WTO
-
ట్రంప్ ‘వాణిజ్య యుద్ధభేరి’
అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసింది మొదలుకొని నాలుగు రోజులుగా డోనాల్డ్ ట్రంప్ వరసపెట్టి జారీచేస్తున్న ఉత్తర్వులు జనాన్ని హడలెత్తిస్తున్నాయి. తాజాగా దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదికనుద్దేశించి గురువారం ఆయన చేసిన ప్రసంగం కూడా ఆ కోవలోనిదే. అది ఒకరకంగా ‘వాణిజ్య యుద్ధభేరి’. తమ దేశంలో పెట్టుబడులు పెడితే ప్రపంచ దేశాలన్నిటికన్నా తక్కువ పన్నులు విధిస్తామనీ, కాదంటే ట్యారిఫ్ల మోత మోగిస్తామనీ ఆయన హెచ్చరించారు. భారత్, చైనాలపై ఆయనకు మొదటినుంచీ ఆగ్రహం ఉంది. ఈ రెండు దేశాలూ వర్ధమాన దేశాల ముసుగులో అనేక వెసులుబాట్లు పొందుతూ అమెరికాకు నష్టం కలిగిస్తున్నాయని గతంలో ఆయన విరుచుకుపడ్డారు. అనంతర కాలంలో దక్షిణాఫ్రికా, ఇండొనేసియాలను కూడా ఈ జాబితాలో చేర్చారు. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) వల్ల అమెరికా బాగా నష్టపోతున్నదని చీటికీ మాటికీ ఆరోపించేవారు. నిజానికి డబ్ల్యూటీవో అమెరికా మానసపుత్రిక. వాణిజ్య ప్రపంచంలో హద్దులుండరాదని, కనీసం వాటిని తగ్గించాలని, హేతుబద్ధమైన ట్యారిఫ్‌లు అమలయ్యేలా చూడా లని ఆ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. వర్ధమాన దేశాలకు సాధారణ ప్రాధాన్యతల వ్యవస్థ (జీఎస్పీ) కింద దిగుమతి చేసుకునే కొన్ని సరుకులపై సుంకాలు తగ్గుతాయి. ఇతర దేశాల ఉత్పత్తులను సైతం సమానంగా చూసే దేశాన్ని అత్యంత అనుకూల దేశం (ఎంఎఫ్ఎన్)గా పరిగణించే సూత్రం డబ్ల్యూటీవో పాటిస్తోంది. ఇవన్నీ ట్రంప్‌కు కంటగింపుగా ఉన్నాయి. సంస్థ నిబంధనల్లో ఉన్న లొసుగులు అమెరికాను దెబ్బతీస్తూ వేరే దేశాలకు తోడ్పడుతున్నాయని ఆరోపించటం అందుకే! ఇంతకూ ట్రంప్ నిజంగానే అన్నంత పనీ చేస్తారా? అలాచేస్తే అమెరికా వాణిజ్యం ఏమవు తుంది? ట్రంప్ హెచ్చరించి 24 గంటలు కాకుండానే పొరుగునున్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో గట్టి జవాబే ఇచ్చారు. కెనడా, మెక్సికోల ఉత్పత్తులపై 25 శాతం ట్యారిఫ్ విధించే ఆలోచన చేస్తున్నా మని, బహుశా ఫిబ్రవరి 1 నుంచి అది అమలుకావచ్చని ప్రకటించటాన్ని ప్రస్తావిస్తూ అదే జరిగితే తమ నుంచి కూడా ప్రతీకారం ఉంటుందని, అమెరికా వినియోగదారులు భారీయెత్తున నష్ట పోవాల్సి వస్తుందని ట్రూడో హెచ్చరించారు. కెనడా నుంచి అమెరికా 34 అత్యవసర ఖనిజాలు, లోహాలు దిగుమతి చేసుకుంటున్నది. అలాగే అమెరికా నుంచి భారీ యంత్రాలూ, సహజవాయువు, విద్యుత్, ముడి చమురు, పండ్లు, కూరగాయలు, మాంస ఉత్పత్తులు కొనుగోలు చేస్తోంది. నిత్యం 270 కోట్ల డాలర్ల విలువైన సరుకులు, సేవలు అటునుంచి ఇటూ, ఇటునుంచి అటూ వెళ్తుంటాయి. భిన్న వాతావరణ పరిస్థితులున్నప్పుడు కావలసిన సమస్తాన్నీ ఏ దేశమూ సొంతంగా ఉత్పత్తి చేసు కోవటం సాధ్యం కాదు. ఈ సంగతి ట్రంప్‌కు తెలియదనుకోలేం. క్రితంసారి అధ్యక్షుడిగా ఉన్న ప్పుడు అమెరికా ఉత్పత్తి చేస్తున్న ఖరీదైన హార్లీ–డేవిడ్సన్ బైక్‌లపై సుంకాలు తగ్గించాలని మన దేశంపై ఒత్తిళ్లు తెచ్చారు. తీరా తగ్గించాక చాలదని పేచీ పెట్టారు. ప్రతీకారంగా మన ఉక్కుపై 25 శాతం, అల్యూమినియం ఉత్పత్తులపై 10 శాతం అదనపు టారిఫ్‌లు విధించారు. దీనికి ప్రతిగా మన దేశం కూడా అమెరికా నుంచి దిగుమతయ్యే ఉత్పత్తులపై సుంకాలు పెంచింది. ట్రంప్ అక్కడితో ఆగలేదు. జీఎస్పీ నిబంధనలు భారత్‌కు వర్తింపజేయొద్దని డబ్ల్యూటీవోకు లేఖ రాశారు. మనం భాగస్వామిగా ఉన్న బ్రిక్స్ దేశాలపై మరింతగా ట్యారిఫ్ వడ్డింపులు ఉంటాయని ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు. బ్రిక్స్‌లో ఉన్న రష్యా, చైనాలు దానివల్ల దండిగా లాభపడతాయని, శక్తి మంతంగా రూపుదిద్దుకుంటాయని ఆయన ఆందోళన. ఉన్నంతలో మనను ఆ సంస్థకు దూరం చేయాలన్నది ట్రంప్ లక్ష్యంగా కనబడుతోంది. అయితే తెగేదాకా లాగే ధైర్యం ట్రంప్‌కు ఉందా అన్నది సందేహమే. ఎందుకంటే 2019లో చైనా ఎగుమతులపై 30 వేల కోట్ల డాలర్ల సుంకాలు విధిస్తామని ట్రంప్ ప్రకటించిన వెంటనే అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల్ని కొనడం ఆపేయాలని తమ పబ్లిక్‌రంగ సంస్థలకు చైనా సూచించింది. ఆ వెంటనే అమెరికా స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా పతనమయ్యాయి. మళ్లీ ట్రంప్ రంగంలోకి దిగి చైనాపై సుంకాల పెంపు ఇప్పట్లో ఉండబోదని ప్రకటించాకగానీ పరిస్థితి కుదుటపడలేదు. తన ప్రకటనల పర్యవసానం ఎలావుంటుందో ట్రంప్ ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. 1930లో అమెరికా తీసుకొచ్చిన టారిఫ్ చట్టానికి ప్రతీకారంగా ఎవరికి వారు వాణిజ్య ఆంక్షలు అమలు చేయటం పెను సంక్షోభానికి దారితీసిన సంగతి ట్రంప్ గుర్తుంచుకోవాలి. ఈ పరస్పరహననం వల్ల ఎన్నో దేశాల జీడీపీలు భారీయెత్తున పడిపోవటం పర్యవసానంగానే అప్పట్లో అన్ని చోట్లా అశాంతి, అపనమ్మకం ప్రబలాయి. దీన్ని హిట్లర్ వంటి నియంతలు చక్కగా వినియోగించు కున్నారు. జాతి విద్వేషాలు, జాతీయ దురభిమానాలను రెచ్చగొట్టారు. సహజ వనరుల వినియోగం పెరగటం, సాంకేతికతల అభివృద్ధి జరగటం తదితర కారణాల వల్ల కొంత హెచ్చుతగ్గులతో చాలా దేశాలు అభివృద్ధి చెందాయి. ఈ నేపథ్యంలో డబ్ల్యూటీవో వంటి సంస్థల వెనకుండి ప్రపంచ వాణి జ్యాన్ని శాసించినవారే, లాభపడ్డవారే ఇప్పుడు ‘అమెరికా ఫస్ట్’ అంటూ స్వరం మారిస్తే ఇతర దేశాలు సాగిలపడాలా? ‘అమెరికా మితిమీరినా డబ్ల్యూటీవో ద్వారా వివాద పరిష్కారానికి గల అవకాశాలను వినియోగించుకోండి. తీవ్ర చర్యలొద్దు’ అని ఇతరేతర దేశాలకు డబ్ల్యూటీవో సంస్థ డైరెక్టర్ జనరల్ గోజీ ఒకాంజో ఇవేలా హితవు చెబుతున్నారు. మంచిదే! మరి ట్రంప్‌కు చెప్ప గలవారెవరు? ఆయనను నియంత్రించగలిగేదెవరు? -
Indian Flag: ప్రపంచాన మెరిసిన త్రివర్ణం
బీజింగ్/సింగపూర్/అమెరికా: ప్రపంచ దేశాల్లో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. వివిధ దేశాల్లో నివసిస్తున్న ప్రవాస భారతీయులు భారత స్వాతంత్య్ర దినోత్సవాలను ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించుకున్నారు. చైనాలో భారత రాయబారి ప్రదీప్ రావత్ వేడుకల్లో పాల్గొన్నారు. భారత ఎంబసీలో జాతీయ జెండాను ఎగురవేశారు. చైనాలోని భారతీయులు అధిక సంఖ్యలో విచ్చేసి, సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు. భారత నావికా దళానికి చెందిన నిఘా నౌక ‘ఐఎన్ఎస్ సరయూ’ బ్యాండ్ సిబ్బంది సింగపూర్‌లో భారత రాయబార కార్యాలయంలో దేశభక్తి గేయాలు ఆలపించారు. కెనడా, బంగ్లాదేశ్, నేపాల్, ఇజ్రాయెల్ తదితర దేశాల్లోను భారత స్వాతంత్య్ర దినోత్సవాలు నిర్వహించారు. అమెరికాలోని బోస్టన్‌లో ‘ఇండియా డే’ పరేడ్ సందర్భంగా 220 అడుగుల ఎత్తున ఎగురవేసిన భారత జాతీయ జెండా ప్రజలను ఆకట్టుకుంది. భారత్‌కు శుభాకాంక్షల వెల్లువ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారత్‌కు ప్రపంచదేశాల అధినేతల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ తదితరులు భారత్‌కు అభినందనలు తెలియజేశారు. ‘సత్యం, అహింసా అని గాంధీజీ ఇచ్చిన సందేశం విలువైనది. ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్, అమెరికా ప్రజల శాంతిభద్రతల కోసం ఇరుదేశాలూ కలిసికట్టుగా పనిచేయాలి’ అని బైడెన్ సందేశమిచ్చారు. ఆస్ట్రేలియా ప్రధాని అల్బానీస్, ఆస్ట్రేలియా రక్షణ శాఖ మంత్రి రిచర్డ్ మార్లెస్, మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం మొహమ్మద్, సోలిహ్, సింగపూర్ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్ తదితర ప్రముఖులు భారత ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇదీ చదవండి: వివాదంలో బ్రిటన్ ప్రధాని అభ్యర్థి రిషి సునాక్! -
'భారత్ పై చర్యలు తీసుకోండి'... బైడెన్‌కి లేఖ...
