ఇరాక్ అంతర్యుద్ధంలో చిక్కుబడిన 46మంది నర్సులతో సహా అక్కడున్న వేలాదిమంది భారతీయుల యోగక్షేమాలపై వ్యక్తమైన ఆందోళన సకాలంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా సమసిపోయింది. సంక్షోభ సమయాల్లో సంయమనం పాటించి ఒడు పుగా వ్యవహరించడం, అనుకూలమైన ఫలితాన్ని రాబట్టడం నిజమైన దౌత్యం అవుతుంది. ఆ విషయంలో నరేంద్ర మోడీ సర్కారు నూటికి నూరుపాళ్లూ విజయం సాధించింది. పల్లెలనూ, పట్టణాలనూ, నగరా లనూ స్వాధీనం చేసుకుంటూ వెళ్తున్న ఇరాక్, సిరియా ఇస్లామిక్ ప్రభుత్వం(ఐఎస్‌ఐఎస్) మిలిటెంట్లు దారిపొడవునా ఎంతటి రక్తపా తాన్ని సృష్టిస్తున్నారో ప్రతి రోజూ మీడియాలో వెలువడిన కథనాలు ఇరాక్ వెళ్లినవారి కుటుంబాలనూ, బంధువులనూ కలవరపరిచాయి. నర్సులందరినీ మిలిటెంట్లు తిక్రిత్ నుంచి బలవంతంగా మోసుల్ తరలించారని, అక్కడినుంచి ఎటు తీసుకెళ్తారో తెలియడంలేదని వార్తలు వచ్చినప్పుడు అందరూ కంగారుపడ్డారు. ఎప్పుడు ఎలాంటి కబురు వినవలసివస్తుందోనన్న బెంగతో ఎన్నో కుటుంబాలవారు కంటి నిండా కునుకులేకుండా క్షణమొక యుగంగా గడిపారు. ఈ నేపథ్యంలో 46మంది నర్సులతోపాటు దాదాపు 800మంది క్షేమంగా స్వదేశానికి చేరడం వారి కుటుంబాలకు మాత్రమే కాదు...దేశ ప్రజలకే ఊరట కలిగించింది.
విధి రాతను ఎదిరిద్దామని, బతుకుల్లో కాస్తంత వెలుగులు నింపు కుందామని పొట్టచేతబట్టుకుని వెళ్లడమే ఒక సాహసం. అయినవాళ్లకు దూరంగా, అసలే పరిచయంలేని ప్రాంతంలో నెగ్గుకురావడంలో ఎన్నో సమస్యలుంటాయి. ఇక నిత్యమూ జాతుల అంతర్గత పోరుతో సతమ తమయ్యే ఇరాక్‌లాంటి దేశంలోకి అడుగుపెట్టడమంటే మాటలు కాదు. అయినా అలాంటిచోటకు మన దేశంనుంచి దాదాపు 10,000 మంది వెళ్లారు. మూడు నెలలక్రితం కూడా అప్పో సప్పోచేసి ఏజెం ట్లకు లక్షన్నర చొప్పున చెల్లించి వెళ్లినవారున్నారు. వీరిలో చాలామంది ఏమాత్రం ప్రాణాలకు భరోసాలేని ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. ఏ దేశంలోనైనా మిలిటెంట్లు పౌరులను బందీ లుగా పట్టుకున్నప్పుడు అక్కడి ప్రభుత్వా లతో మాట్లాడి వారి విడుదలకు చర్యలు తీసుకోవడం సాధారణం. కానీ, ఇరాక్ పరిస్థితి వేరు. అక్కడ ప్రభు త్వం ఉన్నా అది నామమాత్రావశిష్టం. ఆ ప్రభుత్వం ఆధ్వర్యంలోని భద్రతా బలగాలే మిలిటెంట్లకు దాసోహం అంటున్నాయి. భారీ రిఫైనరీలు సైతం మిలిటెంట్ల చేతికి చిక్కాయి. అలాంటిచోట బందీల చెర విడిపించడానికి ఆ ప్రభుత్వాన్ని నమ్ముకోవడం సాధ్యం కాదు. అందువల్లే ఇప్పుడు మిలిటెంట్ల చెరలో ఉన్నవారిని విడిపించడానికి అనధికారవర్గాలద్వారానే మన ప్రభుత్వం ప్రయత్నించింది. ఇరాక్‌లో పనిచేస్తున్న భారతీయ వ్యాపారుల ద్వారా మిలిటెంట్లతో సంప్రదిం పులు జరిపి బందీలను క్షేమంగా తీసుకురాగలిగింది. ఇంకా అక్కడ వేలాదిమంది భారతీయులు చిక్కుకుని ఉన్న నేపథ్యంలో ఎలాంటి ఒప్పందంకింద ఇది సాధ్యమైందన్న వివరాల్లోకి వెళ్లకపోవడమే సబబు. తిండీ నీళ్లూ లేక అలమటిస్తూ, స్వదేశానికొచ్చే దారిలేక నిత్యం నరకం అనుభవిస్తున్న అనేకానేకమందిని కూడా తీసుకొచ్చేందుకు చేసే ప్రయత్నాలకు ఆ వివరాలు ఆటంకం కలిగిస్తాయి.
