మా సుంకాలు తక్కువే...! | India's import duties not high | Sakshi
Sakshi News home page

మా సుంకాలు తక్కువే...!

Published Wed, Mar 6 2019 5:13 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

India's import duties not high - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ భారీగా దిగుమతి సుంకాలు విధిస్తోందన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆరోపణలను కేంద్రం తోసిపుచ్చింది. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) నిబంధనలకు అనుగుణంగానే భారత్‌ సుంకాలు ఉంటున్నాయని స్పష్టం చేసింది. ‘అధిక టారిఫ్‌లు విధిస్తున్నామన్న ఆరోపణలను అంగీకరించబోము. దిగుమతి సుంకాలు డబ్ల్యూటీవో నిర్దేశిత శ్రేణిలోనే ఉన్నాయి. కొన్ని వర్ధమాన దేశాలు, సంపన్న ఎకానమీల స్థాయిలోనే ఉన్నాయి‘  అని కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి అనూప్‌ వాధ్వాన్‌ మంగళవారమిక్కడ విలేకరులకు చెప్పారు.

అదే సమయంలో ఏవో కొన్ని ఉత్పత్తులపై మాత్రమే కొంత అధిక టారిఫ్‌లు ఉండొచ్చని, అయితే అన్ని దేశాల్లోనూ ఇలాంటివి సాధారణమేనని వాణిజ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. హార్లే డేవిడ్‌సన్‌ బైక్స్‌ వంటి అమెరికన్‌ ఉత్పత్తులపై భారీగా దిగుమతి సుంకాలు విధిస్తున్న భారత్‌ .. ఒకరకంగా ’టారిఫ్‌ల రాజా’ అంటూ ట్రంప్‌ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అనూప్‌ వాధ్వాన్‌ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది.

జీఎస్‌పీ ప్రయోజనాలు కొంతే..
వాణిజ్యంలో భారత్‌కి ఇస్తున్న ప్రాధాన్యతాపరమైన ప్రయోజనాలను ఉపసంహరించాలన్న అమెరికా ప్రతిపాదనతో ఎగుమతులపై పెద్దగా ప్రభావమేమీ ఉండబోదని అనూప్‌ వాధ్వాన్‌ వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించి సాధారణ ప్రాధాన్య వ్యవస్థ (జీఎస్‌పీ) కింద భారత్‌ గతేడాది 5.6 బిలియన్‌ డాలర్ల మేర ఎగుమతులు చేసినప్పటికీ, ప్రాధాన్యతా హోదాపరంగా ఒనగూరిన ప్రయోజనాలు సుమారు 190 మిలియన్‌ డాలర్లు మాత్రమేనని ఆయన∙చెప్పారు. అమెరికా కోరుతున్న మేరకు విస్తృతమైన వాణిజ్య ప్యాకేజీపై భారత్‌ కసరత్తు చేస్తున్నప్పటికీ.. ఆ దేశం జీఎస్‌పీని ఉపసంహరించాలని నిర్ణయించుకుందని అనూప్‌ చెప్పారు. ఈ ప్యాకేజీలో మెడికల్‌ డివైజ్‌లు, డెయిరీ ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తులు మొదలైనవన్నీ ఉన్నాయన్నారు. అమెరికా డిమాండ్లపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని, అయితే ప్రజా ఆరోగ్యంతో ముడిపడి ఉన్న విషయాల్లో మాత్రం రాజీపడే ప్రసక్తే లేదని అనూప్‌ వాధ్వాన్‌ స్పష్టం చేశారు.  

ఆయా రంగాలకు ప్రభుత్వం తోడ్పాటునివ్వాలి: ఎఫ్‌ఐఈవో
జీఎస్‌పీ ప్రయోజనాలు ఒక్క శాతం నుంచి ఆరు శాతం శ్రేణిలోనే ఉంటున్నాయని, దీన్ని తొలగించినంత మాత్రాన ఎగుమతులపై పెద్దగా ప్రతికూల ప్రభావమేమీ పడదని ఎగుమతి సంస్థల సమాఖ్య (ఎఫ్‌ఐఈవో) వ్యాఖ్యానించింది. అయితే, కొంత అధిక ప్రయోజనాలు పొందుతున్న రంగాలకు ఒకవేళ జీఎస్‌పీ తొలగించిన పక్షంలో ప్రభుత్వం కొంత మేర తోడ్పాటునివ్వాలని ఎఫ్‌ఐఈవో ప్రెసిడెంట్‌ గణేష్‌ కుమార్‌ గుప్తా చెప్పారు. బిల్డింగ్‌ మెటీరియల్, టైల్స్, చేతి పనిముట్లు (స్పానర్లు, డ్రిల్లింగ్‌ పరికరాలు), ఇంజనీరింగ్‌ ఉత్పత్తులు, టర్బైన్స్, సైకిళ్లు మొదలైన ఉత్పత్తుల ఎగుమతులకు జీఎస్‌పీపరమైన ప్రయోజనాలు ఉంటున్నాయి. మినహాయింపులు ఎత్తివేస్తే.. వాటి ధరలు పెంచాల్సి రావడం వల్ల దేశీ సంస్థలు అంతర్జాతీయంగా పోటీపడలేని పరిస్థితి నెలకొంటుందని గుప్తా చెప్పారు.  