Dangerous trade-distorting practices: అమెరికా కాంగ్రెస్ చట్టసభ సభ్యులు భారత్ వ్యవసాయ రంగంపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ వ్యవసాయ రంగంలో సరైన నియమాలు లేవని ఇవి ప్రమాదకరమైన వాణిజ్యాన్ని వక్రీకరించే పద్ధతులు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయమై భారత్‌తో సంప్రదింపుల కోసం అధికారిక అభ్యర్థనను ధాఖాలు చేయాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ని కోరారు. ఈ మేరకు 12 మంది కాంగ్రెస్ సభ్యులు బైడెన్‌కి లేఖ రాశారు. "ఆ లేఖలో...ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) నియమాల ప్రకారం ఆయా దేశాల ప్రభుత్వాలు వస్తువుల ఉత్పత్తి విలువలో 10% వరకు సబ్సిడీ ఇవ్వడానికి అనుమతిస్తాయి. కానీ భారత ప్రభుత్వం బియ్యం, గోధుమలతో సహా అనేక వస్తువులకు ఉత్పత్తి విలువలో సగానికి పైగా సబ్సిడీని కొనసాగిస్తోంది. బైడెన్ పాలన నియమాలకు విరుద్ధంగా భారత్ ధరలను తగ్గించడం, బియ్యం, గోధుమ వంటి వాటి ఉత్పత్తిని తగ్గించడం వంటివి చేస్తోందని ఆరోపించారు. ఇది అమెరికా ఉత్పత్తిదారులకు ప్రతికూలంగా ఉండటమే కాకుండా ప్రపంచ వ్యవసాయ ఉత్పత్తిని, వాణిజ్యాన్ని కూడా పూర్తిగా మార్చేసిందన్నారు. భారత్ వ్యవసాయ రంగ విధానాలు ప్రపంచ స్థాయిలో ప్రమాదకరమైన వాణిజ్య వక్రీకరణ అని ఆరోపణలు చేశారు. భారత్ అనుసరిస్తున్న విధానాలు అమెరికాలోని రైతులపై ప్రభావం చూపుతోంది." అని ఆ లేఖలో పేర్కొన్నారు. అమెరికా ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ)లోని ఇతర సభ్యుల మద్దతు తీసుకుని భారత్‌తో అధికారిక సంప్రదింపులు జరపాలని కోరారు. ఏకాభిప్రాయం కోసం అమెరికా భారత్‌కి వంతపాడోద్దని, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఆహార కొరతను దృష్టిలో ఉంచుకుని పరిష్కార దిశగా అమెరికా తగు చర్యలు తీసుకోవాలంటూ బైడెన్‌ని చట్ట సభ సభ్యులు డిమాండ్ చేశారు. అంతేకాదు అమెరికా ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రత కోసం స్థితిస్థాపక పరిస్థితులను నిర్మించడంలో అమెరికా వ్యవసాయం దోహదపడుతుందన్నారు. కానీ భారత్ మాత్రం డబ్ల్యూటీఓలో తాము అనుసరిస్తున్న విధానం సరైనదేనని నొక్కి చెబుతోంది. తమ రైతుల ప్రయోజనాలను పరిరక్షించడంలో భాగంగా భారత్ ఇలాంటి విధానాలను అనుసరిస్తోందని , దీన్ని ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు, సంస్థలు ప్రశంసించాయని చెప్పడం విశేషం. (చదవండి: రూ. 300 కోట్ల మోసానికి పాల్పడ్డ భారత సంతతి వ్యక్తి అరెస్ట్) -
ఆహార ధాన్యాల ఎగుమతులు.. భారత్ ఆందోళన
జెనీవా: ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆహార పథకం కోసం కొనుగోలు చేసే ఆహార ధాన్యాలకు ఎగుమతుల నుంచి పూర్తి మినహాయింపులను కొనసాగించడానికి సుముఖంగా లేమని భారత్ తెలిపింది. ఇది దేశీయంగా ఆహార భద్రత సవాళ్లను ఎదుర్కొనే విషయంలో పాలకులను నియంత్రిస్తుందని పేర్కొంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆదివారం జెనీవాలో మొదలైన ప్రపంచ వాణిజ్య సంస్థ 12వ మంత్రిత్వ సదస్సులో ఇది చర్చకు వచ్చింది. డబ్ల్యూటీవో కింద 164 సభ్య దేశాల తరఫున నిర్ణయాలు తీసుకునే అత్యున్నత మండలి ఇది. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఆధ్వర్యంలోని బృందం ఇందులో పాల్గొంటోంది. అభివృద్ధి చెందుతున్న దేశాల జీ–33 గ్రూపు ఉమ్మడిగా కలసి పనిచేయాలని, భాగస్వామ్య దేశాల మద్దతుతో తటస్థమైన, పారదర్శక ఫలితం వచ్చేలా డబ్ల్యూటీవోలో కృషి చేయాలని భారత్ పిలుపునిచ్చింది. డబ్ల్యూటీవో సమావేశం సందర్భంగా జీ33 దేశాల మంత్రులను ఉద్దేశించి గోయల్ మాట్లాడారు. అభివృద్ధి చెందిన దేశాలు భారీ సబ్సిడీలతో అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఎగుమతులను కుమ్మరించడం వల్ల స్థానికంగా ధరలు పడిపోయి, అస్థిరతలను ఎదుర్కోవాల్సి వస్తోందని వాణిజ్య గోయల్ మరోసారి ప్రస్తావించారు. దీన్నుంచి రక్షణ కల్పించే ‘ప్రత్యేక రక్షణ యంత్రాంగం (ఎస్ఎస్ఎం) కోసం భారత్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోంది. చదవండి: వెబ్ 3నే అంతు చిక్కలేదు అప్పుడే వెబ్ 5 అంటున్నారు! -
Omicron ఎఫెక్ట్.. కీలక భేటీ నిరవధిక వాయిదా!
ప్రపంచం మొత్తం ఇప్పుడు కొత్త గుబులుతో ఉడికిపోతోంది. బీ.1.1.529 కరోనా వేరియంట్‌పై ప్రపంచ దేశాల ఆందోళన పెరిగిపోతోంది. వ్యాక్సిన్లకు సైతం తలొగ్గని ఒమిక్రాన్ మొండి వేరియంట్ కావడంతో పలు దేశాలు అప్రమత్తం అవుతున్నాయి. ఈ క్రమంలో మరోసారి ప్రయాణాలపై నిషేధం, ఆంక్షలు తెర మీదకు వస్తున్నాయి. వచ్చే వారం జెనీవాలో డబ్ల్యూటీవో మినిస్టీరియల్(ఎంసీ12) కాన్ఫరెన్స్ జరగాల్సి ఉంది. అయితే కొత్త వేరియెంట్ ఠారెత్తిస్తున్న తరుణంలో ఈ సమావేశాన్ని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. రెండేళ్లకొకసారి జరిగే ఎంసీ12 భేటీలో మల్టీలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ గురించి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రపంచంలో 98 శాతం వాణిజ్యాన్ని సమీక్షించే డబ్ల్యూటీవోలో 164 మంది సభ్యులు ఉన్నారు. ఇక నవంబర్ 30 డిసెంబర్ 3 మధ్య వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఎంసీ12 సమావేశం జరగాల్సి ఉంది. అయితే స్విస్ ప్రభుత్వం శుక్రవారం నుంచి అంతర్జాతీయంగా ట్రావెల్ బ్యాన్ ప్రకటించింది. ముఖ్యంగా సౌతాఫ్రికా, హాంకాంగ్, బెల్జియం ఇతర దేశాల నుంచి ప్రయాణికుల రాకపోకలను నిషేధించింది. ఈ నేపథ్యంలోనే భేటీని నిరవధిక వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది WTO. ఇదిలా ఉంటే ఒమిక్రాన్ వేరియెంట్ కేసులు వెలుగుచూశాక.. త్వరలో జరగాల్సిన కీలక సమావేశాలు, అంతర్జాతీయ సదస్సులు చాలానే వాయిదా పడ్డాయి. చదవండి: ఆ మార్కెట్లో మళ్లీ కరోనా కలకలం -
ఇంత బాధలో మేధో హక్కులా?
కరోనా విజృంభిస్తున్న వేళ విశ్వజనులకు వేగంగా వ్యాక్సిన్ అందించే అడుగులు పడుతున్నాయి. కోవిడ్ వ్యాక్సిన్ పేటెంట్ రక్షణను తాత్కాలికంగానైనా నిలిపివేయాలనే ప్రతిపాదనకు సానుకూల స్పందన వస్తోంది. అంటే, మేధో సంపత్తి హక్కుల మాఫీ అన్నమాట! ఏకాభిప్రాయం కుదిరితే వ్యాక్సిన్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ విశ్వవ్యాప్తమై సత్వరమే అందరికీ వ్యాక్సిన్ లభిస్తుంది. ఫలితంగా కరోనాపై మన ఉమ్మడిపోరు విజయావకాశాలు మెరుగవుతాయి. ఇదొక ఆరోగ్యకర వాతావరణానికి సంకేతం! ముఖ్యంగా వైద్యరంగంలో సరికొత్త సంస్కరణలకు తెరలేపడమే! కొన్నేళ్లుగా లోలోన రగులుతున్న ఈ అంశం ఇప్పుడు ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) వేదికపైకి రావడం విశేషం. భారత్, దక్షిణాఫ్రికా చేసిన ప్రతిపాదనకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సానుకూలంగా స్పందించడం పెద్ద ముందడుగు. అమెరికా మరింత స్పష్టతతో వస్తే అప్పుడాలోచిస్తామని తాజాగా పేర్కొన్న యురోపియన్ యూనియన్ (ఈయూ), ఈ విషయంలో లోతైన చర్చకు తాము సిద్ధమే అనడం కొత్త మలుపు. ఇదివరకటి వారి వైఖరికిది పూర్తి భిన్నం. ఇప్పటికీ జర్మనీ, బ్రిటన్, స్విట్జర్లాండ్. నార్వే వ్యతిరేకిస్తున్నాయి. ఫ్రాన్స్ మాత్రం సానుకూలంగా స్పందించింది. ‘పేటెంట్ హక్కులు తర్వాత, ముందు ప్రజల ప్రాణాలు కాపాడటం ముఖ్యం’ అన్న ఫ్రాన్స్ లాంటి వైఖరే తాజా ముందడుగు వెనుక మూలసూత్రం. అందరూ ఒక్కటై, కరోనా మహమ్మారిపై పోరాడాల్సిన సంక్లిష్ట సమయంలో... ఏ కొందరి వాణిజ్య ప్రయోజనాలకో–లాభార్జనకో రక్షణ కల్పించడం సరికాదనేది రక్షణ సడలించాలనే వారి వాదన. కోవిడ్ వ్యాక్సిన్, దాని ముడిసరుకుల విషయంలో పేటెంట్ హక్కులున్న పరిమిత కంపెనీలు సంపన్న దేశాల్లోనే ఉత్పత్తులు జరుపుతున్నాయి. ఉత్పత్తి ఎక్కడ జరిపినా.. పంపిణీలో వివక్ష వల్ల ఆయా సంపన్న దేశాల్లో జరిగినట్టు టీకాలిచ్చే ప్రక్రియ ఇతర అభివృద్ధి చెందుతున్న, పేద దేశాల్లో జరగటం లేదు. మహమ్మారిని తరిమికొట్టాలన్న విశాల లక్ష్యానికి ఇది విఘాతం. సంపన్న దేశాల్లో టీకాలివ్వడం రేపు సంపూర్ణమైనా, ఆ సమయానికి వ్యాక్సిన్ దొరక్క అభివృద్ధి చెందుతున్న, పేద దేశాలు ఇంకా వైరస్‌తో పోరాడుతూ ఉంటే సమస్యను ఎదుర్కోవడంలో సమతూకం చెడుతుంది. ఉత్పరివర్తనతో వైరస్ మరిన్ని రూపాలు సంతరించుకొని వ్యాప్తి చెందడం వ్యాక్సిన్ పొందిన సంపన్నదేశాలకూ ప్రమాదమే! అలా కాక, పేటెంట్ రక్షణ కవచం తొలగి, ఉత్పత్తి–పంపిణీ వేగంగా విశ్వవ్యాప్తమైతే సకాలంలో టీకా ప్రక్రియ ముగించి మహమ్మారిని శాశ్వతంగా తరిమికొట్టవచ్చని సానుకూలవాదులంటారు. ఇందుకు భిన్నంగా, పేటెంట్ రక్షణను సడలించకూడదనే వారికీ కొన్ని వాదనలున్నాయి. సడలిస్తే ఉత్పత్తి ఎవరెవరి చేతుల్లోకో పోయి వ్యాక్సిన్ నాణ్యత పడిపోతుందని, వినియోగదారుల్లో విశ్వాసం సన్నగిల్లుతుందని వారంటారు. పైగా అభివృద్ధి చెందుతున్న, పేద దేశాల్లో నాణ్యతా ప్రమాణాలుండవనే వాదనను వారు ముందుకు తెస్తున్నారు. ఇదొక తప్పుడు వాదన. వ్యాక్సిన్లు, ఇతర మందులకు పేటెంట్ హక్కులు ఖాయం చేసుకున్న తర్వాత ఇవే పెద్ద కంపెనీలు, పలు చిన్న కంపెనీలకు సబ్ కాంట్రాక్ట్ ఇవ్వడమో, స్వయంగా తామే రంగంలోకి దిగో ఆ పేద దేశాల్లోనే ఉత్పత్తి చేస్తుంటాయి. తేరగా మౌలిక సదుపాయాలు, చౌకగా కూలీలు లభించడం వల్ల అటు మొగ్గి ఇబ్బడిముబ్బడిగా లాభాలార్జిస్తున్నారు. మరి అప్పుడు లేని నాణ్యతా సందేహాలు, పేటెంట్ హక్కుల్ని సడలిస్తేనే వస్తాయా? నిజంగా ఉత్పత్తి నాణ్యతపై భయ–సందేహాలుంటే... విశ్వసనీయత కలిగిన సంస్థల పర్యవేక్షణ, గట్టి నిఘాతో అది సాధించుకోవచ్చు. మేధో సంపత్తి హక్కులు లేకుంటే పెద్ద పరిశ్రమలు భారీ వ్యయంతో పరిశోధనలకు, నూతన ఆవిష్కరణలకు, పెట్టుబడులకు ముందుకు రావంటారు. అందుకే, వారికి తగిన ఆర్థిక