GSP
-
భారత్‌కు ట్రంప్ వాణిజ్య దెబ్బ
వాషింగ్టన్: భారత్‌కు కల్పించిన ప్రాధాన్య వాణిజ్య హోదా(జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్స్–జీఎస్పీ)ని ఈ జూన్ 5వ తేదీ నుంచి రద్దు చేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దాంతో ఈ హోదా కింద భారత్‌కు అమెరికా నుంచి అందుతున్న సుమారు రూ.39 వేల కోట్ల(560 కోట్ల డాలర్లు) విలువైన వాణిజ్య రాయితీలు రద్దవుతాయి. తన మార్కెట్లలోకి అమెరికా ఉత్పత్తులకు సమానమైన అవకాశం కల్పిస్తామని భారత్ హామీ ఇవ్వదని అమెరికా నిర్ధారణకు రావడంతో అమెరికా ఈ చర్య తీసుకుంది. వర్థమాన దేశాల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా అమెరికా చాలా ఏళ్ల నుంచి ఈ జీఎస్పీ హోదా విధానాన్ని అమలు పరుస్తోంది. ఈ హోదా పొందిన దేశాల నుంచి అమెరికా ఎలాంటి సుంకాలు విధించకుండా వేలాది ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటుంది.‘భారత్ తన మార్కెట్లలో అమెరికాకు సమానమైన, సహేతుకమైన అవకాశం కల్పి స్తామని హామీ ఇవ్వదని నేను నిర్ధారణకొచ్చా. అందుకే భారత్‌కు కల్పించిన జీఎస్పీ హోదాను రద్దుచేస్తున్నాం’ అని ట్రంప్ అన్నారు. కాగా, తమకు జీఎస్పీ హోదాను రద్దు చేసినప్పటికీ ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాల బలోపేతానికి అమెరికాతో కలిసి పని చేస్తూనే ఉంటామని భారత్ పేర్కొంది. అమెరికా చర్యపై స్పందిస్తూ భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ శనివారం ఒక ప్రకటన జారీ చేసింది. జీఎస్పీ హోదా కింద భారత్ దాదాపు 2వేల ఉత్పత్తులను అమెరికాకు ఎలాంటి సుంకాలు చెల్లించకుండా ఎగుమతి చేసేది. ఈ హోదా కింద అమెరికా 2017లో 570 కోట్ల డాలర్ల విలువైన ఉత్పత్తులను భారత్ నుంచి సుంకాలు లేకుండా దిగుమతి చేసుకుంది. హోదా పొందాలంటే అమెరికా కంపెనీలు, పౌరులకు అనుకూలంగా వచ్చే మధ్యవర్తిత్వ తీర్పులను గౌరవించడం, అంతర్జాతీయ గుర్తింపు పొందిన కార్మిక హక్కులను గౌరవించడం,మేథో హక్కులను పరిరక్షించడం, అమెరికా కంపెనీలకు సమానమైన, సహేతుకమైన అవకాశం కల్పించడం వంటి నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. -
జీఎస్పీ హోదా రద్దుపై మరో ఆలోచన లేదు
వాషింగ్టన్: ఇండియాకు ప్రాధాన్య వాణిజ్య హోదా (జీఎస్పీ)ని తొలగించే విషయంలో మరో ఆలోచన లేదనీ, ఇది ఇప్పటికే ముగిసిన అంశమని అమెరికా సీనియర్ అధికారి ఒకరు గురువారం చెప్పారు. అలాగే డేటాను భారత్ లోనే భద్రపరచాలన్న నిబంధన, ఇండియాలోని మార్కెట్‌కు అమెరికా కంపెనీలకు యాక్సెస్ కల్పించడం తదితర అంశాల్లో తమ అభ్యంతరాలకు భారత్ పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని కూడా ఆయన అన్నారు. జీఎస్పీ హోదా ఉన్న దేశాల నుంచి వచ్చే దాదాపు 2 వేల వేర్వేరు వస్తువులపై పన్ను విధించకుండానే అమెరికాలోకి దిగుమతి చేసుకుని, ఎగుమతి చేస్తున్న దేశాల ఆర్థికాభివృద్ధికి తోడ్పడటం కోసం ఈ జీఎస్పీ విధానాన్ని అమెరికా గతంలో తీసుకొచ్చింది. అయితే ఈ ఏడాది మార్చి 4న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ ప్రకటన చేస్తూ, భారత్‌కు జీఎస్పీ హోదాను రద్దు చేసేందుకు తాము మొగ్గుచూపుతున్నట్లు తెలిపారు. 60 రోజుల నోటీస్ కాలం మే 3న ముగిసింది. దీంతో భారత్‌కు జీఎస్పీ హోదాను రద్దుచేస్తున్నట్లుగా ఇక ఏ క్షణమైనా అధికారిక నోటిఫికేషన్‌ను అమెరికా విడుదల చేయొచ్చు. -
‘ట్రంప్ నిర్ణయం ఎవరికి నష్టం?’
