
మౌలిక రంగ ప్రాజెక్టులకు దీర్ఘకాలిక రుణాలు అందించే అతి పెద్ద నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థ ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్. ఇందులో ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్‌ఐసీ అతి పెద్ద వాటాదారు. ఆ తర్వాత స్థానం జపాన్‌కు చెందిన ఓరిక్స్ కార్పొరేషన్‌ది. సంస్థ బోర్డులో ఈ వాటాదారులకు ప్రాతినిధ్యంవహించే డైరెక్టర్లుంటారు. సంస్థ అమలు చేసే ప్రతి విధానాన్ని బోర్డు ఖరారు చేస్తుంది. ఈ సంస్థ కార్యకలాపాలను, లావాదేవీలను నిరంతరం గమనిస్తూ దానికి రేటింగ్ ఇచ్చే క్రెడిట్ రేటింగ్ సంస్థలుంటాయి. కానీ ఇంతమంది కళ్లుగప్పి ఈ సంస్థ దివాళా స్థితికి ఎలా చేరుకుందన్న సందేహం ఎవరికైనా కలుగుతుంది. ఈ సంస్థలో ఎల్‌ఐసీ వాటా నాలుగోవంతుకు మించి...అంటే 25.3 శాతం ఉంది. బీమా రంగంలో అది దిగ్గజ సంస్థ.
చెల్లించాల్సిన రుణాల్ని సంస్థ ఎగవేసినప్పుడు తప్ప బయటివారికి అనుమానం రాదు. కానీ సంస్థ డైరెక్టర్లుగా ఉన్న నిపుణులకు పూర్తి అవగాహన ఉండాలి. ఉంటుంది. మరి సింహభాగం పెట్టుబడులు పెట్టిన ఎల్‌ఐసీ ఏం చేసినట్టు? మొన్న జూన్‌లో ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్‌కు చెందిన అనేక అనుబంధ సంస్థల్లో ఒక సంస్థ సకాలంలో రుణ చెల్లింపు చేయకపోవడంతో తొలిసారి బయటివారికి అనుమానాలు తలెత్తాయి. ఆ తర్వాత గ్రూపులోని ఇతర సంస్థలూ ఇదే రీతిలో ఉండటంతో.. మరీ ముఖ్యంగా గత నెల 14న ఆ సంస్థ కొన్ని రుణాలను తీర్చటంలో విఫలం కావడంతో వ్యవహారమంతా బట్టబయలైంది. పరిస్థితి ఇంతగా దిగజారే వరకూ బోర్డు డైరెక్టర్లు నిమ్మకు నీరెత్తినట్టు చేష్టలుడిగిపోవడం, రుణాలిస్తున్న సంస్థలైనా దీన్నంతటినీ గమనించలేకపోవటం, క్రెడిట్ రేటింగ్ సంస్థలు అత్యుత్తమ రేటింగ్‌లిస్తూ రావటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ మొత్తం వ్యవహారాన్ని సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్(ఎస్‌ఎఫ్‌ఐఓ)కు అప్పగించారు. మంచిదే. ఆ దర్యాప్తు సత్వరం పూర్తయి, ఇందులో ఎవరి జవాబుదారీతనం ఎంతో తేల్చాలి.
మౌలిక సదుపాయాల రంగంలోని సంస్థలకు ఫైనాన్స్ చేయడంతోపాటు ఆ రంగంలో స్వయంగా ప్రాజెక్టులు చేపట్టే సంస్థలకు అడుగడుగునా ప్రమాదాలు పొంచి ఉండకతప్పదు. భూసేకరణ మొదలుకొని అనుకోని రీతిలో ఎదురయ్యే సమస్యలతో భారీ ప్రాజెక్టుల పనులు ప్రారంభం కావడంలో జాప్యం చోటుచేసుకొనే అవకాశాలుంటాయి. దానికితోడు ప్రణాళికలు రూపొందించుకోవడంలో, మానవ వనరుల్ని సమీకరించుకోవడంలో విఫలమైనా ఇబ్బందులు తలెత్తుతాయి. పర్యవసానంగా ప్రాజెక్టు వ్యయం అపరిమితంగా పెరిగిపోతుంది. సంస్థ నష్టాల బారిన పడుతుంది. సకాలంలో చెల్లింపులు చేయడంలో విఫలమవుతుంది. అందువల్లే ఇలాంటి సంస్థల నిర్వహణ అత్యంత నిపుణులైనవారికి అప్పగిస్తారు. ఇప్పుడు ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ సంస్థ బోర్డులోనూ ఆ స్థాయివారే ఉన్నారు. కానీ ఏం లాభం? ఎడాపెడా అప్పులు తెస్తూ సంస్థను నిర్వహించడం సరికాదని బోర్డుకు తెలియదు. వాటిని విశ్వసించి రుణాలివ్వడంకాక, సొంతంగా మదింపు వేయడం తమ బాధ్యతని బ్యాంకులకు తోచదు. ఇలాంటి పరిస్థితి ప్రమాదకరమైనది. ఈ తరహా సంక్షోభాలు ఇక తలెత్తనివిధంగా కనీసం ఇప్పటికైనా చర్యలు తీసుకోవటం తక్షణావసరం.
Comments
Please login to add a commentAdd a comment