ప్రతిఫలం ఉండాలంటారు. అది కొంత నిజమే అయినా, ప్రస్తుత ఉపద్రవం తగ్గేవరకైనా పేటెంట్ హక్కుల్ని నిలిపివేయాలని కొన్ని దేశాలు కోరుతున్నాయి. ఈ విపత్కాలంలో ఓ వైపు లక్షలాది మంది ప్రాణాల్ని మహమ్మారి తోడేస్తుంటే, మరోవైపు కొన్ని కంపెనీలు పేటెంట్ రక్షణ కవచం నీడన పెద్దమొత్తం లాభాలార్జించడం ఎలా? సమంజసమనే సందేహం పుడుతోంది. ప్రజాధనంతో పనిచేసే విశ్వవిద్యాలయాలు, పరిశోధనా కేంద్రాల్లో ప్రాథమిక శాస్త్ర పరిశోధనలు, ఆవిష్కరణలే ఆయా వ్యాక్సిన్ అభివృద్ధికి శాస్త్రీయ మూలమైనపుడు కంపెనీలకు అంతటి అపరిమిత హక్కులు ఎందుకనేది ప్రశ్న. మేధో సంపత్తి హక్కులు–బహిరంగ శాస్త్ర పరిజ్ఞానం వాదనలకు మధ్య ఇదో ఘర్షణ. ఇల్లు అలకగానే పండుగ కాదు. ఓటింగ్ పద్ధతి కాకుండా ఏకాభిప్రాయానికి మొగ్గే డబ్ల్యూటీవో లోని 164 సభ్య దేశాలు అంగీకరిస్తేనే ఏదైనా సాధ్యం. పేటెంట్ రక్షణకు సడలింపు ప్రతిపాదనను ఏ ఒక్కదేశం వ్యతిరేకించినా నిర్ణయం జరగదు. పెద్ద దేశాల చొరవతో ఏకాభిప్రాయం సాధ్యమే! పేటెంట్ రక్షణను సడలించాలి. సాంకేతికత బదిలీ జరగాలి. లైసెన్సింగ్ సులభమవాలి. అలా అని, అడ్డదిడ్డంగా వ్యాక్సిన్ ఉత్పత్తి చేసి వినియోగదారుల కళ్లలో దుమ్ముకొట్టే సంస్థలు రాత్రికి రాత్రి పుట్టగొడుగుల్లా పుట్టి, డబ్బు దండుకొని, జారిపోవాలని ఎవరూ కోరుకోరు. పేటెంట్ హక్కుల సడలింపు, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన బదిలీ, ఉత్పత్తి వికేంద్రీకరణ, సమరీతి పంపిణీ, హేతుభద్దమైన ధర... ఇవన్నీ సాకారమై కరోనా మహమ్మారిపై మానవ విజయం పరిపూర్ణం కావాలన్నదే అందరి కోరిక. -
భారత్‌కు అనుకూలించే విషయాలివే!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుందనే కారణంలో చైనాకు చెందిన 59 మొబైల్ యాప్స్‌ను నిషేధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారతదేశం పక్షపాత ధోరణితో, కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ యాప్స్‌ను నిషేధిందని చైనా ఆరోపించింది. దీనిపై ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ)ను సంప్రదిస్తామని చైనా భారత్‌ను హెచ్చరించింది. చైనా ఒకవేళ డబ్ల్యూటీఓలో ఫిర్యాదు చేసినా భారత్ నిర్ణయాన్నే ప్రపంచ వాణిజ్య సంస్థ సమర్థిస్తుంది. దానికి ప్రధానంగా మూడు బలమైన కారణాలు చెప్పవచ్చు. 1. భారత్‌కు చైనాకు మధ్య ఈ యాప్స్ విషయంలో ద్వైపాక్షిక ఒప్పందాలు లేవు. ఇరు దేశాల మధ్య ఈ విషయంలో ఒప్పందాలు లేనప్పటికీ భారతదేశం అతిపెద్ద మార్కెట్ కావడంతో ఆ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టాయి. (చైనాకు చెక్ : మరోసారి మోదీ మార్క్) 2. దేశ భద్రతకు, సమగ్రతకు ముప్పు వాటిల్లుతుందనుకున్నప్పుడు ఆ కంపెనీలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకునే హక్కు ఆయా దేశాలకు ఉంటుంది. ప్రపంచ వాణిజ్య సంస్థ నియమాలలో ఉన్న ఈ అంశం భారతదేశ నిర్ణయానికి అనుకూలంగా ఉంది. చట్టవిరుద్ధ, మోసపూరిత విధానాలు పాటించినందుకు భారతదేశం కావాలంటే చైనా మీదే డబ్ల్యూటీఓ లో ఫిర్యాదు చేయవచ్చు. ఎందుకంటే అధిక సుంకాలు తప్పించుకోవడానికి భారతదేశం ప్రాధ్యాన్యత వాణిజ్య ఒప్పందం కలిగిన సింగపూర్, హాంకాంగ్ దేశాల నుంచి చైనా తక్కువ ధరలకు ఇండియాకు వస్తువులను సరఫరా చేసేది. ఈ విషయంలో ఇండియా చైనా మీద ఫిర్యాదు చేయవచ్చు. (చైనాతో వాణిజ్య లోటు డౌన్) 3. చైనా దాదాపు అన్ని దేశాలలో పెట్టుబడులు పెట్టిన చాలా దేశాలను తమ దేశంలో పెట్టుబడులు పెట్టడానికి వీలు లేకుండా ఆదేశాలు జారీ చేసింది. ఫేస్బుక్, వాట్సాప్‌లాంటి సోషల్‌మీడియా దిగ్గజలు అన్ని దేశాలలో ఉన్నా, చైనాలో మాత్రం వాటి ఊసే ఉండదు. టెక్ దిగ్గజాలు ఎన్నో కంపెనీల మీద చైనా ఆంక్షలు విధించింది. కానీ చైనా దేశానికి చెందిన చాలా సోషల్‌మీడియా సంస్థలు వివిధ దేశాలలో అధిక పెట్టుబడులు పెట్టాయి. చైనా కూడా భారత్‌కు న్యూస్ ఏజెన్సీని చైనాలో నిషేధించింది. పైన తెలిపిన ఈ విషయంలో భారత్‌కు సానుకూలంగా ఉన్నాయి. (‘బ్యాన్ టిక్‌టాక్’ అమెరికాలోనూ..!) -
ఎగుమతుల సబ్సిడీలకు డబ్య్లూటీవో ఆటంకాలు
సాక్షి, న్యూఢిల్లీ : ఎగుమతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న కొన్ని సబ్సిడీలకు వ్యతిరేకంగా ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) వివాదాన్ని లేవనెత్తిన విషయం వాస్తవమేనని వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్ శుక్రవారం రాజ్యసభకు తెలిపారు. వైఎస్సార్సీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎగుమతుల సబ్సిడీ పథకం నిబంధనలకు అనుగుణంగా లేదంటూ డబ్ల్యూటీవో భారత దేశానికి వ్యతిరేకంగా వివాదాన్ని లేవనెత్తిందని చెప్పారు. ప్యానల్ దశలో ఇండియా తన కేసును వాదించింది. కానీ వివాద పరిష్కార ప్యానల్ మాత్రం భారత్ చేపట్టిన చర్యలు డబ్ల్యూటీవో నిబంధనలకు విరుద్ధమని తన నివేదికలో పేర్కొంది. ప్యానల్ నివేదికను భారత్ 19 నవంబర్ 2019న అప్పిలేట్ సంఘం వద్ద సవాలు చేసింది. కానీ తగినంత కోరం లేని కారణంగా కేసులో పురోగతి లేదు. అయినప్పటికీ డబ్ల్యూటీవోలోని ఇతర సభ్యులతో కలసి అప్పిలేట్ సంఘం వద్ద ఈ కేసును అనుకూలంగా పరిష్కరించుకోవడానికి భారత్ కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. అయితే ఈ దశలో కేసు మనకు అననుకూలంగా పరిష్కారం అవుతుందో లేదో చెప్పలేమని అన్నారు. -
‘అమెరికా అభివృద్ధి చెందుతున్న దేశమే’
దావోస్ : వరల్డ్ ఎకనమిక్ ఫోరం వేదికగా డబ్ల్యూటీవోపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ దేశం పట్ల డబ్ల్యూటీవో న్యాయబద్ధంగా వ్యవహరించడం లేదని మండిపడ్డారు. చైనా, భారత్‌లను అభివృద్ధి చెందుతున్న దేశాలుగా చూస్తున్న అంతర్జాతీయ వాణిజ్య సంస్థ అమెరికాను మాత్రం అభివృద్ధి చెందుతున్న దేశంగా పరిగణించడం లేదని వ్యాఖ్యానించారు. తమ దేశాన్ని సరిగ్గా ట్రీట్ చేయని డబ్ల్యూటీవో తీరుపై తాను కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నానని, చైనా..భారత్‌లను అభివృద్ధి చెందుతున్న దేశాలుగా చూస్తున్న ఈ సంస్థ తమను ఎందుకు అలా చూడటం లేదని ప్రశ్నించారు. దావోస్‌లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. తన దృష్టిలో అమెరికా సైతం అభివృద్ధి చెందుతున్న దేశమేనని, తమను ఇలా చూడకుండా, భారత్..చైనాలనే అభివృద్ధి చెందుతున్న దేశాలుగా చూడటంతో ఆ దేశాలు భారీ ప్రయోజనాలను దక్కించుకుంటున్నాయని రుసరుసలాడారు. ఆ దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలైతే తమదీ అభివృద్ధి చెందుతున్న దేశమని గుర్తించాలని అన్నారు. డబ్ల్యూటీవో ఈ దిశగా నూతన విధానం చేపట్టకపోతే..తాము ఏదో ఒకటి చేయాల్సి వస్తుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికాకు డబ్ల్యూటీవో అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. చదవండి : కశ్మీర్‌పై మధ్యవర్తిత్వం వహిస్తా -
రైతుహక్కుల పరిరక్షణే ప్రధానం
వ్యవసాయ వంగడాల అభివృద్ధిలో ప్రభుత్వ సంస్థలతో పోటీపడుతూ దేశీయ వ్యవసాయ రంగంలోకి అడుగుపెట్టిన బహుళజాతి సంస్థలు రైతు సంక్షేమం దృష్ట్యా పని చేస్తాయి అనుకుంటే అది మన భ్రమే. కేవలం లాభాపేక్షతోనే ఇవి తమ కార్యక్రమాలు నిర్వహిస్తాయి. తమ లాభాలను రక్షించుకునే ప్రక్రియలో భాగంగానే ఈ రోజు చిన్న సన్నకారు రైతుల పైన కూడా కోటి రూపాయల వరకు నష్టపరిహారం కోరుతూ పెప్సీ కంపెనీ గుజరాత్ కోర్టులో దావా వేయటానికి వెనకాడలేదు. బహుళజాతి సంస్థలు సరఫరా చేసిన విత్తనాలు మొలకెత్తక పోయినా, లేక నేడు గుజరాత్లో లాగా వారి హక్కులను అతిక్రమించారని కేసులు వేసినా వ్యక్తిగతంగా రైతు ఈ సంస్థలతో పోరాటం జరిపే పరిస్థితి లేదు. అందుకనే ’మొక్కలలో రకాలు వ్యవసాయదారుల హక్కుల పరిరక్షణ చట్టం’లో రైతుల ప్రయోజనాల్ని పరిరక్షించే విధంగా మార్పులు తీసుకురావడం అవశ్యం. ఈమధ్య గుజరాత్ రాష్ట్రంలో పెప్సీ కంపెనీ వారు రైతుల పైన కోర్టులో కోటి రూపాయల నష్టపరిహారం కోరుతూ కేసులు వేశారు. తాము సంపాదించిన పేటెం ట్‌కు విఘాతం కలిగించే విధంగా విత్తనాలు ఉపయోగించి వ్యవసాయం చేశారనేది వారి మీద మోపబడిన ప్రధాన అభియోగం. 2001వ సంవత్సరంలో రూపొందించిన ’మొక్కలలో రకాలు రైతుల హక్కుల పరిరక్షణ చట్టం’ (ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్స్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్) ఉల్లంఘనకు గానూ రైతులపై ఈ కేసు పెట్టారు. 1989వ సంవత్సరం నుంచి భారతదేశంలో పంజాబ్ రాష్ట్రంతో మొదలుపెట్టి ఒప్పంద వ్యవసాయ విధానం ద్వారా(కాంట్రాక్ట్ ఫార్మింగ్) వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకం చేస్తూ ఉన్న పెప్సీ కంపెనీ దాదాపు 30 ఏళ్ల అనుభవం తరువాత ఈరోజు రైతులపై కేసులు పెట్టటం కొంత విచిత్రంగానే కనిపిస్తుంది. కానీ పెప్సీ కంపెనీ పెట్టిన ఈ కేసు మూలంగా ’ మొక్కలలో రకాలు రైతుల ప్రయోజనాల పరిరక్షణ చట్టం’లోని కొన్ని లొసుగుల అంశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. పై చట్టంలో సెక్షన్ 39 కింద వ్యవసాయదారుల హక్కుల పరిరక్షణ గురించి చెప్పారు. బ్రాండింగ్ చేసి వాణిజ్యపరంగా అమ్మనంతవరకు వ్యవసాయదారుల చేత రక్షిత వంగడాల వాడకాన్ని ఈ సెక్షన్ కింద పరిరక్షించటం జరి గింది. కానీ ఇదే చట్టంలో సెక్షన్ 28 కింద కొత్త వంగడాలను అభివృద్ధి చేసిన సంస్థలకు తాము కానీ తమ చేత లైసెన్స్ పొందిన వ్యక్తులు గానీ ప్రత్యేకంగా వినియోగించే అవకాశాన్ని కల్పించింది. ఈ రెండు సెక్షన్లలోని పరస్పర విరుద్ధ అంశాలను ఈ కేసులలో కోర్టులు పరిష్కరించాల్సి ఉంటుంది. ప్రస్తుతం పెప్సీ కంపెనీ ఈ అంశాలను కోర్టు బయట పరిష్కరించుకోవటానికి సుముఖత చూపటం బట్టి ఈ అంశాలు ఇప్పట్లో కోర్టుల్లో తేలే అవకాశాలు కనిపించడం లేదు. ముఖ్యంగా ఈ ఉదంతం నుంచి మన దృష్టికి వచ్చిన ప్రధానమైన అంశాలు ఈ కింది విధంగా ఉంటాయి. 