సాక్షి, న్యూఢిల్లీ : అమెరికా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే సరకులపై సుంకం మినహాయింపు దేశాల (జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రివరెన్సెస్) జాబితా నుంచి టర్కీతోపాటు భారత్ పేరును కూడా తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ నిర్ణయం వల్ల భారత దేశానికి ఎలాంటి నష్టం ఉంటుంది ? అలాంటి నిర్ణయం భారత్ కూడా తీసుకుంటే ఆ ప్రభావం అమెరికాపై ఎలా ఉంటుంది ? ఈ నిర్ణయాల వల్ల వాస్తవానికి ఎవరు నష్టపోతారు ? ఇరు దేశాల ప్రభుత్వాలా ? లేదా ఇరు దేశాల వినియోగదారుల ? అసలు అమెరికా ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? అందుకు దారి తీసిన పరిస్థితులు ఏమిటీ? అమెరికా సుంకం మినహాయింపు జాబితా కింద భారత దేశం నుంచి 1500 రకాల సరకుల దిగుమతులపై సుంకం విధించడం లేదు. అంటే ఎలాంటి సుంకం చెల్లించకుండానే భారత వ్యాపారులు ఆ వస్తువులను అమెరికాలో విక్రయించుకోవచ్చు. భారత్ ఎగుమతి చేస్తున్న సరకుల్లో మధుబని ప్రింట్లు, టీ షర్టుల నుంచి ఉక్కు వరకు ఉంది. అయితే ఉక్కుపైన పరిమితి పన్ను ఉంది. ఇందుకు బదులుగా అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న సోయాబిన్, ఆల్మండ్స్ నుంచి ఖరీదైన బైకుల వరకు భారత ప్రభుత్వం పన్ను మినహాయింపులు ఇస్తోంది. సుంకం మినహాయింపు కింద భారత్ 2017–18 ఆర్థిక సంవత్సరం నుంచి 560 కోట్ల డాలర్ల సరకులను అమెరికాకు ఎగుమతి చేసింది. వీటిపై 19 కోట్ల డాలర్ల సుంకం మినహాయింపు లభించింది. వాస్తవానికి 2017–18, నుంచి 2018–19 ఆర్థిక సంవత్సరాల్లో (2018, డిసెంబర్ వరకు) భారత్ దాదాపు 8,700 కోట్ల డాలర్ల విలువైన సరకులను అమెరికాకు ఎగుమతి చేసింది. దాంతో పోల్చుకుంటే సుంకం మినహాయింపు కింద ఎగుమతి చేసిన సరకుల విలువ చాలా తక్కువ. అమెరికా ఈ రెండు ఆర్థిక సంవత్సరాల్లో భారత్‌కు దిగుమతి చేసిన సరకుల విలువ దాదాపు 5,300 కోట్ల డాలర్ల మాత్రమే. గత జూన్ నుంచే భారత్ బెదిరింపులు భారత్ కొత్త సుంకం విధానం కింద అమెరికా నుంచి దిగుమతి చేసుకునే 30 సరకులపై సుంకం మినహాయింపు ఇస్తోంది. వీటిపై కూడా సుంకాలను విధిస్తామని గత జూన్ నెల నుంచే అమెరికాను భారత్ హెచ్చరిస్తూ వస్తోంది. అంతకుముందే అమెరికా నుంచి పాల ఉత్పత్తుల దిగమతిని భారత్ నిషేధించింది. కారణం, అమెరికాలోని ఆవులు మాంసాహారాన్ని తింటాయి కనుక. ఇందుకు ప్రతీకారంగా గుండె రక్తనాళాల్లో అమర్చే స్టెంటుల దిగుమతిపై టారిఫ్‌లను పెంచుతామని అమెరికా హెచ్చరించింది. టారిఫ్‌లు తక్కువగా ఉండడం వల్లనే మోదీ ప్రభుత్వం స్టెంట్ల ధరలపై నియంత్రణ ధరలను తీసుకొచ్చింది. అయితే అమెరికా ఇప్పటి వరకు వీటిపై సుంకం టారిఫ్‌లను పెంచలేదు. 