డబ్ల్యూటీవో ముందుకు వీసాల వ్యవహారం?
డబ్ల్యూటీవో ముందుకు వీసాల వ్యవహారం?
Published Wed, Mar 29 2017 8:22 PM | Last Updated on Fri, Aug 24 2018 7:58 PM
న్యూఢిల్లీ: వీసాల ఫీజుల పెంపుపై అమెరికా దుందుడుకుతనాన్ని భారత్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్(డబ్ల్యూటీవో) ముందుకు తీసుకెళ్లింది. ఈ విషయంపై వివాదాల పరిష్కారాల ఏజెన్సీ డబ్ల్యూటీవోను ఆశ్రయించినట్టు పరిశ్రమల, వాణిజ్య శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం రాజ్యసభలో తెలిపారు.హెచ్-1బీ, ఎల్-1 వీసాల విషయంలో వీసా ప్రక్రియ ఫీజులను అమెరికా పెంచుతుందని ఆమె ఆరోపించారు. దీంతో దేశీయ సర్వీసు కంపెనీలు సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. ఇప్పటికే చాలా సార్లు అమెరికా ప్రభుత్వంతో తాము చర్చలు జరిపామని, ఇక చివరికి ఈ విషయంపై డబ్ల్యూటీవో ముందుకెళ్లినట్టు తెలిపారు.
హెచ్-1బీ వీసా ప్రక్రియలో నిబంధనల కఠినతరంపై భారత ప్రభుత్వం, అమెరికా కార్యావర్గానికి నచ్చజెప్పేలా ప్రయత్నాలు సాగిస్తూనే ఉందని, ఎప్పడికప్పుడూ అమెరికా కార్యవర్గంతో చర్చలు జరుపుతూనే ఉందని ఆమె తెలిపారు. భారత విదేశాంగ కార్యదర్శి ఎస్. జయశంకర్ కూడా ఈ నెల మొదట్లో అమెరికాను సందర్శించారు. అమెరికా ఆర్థికవ్యవస్థ వృద్ధి చెందడానికి భారత్ భాగస్వామ్యం ఎంతో అవసరమని ఆయన ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తో చెప్పారు.
ఈ విషయంపై అమెరికాకు నచ్చజెప్పేందుకు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అధికారులతో, కాంగ్రెస్తో చాలా సార్లు చర్చలు జరిపినట్టు జయశంకర్ తెలిపారు. ఏప్రిల్ 3 నుంచి హెచ్-1బీ వీసాల ప్రీమియం ప్రాసెసింగ్ ను సస్పెండ్ చేస్తామని అమెరికా ఇంతకముందే చెప్పింది. ప్రతిభావంతులైన విదేశీయులు మాత్రమే అమెరికాలోకి వచ్చే విధంగా హెచ్-1బీ వీసా ప్రక్రియను కఠినతరం చేస్తామని అమెరికా హెచ్చరిస్తోంది. అమెరికాలో పనిచేసే చాలా భారత ఐటీ కంపెనీలు హెచ్-1బీ వీసాలపై ఆధారపడి ఉన్నాయి. ఈ నిబంధనల కఠినతరంతో భారత ఐటీ కంపెనీలకు తీవ్ర నష్టం వాటిల్లనుంది. దీంతో భారత్ లో ఆందోళన నెలకొంది.
Advertisement