అరవింద్ కేజ్రీవాల్
సంపాదకీయం
ఏ సమయానికి ఏంచేయాలో ఖచ్చితంగా తెలిసినవాడే రాజకీయాల్లో విజేతగా నిలుస్తాడని బ్రిటన్ ప్రధానిగా పనిచేసిన విలియం గ్లాడ్‌స్టోన్ అంటాడు. ఈ సంగతి కొమ్ములు తిరిగిన రాజకీయ నాయకులకంటే నిన్న మొన్న రాజకీయాల్లోకొచ్చిన అరవింద్ కేజ్రీవాల్‌కు బాగా తెలుసు. అందువల్లే అధికారంలో అర్ధ శతదినోత్సవమైనా జరుపుకోకుండానే.... అదును చూసుకుని ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. పర్యవసానంగా ఎన్నికలై రెండునెలలు కాకుండానే ఢిల్లీ రాష్ట్రపతి పాలనకిందకు వెళ్లింది. గత డిసెంబర్‌లో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించినప్పుడు ఆయన అయిదేళ్లూ ఆ గద్దెపై ఉంటారని ఎవరూ అనుకోలేదు. ప్రజలకిచ్చిన 18 హామీలనూ ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నిర్ణీత గడువులోగా నెరవేరిస్తేనే మద్దతు కొనసాగిస్తామని కాంగ్రెస్ షరతుపెట్టింది.
ఆ రకంగా మద్దతు వెనక్కు తీసుకోవడానికి అవసరమైన దోవను అది ముందే ఏర్పాటుచేసుకుంది. కేజ్రీవాల్‌ను విఫలుడిగా నిరూపించడానికి తగిన సమయం కోసం అది ఎదురుచూస్తుండగా... దీన్నుంచి ఎప్పుడు బయటపడదామా అని కేజ్రీవాల్ తహతహలాడారు. ఆప్‌కు మద్దతివ్వడం ద్వారా కేజ్రీవాల్‌ను ఢిల్లీకి పరిమితం చేయొచ్చని, అదే సమయంలో నరేంద్ర మోడీని సమర్ధించే పట్టణ మధ్యతరగతి వర్గానికి ఒక ప్రత్యామ్నాయాన్ని చూపవచ్చని...తద్వారా బీజేపీకి చెక్ పెట్టవచ్చునని కాంగ్రెస్ ఆశించింది. ఢిల్లీలో సాధించిన విజయాన్ని మరింత విస్తరింపజేయడానికి... ముఖ్యంగా హర్యానా, యూపీ వంటి ఇరుగుపొరుగు రాష్ట్రాల్లో పార్టీని బలమైన శక్తిగా రూపొందించడానికి కేజ్రీవాల్ ప్రణాళికలు వేసుకున్నారు. తాను ఢిల్లీకే పరిమితమైతే ఇది వీలుపడదు. అందువల్లే ఎలాగైనా అధికారంనుంచి బయటపడాలని ఆయన భావించారు. ఈ పందెంలో చివరకు కేజ్రీవాల్‌దే పైచేయి అయింది. ఆయన సరిగ్గా తాను అనుకున్న సమయానికే, తనకు అనుకూలమైన పద్ధతుల్లోనే అధికారంనుంచి వైదొలగారు. కేజ్రీవాల్ ముందు శతాధిక వృద్ధ కాంగ్రెస్ ఎత్తుగడలు పారలేదు.
అధికారంలోకొచ్చినప్పటినుంచీ కేజ్రీవాల్ తీసుకున్న చర్యలు ప్రజలను ఆకట్టుకున్నాయి. ప్రతి కుటుంబానికీ రోజూ 667 లీటర్లవరకూ ఉచితంగా మంచినీరివ్వడం దగ్గర్నుంచి అవినీతిపై హెల్ప్‌లైన్ ప్రారంభించడంవరకూ...ఢిల్లీలో మూడు దశాబ్దాలనాటి సిక్కుల ఊచకోతపై సిట్ దర్యాప్తు మొదలుకొని కామన్వెల్త్ క్రీడల స్కాంలో మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌పై ఎఫ్‌ఐఆర్ దాఖలుచేయడంవరకూ అన్నీ కీలకమైనవే. జనంలో ఆప్ ప్రతిష్టను పెంచేవే. గ్యాస్ ధరల విషయంలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, చమురు శాఖ మంత్రి వీరప్ప మొయిలీ, కేంద్ర మాజీ మంత్రి మురళీ దేవ్‌రా తదితరులపై మూడురోజులక్రితం ఎఫ్‌ఐఆర్ దాఖలుచేయడం వీటన్నిటికీ పరాకాష్ట. ఇవన్నీ తాను చేయగలిగినవే. కానీ, తనకు అసాధ్యమైనవి కూడా ఉన్నాయి. చార్జీలు పెంచాలని చూస్తున్న డిస్కంలను నిలువరించడం, రానున్న వేసవిలో అవి విధించబోయే కరెంటు కోతలను నివారించడం వంటివి అత్యంత క్లిష్టమైన పనులు. తమ చెప్పుచేతల్లో కాకుండా కేంద్ర హోంశాఖ కనుసన్నల్లో మెదిలే పోలీసు శాఖ వైఫల్యాలకూ, చేతగానితనానికీ బాధ్యతవహించాల్సిరావడం కూడా తక్కువ భారమేమీ కాదు. మరికొన్ని రోజులు కొనసాగితే ఇవన్నీ గుదిబండలవుతాయి. వైఫల్యాలకు ఆనవాళ్లవుతాయి. లోక్‌సభ ఎన్నికల సమయంలో ప్రత్యర్థులకు పదునైన అస్త్రాలవుతాయి.
అందుకే, ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చివున్న జన్‌లోక్‌పాల్ బిల్లును ఆయన అసెంబ్లీ ముందుకు తెచ్చేందుకు ప్రయత్నించారు. ఆర్ధికాంశాలతో ముడిపడివుండే బిల్లులు తీసుకురావడానికి కేంద్రం ముందస్తు అనుమతి అవసరమన్న లెఫ్టినెంట్ గవర్నర్‌ను ఆయన బేఖాతరుచేశారు. ఇలా చేయడం రాజ్యాంగ నిబంధనలను అతిక్రమించడమేనని వాదించి, జన్‌లోక్‌పాల్ బిల్లు ప్రవేశాన్ని అడ్డుకుని చివరకు బీజేపీ, కాంగ్రెస్‌లే గోతిలోపడ్డాయి. ఒకపక్క ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర ప్రతిపత్తి కల్పించాలని డిమాండు చేస్తున్న ఆ రెండు పార్టీలూ అసెంబ్లీ అధికారానికి పరిమితులు విధించే ఇలాంటి నిబంధనపై పట్టుబట్టాల్సిన అవసరమేమిటో అర్ధంకాని విషయం. పైగా, ఇది కేజ్రీవాల్ మాత్రమే చేసిన పని కాదు. ఇంతక్రితం షీలా దీక్షిత్ సర్కారు ఈ నిబంధనను బేఖాతరుచేసి 13 బిల్లులను అసెంబ్లీలో ఆమోదింపజేసుకున్నది. కేవలం ముఖేష్ అంబానీపై కేసు పెట్టడాన్ని జీర్ణించుకోలేకే బిల్లును అడ్డుకున్నారన్న కేజ్రీవాల్ విమర్శలకు బీజేపీ, కాంగ్రెస్‌లవద్ద ఇప్పుడు జవాబులేదు.
అవినీతి వ్యతిరేకోద్యమంలో చురుగ్గా పనిచేస్తున్నప్పుడు రాజకీయనాయకులంతా ఆయనను ‘బాధ్యతలేని వ్యక్తి’గా ముద్రేయడానికి చూశారు. బయటవుండి కబుర్లు చెప్పడం కాదు...ఎన్నికల్లో నిలబడి సత్తా చాటుకోవాలని సవాల్‌చేశారు. వచ్చి ఎన్నికల్లో నిలబడినప్పుడు ‘మా మెజారిటీని తగ్గించడానికొచ్చిన అవతలి పార్టీ ఏజెంట’న్నారు. అన్ని అంచనాలనూ తలకిందులు చేసి 28 స్థానాలు గెల్చుకుని... కాంగ్రెస్ మద్దతివ్వడానికి ముందుకొచ్చినా మీనమేషాలు లెక్కిస్తుంటే బాధ్యతలనుంచి పారిపోతున్నాడన్నారు. పదవి చేపట్టాక ఆయనను కాంగ్రెస్‌తో కుమ్మక్కయినవాడిగా చిత్రించారు.
ఢిల్లీ పోలీసులతో వచ్చిన వివాదంతో వీధికెక్కి, బాధ్యులపై చర్య తీసుకోవాలని డిమాండుచేస్తూ ధర్నాకు దిగినప్పుడు ‘అరాచకవాద’న్నారు. ఎన్నో అన్నారుగానీ...కేజ్రీవాల్‌ను పెద్ద వ్యూహకర్తగా కాంగ్రెస్, బీజేపీలు గుర్తించలేకపోయాయి. రాగల లోక్‌సభ ఎన్నికల్లోనూ, బహుశా ఆ ఎన్నికలతోపాటే మళ్లీ జరగబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇందుకు ఆ పార్టీలు భారీ మూల్యమే చెల్లించాల్సిరావొచ్చు.