800 సీసీ పైనున్న టూ వీలర్స్, ముఖ్యంగా హార్లీ డేవిడ్సన్ వాహనాలపై భారత్ అధిక సుంకం విధించడం పట్ల ట్రంప్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేయడంతో భారత్ వాటిని తగ్గించింది. ఈ-వాణిజ్యంలో కూడా ఇరు దేశాల మధ్య మినహాయింపులు కేవలం సరకుల ఎగుమతులు, దిగుమతులకే పరిమితం కాలేదు. ఈ-వాణిజ్యంలో కూడా మినహాయింపులు ఉన్నాయి. అమెరికాలో ఈ-వాణిజ్య నిబంధనలను సవరించిన కారణంగానే అమెజాన్, వాల్‌మార్ట్ కంపెనీలు భారత్‌లో రిటేల్ వ్యాపారాన్ని నిర్వహించ కలుగుతున్నాయి. అయితే ఇలాంటి విదేశీ సంస్థలపై భారత్ ఆంక్షలు విధించింది. విదేశీ ఈ రిటేలర్లు ‘ఇన్వెంటరీ మోడల్’ లో సరకులను అమ్మరాదు. అంటే ముందుగా ఆర్డర్లు తీసుకొని వాటిని ఉత్పత్తి చేసి ఆ తర్వాత సరఫరా చేయడం చేయరాదు. రెడీగా ఉన్న సరకులను అమ్మాలి. రిలయెన్స్ లాంటి భారతీయ రిటేలర్స్ రెడీగా ఉన్న ఉత్పత్తులను అమ్మవచ్చు. ఇన్వెంటరీ పద్ధతిలో సరకులను సరఫరా చేయవచ్చు. భారత్ తాము ఎగుమతి చేస్తున్న ఉక్కుపై మరింత టారిఫ్‌ను తగ్గించాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోంది. ఇలా దేశాల మధ్య మార్కెట్ యుద్ధం ఎంతో కాలం నుంచి నడుస్తోంది. మనకే నష్టం ఎక్కువ అమెరికా ఎలాగు నిర్ణయం తీసుకున్నది కనుక, అలాంటి నిర్ణయం భారత్‌కూడా తీసుకొని అమెరికా దిగుమతి ఉత్పత్తులపై సుంకం విధించాల్సి వస్తుంది. మనమే అమెరికాతో ఎక్కువ ఎగుమతి వ్యాపారం చేస్తున్నాం కనుక మనమే ఎక్కువ నష్టపోవాల్సి వస్తోంది. ముఖ్యంగా స్టీల్ ఎగుమతి పడిపోయే ప్రమాదం ఉంది. పరస్పర సుంకాల వల్ల ప్రభుత్వ ఖజానాలకు పెద్ద నష్టం వాటిల్లక పోవచ్చు. కానీ వినియోగదారులు ఎక్కువ ధరలు పెట్టి సరకులను కొనాల్సి వస్తుంది కనుక వాళ్ల జేబులకు చిల్లులు పడుతాయి. అమెరికా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగి ఉంది, అక్కడి వినియోగదారులకు ఆదాయం ఎక్కువ. అలా చూసినా భారత వినియోగదారులే ఎక్కువ నష్ట పోవాల్సి వస్తోంది. స్వేచ్ఛా వాణిజ్యం పేరిట ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల మధ్య ఇలా ఇచ్చి పుచ్చుకునే రాయతీలు కొనసాగడం వల్లనే గత 30 ఏళ్లల్లో ప్రపంచ స్థూల ఉత్పత్తి రేటు ఊహించనంతగా పెరిగిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. -
మా సుంకాలు తక్కువే...!
