ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లో దాదాపు రెండునెలలుగా సాగుతున్న సంక్షోభం అందరూ అనుకున్నట్టే అసమ్మతివాదులను పార్టీనుంచి బహిష్కరించడంతో ముగిసింది. యోగేంద్రయాదవ్, ప్రశాంత్‌భూషణ్, ఆనంద్ కుమార్, అజిత్ ఝాలకు షోకాజ్ నోటీసులు జారీకాగా అజిత్ మినహా మిగిలినవారంతా జవాబులిచ్చారు. మిగిలిన ఆ ఒక్కరి సంజాయిషీ కోసం ఎదురుచూడటం దండగనుకున్నారో, చేయాల్సింది ఒకేసారి చేస్తే పనయిపోతుందనుకున్నారో మొత్తం నలుగురిపైనా సోమవారం చర్యతీసుకున్నారు. మొన్నటివరకూ పార్టీ లోక్‌పాల్‌గా వ్యవహరించి, హఠాత్తుగా ఆ పదవిని కోల్పోయిన అడ్మిరల్ రాందాస్ మాత్రం ఈ జాబితాలో లేరు. ఆప్‌లో తలెత్తిన సంక్షోభం, దానికి ఆ పార్టీ వెతికిన పరిష్కారం ఈ దేశ ప్రజలకు కొత్తేమీ కాదు. వ్యక్తులు వేరుకావొచ్చు, కార ణాలు వేరే ఉండొచ్చు... కాంగ్రెస్, బీజేపీ మొదలుకొని కమ్యూనిస్టు పార్టీల వరకూ అన్ని పార్టీల్లోనూ అసమ్మతి తలెత్తినప్పుడల్లా చివరకు జరిగేది ఇదే. అయితే, మిగిలిన పార్టీలకన్నా ఆప్ విభిన్నమైనదనుకున్నారు గనుకా, ఆ పార్టీ కూడా అలా చెప్పుకున్నది గనుకా జనం ఆశ్చర్యపోయారు.
ఆప్ క్రమశిక్షణా సంఘంలో పాత్రికేయులుగా పనిచేసినవారు ఉండటంవల్ల కావొచ్చు... బహిష్కరణ నిర్ణయాన్ని రాత్రి 9 గంటలు దాటాకే బయటపెట్టి వెనువెంటనే దానిపై చర్చకు అవకాశం లేకుండా చేశారు. ఆదర్శాలు చెప్పడానికి, వాటిని ఆచరించి చూపడానికి మధ్య ఎంత అగాధం ఉంటుందో ఆప్ పరిణామాలే స్పష్టంచేస్తున్నాయి. అవినీతి వ్యతిరేక ఉద్యమంలో ముఖ్యపాత్ర పోషించిన కేజ్రీవాల్‌కూ, ఇప్పుడు తన వ్యవహారశైలిని ప్రశ్నించిన వారిపై చర్య తీసుకున్న కేజ్రీవాల్‌కూ ఎంత తేడా! ఉద్యమకారుడిగా ఉన్నప్పుడు వల్లించిన సిద్ధాంతాలకూ, రాజకీయ నాయకుడి అవతారమెత్తాక వ్యవహరించిన శైలికీ ఎంత మార్పు!
తొలిసారి ముఖ్యమంత్రి అయ్యాక కేజ్రీవాల్ స్వల్పకాలం మాత్రమే పాలించినా ప్రజలు ఆయన నాయకత్వ దక్షతపై విశ్వాసాన్ని చూపి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయాన్నందించారు. 70 స్థానాలున్న అసెంబ్లీలో ఆ పార్టీకి 67 అందించారు. కులమతాలకూ, ప్రాంతీయ అభిమానాలకూ తావీయకుండా అన్ని వయసులవారూ ఆప్ వెనక దృఢంగా నిలబడ్డారు. ఎన్నికల్లో డబ్బు ప్రభావం పెరిగిపోతున్నదని, ప్రలోభాలకు జనం లొంగిపోతున్నారని చాలామంది వ్యక్తం చేస్తున్న నిర్వేదంలో నిజం లేదని ఓటర్లు తేల్చిచెప్పారు. తాము మూస రాజకీయాలకు భిన్నంగా ఉంటామని, నైతికవర్తనకు పెద్దపీట వేస్తామని కేజ్రీవాల్ చెప్పిన మాటల్ని వారు నమ్మడంవల్లే ఇది సాధ్యమైంది. దాన్ని ఆయన నిలబెట్టుకోవాలని, ఆదర్శవంతమైన రాజకీయాలకు చుక్కాని కావాలని ఎందరో ఆశించారు. అయితే ఆప్ తీరుతెన్నులు అందరినీ దిగ్భ్రాంతిపరిచాయి.