1. ప్రపంచ వాణిజ్య సంస్థకు అనుబంధంగా తయారైన ఖీఖఐ్కS లాంటి మేధోసంపత్తి హక్కుల నుంచి భారత ప్రభుత్వం బయటకి వచ్చే అవకాశం ఉందా! 2. బహుళ జాతి సంస్థల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఒప్పంద వ్యవసాయ విధానానికి ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా? 3. రైతుల హక్కులను పరిరక్షించడానికి ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోవాలి. ఈ మూడు అంశాలు ఒక్కొక్కటి పరిశీలిద్దాం. ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీవో) ఏర్పాటు కావడానికి ముందు వ్యవసాయ పరిశోధన వంగడాల అభివృద్ధి ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రభుత్వరంగ సంస్థల్లో జరుగుతూ ఉండేది. ఈ సంపద అంతా జాతీయ సంపదగా పరిగణించారు కాబట్టి పరిశోధనకు అవసరమైనటువంటి నిధులు ప్రజాధనం ద్వారా సమకూర్చారు కాబట్టి ఈ పరిశోధన వల్ల వచ్చే ఫలితాలు అందరు రైతులకు అందుబాటులో ఉండేవి. ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పాటుతో ఈ విధానం మారింది. మేధోసంపత్తికి పరిహారం సమకూర్చే విధంగా ట్రిప్స్ అగ్రిమెంటు ప్రపంచ వాణిజ్య సంస్థ విధి విధానాల్లో భాగంగా పొందుపరిచారు. ఈ మొత్తం ప్రక్రియ అభివృద్ధి చెందిన దేశాలకు అనుకూలంగా, అభివృద్ధి చెందుతున్న దేశాలకు వ్యతిరేకంగా నడిచింది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ముందు పారిశ్రామిక సర్వీస్ రంగాల్లో డబ్ల్యూటీవో ద్వారా సరళీకృత విధానాలను విజయవంతంగా ప్రవేశపెట్టి ట్రిప్స్ అగ్రిమెంట్ ద్వారా పేటెంటింగ్ కాపీరైట్ చట్టాలను బలపరిచి అభివృద్ధి చెందిన దేశాలు తమ ప్రయోజనాలను పూర్తిగా పరీక్షించుకున్నారు. వ్యవసాయరంగంలో సరళీకృత విధానాన్ని అమలు చేస్తామని వాగ్దానం చేసినా దోహా రౌండ్ చర్చలు విఫలం కావడంతో వ్యవసాయ రంగ సరళీకృత విధానాల ద్వారా అభివృద్ధి చెందుతున్న దేశాలకు వచ్చే ప్రయోజనాలు ఎండమావులు గానే మిగిలిపోయాయి. అభివృద్ధి చెందిన దేశాలలో వ్యవసాయ రంగానికి ఇచ్చే సబ్సిడీలు అంతకుముందు లాగానే కొనసాగుతున్నాయి. పూర్తిగా వ్యవసాయ రంగాన్ని సరళీకృతం చేసి, అభివృద్ధి చెందిన దేశాలలో వ్యవసాయ రంగానికి సబ్సిడీలను నియంత్రణ చేయగలిగి ఉంటే అభివృద్ధి చెందే దేశాల వ్యవసాయ ఉత్పత్తులకు అభివృద్ధి చెందిన దేశాలలో విస్తృత మార్కెట్ ఏర్పడి ఉండేది. తదనుగుణంగా ఇక్కడి రైతుల ఆదాయాలు గణనీయంగా అభివృద్ధి చెందే అవకాశం ఉండేది. వ్యవసాయ రంగంపై జరిగిన దోహా రౌండ్ చర్చలు విఫలం కావటంతో అటువంటి అవకాశం లేకుండా పోయింది. డబ్ల్యూటీవో సంస్థ ఆధ్వర్యంలోని ట్రిప్స్ అగ్రిమెంట్ ద్వారా వచ్చిన మేధో సంపత్తి పరిరక్షణ విధానానికి అనువుగా మన చట్టాలు మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఒక విధంగా డబ్ల్యూటీవో చట్రంలో ట్రిప్స్ చక్రంలో ఇతర దేశాలతో పాటు మనం కూడా బంధితులమయ్యాం. తదనుగుణంగా మన చట్టాల్లో తెచ్చిన మార్పు 2001 సంవత్సరంలోని మొక్కలలో రకాలు వ్యవసాయదారుల హక్కుల పరిరక్షణ చట్టం. ఈ చట్టం కిందనే ఈరోజు పెప్సీ కంపెనీ గుజరాత్లో రైతుల మీద కేసులు పెట్టింది. అంతర్జాతీయ ఒప్పందాల దృష్ట్యా ఈ చట్టాన్ని రద్దు చేసుకునే అవకాశం లేనందువల్ల చట్టం లోపలే ఏ విధంగా వ్యవసాయదారుల హక్కులను పరిరక్షించాలి అనే అంశంపైన ప్రభుత్వం దృష్టి పెడితే బాగుంటుంది. ఇక రెండో ప్రధానమైన అంశం ఈ బహుళ జాతి సంస్థల ఆధ్వర్యంలో జరిగే ఒప్పంద వ్యవసాయానికి(కాంట్రాక్ట్ ఫార్మింగ్) ప్రత్యామ్నాయ విధానం ఏమైనా ఉందా! కొంతవరకు సహకార వ్యవసాయ విధానం ఈ ఒప్పంద వ్యవసాయ విధానానికి ప్రత్యామ్నాయంగా అభివృద్ధి చేయవచ్చు. కానీ దీనికి బలమైన నాయకత్వం అవసరం ఎంతైనా ఉంది. సహకార రంగంలో ఒక అమూల్ సంస్థ తప్పితే దేశంలో ఇంకెక్కడ సహకార సంస్థలు బలపడి రైతులకు దీర్ఘకాలంలో ప్రయోజనం కల్పించిన దాఖలాలు కనిపించడం లేదు. బహుళజాతి సంస్థల ఆధ్వర్యంలో జరిగే ఒప్పంద వ్యవసాయ విధానంలో రైతులకు బహుళ ప్రయోజనాలు చేకూరుతాయి అనేది కూడా వాస్తవం. మొట్టమొదటిది అంతర్జాతీయ మార్కెట్‌ను, చిన్నకమతాల రైతులను అనుసంధానం చేసే సామర్థ్యం బహుళజాతి సంస్థలకే ఉంటుంది. నాణ్యమైన వంగడాల సరఫరా, వ్యవసాయ ఉత్పత్తులను ఆధునిక పద్ధతుల్లో నిల్వ చేయటం, ప్రాసెసింగ్ సదుపాయాలు కల్పించటం తద్వారా వ్యవసాయోత్పత్తుల విలువను పెంచటం ఈ బహుళ జాతి సంస్థల ద్వారానే సాధ్యమవుతుంది. సరైన ప్రత్యామ్నాయం వాటికి లేదు కనుక వ్యవసాయ రంగంలో కొన్ని పరిమితులు, షరతులకు లోబడి పనిచేసే విధంగా బహుళజాతి సంస్థల ఆధ్వర్యంలో ఒప్పంద వ్యవసాయాన్ని ప్రోత్సహించడం వ్యవసాయ రంగంలో ఉత్పాదకత ఆదాయం పెరగడానికి దోహదపడుతుంది. కానీ ప్రభుత్వాలు ఈ బహుళ జాతి సంస్థలపై ఎప్పుడూ ఒక కన్నేసి ఉంచాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. రైతు సంక్షేమం దృష్ట్యా అవి పనిచేస్తాయి అనుకుంటే అది మన భ్రమే. కేవలం లాభాపేక్షతోనే ఈ కంపెనీలు తమ కార్యక్రమాలు నిర్వహిస్తాయి. అటువంటి లాభాలను రక్షించుకునే ప్రక్రియలో భాగంగానే ఈ రోజు చిన్న, సన్నకారు రైతులపైన కూడా కోటి రూపాయల వరకు నష్టపరిహారం కోరుతూ పెప్సీ కంపెనీ గుజరాత్లో కోర్టులో దావా వేయటానికి వెనకాడలేదు. వ్యవసాయం చేసుకోవలసిన రైతులను కక్షదారులుగా మారిస్తే పరిమితి లేని వనరులున్న ఈ బహుళ జాతి సంస్థలపై రైతులు పోరాటం చేసే పరిస్థితే లేదు. బహుళజాతి సంస్థలు సరఫరా చేసిన విత్తనాలు మొలకెత్తక పోయినా, లేక ఈనాడు గుజరాత్లో లాగా వారి హక్కులను అతిక్రమించారని కేసులు వేసినా వ్యక్తిగతంగా రైతు ఈ సంస్థలతో పోరాటం జరిపే పరిస్థితి లేదు. ఇక్కడనే ప్రభుత్వాలకు చాలా ప్రధానమైనటువంటి పాత్ర ఉన్నది. బహుళజాతి సంస్థలతో ఉత్పన్నమైన ఎటువంటి కేసుల విషయంలో కూడా రైతుల తరఫున పోరాడే బాధ్యత ప్రభుత్వం చేత ఏర్పాటు చేసిన సంస్థ స్వీకరించాలి. పూర్తిగా వ్యాజ్యం అయ్యే ఖర్చులు ఈ సంస్థ భరించే విధంగా మార్పులు తీసుకురావాలి. రైతు లను కేవలం వ్యవసాయానికే పరిమితం చేసి అనవసరమైన కోర్టు కేసులు వారి నెత్తి మీద లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఈ సంస్థ రైతులకు అండగా కోర్టు కేసులు నడపటానికి అనువుగా చట్ట సవరణ ప్రభుత్వం తీసుకురావాలి. అట్లాగే ఆ సంస్థలకు కావలసిన ఆర్థిక పరిపుష్టిని ఏర్పాటు చేయాలి. అప్పుడే నిర్భయంగా వ్యవసాయదారుడు బహుళజాతి సంస్థలతో ఒప్పందాలు చేసుకుని వ్యవసాయ కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించడంలో నిమగ్నం కాగలుగుతాడు. ఇంకొక ప్రధాన విషయం మనదేశంలో ఈ చట్టాన్ని రూపొందించేటప్పుడు పూర్తిగా పేటెంట్ విధానానికి వెళ్లకుండా రైతుల ప్రయోజనాలను కూడా దృష్టిలో పెట్టుకొని sui generisవిధానంలో ఈ ‘మొక్కలలో రకాలు వ్యవసాయదారుల హక్కుల పరిరక్షణ చట్టం’ని రూపొం దించారు. ఈ చట్టం అమలులో ఉండి 20 సంవత్సరాలు అవుతుంది కనుక ఇది ఎంతవరకు రైతుల ప్రయోజనాలను పరిరక్షించడంలో సఫలీకృతమైంది అనే విషయాన్ని ఒకసారి సమీక్షించుకొని ట్రిప్స్ విధానానికి ప్రతికూలం కానంతవరకు తగిన మార్పులను వ్యవసాయదారుల ప్రయోజనాలను పరిరక్షించే విధంగా తీసుకురావాల్సిన ఆవశ్యకత కూడా ఎంతైనా ఉంది. ఐవైఆర్ కృష్ణారావు వ్యాసకర్త ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఈ–మెయిల్ : iyrk45@gmail.com -
హైదరాబాద్‌లో వరల్డ్ డిజైన్ అసెంబ్లీ
సాక్షి, హైదరాబాద్: ఐటీ, పారిశ్రామిక రంగాల్లో అంతర్జాతీయ ఖ్యాతిని పొందిన హైదరాబాద్ నగరం మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సదస్సుకు వేదిక కానుంది. ఈ ఏడాది అక్టోబర్ 11, 12 తేదీల్లో జరిగే ‘వరల్డ్ డిజైన్ అసెంబ్లీ’కి ఆతిథ్యం ఇవ్వనుంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో రెండు రోజులపాటు జరిగే ఈ సదస్సు ద్వారా పారిశ్రామిక డిజైనింగ్ రంగంలో సృజనాత్మకత పెరుగుతుందని భావిస్తున్నారు. ప్రపంచస్థాయి సదస్సు నిర్వహణ ద్వారా తెలంగాణ ప్రతిష్ట మరింత ఇనుమడిస్తుందని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సామాజిక మాధ్యమం ట్విట్టర్లో హర్షం వ్యక్తం చేశారు. 31వ ద్వైవార్షిక వరల్డ్ డిజైన్ అసెంబ్లీని హైదరాబాద్‌లో నిర్వహిస్తామని గతేడాది జూలైలో వరల్డ్ డిజైన్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూడీఓ) అధ్యక్షులు లూయిసా బొషిటో ప్రకటించారు. వరల్డ్ డిజైన్ అసెంబ్లీ నిర్వహణకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా పలు నగరాల నుంచి బిడ్ లు స్వీకరించారు. అంతర్జాతీయ స్థాయి సదస్సుల నిర్వహణకు ఆయా నగరా ల్లో ఉన్న అనుకూలతలను పరిశీలించిన డబ్ల్యూడీఓ హైదరాబాద్‌ను ఎంపిక చేసింది. ఈ సదస్సు నిర్వహణ తేదీలను కూడా డబ్ల్యూడీఓ ప్రకటించింది. ఐక్యరాజ్యసమితి లక్ష్యాల మేరకు ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యానికి అనుగుణంగా 1957లో ఇంటర్నేషనల్ కౌన్సిల్ సొసైటీస్ ఆఫ్ ఇండస్ట్రియల్ డిజైన్ (ఐసీఎస్‌ఐడీ) ఏర్పాటైంది. తొలుత 12 వృత్తి నైపుణ్యం కలిగిన డిజైన్ అసోసియేషన్లతో ఏర్పాటైన ఐసీఎస్‌ఐడీ 2015 అక్టోబర్‌లో వరల్డ్ డిజైన్ ఆర్గనైజేషన్‌గా నామాంతరం చెందింది. ప్రపంచవ్యాప్తంగా 140 డిజైన్ అసోసియేషన్లు డబ్ల్యూడీఓలో సభ్యత్వం కలిగి ఉన్నాయి. పారిశ్రామిక ఉత్పత్తుల తయారీలో సృజనాత్మకతను ప్రోత్సహించడం, నాణ్యమైన ఉత్పత్తులు, సేవలు అందిం చేలా పారిశ్రామిక నమూనాలు తయారు చేయడం తదితరాలు లక్ష్యంగా వరల్డ్ డిజైన్ ఆర్గనైజేషన్ పనిచేస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో ప్రతి రెండేళ్లకోసారి వరల్డ్ డిజైన్ క్యాపిటల్ పేరిట ఒక్కో నగరాన్ని ఎంపి క చేసి సదస్సులు నిర్వహిస్తోంది. -
మా సుంకాలు తక్కువే...!