న్యూఢిల్లీ: భారత్ భారీగా దిగుమతి సుంకాలు విధిస్తోందన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపణలను కేంద్రం తోసిపుచ్చింది. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) నిబంధనలకు అనుగుణంగానే భారత్ సుంకాలు ఉంటున్నాయని స్పష్టం చేసింది. ‘అధిక టారిఫ్‌లు విధిస్తున్నామన్న ఆరోపణలను అంగీకరించబోము. దిగుమతి సుంకాలు డబ్ల్యూటీవో నిర్దేశిత శ్రేణిలోనే ఉన్నాయి. కొన్ని వర్ధమాన దేశాలు, సంపన్న ఎకానమీల స్థాయిలోనే ఉన్నాయి‘ అని కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి అనూప్ వాధ్వాన్ మంగళవారమిక్కడ విలేకరులకు చెప్పారు. అదే సమయంలో ఏవో కొన్ని ఉత్పత్తులపై మాత్రమే కొంత అధిక టారిఫ్‌లు ఉండొచ్చని, అయితే అన్ని దేశాల్లోనూ ఇలాంటివి సాధారణమేనని వాణిజ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. హార్లే డేవిడ్సన్ బైక్స్ వంటి అమెరికన్ ఉత్పత్తులపై భారీగా దిగుమతి సుంకాలు విధిస్తున్న భారత్ .. ఒకరకంగా ’టారిఫ్‌ల రాజా’ అంటూ ట్రంప్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అనూప్ వాధ్వాన్ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. జీఎస్పీ ప్రయోజనాలు కొంతే.. వాణిజ్యంలో భారత్‌కి ఇస్తున్న ప్రాధాన్యతాపరమైన ప్రయోజనాలను ఉపసంహరించాలన్న అమెరికా ప్రతిపాదనతో ఎగుమతులపై పెద్దగా ప్రభావమేమీ ఉండబోదని అనూప్ వాధ్వాన్ వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించి సాధారణ ప్రాధాన్య వ్యవస్థ (జీఎస్పీ) కింద భారత్ గతేడాది 5.6 బిలియన్ డాలర్ల మేర ఎగుమతులు చేసినప్పటికీ, ప్రాధాన్యతా హోదాపరంగా ఒనగూరిన ప్రయోజనాలు సుమారు 190 మిలియన్ డాలర్లు మాత్రమేనని ఆయన∙చెప్పారు. అమెరికా కోరుతున్న మేరకు విస్తృతమైన వాణిజ్య ప్యాకేజీపై భారత్ కసరత్తు చేస్తున్నప్పటికీ.. ఆ దేశం జీఎస్పీని ఉపసంహరించాలని నిర్ణయించుకుందని అనూప్ చెప్పారు. ఈ ప్యాకేజీలో మెడికల్ డివైజ్‌లు, డెయిరీ ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తులు మొదలైనవన్నీ ఉన్నాయన్నారు. అమెరికా డిమాండ్లపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని, అయితే ప్రజా ఆరోగ్యంతో ముడిపడి ఉన్న విషయాల్లో మాత్రం రాజీపడే ప్రసక్తే లేదని అనూప్ వాధ్వాన్ స్పష్టం చేశారు. ఆయా రంగాలకు ప్రభుత్వం తోడ్పాటునివ్వాలి: ఎఫ్ఐఈవో జీఎస్పీ ప్రయోజనాలు ఒక్క శాతం నుంచి ఆరు శాతం శ్రేణిలోనే ఉంటున్నాయని, దీన్ని తొలగించినంత మాత్రాన ఎగుమతులపై పెద్దగా ప్రతికూల ప్రభావమేమీ పడదని ఎగుమతి సంస్థల సమాఖ్య (ఎఫ్ఐఈవో) వ్యాఖ్యానించింది. అయితే, కొంత అధిక ప్రయోజనాలు పొందుతున్న రంగాలకు ఒకవేళ జీఎస్పీ తొలగించిన పక్షంలో ప్రభుత్వం కొంత మేర తోడ్పాటునివ్వాలని ఎఫ్ఐఈవో ప్రెసిడెంట్ గణేష్ కుమార్ గుప్తా చెప్పారు. బిల్డింగ్ మెటీరియల్, టైల్స్, చేతి పనిముట్లు (స్పానర్లు, డ్రిల్లింగ్ పరికరాలు), ఇంజనీరింగ్ ఉత్పత్తులు, టర్బైన్స్, సైకిళ్లు మొదలైన ఉత్పత్తుల ఎగుమతులకు జీఎస్పీపరమైన ప్రయోజనాలు ఉంటున్నాయి. మినహాయింపులు ఎత్తివేస్తే.. వాటి ధరలు పెంచాల్సి రావడం వల్ల దేశీ సంస్థలు అంతర్జాతీయంగా పోటీపడలేని పరిస్థితి నెలకొంటుందని గుప్తా చెప్పారు. తగ్గుతున్న వాణిజ్య లోటు.. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2016–17లో 64.5 బిలియన్ డాలర్లుగా ఉండగా.. 2017–18లో 74.5 బి. డాలర్ల స్థాయికి చేరింది. అమెరికా నుంచి చమురు, గ్యాస్, బొగ్గు తదితర ఉత్పత్తుల కొనుగోళ్లను పెంచిన నేపథ్యంలో భారత్‌తో అగ్రరాజ్యం వాణిజ్య లోటు 2017, 2018లో గణనీయంగా తగ్గినట్లు కేంద్ర వాణిజ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ‘గతేడాది వాణిజ్య లోటు పరిమాణం దాదాపు 4 బి. డాలర్లు తగ్గింది. భారత్‌లో ఇంధనానికి, పౌర విమానాలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఇది మరింతగా తగ్గుతుంది. అమెజాన్, ఉబెర్, గూగుల్, ఫేస్బుక్ వంటి అమెరికన్ ఈ–కామర్స్, సర్వీసుల కంపెనీలు భారత మార్కెట్లో భారీగా అవకాశాలు అందిపుచ్చుకుంటున్నాయి‘ అని పేర్కొంది. ఇక, కొన్ని ఐటీ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు తగ్గించాలన్న అమెరికా డిమాండ్‌పై స్పందిస్తూ.. ప్రస్తుతం టారిఫ్‌లు ఒక మోస్తరు స్థాయిలోనే ఉన్నాయని, దిగుమతులను నిలిపివేసేంత భారీగా లేవని స్పష్టం చేసింది. జీఎస్పీ వివాదమిదీ.. జీఎస్పీ కింద వాణిజ్యానికి సంబంధించి అమెరికా ప్రాధాన్యమిస్తున్న వర్ధమాన దేశాల్లో భారత్ కూడా ఒకటి. దీని కింద అమెరికా మార్కెట్లోకి ఎలాంటి సుంకాలు లేకుండా కొన్ని ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు భారత్‌కు వీలు ఉంటోంది. సాధారణంగా 3,700 ఉత్పత్తులకు జీఎస్పీ ప్రయోజనాలు పొందే అవకాశం ఉన్నప్పటికీ.. భారత్ 1,900 ఉత్పత్తులు (రసాయనాలు మొదలైనవి) మాత్రమే ఎగుమతి చేస్తోంది. అయితే, జీఎస్పీ హోదా ఇస్తున్నప్పటికీ.. ప్రతిగా భారత మార్కెట్లో తమకు సముచిత, సమానమైన అవకాశాలు లభించడం లేదంటూ అమెరికా భావిస్తోంది. దేశీయంగా స్టెంట్లు మొదలైన మెడికల్ డివైజ్‌ల రేట్లు భారీగా ఉండటంతో.. ధరలపై పరిమితులు విధించాలన్న భారత నిర్ణయంపై అమెరికన్ కంపెనీలు అభ్యంతరాలు వ్యక్తం చేయడం వంటివి దీనికి కారణం. డెయిరీ, మెడికల్ డివైజ్‌ల తయారీ సంస్థల నుంచి ఫిర్యాదులు రావడంతో .. భారత్‌కి ఇస్తున్న జీఎస్పీ ప్రయోజనాలపై 2018 ఏప్రిల్‌లో అమెరికా పునఃసమీక్ష ప్రారంభించింది. ఆ తర్వాత సమీక్ష పరిధిలోకి ఐటీ ఉత్పత్తులు, వ్యవసాయోత్పత్తులు మొదలైన వాటన్నింటినీ చేర్చింది. చివరికి భారత్‌కి ఇస్తున్న జీఎస్పీని ఉపసంహరించాలని అమెరికా నిర్ణయించింది. భారత్‌తో పాటు టర్కీకి కూడా దీన్ని వర్తింపచేయాలని నిర్ణయం తీసుకుంది. అమెరికన్ కాంగ్రెస్, భారత ప్రభుత్వం నోటిఫికేషన్స్ ఇచ్చిన తర్వాత 60 రోజుల్లో అమల్లోకి రావొచ్చని అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం యూఎస్టీఆర్వో) వెల్లడించింది. -
ప్రాధాన్యహోదా తొలగిస్తాం
వాషింగ్టన్/న్యూఢిల్లీ: భారత్‌కు వాణిజ్య ప్రాధాన్య హోదా (జీఎస్పీ)ను త్వరలో తొలగించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌కు లేఖ అందజేశారు. అమెరికా కాంగ్రెస్, భారత ప్రభుత్వానికి దీనిపై నోటిఫికేషన్ ఇచ్చిన 60 రోజుల్లో అమల్లోకి వస్తుంది. ట్రంప్ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపనుందనే విషయం ఇప్పుడు భారత్‌లో చర్చనీయాంశమైంది. అమెరికాకు మన దేశం ఎలాంటి సుంకం చెల్లించకుండా ఏడాదికి రూ.39 వేల కోట్ల విలువైన వస్తువుల్ని ఎగుమతి చేస్తోంది. జీఎస్పీ హోదా తొలగిస్తే మనం ఆ వస్తువుల ఎగుమతికి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అమెరికా వాణిజ్య లోటును తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా ట్రంప్ భారత్ వస్తువులపై సుంకాలు విధిస్తామని గతంలో పలుమార్లు హెచ్చరించారు. ఇప్పుడు ఏకంగా వాణిజ్య ప్రాధాన్య హోదాను తొలగించడానికే సిద్ధమయ్యారు. అయితే, దీని వల్ల మనకు వచ్చిన నష్టమేమీ లేదని వాణిజ్య శాఖ కార్యదర్శి అనూప్ వాద్వాన్ అంటున్నారు. జీఎస్పీ కింద భారత్ రూ.39 వేల కోట్ల