ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఊహకందనంత మెజారిటీని సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నెల్లాళ్లు కాకుండానే సంస్థాగత సంక్షోభంలో పడింది. పార్టీ కన్వీనర్‌గా ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కూ... పార్టీ అగ్రనేతలు యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ ద్వయానికి మధ్య అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచి లోలోపల రాజుకుంటున్న పోరు బుధవారం భళ్లున బద్దలయింది. పార్టీ అత్యున్నత నిర్ణాయక వేదిక రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) నుంచి యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్‌లిద్దరినీ తొలగిస్తూ ఆప్ జాతీయ కార్యవర్గం నిర్ణయం తీసుకుంది. కన్వీనర్ పదవికి కేజ్రీవాల్ చేసిన రాజీనామాను తిరస్కరించింది. దేశ రాజకీయాలపైనా, పార్టీల పనితీరుపైనా కొద్దో గొప్పో అవగాహన ఉన్నవారికి ఆప్‌లో ఏం జరుగుతున్నదో, చివరికేమవుతుందో ముందే తెలిసిపోయింది.
ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్, ఆయన ప్రధాన అనుచరుల ఎత్తుగడలన్నీ మూస రాజకీయాల తీరుకు భిన్నంగా ఏమీ లేవు. అంతర్గత కలహాల విషయం మీడియాకు వెల్లడైన వెంటనే కేజ్రీవాల్ కన్వీనర్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఒంట్లో బాగోలేదని చెప్పి జాతీయ కార్యవర్గ సమావేశానికి హాజరుకావడంలేదని వెల్లడించారు. కాయకల్ప చికిత్స కోసం బెంగళూరు వెళ్తున్నట్టు తెలిపారు. చికిత్స సంగతి నిజమే అయినా సరిగ్గా జాతీయ కార్యవర్గ భేటీ సమయానికే దాన్ని ఎంచుకోవడంలో అవసరం కంటే లౌక్యం ఎక్కువుంది. ఈ విభేదాలను పార్టీ లోక్‌పాల్ అడ్మిరల్ రాందాస్ బహిరంగపరిచాక కేజ్రీవాల్ ఒక్క మాట మాట్లాడలేదు. తన అంతరంగమేమిటో చెప్పలేదు. ఒకే ఒక్కసారి ట్విటర్ మాధ్యమంలో మాత్రం ఈ మురికి యుద్ధంలో దిగదల్చు కోలేదంటూ చిన్నపాటి ప్రకటన చేశారు. అయితే, ఆయన వర్గం చేతులు ముడుచుకు కూర్చోలేదు. ప్రశాంత్ భూషణ్, ఆయన తండ్రి శాంతిభూషణ్ పార్టీలో కుటుంబ పాలన తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారని ఆశిష్ ఖేతాన్ అంటే... పార్టీ కన్వీనర్ పదవిలో యోగేంద్ర యాదవ్‌ను కూర్చోబెట్టేందుకు శాంతిభూషణ్ కుట్ర పన్నారని అశుతోష్ గుప్తా ఆరోపించారు. ఈ పరిణామాలను గమనించాక పీఏసీ నిర్ణయం మరోలా ఉంటుందని ఎవరూ అనుకోలేరు.
దేశ రాజకీయాల్లో ఆప్ ఒక విశిష్ట ప్రయోగం. బహుశా స్వాతంత్య్రానంతరం జరిగిన మొట్టమొదటి ప్రయోగం. ఇంతక్రితం అస్సాంలో విద్యార్థి ఉద్యమాన్ని నడిపినవారు అసోం గణ పరిషత్ (ఏజీపీ)ని స్థాపించారు. వారి ఆశయాలు వేరు, ఉద్దేశాలు వేరు. ఆప్ ఆ కోవలోనిది కాదు. ఆ పార్టీని స్థాపించినవారందరూ తమ తమ రంగాల్లో లబ్ధప్రతిష్టులు. తమ విశ్వాసాలూ, సిద్ధాంతాలూ ఏమైనప్పటికీ దేశంలో సమస్త వ్యవస్థలనూ ధ్వంసంచేస్తున్న అవినీతిని అంతమొందించాలన్న దృఢ సంకల్పంతో అన్నా హజారే నాయకత్వంకింద జరిగిన ‘అవినీతి వ్యతిరేక భారత్’ ఉద్యమంకింద ఏకమైనవారు. నాలుగు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న లోక్‌పాల్ బిల్లు సాకారమయ్యేందుకు దేశ ప్రజలందరినీ కూడగట్టినవారు. దేశంలో ఉదారవాద సంస్కరణలు ప్రవేశించాక ప్రేక్షకపాత్రకే పరిమితమైపోయిన మధ్యతరగతి యువతరాన్ని రోడ్లపైకి తెచ్చినవారు. ఆ ఉద్యమ సందర్భంలో ఎదురైన సవాళ్లనూ, అనుభవాలనూ సమీక్షించుకుని ఒక పార్టీని నిర్మించాలని నిర్ణయించుకున్నవారు. మూస రాజకీయాలకు భిన్నంగా తాము స్వచ్ఛమైన, నిజాయితీ అయిన పాలనను అందించగలమని హామీ ఇస్తూ ఎన్నికల బరిలోకి దూకినవారు. వీరి ఉత్సాహం మాటెలా ఉన్నా ఈ నేతల్లో ఉన్న వైరుధ్యాలను దేశం గమనించకపోలేదు. అవినీతి వ్యతిరేక ఉద్యమ సందర్భంలో చిన్న చిన్న అంశాల్లోనే ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేయడంలో విఫలమవుతున్న ఈ నేతలు ఒక పార్టీగా నిలబడగలుగుతారా అని ఎందరో సందేహం వెలిబుచ్చారు. ఈ ప్రయోగం విజయవంతం కావాలని ఆశించిన వారు సైతం ఇందులో ఉన్నారు.
