శుక్రవారం ఢిల్లీ బీజేపీ కార్యాలయంలో దివాళీ మిలన్‌లో మాట్లాడుతున్న మోదీ
న్యూఢిల్లీ: కృత్రిమ మేధ(ఏఐ) దుర్వినియోగం అవుతుండడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. డీప్‌ఫేక్ వీడియోలు, చిత్రాలు సృష్టించడానికి కృత్రిమ మేధను వాడుకుంటున్నారని, ఇదొక పెను సంక్షోభానికి దారి తీస్తోందని హెచ్చరించారు. ఏఐ దుర్వినియోగం, దాని ప్రభావంపై ప్రజల్లో చైతన్యం పెంచాలని చేయాలని ప్రసార మాధ్యమాలకు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ‘దివాళీ మిలన్’ సందర్భంగా ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడారు.
గార్బా వేడుకలో తాను పాట పాడుతున్నట్లు ఇటీవల ఓ ఫేక్ వీడియోను గుర్తు తెలియని వ్యక్తులు సృష్టించారని, ఓ అభిమాని తనకు ఆ వీడియోను పంపించాడని తెలిపారు. నిజానికి పాఠశాల రోజుల నుంచి తాను ఏనాడూ పాట పాడలేదని నవ్వుతూ చెప్పారు. వైవిధ్యంతో కూడిన మన సమాజంలో డీప్‌ఫేక్‌లు పెద్ద ప్రమాదానికి కారణమవుతాయని అన్నారు. ఏఐ పరిజ్ఞానంతో డీప్‌ఫేక్‌ల సృష్టి వల్ల కొత్త సంక్షోభం తెరపైకి వస్తోందని వెల్లడించారు. సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్న వీడియోలు నిజమో కాదో తేల్చుకునే వ్యవస్థ ప్రజలందరికీ అందుబాటులో లేదని పేర్కొన్నారు.
‘వోకల్ ఫర్ లోకల్’కు ప్రజల మద్దతు
వివాదాస్పద దృశ్యాలు, సంభాషణలు ఉన్న చలనచిత్రాలు గతంలో వస్తే కొద్దిరోజుల్లోనే ఆ రగడ చల్లారేదని గుర్తుచేశారు. ఇప్పుడు మాత్రం అలాంటి చిత్రాలను సమాజంలోని కొన్ని వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని, పెద్ద వివాదంగా మారుస్తున్నాయని, భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఆ చిత్రాలు పరాజయం పాలవుతున్నాయని చెప్పారు. సిగరెట్ పెట్టెలపై ఆరోగ్యపరమైన హెచ్చరికలు ఉన్నట్లుగానే డీప్‌ఫేక్ వీడియోలపైనా అలాంటి హెచ్చరికలు ఉంటే బాగుంటుందని మోదీ అభిప్రాయపడ్డారు.
2047 నాటికి ‘వికసిత్ భారత్’ తన లక్ష్యమని పునరుద్ఘాటించారు. ఇది కేవలం నోటిమాట కాదని, క్షేత్రస్థాయిలో జరగబోయే వాస్తవమని స్పష్టం చేశారు. ‘వోకల్ ఫర్ లోకల్’ ప్రచారానికి జనం సంపూర్ణ మద్దతు ఇస్తున్నారని వ్యక్తం చేశారు. దీపావళి పండుగ సమయంలో దేశంలో రూ.4.5 లక్షల కోట్ల విలువైన వ్యాపారం జరిగిందని తెలిపారు. కోవిడ్–19 ముప్పు తొలగిపోవడంతో ప్రజలు ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకున్నారని చెప్పారు.
సాధారణ ప్రజల మరణాలను ఖండిస్తున్నాం
ఇజ్రాయెల్–హమాస్ యుద్ధంపై మోదీ
ఇజ్రాయెల్–హమాస్ యుద్ధంలో సాధారణ ప్రజలు మరణించడాన్ని భారత్ తీవ్రంగా ఖండిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. పశి్చమాసియాలో చోటుచేసుకుంటున్న పరిణా మాలు ప్రపంచానికి కొత్త సవాళ్లను విసురుతున్నాయని తెలిపారు. ఇలాంటి తరుణంలో ప్రపంచ మానవాళి క్షేమం కోసం గ్లోబల్ సౌత్ దేశాలు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
శుక్రవారం కేంద్రం వర్చువల్‌గా నిర్వహించిన ‘వాయిస్ ఆఫ్ ద గ్లోబల్ సౌత్’ రెండో ఎడిషన్ శిఖరాగ్ర సదస్సులో మోదీ మాట్లాడారు. ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంలో సాధారణ ప్రజలు చనిపోతుండడం బాధాకరమని చెప్పారు. చర్చలు, దౌత్య మార్గాల్లో వివాదాలను పరిష్కరించుకోవాలన్నారు. 21వ శతాబ్దంలో మార్పులకు లోనవుతున్న ప్రపంచాన్ని ‘వాయిస్ ఆఫ్ ద గ్లోబల్’ వేదిక ప్రతిబింబిస్తోందన్నారు. ఐదు ‘సీ’లు.. కన్సల్టేషన్, కమ్యూనికేషన్, కో–ఆపరేషన్, క్రియేటివిటీ, కెపాసిటీ బిల్డింగ్ అనే ఫ్రేమ్‌వర్క్ కింద గ్లోబల్ సౌత్ దేశాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment