న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లో సంక్షోభానికి తెరపడే దిశగా ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. పార్టీకి, పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలపై రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ) నుంచి బహిష్కరణకు గురైన నేతలు ప్రశాంత్ భూషణ్, యోగేంద్రయాదవ్‌లు త్వరలో కేజ్రీవాల్‌తో భేటీ కానున్నారు. ఈ మేరకు వారిద్దరి తరఫున కేజ్రీవాల్‌కు వెళ్లిన ఎస్‌ఎంఎస్‌కు ‘త్వరలోనే కలుద్దాం’ అంటూ కేజ్రీవాల్ జవాబిచ్చారు. మరోవైపు, బెంగళూరులో ప్రకృతి చికిత్స అనంతరం కేజ్రీవాల్ ఢిల్లీకి తిరిగివచ్చిన కాసేపటికి సోమవారం రాత్రి యోగేంద్రతో కేజ్రీవాల్‌కు నమ్మకస్తులైన సంజయ్ సింగ్, కుమార్ విశ్వాస్, అశుతోశ్, ఆశిష్ ఖేతన్ భేటీ అయ్యారు. తెల్లవారుజాము 3 గంటల వరకు చర్చించారు. సరైన దిశలోనే చర్చలు ప్రారంభమయ్యాయని యోగేంద్ర యాదవ్ అన్నారు.
‘పార్టీలో జరిగిన గత కొన్ని రోజుల మేథో మథనంలో చాలా విషం వెలువడింది. ఇప్పుడు అమృతం వెలువడాల్సి ఉంది’ అని పేర్కొన్నారు. అంతకుముందు, ప్రశాంత్‌తో భేటీ అయ్యేందుకు ఆప్ నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కేజ్రీవాల్ మినహా మరెవరితోనూ చర్చించే ప్రసక్తే లేదని ప్రశాంత్ తేల్చి చెప్పారు. కాగా, అనుకోకుండా మంగళవారం కేజ్రీవాల్, యోగేంద్ర కలుసుకున్నారు. పరువు నష్టం కేసులోకారణాలు చూపకుండా కోర్టుకు గైర్హాజరైనందుకు కడ్కడూమా జిల్లా కోర్టు జడ్జి ఆగ్రహించడంతో కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం సిసోడియా, యోగేంద్ర మధ్యాహ్నం కోర్టుకు హాజరయ్యారు. రెండు నిమిషాల పాటు వారు మాట్లాడుకున్నారు.