ఆదర్శాల్లో పుట్టి, వైవిధ్యంతో ఎదిగి అన్ని వర్గాల్లోనూ ఎన్నో ఆశలను రగిలించిన ఆప్ చాలా స్వల్పకాలంలోనే కుల,మత, ప్రాంత, వర్గ భేదాలతో నిమిత్తంలేకుండా అందరి అభిమానాన్నీ చూరగొనడం సాధారణ విషయం కాదు. ఆ విజయం వెనక లక్షలాదిమంది స్వచ్ఛందంగా పనిచేసిన విద్యార్థి, యువజనులున్నారు. వారంతా దేశంలో విలక్షణమైన రాజకీయాలుండాలని, ప్రజలకు విభిన్నమైన పాలన అందాలని కోరుకున్నవారు. ఇప్పుడు పరస్పరం సంఘర్షించుకుంటున్న నాయకులు దీన్ని మరిచినట్టే కనబడుతున్నారు. ప్రశాంత్, యోగేంద్రల ఆరోపణలు వ్యక్తిగతమైనవి కాదు. పార్టీలో పారదర్శకత లోపించిందనీ, కేజ్రీవాల్ తన మాటే చెల్లుబాటు కావాలనుకుంటారని, కొన్ని అంశాల్లో రాజీపడటం అవసరమని భావిస్తారని ప్రశాంత్ అంటున్నారు.
ఆయన వ్యవహారశైలిపైనే తమ అభ్యంతరం తప్ప కన్వీనర్ పదవినుంచి ఆయన తప్పుకోవాలని కోరుకోవడం లేదని యోగేంద్ర చెబుతున్నారు. అందరినీ కలుపుకొని పోవాలనడమే, పారదర్శకంగా మెలగాలనడమే సమస్యలుగా పరిణమించడమంటే ఇప్పటికే ఉన్న అనేకానేక పార్టీల్లో ఆప్ ఒకటిగా మారటమే అవుతుంది. ఎన్నికల రాజకీయాలకు వెలుపల ఉన్నప్పుడు పార్టీలనూ, పార్టీల నేతలనూ నిలదీసినవారు తీరా తమదాకా వచ్చేసరికి అదే మూసలోకి జారిపోవడం ఒక విషాదం. కేజ్రీవాల్ నిజంగా చిత్తశుద్ధితో మెలగదలిస్తే ఆశిష్, అశుతోష్‌లతో ఆరోపణలు చేయించడం కాక... తనపై వచ్చిన విమర్శలకు నేరుగా ప్రశాంత్, యోగేంద్రలతో మాట్లాడవలసింది. ఎందరి భాగస్వామ్యంతోనో ఏర్పడిన ఆప్ ఎవరో ఒకరి చేతిలో అంత సులభంగా ఒదిగిపోదు. వారిద్దరినీ తొలగించే తీర్మానంపై జాతీయ కార్యవర్గంలో జరిగిన ఓటింగు తీరే అందుకు నిదర్శనం. దీన్నొక సూచికగా పరిగణించి కేజ్రీవాల్ తన తీరును మార్చుకోవడం, ప్రజాస్వామిక విలువలను పాటించడం ఆప్ శ్రేయస్సుకు మాత్రమే కాదు... తన వ్యక్తిగత ప్రతిష్టకు కూడా చాలా అవసరం.
ఆప్‌లో అంతర్మథనం
Published Fri, Mar 6 2015 12:42 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement
Advertisement