ఒకరిపై ఒకరు నిఘా పెట్టుకోవడంలో... అవతలివారి మాటల్ని దొంగతనంగా రికార్డుచేసుకోవడంలో ఒకరినొకరు మించి పోయారు. వేదికలెక్కి ఆదర్శాలు వల్లిస్తున్నవారంతా ప్రైవేటు సంభాషణల్లో ఇంత అన్యాయంగా మాట్లాడతారా అని కొందరు ఆశ్చర్యపోతే... ఆప్‌లో నేతలమధ్య ఇంత అల్పస్థాయి సంబంధాలున్నాయా అని మరికొందరు విస్మయం వ్యక్తం చేశారు. ఇప్పుడు బహిష్కృతులైన నేతలు మేధావులుగా, సిద్ధాంతవేత్తలుగా గుర్తింపుపొందిన వారు. కేజ్రీవాల్ స్థాయిలో వారు జనాకర్షణ ఉన్న నేతలు కాకపోవచ్చు. కానీ ఆప్‌లో చేరిన వందలాది మంది యువ కార్యకర్తలకు స్ఫూర్తినిచ్చినవారు. వీరిపై ఉన్న ఆరోపణల్లా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి కుట్రపన్నారన్నదే. అయితే ఆ కుట్ర అమలు చేయడానికి వారనుసరించిన విధానమేమిటో కేజ్రీవాల్ శిబిరం ఇంతవరకూ వెల్లడించలేదు.
బహిష్కృత నేతలు కేజ్రీవాల్‌పై వ్యక్తిగత ఆరోపణలు చేయలేదు. ఆయన వ్యవహారశైలి సరిగా లేదని మాత్రమే ఆరోపించారు. పార్టీలో పారదర్శకత లోపించిందనీ, సాధారణ రాజకీయవేత్తలానే ఆయన సూత్రబద్ధమైన రాజకీయాలను విడిచిపెడుతున్నారని వారి అభియోగం. అలాగే, రాజకీయ వ్యవహారాల కమిటీ ముందస్తు అనుమతి లేకుండా భారీగా వచ్చే విరాళాలను అంగీకరించరాదన్న నియమమున్నా దాన్ని పాటించలేదని విమర్శించారు. వీటిపై బాధ్యతగల నాయకుడిగా కేజ్రీవాల్ జవాబిచ్చి ఉంటే వేరుగా ఉండేది. కానీ, ఆయన మౌనం పాటించారు. తనకు కొత్తగా సన్నిహితులైన ఆశిష్ ఖేతాన్, అశుతోష్ వంటివారితో ప్రత్యారోపణలు చేయించారు. నిజానికి విరాళాల విషయంలో వారిద్దరూ చేసిన ఆరోపణ ఖేతాన్‌ను ఉద్దేశించిందే. అలాంటి వ్యక్తినే క్రమశిక్షణా సంఘంలో నియమించి, ఆ సంఘం ద్వారానే అసమ్మతి నేతలను బహిష్కరించే నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యకరం. యోగేంద్రయాదవ్, ప్రశాంత్‌భూషణ్ ఆరోపణలకూ జవాబివ్వక... వారిపై తాము చేసిన ఆరోపణలకూ ఆధారాలివ్వక చివరకు ఇలా బహిష్కరణ వేటు వేయడం విస్మయం కలిగిస్తుంది. కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లో సైతం ఈ తరహా పోకడలు కనబడవు. నరేంద్రమోదీ విషయంలో అనేకసార్లు అద్వానీ బహిరంగంగా ప్రకటనలు చేసినా ఆయనపై బీజేపీ చర్య తీసుకోలేదు. కాంగ్రెస్‌లో సైతం చిదంబరం, షీలా దీక్షిత్ వంటివారు నాయకత్వ తీరు విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేశారు. వారిపైనా ఆ పార్టీ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఈ నేపథ్యంలో ఆప్ ఖాప్ పంచాయతీలా మారిందని ప్రశాంత్‌భూషణ్ చేసిన వ్యాఖ్యానం నిజమేననుకోవడానికి ఆస్కారం కలగదా? బహిష్కరించిన సందర్భంగా కనీసం వారు చేసిన తప్పేమిటో చెప్పగలిగి ఉంటే కేజ్రీవాల్ శిబిరం తీసుకున్న చర్యలో సహేతుకత కనబడేది.
పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని పాటించడం, పారదర్శకంగా వ్యవహరించడం ఆదర్శవంతమైనది. అలా చేస్తామని చెప్పడంవల్లే మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతికి చెందిన వేలాదిమంది యువ కార్యకర్తలు తమ భవిష్యత్తును సైతం ఖాతరు చేయక ఆప్ వెనక నిలబడ్డారు. పార్టీ సందేశాన్ని మూలమూలలకూ తీసుకుపోయారు. అలాంటివారి ఆశలను, విశ్వాసాలనూ ఈ బహిష్కరణ నిర్ణయం ద్వారా కేజ్రీవాల్ వమ్ముచేశారు. ప్రజానుకూలమైన చర్యలు తీసుకుని మంచి ముఖ్యమంత్రిగా ఆయన పేరు తెచ్చుకుంటే తెచ్చుకోవచ్చు. కానీ పార్టీలో భిన్నాభిప్రాయాలకు విలువనీయడం, పారదర్శకతను పెంపొందించడం, ఉమ్మడి నాయకత్వంలో పనిచేయడం వంటి విలువలను గౌరవించడం నేర్చుకోనట్టయితే అది పార్టీ భవిష్యత్తును దెబ్బతీస్తుంది. దీన్ని గ్రహించే స్థితిలో కేజ్రీవాల్ ఉన్నట్టు కనబడటం లేదు.
ఆప్ మూస రాజకీయం
Published Wed, Apr 22 2015 12:04 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement
Advertisement