న్యూఢిల్లీ: భారత్ భారీగా దిగుమతి సుంకాలు విధిస్తోందన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపణలను కేంద్రం తోసిపుచ్చింది. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) నిబంధనలకు అనుగుణంగానే భారత్ సుంకాలు ఉంటున్నాయని స్పష్టం చేసింది. ‘అధిక టారిఫ్‌లు విధిస్తున్నామన్న ఆరోపణలను అంగీకరించబోము. దిగుమతి సుంకాలు డబ్ల్యూటీవో నిర్దేశిత శ్రేణిలోనే ఉన్నాయి. కొన్ని వర్ధమాన దేశాలు, సంపన్న ఎకానమీల స్థాయిలోనే ఉన్నాయి‘ అని కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి అనూప్ వాధ్వాన్ మంగళవారమిక్కడ విలేకరులకు చెప్పారు. అదే సమయంలో ఏవో కొన్ని ఉత్పత్తులపై మాత్రమే కొంత అధిక టారిఫ్‌లు ఉండొచ్చని, అయితే అన్ని దేశాల్లోనూ ఇలాంటివి సాధారణమేనని వాణిజ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. హార్లే డేవిడ్సన్ బైక్స్ వంటి అమెరికన్ ఉత్పత్తులపై భారీగా దిగుమతి సుంకాలు విధిస్తున్న భారత్ .. ఒకరకంగా ’టారిఫ్‌ల రాజా’ అంటూ ట్రంప్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అనూప్ వాధ్వాన్ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. జీఎస్పీ ప్రయోజనాలు కొంతే.. వాణిజ్యంలో భారత్‌కి ఇస్తున్న ప్రాధాన్యతాపరమైన ప్రయోజనాలను ఉపసంహరించాలన్న అమెరికా ప్రతిపాదనతో ఎగుమతులపై పెద్దగా ప్రభావమేమీ ఉండబోదని అనూప్ వాధ్వాన్ వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించి సాధారణ ప్రాధాన్య వ్యవస్థ (జీఎస్పీ) కింద భారత్ గతేడాది 5.6 బిలియన్ డాలర్ల మేర ఎగుమతులు చేసినప్పటికీ, ప్రాధాన్యతా హోదాపరంగా ఒనగూరిన ప్రయోజనాలు సుమారు 190 మిలియన్ డాలర్లు మాత్రమేనని ఆయన∙చెప్పారు. అమెరికా కోరుతున్న మేరకు విస్తృతమైన వాణిజ్య ప్యాకేజీపై భారత్ కసరత్తు చేస్తున్నప్పటికీ.. ఆ దేశం జీఎస్పీని ఉపసంహరించాలని నిర్ణయించుకుందని అనూప్ చెప్పారు. ఈ ప్యాకేజీలో మెడికల్ డివైజ్‌లు, డెయిరీ ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తులు మొదలైనవన్నీ ఉన్నాయన్నారు. అమెరికా డిమాండ్లపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని, అయితే ప్రజా ఆరోగ్యంతో ముడిపడి ఉన్న విషయాల్లో మాత్రం రాజీపడే ప్రసక్తే లేదని అనూప్ వాధ్వాన్ స్పష్టం చేశారు. ఆయా రంగాలకు ప్రభుత్వం తోడ్పాటునివ్వాలి: ఎఫ్ఐఈవో జీఎస్పీ ప్రయోజనాలు ఒక్క శాతం నుంచి ఆరు శాతం శ్రేణిలోనే ఉంటున్నాయని, దీన్ని తొలగించినంత మాత్రాన ఎగుమతులపై పెద్దగా ప్రతికూల ప్రభావమేమీ పడదని ఎగుమతి సంస్థల సమాఖ్య (ఎఫ్ఐఈవో) వ్యాఖ్యానించింది. అయితే, కొంత అధిక ప్రయోజనాలు పొందుతున్న రంగాలకు ఒకవేళ జీఎస్పీ తొలగించిన పక్షంలో ప్రభుత్వం కొంత మేర తోడ్పాటునివ్వాలని ఎఫ్ఐఈవో ప్రెసిడెంట్ గణేష్ కుమార్ గుప్తా చెప్పారు. బిల్డింగ్ మెటీరియల్, టైల్స్, చేతి పనిముట్లు (స్పానర్లు, డ్రిల్లింగ్ పరికరాలు), ఇంజనీరింగ్ ఉత్పత్తులు, టర్బైన్స్, సైకిళ్లు మొదలైన ఉత్పత్తుల ఎగుమతులకు జీఎస్పీపరమైన ప్రయోజనాలు ఉంటున్నాయి. మినహాయింపులు ఎత్తివేస్తే.. వాటి ధరలు పెంచాల్సి రావడం వల్ల దేశీ సంస్థలు అంతర్జాతీయంగా పోటీపడలేని పరిస్థితి నెలకొంటుందని గుప్తా చెప్పారు. తగ్గుతున్న వాణిజ్య లోటు.. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2016–17లో 64.5 బిలియన్ డాలర్లుగా ఉండగా.. 2017–18లో 74.5 బి. డాలర్ల స్థాయికి చేరింది. అమెరికా నుంచి చమురు, గ్యాస్, బొగ్గు తదితర ఉత్పత్తుల కొనుగోళ్లను పెంచిన నేపథ్యంలో భారత్‌తో అగ్రరాజ్యం వాణిజ్య లోటు 2017, 2018లో గణనీయంగా తగ్గినట్లు కేంద్ర వాణిజ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ‘గతేడాది వాణిజ్య లోటు పరిమాణం దాదాపు 4 బి. డాలర్లు తగ్గింది. భారత్‌లో ఇంధనానికి, పౌర విమానాలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఇది మరింతగా తగ్గుతుంది. అమెజాన్, ఉబెర్, గూగుల్, ఫేస్బుక్ వంటి అమెరికన్ ఈ–కామర్స్, సర్వీసుల కంపెనీలు భారత మార్కెట్లో భారీగా అవకాశాలు అందిపుచ్చుకుంటున్నాయి‘ అని పేర్కొంది. ఇక, కొన్ని ఐటీ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు తగ్గించాలన్న అమెరికా డిమాండ్‌పై స్పందిస్తూ.. ప్రస్తుతం టారిఫ్‌లు ఒక మోస్తరు స్థాయిలోనే ఉన్నాయని, దిగుమతులను నిలిపివేసేంత భారీగా లేవని స్పష్టం చేసింది. జీఎస్పీ వివాదమిదీ.. జీఎస్పీ కింద వాణిజ్యానికి సంబంధించి అమెరికా ప్రాధాన్యమిస్తున్న వర్ధమాన దేశాల్లో భారత్ కూడా ఒకటి. దీని కింద అమెరికా మార్కెట్లోకి ఎలాంటి సుంకాలు లేకుండా కొన్ని ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు భారత్‌కు వీలు ఉంటోంది. సాధారణంగా 3,700 ఉత్పత్తులకు జీఎస్పీ ప్రయోజనాలు పొందే అవకాశం ఉన్నప్పటికీ.. భారత్ 1,900 ఉత్పత్తులు (రసాయనాలు మొదలైనవి) మాత్రమే ఎగుమతి చేస్తోంది. అయితే, జీఎస్పీ హోదా ఇస్తున్నప్పటికీ.. ప్రతిగా భారత మార్కెట్లో తమకు సముచిత, సమానమైన అవకాశాలు లభించడం లేదంటూ అమెరికా భావిస్తోంది. దేశీయంగా స్టెంట్లు మొదలైన మెడికల్ డివైజ్‌ల రేట్లు భారీగా ఉండటంతో.. ధరలపై పరిమితులు విధించాలన్న భారత నిర్ణయంపై అమెరికన్ కంపెనీలు అభ్యంతరాలు వ్యక్తం చేయడం వంటివి దీనికి కారణం. డెయిరీ, మెడికల్ డివైజ్‌ల తయారీ సంస్థల నుంచి ఫిర్యాదులు రావడంతో .. భారత్‌కి ఇస్తున్న జీఎస్పీ ప్రయోజనాలపై 2018 ఏప్రిల్‌లో అమెరికా పునఃసమీక్ష ప్రారంభించింది. ఆ తర్వాత సమీక్ష పరిధిలోకి ఐటీ ఉత్పత్తులు, వ్యవసాయోత్పత్తులు మొదలైన వాటన్నింటినీ చేర్చింది. చివరికి భారత్‌కి ఇస్తున్న జీఎస్పీని ఉపసంహరించాలని అమెరికా నిర్ణయించింది. భారత్‌తో పాటు టర్కీకి కూడా దీన్ని వర్తింపచేయాలని నిర్ణయం తీసుకుంది. అమెరికన్ కాంగ్రెస్, భారత ప్రభుత్వం నోటిఫికేషన్స్ ఇచ్చిన తర్వాత 60 రోజుల్లో అమల్లోకి రావొచ్చని అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం యూఎస్టీఆర్వో) వెల్లడించింది. -
సుంకాల బాదుడు
దాదాపు ఏడాదిన్నర నుంచి భారత్–అమెరికాల మధ్య సాగుతున్న సుంకాల వివాదంలో మంగళ వారం కీలక పరిణామం చోటుచేసుకుంది. దాదాపు 50 ఏళ్లుగా మన దేశానికి సాధారణ ప్రాధాన్య తల వ్యవస్థ(జీఎస్పీ)కింద కల్పిస్తున్న వెసులుబాట్లను రద్దు చేయాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రతినిధుల సభకు లేఖ రాశారు. తన మార్కెట్లలో అమెరికాకు సమానమైన, సహేతుకమైన ప్రాధాన్యతనివ్వడానికి భారత్ ముందుకు రాకపోవడం వల్ల ఈ చర్య తీసుకోవాలని ట్రంప్ కోరారు. కానీ మన దేశం వాదన వేరేలా ఉంది. మనం విధిస్తున్న దిగుమతి సుంకాలు ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) నిబంధనలకు లోబడే ఉన్నాయని చెబుతున్నది. వాస్తవానికి ఈ విషయంలో తనకేమైనా ఫిర్యాదులుంటే అమెరికా డబ్యూటీఓలో తేల్చుకోవాలి. కానీ అక్కడికెళ్తే తమ వాదన వీగిపోతుందన్న భయంతో కావొచ్చు... అమెరికా ఇలా సొంత నిర్ణయాలు తీసుకుం టోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం జరిగినప్పుడే ప్రపంచ దేశాల చేతుల్లో అమెరికా ఎలా మోసపోతున్నదో, ఎంత నష్టపోతున్నదో ట్రంప్ ఏకరువు పెట్టేవారు. తాను అధ్యక్ష పీఠం అధిష్టిం చిన వెంటనే దీన్నంతటినీ సరిచేస్తానని చెప్పేవారు. ఏడాదిన్నరగా ట్రంప్ ఈ సుంకాల రణం తీవ్రతను పెంచారు. నిరుడు చైనాపైనా, 28 సభ్య దేశాలున్న యూరప్ యూనియన్(ఈయూ) పైనా ట్రంప్ అదనపు సుంకాలు విధించగా... దానికి ప్రతీకారంగా అటు చైనా, ఇటు ఈయూ కూడా అమెరికాకు అదే భాషలో జవాబిచ్చాయి. నిరుడు జూన్‌లో మనం ఎగుమతి చేసే ఉక్కుపై 25 శాతం, అల్యూమినియం ఉత్పత్తులపై 10 శాతం చొప్పున అమెరికా సుంకాలు పెంచిన ప్పుడు...ఆ వెంటనే మన దేశం కూడా అమెరికా నుంచి వచ్చే పప్పులు, ఇనుము, ఉక్కు, యాపిల్స్ తదితర 29 ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు పెంచుతామని ప్రకటించింది. కానీ అలా ప్రకటించ డమే తప్ప మన దేశం ఇంతవరకూ ఆ నిర్ణయాన్ని అమలు చేయలేదు. సుంకాలు పెంచే నోటిఫికే షన్ అమలును తరచు వాయిదా వేస్తూ పోతోంది. గత నెలాఖరునే ఈ నిర్ణయం మరోసారి వాయిదా పడింది. అయినా అమెరికా ఎక్కడా సంతృప్తి పడింది లేదు. మన ఉక్కు, అల్యూమి నియం ఉత్పత్తులపై ఆ దేశం పెంచిన సుంకాల అమలు అప్పట్లోనే మొదలైంది. ఇప్పుడు తాజా ప్రతిపాదన సైతం రేపో మాపో అమల్లోకి రావడం ఖాయం. స్వేచ్ఛా వాణిజ్యం పేరిట, ప్రపంచీ కరణ పేరిట ప్రపంచ దేశాలను నయానా భయానా లొంగదీసుకున్న అమెరికా నుంచి ఇలాంటి పరిణామాలను ఎవరూ ఊహించరు. కానీ డోనాల్డ్ ట్రంప్ వచ్చాక ఇది రివాజుగా మారిపోయింది. ఇప్పుడు జీఎస్పీ కింద భారత్‌కు కల్పిస్తున్న వెసులుబాట్లు రద్దు చేయాలన్న ట్రంప్ సూచన అమల్లోకొస్తే మన దేశం నుంచి అక్కడి మార్కెట్‌కు ఎగుమతయ్యే దుస్తులు, యంత్ర పరికరాలు, ఇతర వస్తువులు వేరే దేశాల ఉత్పత్తుల నుంచి గట్టి పోటీ ఎదుర్కొనవలసి ఉంటుంది. మన దేశం నుంచి అమెరికాకు ఎగుమతయ్యే సరుకుల్లో దాదాపు 12 శాతం ఈ జీఎస్పీ కిందికి వస్తాయి. ఇది దాదాపు 560 కోట్ల డాలర్లు ఉండొచ్చునని అమెరికా అంచనా వేస్తుంటే...మన అధికారులు మాత్రం 19 కోట్ల డాలర్లు మించదని చెబుతున్నారు. మన దేశానికి నష్టం కలిగించి దారికి తెచ్చుకోవడమే ట్రంప్ నిర్ణయాల సారాంశం గనుక ఇవి ఇంతటితో ఆగవు. అనుకున్న స్థాయిలో భారత్‌కు నష్టం చేకూర్చలేకపోతున్నామనుకుంటే వాటిని మరింత పెంచడానికి ట్రంప్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఇరు దేశాల మధ్యా ద్వైపాక్షిక వాణిజ్య లోటు 2,000 కోట్ల డాలర్లు ఉందని ఆయన ఎప్ప టినుంచో చెబుతున్నారు. దీన్ని గణనీయంగా తగ్గించడమే ధ్యేయమంటున్నారు. ఆయన తాజా నిర్ణయం వెనక అమెరికాకు చెందిన రెండు లాబీలు గట్టిగా పనిచేశాయని కథనాలు వినిపిస్తు న్నాయి. వైద్య పరికరాల పరిశ్రమ, పాడి ఉత్పత్తుల సంఘాలు మన దేశంపై చేస్తున్న ఫిర్యాదుల ఫలితంగానే ట్రంప్ భారత్‌పై తరచు కారాలు మిరియాలూ నూరుతున్నారు. గుండె రక్త నాళాల్లో ఏర్పడే అవరోధాలకు వాడే స్టెంట్లు, మోకాళ్లలో వాడే ఇంప్లాంట్స్ వగైరాల ధరల్ని గణనీయంగా తగ్గించడం అమెరికా వైద్య పరికరాల పరిశ్రమలకు కంటగింపుగా ఉంది. పశువులకు దాణా బదులు మాంసాహారాన్ని అందించి రాబట్టే పాడి ఉత్పత్తుల్ని అనుమతించకూడదని పదేళ్లనాడు మన దేశం విధించిన నిబంధన పాడి పరిశ్రమకు ఆగ్రహం కలిగిస్తోంది. ఈ రెండింటి విషయంలో సడ లింపులు ఇవ్వడానికి మన దేశం నిరాకరించడంతోపాటు అమెజాన్, వాల్‌మార్ట్, ఫ్లిప్‌కార్ట్ తదితర సంస్థల్ని ప్రభావితం చేసే ఈ–కామర్స్ కొత్త నిబంధనలు అమెరికాకు నచ్చడం లేదు. అలాగే మాస్టర్‌కార్డ్, వీసా తదితర సంస్థలు తమ డేటా సర్వర్లను భారత్‌కు తరలించాలని మన ప్రభుత్వం కోరడం ఆ దేశానికి ఆగ్రహం తెప్పిస్తోంది. వెరసి ఇవన్నీ ట్రంప్ తాజా ప్రతిపాదనలకు దారితీశాయి. అయితే ఏ దేశమైనా తనకు అనువైన, లాభదాయకమైన వాణిజ్య విధానాలు రూపొం దించుకుంటుంది. వాటిపై అభ్యంతరాలుంటే తగిన వేదికలపై ఫిర్యాదు చేయాలి తప్ప ఇష్టాను సారం వ్యవహరిస్తానంటే చెల్లదు. 90వ దశకానికి ముందు మన సుంకాలు బాగా అధికంగా ఉండేవి. అయితే ఆర్థిక సంస్కరణలు ప్రారంభమయ్యాక అవి క్రమేపీ తగ్గడం మొదలుపెట్టాయి. 1991–92లో వ్యవసాయేతర ఉత్పత్తులపై అత్యధికంగా 150 శాతంమేర సుంకాలుంటే... అవి 1997–98నాటికి 40 శాతానికి పడిపోయాయి. 2004–05 నాటికి 20 శాతానికి వచ్చాయి. ఆ తర్వాత మరో మూడేళ్లకు 10 శాతానికి చేరుకున్నాయి. వాస్తవానికి డబ్ల్యూటీఓ గణాంకాలనుబట్టి మన సగటు సుంకం 13శాతం మించడం లేదు. అమెరికా ప్రారంభించిన ఈ సుంకాల రణం అనూహ్య పరిణామాలకు దారితీస్తుంది. ప్రభావిత దేశాలు తమ వంతుగా ప్రతీకార చర్యలకు దిగితే అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపుతుంది. కనుక ట్రంప్ విజ్ఞతతో మెలగి సమస్యల్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలి. -
ఈ–కామర్స్ రంగంపై అంతర్జాతీయ ఒప్పందం!
దావోస్: వేగంగా మారుతున్న ప్రపంచంతో పాటు మారకపోతే బహుళపక్ష వాణిజ్య వ్యవస్థలు, డబ్ల్యూటీఓ వంటి సంస్థలు కనుమరుగు కాక తప్పదని డబ్ల్యూటీఓ చీఫ్ రొబెర్టో అజెవెడో హెచ్చరించారు. దీనిని నివారించడానికి తక్షణం చర్యలు తీసుకోవాలని సూచించారు. జోరుగా వృద్ధి చెందుతున్న ఈ–కామర్స్ కోసం అంతర్జాతీయ బహుళపక్ష ఒప్పందం అవసరమన్నారు. ఇక్కడి ప్రపంచ ఆర్థిక సదస్సులో (డబ్ల్యూఈఎఫ్) ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు పెరగడం, రక్షణాత్మక విధానాలు పెరుగుతుండటం వంటి కారణాల వల్ల వాణిజ్య రంగంలో గతంలో కంటే సవాళ్లు మరింత క్లిష్టమవుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు నిజానికి రాజకీయ సమస్య అని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుంటెరస్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలు ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉన్నాయని, వీటిని సవ్యంగా పరిష్కరించలేకపోతే పెను విపత్తు తప్పదని ఆయన హెచ్చరించారు. కాగా ఆర్థిక వృద్ధికి సంబంధించిన అంశాలను దేశాలు త్వరితంగా పరిష్కరించుకోవాలని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్ఎఫ్) చీఫ్ క్రిస్టీనా లగార్డ్ సూచించారు. అందుకే అం తర్జాతీయ ఆర్థిక వృద్ధి అంచనాలను తగ్గించామన్నా రు. కాగా, కృత్రిమ మేధ నియంత్రణకు నిబంధనల ను రూపొందించాల్సిన అవసరముందని మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెళ్ల వ్యాఖ్యానించారు. గోప్యతను మానవ హక్కుగా పరిగణించాలని పేర్కొన్నారు. డిజిటల్ డిక్లరేషన్... డిజిటల్ యుగంలో నైతికంగా, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తామనే డిజిటల్ ప్రతినకు 40కు పైగా అంతర్జాతీయ వ్యాపార ప్రముఖులు సంఘీభావం తెలిపారు. ఈ డిజిటల్ డిక్లరేషన్‌పై మన దేశానికి చెందిన భారతీ ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ తొలి సంతకం చేశారు. ఎరిక్సన్, ఐబీఎమ్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్, నోకియా, శామ్సంగ్, షార్ప్, వెరిజాన్, వొడాఫోన్, షియోమి తదితర సంస్థలు ఈ డిజిటల్ డిక్లరేషన్‌కు సంఘీభావం తెలిపాయి. ఎలక్ట్రానిక్ వేస్ట్.. 6,200 కోట్ల డాలర్లు ప్రతీ ఏడాదీ ఎలక్ట్రానిక్ వ్యర్థాలు(ఈ–వేస్ట్) విపరీతంగా పెరిగిపోతున్నాయని తాజా నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం 5 కోట్ల టన్నులుగా (ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా తయారైన వాణిజ్య విమానాల బరువు కంటే ఇది అధికం) ఉన్న ఈ–వేస్ట్ 2050 కల్లా 12 కోట్ల టన్నులకు పెరుగుతుందని పేర్కొంది. ఫలితంగా తీవ్రమైన ఆరోగ్య, పర్యావరణ సమస్యలు తలెత్తుతాయని వివరించింది. ఏటా పేరుకుపోతున్న ఈ–వ్యర్థాల విలువ 6,200 కోట్ల డాలర్ల మేర ఉంటుందని, ఇది మొత్తం ప్రపంచ వెండి ఉత్పత్తి విలువకు మూడు రెట్లకు సమానమని వివరించింది. ప్రతి ఏటా ఎలక్ట్రానిక్స్, ప్లాస్టిక్స్ ఉత్పత్తుల్లో 20 శాతం మాత్రమే రీసైకిల్ అవుతున్నట్లు తెలియజేసింది. -
యువతకు ఆ దేశమే బెస్ట్
ఆమ్స్టర్డ్యామ్ : మంచి మార్కులు రాలేదనో.. కోరుకున్న కాలేజిలో సీటు రాదనో.. అమ్మ మందలించిందనో.. నాన్న కోప్పడ్డాడనో కారణాలేవైనా సరే.. క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుంటోంది నేటి యువత. అందరు ఇలానే ఉన్నారని చెప్పలేము. కానీ చాలా దేశాల్లో యువత మాత్రం ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొంటున్నారు. అయితే ఈ విషయం గురించి అధ్యాయనం చేసిన కొన్ని సంస్థలు మాత్రం నేటి యువతకు తగిన దేశం నెదర్లాండ్ అని ముక్త కంఠంతో తేల్చేశాయి. ఎందుకంటే నెదర్లాండ్ యువత తమ టీనేజ్‌ను చాలా సంతోషకరమైన పరిస్థితులు మధ్య గడుపుతున్నట్లు ఈ సర్వేలో తెలిసింది. ప్రపంచ సంపన్న దేశాల్లో సంతోషం, ఆరోగ్యం, మంచి విద్య వంటి పలు అంశాల గురించి చేసిన సర్వేలో నెదర్లాండ్ మిగతా దేశాలను వెనక్కి నెట్టి ప్రథమ స్థానంలో ఉన్నట్లు సర్వేలు తెలిపాయి. యూనిసెఫ్ సర్వేలోనూ ప్రథమం... ఐక్యరాజ్యసమితి ముఖ్య విభాగం యూనిసెఫ్ 2017 సంవత్సరానికి గాను నిర్వహించిన సంతోషకరమైన దేశాల సర్వేలో నెదర్లాండ్ ప్రథమ స్థానంలో నిలిచింది. అంతేకాక మరో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే ప్రపంచ వ్యాప్తంగా ఆడపిల్లల పట్ల హింస పెరిగిపోతున్న ఈ కాలంలో, నెదర్లాండ్ ఆడపిల్లలు మాత్రం చాలా అంటే చాలా తక్కువ శాతం మంది మాత్రమే ఏవో చిన్న చిన్న విషయాల్లో మాత్రమే బాధపడినట్లు సర్వేలో తెలిసింది. అలానే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు విడుదల చేసిన సర్వేలో స్థూలకాయం బారిన పడుతున్న వారి సంఖ్య మిగతా సంపన్న దేశాలతో పోలిస్తే నెదర్లాండ్‌లో చాలా తక్కువగా ఉన్నట్లు గుర్తించింది. అసలు రహస్యం ఇదే... నెదర్లాండ్ దేశ ప్రజలు ఇంత సంతోషంగా ఉండటానికి కారణం వారి పని వేళలు అంటున్నారు నిపుణులు. డచ్ ప్రజలు(నెదర్లాండ్ ప్రజలనే డచ్ ప్రజలు అంటారు) రోజులో 16 గంటల సమయాన్ని తినడం, నిద్రపోవడం, కుటుంబంతో గడపడం వంటి వాటికే కేటాయిస్తారు. వారంలో కేవలం 30.3 గంటలు మాత్రమే పనిచేస్తారు. కేవలం 0.5శాతం మంది మాత్రమే ఎక్కువ గంటలు పనిచేస్తారని నివేదికలు తెలుపుతున్నాయి. నెదర్లాండ్ ప్రజలు కుటుంబ సభ్యులతో గడపడానికి ఎక్కువ ఇష్ట పడతారు. దాంతో అక్కడి యువత తల్లిదండ్రులతో చాలా మంచి అనుబంధాన్ని కల్గి ఉంటారు. వారి తల్లిదండ్రులతో అన్ని విషయాలు చర్చిస్తారని నివేదికలు తెలుపుతున్నాయి. ఇవే డచ్ యువత సంతోషానికి ప్రధాన కారణమంటున్నాయి సర్వేలు. -
దెబ్బకు దెబ్బ : ట్రంప్ సర్కార్‌కు భారత్ ఝలక్
న్యూఢిల్లీ : ట్రంప్ సర్కార్‌కు దెబ్బకు దెబ్బ తగిలింది. స్టీల్, అల్యూమినియం ఉత్పత్తులపై అమెరికా డ్యూటీలు పెంచడంతో, భారత్‌కు కూడా అదే స్థాయిలో టారిఫ్‌లను విధించి, ట్రంప్ సర్కార్‌కు ఝలకిచ్చింది. మోటార్ సైకిల్, ఇనుము, ఉక్కు, బోరిక్ ఆమ్లం, కాయధాన్యాలు వంటి 30 రకాల ఉత్పత్తులపై కస్టమ్స్ డ్యూటీని 50 శాతం పెంచే ప్రతిపాదనను భారత్ ప్రభుత్వం డబ్ల్యూటీఓకు సమర్పించింది. స్టీల్, అల్యూమినియం ఉత్పత్తులపై టారిఫ్‌లను విధించడంతో ట్రంప్ సర్కార్ 241 మిలియన్ డాలర్ల వరకు ఆర్జిస్తోంది. ట్రంప్ టారిఫ్‌లపై ఆగ్రహించిన భారత్, అంతేమొత్తంలో అమెరికా నుంచి దిగుమతి అయ్యే 30 రకాల ఉత్పత్తులపై రాయితీలను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించినట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. ఈ ఏడాది మే నెలలో కూడా అమెరికా నుంచి దిగుమతి అయ్యే బాదం, ఆపిల్, మోటార్‌సైకిల్స్ వంటి 20 రకాల ఉత్పత్తులపై కూడా డ్యూటీలను 100 శాతం పెంచాలని భారత్ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఈ ఉత్పత్తులపై భారత్ ప్రతిపాదించిన అదనపు డ్యూటీలు 10 శాతం నుంచి 100 శాతం రేంజ్లో ఉన్నాయి. 800 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ కెపాసిటీ ఉన్న మోటార్ సైకిళ్లపై 50 శాతం డ్యూటీ, బాదంపై 20 శాతం, వాల్‌నట్స్‌పై 20 శాతం, ఆపిల్స్‌పై 25 శాతం డ్యూటీని భారత్ ప్రతిపాదించింది. భారత్ ప్రతీకార టారిఫ్‌లను విధించడం ఇదే మొదటిసారి. ట్రంప్ సర్కార్ వెళ్తున్న నియంతృత్వ పోకడకు ప్రతీకారంగా భారత్ ఈ టారిఫ్‌లను విధించింది. సమీక్షించిన ఈ డ్యూటీలు జూన్ 21 నుంచి అమల్లోకి రానున్నాయి. అమెరికాకు ఇస్తున్న మినహాయింపులను నిషేధించే నిర్ణయం తీసుకున్నామని, దీంతో 238.09 మిలియన్ డాలర్ల డ్యూటీని సేకరించనున్నామని డబ్ల్యూటీఓకు భారత్ సమర్పించిన నివేదికలో పేర్కొంది. కాగ, గత మార్చిలో అమెరికా తమ దేశానికి దిగుమతి అయ్యే స్టీల్ ఉత్పత్తులపై 25 శాతం, అల్యూమినియం ఉత్పత్తులపై 10 శాతం డ్యూటీలను విధిస్తున్నట్టు ప్రకటించింది. -
వేధించారు.. మేం ఢిల్లీ రావడం లేదు : పాక్
న్యూఢిల్లీ : భారత్‌లోని తమ రాయబారులు వేధింపులకు గురవుతున్నారంటూ ఆరోపించిన పాకిస్తాన్.. ఇందుకు నిరసనగా న్యూఢిల్లీలో జరగబోయే ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీవో) సమావేశాలకు హాజరుకావడం లేదని స్పష్టం చేసింది. భారత్, పాకిస్థాన్ మధ్య గత కొన్ని రోజులుగా దౌత్యపరమైన ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఆ దేశ దౌత్య వర్గాలు భారత్‌కు సమాచారం అందించాయి. ఈ నెల 19, 20 తేదీల్లో న్యూఢిల్లీ వేదికగా డబ్ల్యూటీవో సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి హాజరుకావాలని పాక్ వాణిజ్య శాఖ మంత్రి పర్వేజ్ మాలిక్‌కు గత నెలలో భారత్ ఆహ్వానం పంపింది. సదస్సుకు రాకూడదని పాక్ చివరి నిమిషంలో నిర్ణయం తీసుకుందని.. దీనిపై తాము స్పందించబోమని భారత అధికారులు చెబుతున్నారు. భారత్‌లో తాము వేధింపులకు గురవుతున్నామంటూ పాకిస్తాన్ హైకమిషన్ సిబ్బంది ఫిర్యాదు చేశారు. పాకిస్తాన్ మీడియాలో కథనాల ద్వారా ఈ విషయం బయటపడింది. వెంటనే స్పందించిన భారత్ దీనిపై విచారణ చేపడుతామని హామీ ఇచ్చింది. -
అమెరికా ప్రకటనపై డబ్ల్యూటీవో ఆందోళన