ఇరాక్‌నుంచి తిరిగొచ్చినవారు చెబుతున్న కథనాలు ఒళ్లు గగుర్పొ డిచేలా ఉన్నాయి. తమను పంపేటపుడు ఏజెంట్లు భారీ మొత్తాల్లో డబ్బు గుంజి అక్కడ బతుకు బ్రహ్మాండంగా ఉంటుందన్న హామీలి చ్చారని, తీరా వెళ్లాక అత్యంత దుర్భరమైన జీవితాన్ని చవిచూశామని వారు చెబుతున్నారు. మృత్యువు కోరల్లోంచి బయటికొచ్చి, మళ్లీ సొంత గడ్డపై అడుగుపెట్టడం వారికి సంతోషంగానే ఉండొచ్చుగానీ రోజులు గడుస్తున్నకొద్దీ చేసిన అప్పులు, ఎప్పటినుంచో ఉన్న సమ స్యలూ మళ్లీ వేధించడం మొదలుపెడతాయి. ఒకపక్క తిరిగొచ్చిన నర్సులు తాము ఎన్ని ఇబ్బందులు పడిందీ వివరిస్తుండగానే మరికొం దరు అక్కడికి వెళ్లేందుకు సంసిద్ధులవుతున్నారు. నర్సింగ్ కోర్సులో చేరడానికి చేసిన వేలాది రూపాయల అప్పు చెల్లించడానికి అంతకన్నా తమకు గత్యంతరం లేదని వారు చెబుతున్నారు. ఇది మన ప్రభుత్వా లకు సవాల్ వంటిది. చావు ముంగిట్లోకి వెళ్లేందుకు కూడా సిద్ధప డటం, అందుకు ఏజెంట్లను ఆశ్రయించడం వంటివి సాగుతున్నా యంటే లోపం ఎక్కడున్నదో కేంద్ర ప్రభుత్వమూ, రాష్ట్ర ప్రభుత్వాలూ గుర్తించడం అవసరం. మన దేశంనుంచి దాదాపు 80 లక్షలమంది ఉపాధి, ఉద్యోగాల కోసం పలు దేశాలకు వలస వెళ్లినట్టు అంచనా. తగిన విద్యార్హతలు, నైపుణ్యం లేనివారు ఇందులో ఎక్కువ. ఇలాంటి వారికి ఇక్కడ ఉపాధి అవకాశాలు నానాటికీ తగ్గిపోతుండటం ఒక సమస్యయితే... నర్సింగ్ కోర్సులు చేసినవారికి అయిదారు వేల రూపా యలకు మించి ఆస్పత్రులు వేతనాలు చెల్లించకపోవడం మరో సమస్య. ఉపాధి అవకాశాలు పెంచి, బోగస్ ఏజెంట్లను ఏరేయడంతో పాటు నర్సులకు గౌరవప్రదమైన వేతనాలు చెల్లించేలా చర్యలు తీసు కుంటే వలసలను అరికట్టడం సాధ్యమవుతుంది. రెండేళ్లక్రితం పలు రాష్ట్రాల్లోని ప్రైవేటు ఆస్పత్రుల నర్సులు సమ్మెచేసినప్పుడు కార్మిక విభాగాల నేతృత్వంలో కనీస వేతనాలు, పనివేళలు వంటి విషయాల్లో ఒప్పందాలు కుదిరాయి. కానీ, ఎన్ని రాష్ట్రాల్లో అవి సక్రమంగా అమల వుతున్నాయన్నది ప్రశ్నార్థకమే. ఇప్పుడు ఇరాక్ సంక్షోభంతో వలస పోతున్న పౌరుల సమస్యలు ఎజెండాలోకొచ్చాయి గనుక దీనిలో ఇమి డివున్న అంశాలన్నిటినీ కేంద్ర ప్రభుత్వం సమగ్రంగా పరిశీలించాలి. దేశంలో ఉపాధి అవకాశాలను మెరుగుపరచడంతోపాటు నర్సింగ్ కోర్సువంటివి పూర్తిచేసుకున్నవారికి న్యాయమైన వేతనాలు లభించేలా చర్యలు తీసుకోవాలి. అది పాలకుల కనీస బాధ్యత.
మృత్యు చెరనుంచి...
Published Tue, Jul 8 2014 12:21 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement
Advertisement