తగ్గుతున్న వాణిజ్య లోటు..
రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2016–17లో 64.5 బిలియన్‌ డాలర్లుగా ఉండగా.. 2017–18లో 74.5 బి. డాలర్ల స్థాయికి చేరింది. అమెరికా నుంచి చమురు, గ్యాస్, బొగ్గు తదితర ఉత్పత్తుల కొనుగోళ్లను పెంచిన నేపథ్యంలో భారత్‌తో అగ్రరాజ్యం వాణిజ్య లోటు 2017, 2018లో గణనీయంగా తగ్గినట్లు కేంద్ర వాణిజ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ‘గతేడాది వాణిజ్య లోటు పరిమాణం దాదాపు 4 బి. డాలర్లు తగ్గింది.

భారత్‌లో ఇంధనానికి, పౌర విమానాలకు డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఇది మరింతగా తగ్గుతుంది. అమెజాన్, ఉబెర్, గూగుల్, ఫేస్‌బుక్‌ వంటి అమెరికన్‌ ఈ–కామర్స్, సర్వీసుల కంపెనీలు భారత మార్కెట్లో భారీగా అవకాశాలు అందిపుచ్చుకుంటున్నాయి‘ అని పేర్కొంది. ఇక, కొన్ని ఐటీ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు తగ్గించాలన్న అమెరికా డిమాండ్‌పై స్పందిస్తూ.. ప్రస్తుతం టారిఫ్‌లు ఒక మోస్తరు స్థాయిలోనే ఉన్నాయని, దిగుమతులను నిలిపివేసేంత భారీగా లేవని స్పష్టం చేసింది.  

జీఎస్‌పీ వివాదమిదీ..
జీఎస్‌పీ కింద వాణిజ్యానికి సంబంధించి అమెరికా ప్రాధాన్యమిస్తున్న వర్ధమాన దేశాల్లో భారత్‌ కూడా ఒకటి. దీని కింద అమెరికా మార్కెట్లోకి ఎలాంటి సుంకాలు లేకుండా కొన్ని ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు భారత్‌కు వీలు ఉంటోంది. సాధారణంగా 3,700  ఉత్పత్తులకు జీఎస్‌పీ ప్రయోజనాలు పొందే అవకాశం ఉన్నప్పటికీ.. భారత్‌ 1,900 ఉత్పత్తులు (రసాయనాలు మొదలైనవి) మాత్రమే ఎగుమతి చేస్తోంది. అయితే, జీఎస్‌పీ హోదా ఇస్తున్నప్పటికీ.. ప్రతిగా భారత మార్కెట్లో తమకు సముచిత, సమానమైన అవకాశాలు లభించడం లేదంటూ అమెరికా భావిస్తోంది.

దేశీయంగా స్టెంట్‌లు మొదలైన మెడికల్‌ డివైజ్‌ల రేట్లు భారీగా ఉండటంతో.. ధరలపై పరిమితులు విధించాలన్న భారత నిర్ణయంపై అమెరికన్‌ కంపెనీలు అభ్యంతరాలు వ్యక్తం చేయడం వంటివి దీనికి కారణం.  డెయిరీ, మెడికల్‌ డివైజ్‌ల తయారీ సంస్థల నుంచి ఫిర్యాదులు రావడంతో .. భారత్‌కి ఇస్తున్న జీఎస్‌పీ ప్రయోజనాలపై 2018 ఏప్రిల్‌లో అమెరికా పునఃసమీక్ష ప్రారంభించింది. ఆ తర్వాత సమీక్ష పరిధిలోకి ఐటీ ఉత్పత్తులు, వ్యవసాయోత్పత్తులు మొదలైన వాటన్నింటినీ చేర్చింది. చివరికి భారత్‌కి ఇస్తున్న జీఎస్‌పీని ఉపసంహరించాలని అమెరికా నిర్ణయించింది. భారత్‌తో పాటు టర్కీకి కూడా దీన్ని వర్తింపచేయాలని నిర్ణయం తీసుకుంది. అమెరికన్‌ కాంగ్రెస్, భారత ప్రభుత్వం నోటిఫికేషన్స్‌ ఇచ్చిన తర్వాత 60 రోజుల్లో అమల్లోకి రావొచ్చని అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం యూఎస్‌టీఆర్‌వో) వెల్లడించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement