అమెరికా వీసా విధానంలో స్థిరత్వం, పారదర్శకత ఉండాలని భారత్ పేర్కొంది.
న్యూఢిల్లీ: అమెరికా వీసా విధానంలో స్థిరత్వం, పారదర్శకత ఉండాలని భారత్ పేర్కొంది. అలాంటి వాతావరణంలోనే వ్యాపారం అభివృద్ధి చెందుతుందని తెలిపింది. భారత పర్యటనకొచ్చిన అమెరికా కాంగ్రెస్ సభ్యులతో సోమవారం ఈ విషయాలపై సమగ్రంగా చర్చించినట్లు వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఐక్యరాజ్య సమితి నివేదిక ఒకటి విడుదల సందర్భంగా ఆమె మంగళవారం విలేకర్లతో మాట్లాడారు. అమెరికాలో కొత్త ప్రభుత్వం కుదురుకునే దాకా వేచి చూస్తున్నామని కాంగ్రెస్ సభ్యులు చెప్పినట్లు మంత్రి తెలిపారు. వీసా సంబంధ సమస్యల పరిష్కారంలో రెండు పార్టీలకు చెందిన సభ్యులు కీలక పాత్ర పోషిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు.
సోమవారం ఈయూ ప్రతినిధులతో జరిగిన సమావేశం గురించి అడిగినపుడు... స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ), ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం(బీఐటీ)పై వారితో చర్చలు జరిపినట్లు తెలిపారు. ఈ రెండు అంశాలపై భారత వైఖరిని వారికి స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు. ఎఫ్‌టీఏపై తదుపరి విడత చర్చలకు ఎలాంటి కాలపరిమితి లేదని, వీలైనంత త్వరగానే ప్రారంభమవుతాయని చెప్పారు.