జెనీవా : స్టీల్, అల్యూమినియం ఉత్పత్తులపై భారీగా దిగుమతి సుంకాలు విధించనున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్(డబ్ల్యూటీఓ) డైరెక్టర్ జనరల్ రాబర్టో అజెవెడో ఆందోళన వ్యక్తం చేశారు. డబ్ల్యూటీఓ ట్రేడ్ పాలసీ విషయాల్లో జోక్యం చేసుకోవడం చాలా అరుదు. అయినప్పటికీ ట్రంప్ చేసిన ప్రకటనతో ట్రేడ్ వార్ జరిగే ప్రమాదం ఉందంటూ డబ్ల్యూటీఓ ఆందోళన వ్యక్త పరుస్తోంది. ట్రేడ్ వార్ జరుగాలని ఎవరూ కోరుకోవడం లేదని, పరిస్థితిని డబ్ల్యూటీఓ సునిశితంగా పరిశీలిస్తుందని చెప్పారు. ట్రంప్ ప్రకటనపై ఇతరులు ఏ విధంగా స్పందిస్తారో కూడా చూస్తున్నామని తెలిపారు. స్టీల్ దిగుమతులపై 25 శాతం సుంకాలు, అల్యూమినియంపై 10 శాతం టారిఫ్‌లను విధించనున్నట్టు ప్రకటించిన అనంతరం ట్రంప్ ట్రేడ్ వార్ చాలా మంచిదని, తేలికగా గెలువవచ్చని పేర్కొన్నారు. దీంతో ట్రేడ్ వార్ జరిగే ప్రమాదముందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ట్రేడ్ వార్ సంకేతాలతో ప్రపంచ స్టాక్ మార్కెట్లు సైతం అతలాకుతలమవుతున్నాయి. ప్రపంచ కుబేరుల సంపద ఇప్పటికే భారీగా కోల్పోయారు.ఈ ప్లాన్‌ఫై డబ్ల్యూటీఓ కమిటీ అంతకముందే విమర్శలు చేసింది. ఈ విషయంపై అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. కానీ ట్రంప్ టారిఫ్ ప్లాన్లు, సిస్టమ్‌కు దారుణమైన ప్రమాదంగా తెలుస్తోంది. -
అమెరికాకు గట్టి షాకిచ్చిన ఇండియా
జెనీవా : పలు రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు తలుపులు బార్లాగా తెరిచే భారత్.. సౌర శక్తి (సోలార్ ఎనర్జీ) విషయంలో మాత్రం భిన్నంగా వ్యవహరించింది. అమెరికాలో తయారయ్యే సోలార్ సెల్స్, మాడ్యుల్స్ల దిగుమతిపై విధించిన ఆంక్షలు ముమ్మాటికి సరైనవేనని పేర్కొంది. డబ్ల్యూటీవో నిబంధనల ప్రకారం ‘సౌరశక్తి ఉత్పత్తి పరికరాల సరఫరా’ ఒప్పందాలను భారత్ ఉల్లంఘించిందని అమెరికా ఆరోపించగా, అసలు తప్పు అమెరికాదేనని భారత్ వాదించింది. ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీవో) ఈ మేరకు సోమవారం ఒక ప్రటకనలో ఈ వివరాలను పేర్కొంది. ఏమిటీ వివాదం? : కాలుష్యరహిత సంప్రదాయేతర ఇంధన వనరులను ఎక్కువ వినియోగంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం 2011లో సౌర విద్యుత్ విధానం(సోలార్ పవర్ పాలసీ)ని రూపొందించుకుంది. ప్రపంచ వాణిజ్య సంస్థలో సభ్యురాలైన భారత్ ఆ సంస్థ నిబంధనల ప్రకారం అమెరికాకు చెందిన సోలార్ పరికరాల సంస్థల కార్యకలాపాలకు అనుమతి ఇచ్చింది. అయితే, విదేశీ కంపెనీల పోటీ ఎక్కువ కావడంతో దేశీయ సోలార్ ఎనర్జీ కంపెనీలు, పరికరాల తయారీదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో భారత ప్రభుత్వం.. ‘సోలార్ ప్యానెళ్లలోని మాడ్యుల్స్, సెల్స్‌లు ఇక్కడ తయారుచేసినవే అయి ఉండాలని’ నిబంధన తీసుకొచ్చింది. భారత్ నిబంధనను తప్పుపడుతూ 2013లో అమెరికా.. డబ్ల్యూటీవో ఆధ్వర్యంలోని వాణిజ్య కోర్టు(జెనీవా)ను ఆశ్రయించింది. సుదీర్ఘంగా సాగిన వాదోపవాదాల్లో ఇరుదేశాలు తమతమ వాణిని వినిపించాయి. తాజాగా ‘నిబంధనలు ఉల్లంఘించినందుకు భారత్ జరిమానా కట్టాలని’ అమెరికా మెలిక పెట్టింది. భారత్ వాదన : అమెరికా ఆరోపణలను తిప్పికొడుతూ భారత్ గట్టి వాదన వినిపించింది. ‘డబ్ల్యూటీవో నిబంధనల ప్రకారం విదేశీ సంస్థలపై ఆంక్షలు విధించే అధికారం మాకు ఉంది. అదేసమయంలో ఆంక్షల సాకు చెప్పి ఒప్పందాల నుంచి తప్పుకోవాలని చూస్తే అది అమెరికా తన పక్షపాతవైఖరిని బయటపెట్టుకున్నట్లవుతుంది. నిబంధనల విషయంలో మేం(భారత్) ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదు. కాబట్టి అమెరికా చెప్పేదాంట్లో విషయంలేదు’’ అని భారత్ పేర్కొంది. -
బంగినపల్లి మామిడి కర్నూలు జిల్లాదే
కర్నూలు (అగ్రికల్చర్): జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విశేష ప్రాచుర్యం పొందిన బంగినపల్లి మామిడికి భౌగోళిక (జియోగ్రాఫికల్ ఇండికేషన్) గుర్తింపు లభించింది. ఈ మామిడి ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందినదిగా ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) గుర్తించింది. రెండేళ్ల క్రితమే ప్రాథమికంగా గుర్తింపు లభించినప్పటికీ తాజాగా పూర్తి హక్కులు ఇచ్చినట్లు సంస్థ సోమవారం చెన్నైలో ప్రకటించింది. భౌగోళిక గుర్తింపుతో పాటు బంగినపల్లి మామిడి మాది అని చెప్పే అధికారం ఇతరులకు ఇకనుంచి ఉండదు. బంగినపల్లి మామిడి పేరును వాడుకోవాలంటే కర్నూలు జిల్లాకు రాయల్టీ చెలించాల్సి ఉంటుంది. -
డబ్ల్యూటీవో కంటే హానికరం
అభిప్రాయం ‘రెండు దశాబ్దాల క్రితం 1995 జనవరి 1న ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) ఏర్పడినప్పుడు రైతు సంఘాలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున నిర సన తెలిపాయి, ఉద్యమాలు చేసాయి. పూర్తిగా దానిని ఆపలేకపోయినా, కొంతవరకు దానిలోని ప్రజా వ్యతిరేక అంశాలను అడ్డుకోగలిగాయి. అయినా దాని దుష్ప్రభావాలు మనం ఇప్పటిదాకా చూస్తున్నాము. అయితే ఇప్పుడు డబ్ల్యూటీవో కంటే ప్రమాదకరంగా ఉన్న స్వేచ్ఛావాణిజ్య ఒప్పందాలు వస్తున్నాయి. అటువంటిదే ‘‘ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం’’ (ఆర్సీఈపీ) పేరుతో వస్తున్న ఈ ఒప్పందం. ఆర్సీఈపీ అనేది 16 దేశాల మధ్య జరుగుతున్న స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం. దీనిలో భారత్‌తోపాటు చైనా, జపాన్, దక్షిణ కొరియాలు, సంపన్న దేశాలైన ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, ఆగ్నేయ ఆసియాలోని సింగపూరు, మలేషియావంటి పది దేశాలు ఉన్నాయి. హైదరాబాద్‌లోనే 16 దేశాల ప్రభుత్వ ప్రతినిధులు జూలై 24 నుంచి 28 దాకా ఆర్సీఈపీ ఒప్పందంపై చర్చించి తుది మెరుగులు దిద్దడానికి భేటీ అవుతున్నారు. వ్యవసాయం, విత్తన రంగంపై ప్రభావం: వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులపై ఆంక్షలు, దిగుమతి సుంకాలు పూర్తిగా తీసి వేయాలన్నది ఆర్సీఈపీ లక్ష్యం. ప్రస్తుతం వ్యవసాయ ఉత్పత్తులపై సగటు దిగుమతి సుంకం 32.7% ఉంది. ఈ ఒప్పందం అమల్లోకి వస్తే అది ఒకేసారిగా సున్నాకి వచ్చేస్తుంది. ఇప్పటికే డబ్ల్యూటీఓ, ఆగ్నేయాసియా దేశాల సంస్థ (ఆసియాన్) సభ్య దేశాలతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాల వలన అనేక పంటల విషయంలో రైతులు దెబ్బ తిన్నారు. చవక పామోలీన్ దిగుమతితో వేరుశనగ, కొబ్బరి, ఇతర నూనె గింజల పంటల మార్కెట్ పూర్తిగా దెబ్బతిన్నది. అలాగే గతేడాది కంది దిగుమతి వలన నవంబర్‌లో కందుల ధర క్వింటాలుకి రూ. 9,000 నుంచి రూ. 4,000 వరకు పడిపోవడంతో రైతులు విపరీతంగా నష్టపోయారు. దేశమంతా రైతులు పంటలకు గిట్టుబాటు ధరలు కావాలని ఉద్యమాలు చేస్తుండగా, సరైన ఆదాయం లేక ఆత్మహత్యలు చేసుకుంటుండగా, పంట ధరలను మరింత దెబ్బతీసే ఇటువంటి ఒప్పందాలను ముందుకి తీసుకు వెళ్ళడం దారుణం. అంతే కాదు, మన ప్రభుత్వం వరి, గోధుమ వంటి పంటలను సేకరించినప్పుడు మన రైతులు మాత్రమే గాక విదేశీ కంపెనీల వద్ద నుంచి కూడా సేకరించాలన్న ఆంక్షలు దీనిలో ఉన్నాయి. ఆర్సీఈపీ ఒప్పం దంలో విత్తనాలపై పేటెంట్లు తీసుకు రావాలన్న ఒత్తిడి ఉంది. ఇది విత్తన రంగంలో పూర్తి కార్పొరేటీకరణకు దారి తీస్తుంది. పశు సంరక్షణ, పాల ఉత్పత్తిపై దెబ్బ: ఆస్ట్రేలియా, న్యూజీ లాండ్ దేశాలు అత్యధికంగా పాల ఉత్పత్తి చేసే దేశాలు. తమ అవసరాల కంటే 500 శాతం అధిక ఉత్పత్తి ఆ దేశాలలో ఉంది. వాటిని తక్కువ ధరకు మన దేశంలో దిగుమతి చేస్తే ఇక్కడి ఉత్పత్తి పూర్తిగా దెబ్బ తింటుంది. మన దేశంలో చిన్న రైతులు, ముఖ్యంగా మహిళా రైతులకి పాల ఉత్పత్తి ముఖ్య ఆదాయం ఇలాంటి 1.5 కోట్ల కుటుంబాల జీవనోపాధిపై పెద్దదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. కార్మికుల హక్కులు, పారిశ్రామిక రంగం: చవక దిగుమతుల వలన మన పారిశ్రామిక రంగం కూడా దెబ్బ తింటుంది. ఇప్పటికే ప్రతి రోడ్డు మీదా చైనా బొమ్మలే. మన దేశంలో బొమ్మల తయారీ పరిశ్రమ నాశనమై పోయింది. ఆర్సీఈపీ వస్తే ఉక్కు, యంత్ర పరిశ్రమలలో ఉత్పత్తి, ఉద్యోగాలు తగ్గిపోతాయి. వస్త్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, పింగాణీ పరిశ్రమలపై ప్రభావం ఉంటుంది. మందుల ధరలు ఆకాశానికి : మన దేశం జనరిక్ మందుల తయారీకి పుట్టినిల్లు. అంటే ఒక మందుపై పేటెంట్ ఉన్న కంపెనీ మాత్రమే కాకుండా ఇతర కంపెనీలు కూడా తయారు చేయడానికి వెసులుబాటు ఉంది. ఎయిడ్స్ రోగులు విదేశీ కంపెనీల మందులు వాడుతున్నప్పుడు నెలకు లక్షన్నర రూపాయలు ఖర్చు అయ్యేది, అది జనరిక్ మందుల వలన ఒక్కసారిగా నెలకు రూ.800 లకు తగ్గిపోయింది. క్యాన్సర్, హెపటైటిస్, టీబీ వంటి రోగాలకు సంబంధించి విదేశీ కంపెనీల మందులకు, మన మందులకు వందల రెట్లు తేడా ఉంది. ఈ ఒప్పందంలో విదేశీ కంపెనీల పేటెంట్ హక్కులను కాపాడే పేరుతో జనరిక్ మందుల తయారీపై వేటు పడనుంది. మందుల ధరలు కొండెక్కుతాయి. ఒప్పందాలకు బ్రేక్ వేయాలి, విస్తృతంగా చర్చించాలి: ఇటువంటి ఒప్పందాల వివరాలను బయట పెట్టకుండా, పార్లమెంట్లో కూడా చర్చించకుండా భారత ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. కాబట్టి రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు అందరూ కలిసి ప్రతిఘటించడానికి ముందుకు రావడం ఆశాజనకం. ఈ స్వేచ్ఛావాణిజ్య ఒప్పందాలపై విస్తృత చర్చ అవసరం. విదేశీ కంపెనీలకు పూర్తి స్వేచ్ఛనివ్వడం, మన ప్రజల హక్కులను, ప్రభుత్వాలను కట్టడి చెయ్యడం–ఇదే స్వేచ్ఛావాణిజ్య ఒప్పందాల సారాంశం. భారత ప్రభుత్వం ఈ అంశాలను పార్లమెంట్‌లోనూ, ప్రజాసంఘాలతోనూ చర్చించకుండా ఏ మాత్రం ముందుకు వెళ్లకూడదు. (ఆర్సీఈపీ స్వేచ్ఛావాణిజ్య ఒప్పందాలపై సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జూలై 23న విస్తృత ప్రజా సదస్సు, జూలై 24న నిరసన కార్యక్రమాలు జరుగుతాయి) వ్యాసకర్త రైతు స్వరాజ్య వేదిక బాధ్యుడు ‘ 97017 05743 -విస్సా కిరణ్ కుమార్ -
డబ్ల్యూటీవో ముందుకు వీసాల వ్యవహారం?
న్యూఢిల్లీ: వీసాల ఫీజుల పెంపుపై అమెరికా దుందుడుకుతనాన్ని భారత్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్(డబ్ల్యూటీవో) ముందుకు తీసుకెళ్లింది. ఈ విషయంపై వివాదాల పరిష్కారాల ఏజెన్సీ డబ్ల్యూటీవోను ఆశ్రయించినట్టు పరిశ్రమల, వాణిజ్య శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం రాజ్యసభలో తెలిపారు.హెచ్-1బీ, ఎల్-1 వీసాల విషయంలో వీసా ప్రక్రియ ఫీజులను అమెరికా పెంచుతుందని ఆమె ఆరోపించారు. దీంతో దేశీయ సర్వీసు కంపెనీలు సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. ఇప్పటికే చాలా సార్లు అమెరికా ప్రభుత్వంతో తాము చర్చలు జరిపామని, ఇక చివరికి ఈ విషయంపై డబ్ల్యూటీవో ముందుకెళ్లినట్టు తెలిపారు. హెచ్-1బీ వీసా ప్రక్రియలో నిబంధనల కఠినతరంపై భారత ప్రభుత్వం, అమెరికా కార్యావర్గానికి నచ్చజెప్పేలా ప్రయత్నాలు సాగిస్తూనే ఉందని, ఎప్పడికప్పుడూ అమెరికా కార్యవర్గంతో చర్చలు జరుపుతూనే ఉందని ఆమె తెలిపారు. భారత విదేశాంగ కార్యదర్శి ఎస్. జయశంకర్ కూడా ఈ నెల మొదట్లో అమెరికాను సందర్శించారు. అమెరికా ఆర్థికవ్యవస్థ వృద్ధి చెందడానికి భారత్ భాగస్వామ్యం ఎంతో అవసరమని ఆయన ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తో చెప్పారు. ఈ విషయంపై అమెరికాకు నచ్చజెప్పేందుకు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అధికారులతో, కాంగ్రెస్‌తో చాలా సార్లు చర్చలు జరిపినట్టు జయశంకర్ తెలిపారు. ఏప్రిల్ 3 నుంచి హెచ్-1బీ వీసాల ప్రీమియం ప్రాసెసింగ్ ను సస్పెండ్ చేస్తామని అమెరికా ఇంతకముందే చెప్పింది. ప్రతిభావంతులైన విదేశీయులు మాత్రమే అమెరికాలోకి వచ్చే విధంగా హెచ్-1బీ వీసా ప్రక్రియను కఠినతరం చేస్తామని అమెరికా హెచ్చరిస్తోంది. అమెరికాలో పనిచేసే చాలా భారత ఐటీ కంపెనీలు హెచ్-1బీ వీసాలపై ఆధారపడి ఉన్నాయి. ఈ నిబంధనల కఠినతరంతో భారత ఐటీ కంపెనీలకు తీవ్ర నష్టం వాటిల్లనుంది. దీంతో భారత్ లో ఆందోళన నెలకొంది. -
డబ్యూటీఓలో భారత రాయబారి దీపక్
న్యూఢిల్లీ: ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ–వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్)లో భారత రాయబారి(భారత శాశ్వత ప్రతినిధి)గా టెలికం కార్యదర్శి జె.ఎస్. దీపక్ నియమితులయ్యారు. 1982 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన దీపక్ ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు. 2010లో స్పెక్ట్రమ్ ఈ–వేలం ద్వారా ప్రభుత్వానికి రూ.1.06 లక్షల కోట్లు విజయవంతంగా రావడానికి ఈయనే ముఖ్య కారణం. ఐఐఎం, అహ్మదాబాద్‌లో ఎంబీఏ చదివిన దీపక్ వాషింగ్టన్ డీసీకి చెందిన పాలసీ ప్రాజెక్ట్‌కు కన్సల్టెంట్‌గా పనిచేశారు. -
ప్రపంచ వాణిజ్యం పడిపోతోంది
డబ్ల్యూటీఓ అంచనా... జెనీవా: ప్రపంచ వాణిజ్యవృద్ధి రేటు అంచనాలు క్రమంగా తగ్గిపోతున్నాయి. ఈ ఏడాది ఈ వృద్ధి అంచనా కేవలం 1.7 శాతమని ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) తన తాజా నివేదికలో తెలిపింది. 2016కు సంబంధించి ఈ వృద్ధి రేటు అంచనాలను డబ్ల్యూటీఓ తగ్గించడం ఇది వరుసగా మూడవసారి. దీనిని దేశాలు తీవ్రంగా పరిగణించి, తగిన చర్యలు తీసుకోవాలని డబ్ల్యూటీఓ డెరైక్టర్ జనరల్ రాబర్టో అజ్వాడో పేర్కొన్నారు. ఇప్పటికే ఎగుమతులు క్షీణ బాటలో నడుస్తున్న భారత్ వంటి దేశాలకు తాజా పరిణామం ఆందోళన కలిగించేదనడంలో సందేహం లేదు. 2014 డిసెంబర్ నుంచీ వరుసగా 19 నెలలు 2016 మే వరకూ భారత్ ఎగుమతుల్లో అసలు వృద్ధి నమోదుకాకపోగా పడిపోతూ వచ్చాయి. జూన్‌లో స్వల్ప వృద్ధితో ఊరట నిచ్చాయి. అయితే అటు తర్వాత రెండు నెలలూ (జూలై, ఆగస్టు) ఎగుమతులు క్షీణబాట పట్టాయి. జెనీవాలోని డబ్ల్యూటీఓ ప్రధాన కార్యాలయంలో మంగళవారం ప్రపంచ వృద్ధిపై ఒక కీలక సమావేశం జరిగింది. 2016లో ప్రపంచ వాణిజ్య వృద్ధి రేటు 3.9 శాతం పెరుగుతుందని 2015 సెప్టెంబర్‌లో డబ్ల్యూటీఓ అంచనావేసింది. అయితే ఈ రేటును ఈ ఏడాది ఏప్రిల్‌లో 2.8 శాతానికి కుదించింది. తాజాగా మరింతగా 1.7 శాతానికి తగ్గించింది. 2009 తరువాత వాణిజ్య వృద్ధి ఈ స్థాయికి పడిపోవడం ఇదే తొలిసారనీ వివరించింది. స్థూల దేశీయోత్పత్తి పడిపోవడమే కాకుండా, చైనా, బ్రెజిల్, ఉత్తర అమెరికా వంటి దేశాలూ ఎగుమతుల మందగమన ఎదుర్కొనక తప్పదని పేర్కొంది. -
ప్రాణాలు పోతున్నాయ్..
దేశంలో వైద్య సేవల కొరత.. ఏటా 10 లక్షల మంది మృతి 125 కోట్ల జనాభాకు ఉన్న డాక్టర్ల సంఖ్య 9.29 లక్షలే.. స్పెషలిస్ట్ డాక్టర్‌ను చూడని 70 కోట్ల మంది! రోగాలతో అప్పులపాలవుతున్నవారు ఆరుకోట్ల పైనే 31 శాతం జనాభా ఉన్న 6 రాష్ట్రాల్లోనే 58 శాతం ఎంబీబీఎస్ సీట్లు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదికలో దిగ్భ్రాంతికర అంశాలు వెల్లడి సాక్షి, హైదరాబాద్: దేశంలో సరైన వైద్యసేవలు అందుబాటులో లేక ఏటా 10 లక్షల మంది మృత్యువాత పడుతున్నారు... గుండెలు పగిలే ఈ కఠోర వాస్తవం వేరెవరో చెప్పింది కాదు.. స్వయానా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కేంద్రానికి సమర్పించిన నివేదిక వెల్లడించిన పచ్చినిజం. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్‌ది మూడోస్థానమని చెప్పుకుంటున్న పరిస్థితుల్లో దేశంలోని సామాన్యులకు కనీస వైద్యసేవలు కూడా అందుబాటులో లేవన్న కఠోర సత్యాన్ని ఇది చాటుతోంది. దేశంలో అందుతున్న వైద్యసేవల్లోని డొల్లతనాన్ని ఈ నివేదిక బట్టబయలు చేసింది. తాజాగా కేంద్రానికి సమర్పించిన ఈ నివేదికలో పలు దిగ్భ్రాంతి కలిగించే అంశాలున్నాయి. దాదాపు 125 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో కేవలం 9.29 లక్షలమంది మాత్రమే డాక్టర్లున్నారని, అందులోనూ నిత్యం వైద్యసేవలందిస్తున్నవారు 7.24 లక్షలమందేనని నివేదిక స్పష్టం చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) లెక్కల ప్రకారం ప్రతి వెయ్యిమందికీ ఒక డాక్టరు ఉండాలి. కానీ భారత్‌లో ఉన్న వైద్యులసంఖ్యతో పోలిస్తే 2వేల మందికి కూడా ఒక వైద్యుడు లేని పరిస్థితిని ఈ నివేదిక కళ్లకు కట్టింది. నివేదికలో ప్రస్తావించిన ఇతర ముఖ్యాంశాలివీ.. * దేశ జనాభా 125 కోట్లు ఉంటే.. అందులో 70 కోట్ల మందికి ఇప్పటికీ స్పెషలిస్ట్ డాక్టర్ సేవలు అందుబాటులోకి రాలేదు. డబ్బున్నవాళ్లు నిత్యం స్పెషలిస్ట్ డాక్టర్ పర్యవేక్షణలోనే వైద్యం పొందుతుంటే.. అసలు స్పెషలిస్ట్ డాక్టర్ అంటేనే తెలియనివాళ్లే అధికంగా ఉన్నారు. * దేశంలో మెడికల్ రిజిస్ట్రేషన్ లోపభూయిష్టంగా ఉంది. ఎంతమంది రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారున్నారు, వీరిలో వైద్యం చేస్తున్నవాళ్లెందరు?, మృతిచెందిన వారెంతమంది తదితర లెక్కలు సరిగా లేవు. అంతేకాదు ప్రస్తుతం స్పెషలిస్ట్ వైద్యులు, సూపర్ స్పెషలిస్టు వైద్యుల్లో 80 శాతం మంది పట్టణాల్లోనే ఉన్నారు. దీనివల్ల గ్రామీణులకు స్పెషాలిటీ వైద్యుల సేవలు అందట్లేదు. * దేశంలో వైద్య పరిస్థితులు విచిత్రంగా ఉన్నాయి. జాతీయ ఆరోగ్య విధానం-2015 ప్రకారం ఏటా వైద్యసేవలకోసం వెళుతున్నవారిలో 6.3 కోట్లమంది అప్పులపాలవుతున్నారు. ముఖ్యంగా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్(ఎన్సీడీ), మధుమేహం, గుండెజబ్బు, కేన్సర్ వంటి జబ్బులు తీవ్రమవుతున్నందున సామాన్య, మధ్యతరగతి వర్గాలు అప్పుల్లోకి వెళుతున్నాయి. వేధిస్తోన్న వైద్యకళాశాలల కొరత దేశంలో ఉన్న జనాభాకు, వైద్యకళాశాలల సంఖ్యకూ పొంతనలేదు. అంతేకాదు.. దేశంలోఉన్న 65 శాతం వైద్య కళాశాలలు గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లోనే ఉన్నాయి. దీనివల్ల రాష్ట్రాల మధ్య వైద్యసేవల వ్యత్యాసం తీవ్రంగా ఉంది. ఉత్తరాది రాష్ట్రాలతోపాటు మధ్యభారత రాష్ట్రమైన మధ్యప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల్లో వైద్యుల కొరత ఎక్కువగా ఉంది. విచిత్రమేమంటే దేశ జనాభాలో 31 శాతం జనాభా ఆరు రాష్ట్రాల్లో ఉంటే.. 58 శాతం ఎంబీబీఎస్ సీట్లు ఇక్కడే ఉన్నాయి. మరో 8 రాష్ట్రాల్లో 46 శాతం జనాభా ఉంటే.. వాటిల్లో కేవలం 21 శాతమే ఎంబీబీఎస్ సీట్లున్నాయి. వైద్య కళాశాలల ఏర్పాటులో అసమానతలు తొలగించాల్సిన, అన్ని రాష్ట్రాలకు సేవలందేలా సమాన ప్రాతినిధ్యం కల్పించాల్సిన బాధ్యత భారతీయ వైద్యమండలి(ఎంసీఐ)దే. దేశంలో ఉన్న డాక్టర్ల సంఖ్య 9.29 లక్షలు ప్రాక్టీస్ చేస్తున్నవారి సంఖ్య 7.24 లక్షలు స్పెషలిస్ట్ డాక్టర్ సేవలు అందనివారు 70 కోట్లు వ్యాధులతో అప్పుల పాలవుతున్నవారు 6.30 కోట్లు పట్టణాల్లో మాత్రమే ఉంటున్న స్పెషలిస్టులు 80 శాతం 31శాతం జనాభా ఉన్న 6 రాష్ట్రాల్లో 58 శాతం ఎంబీబీఎస్ సీట్లు 46శాతం జనాభా ఉన్న 8 రాష్ట్రాల్లో 21 శాతం ఎంబీబీఎస్ సీట్లు