విలువైన వస్తువుల్ని ఎగుమతి చేస్తే, ఏడాదికి సుమారు రూ.13 వేల కోట్ల ప్రయోజనం కలుగుతోందని ఆయన చెప్పారు. హోదా తొలగింపు రెండు దేశాల మధ్య వాణిజ్య సంబం«ధాలపై కూడా పెద్దగా ప్రభావం చూపించదని అనూప్ అభిప్రాయపడ్డారు. ఏమిటీ వాణిజ్య ప్రాధాన్య హోదా? అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వాణిజ్య కార్యకలాపాలను ప్రోత్సహించడం కోసం జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ (జీఎస్పీ)ను 1976లో అమెరికా రూపొందించింది. దీని ప్రకారం 129 అభివృద్ధి చెందుతున్న దేశాలను గుర్తించి ఆయా దేశాల నుంచి ఎగుమతి అయ్యే 4,800 రకాల ఉత్పత్తులకు సుంకాలు విధించరాదని నిర్ణయించింది. 1974 వాణిజ్య చట్టం విధివిధానాలకు అనుగుణంగా 1976లో ఈ వాణిజ్య హోదాను ప్రవేశపెట్టింది. ఈ హోదా ద్వారా ఎక్కువ లబ్ధి పొందిన దేశాల్లో భారత్ కూడా ఒకటి. ప్రస్తుతం ప్రతీ ఏడాది 2 వేల రకాల వస్తువుల్ని మనం ఎలాంటి పన్నులు లేకుండా అమెరికాకు ఎగుమతి చేస్తున్నాం. అమెరికా విధివిధానాల ప్రకారం వాణిజ్య హోదా అనుభవిస్తున్న దేశం తమ దేశీయ మార్కెట్లలో అమెరికా సులభంగా ప్రవేశించడానికి కూడా వీలు కల్పించాలి. కానీ, భారత్ అలాంటి సూత్రాలు పాటించకుండా అమెరికా ఎగుమతులపై అధికంగా పన్నులు విధిస్తోందని ట్రంప్ అధ్యక్షుడయ్యాక ఆరోపణలు చేస్తున్నారు. కొన్నిటి ధరల నియంత్రణ ఎత్తేయాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. -
సుంకాల బాదుడు
దాదాపు ఏడాదిన్నర నుంచి భారత్–అమెరికాల మధ్య సాగుతున్న సుంకాల వివాదంలో మంగళ వారం కీలక పరిణామం చోటుచేసుకుంది. దాదాపు 50 ఏళ్లుగా మన దేశానికి సాధారణ ప్రాధాన్య తల వ్యవస్థ(జీఎస్పీ)కింద కల్పిస్తున్న వెసులుబాట్లను రద్దు చేయాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రతినిధుల సభకు లేఖ రాశారు. తన మార్కెట్లలో అమెరికాకు సమానమైన, సహేతుకమైన ప్రాధాన్యతనివ్వడానికి భారత్ ముందుకు రాకపోవడం వల్ల ఈ చర్య తీసుకోవాలని ట్రంప్ కోరారు. కానీ మన దేశం వాదన వేరేలా ఉంది. మనం విధిస్తున్న దిగుమతి సుంకాలు ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) నిబంధనలకు లోబడే ఉన్నాయని చెబుతున్నది. వాస్తవానికి ఈ విషయంలో తనకేమైనా ఫిర్యాదులుంటే అమెరికా డబ్యూటీఓలో తేల్చుకోవాలి. కానీ అక్కడికెళ్తే తమ వాదన వీగిపోతుందన్న భయంతో కావొచ్చు... అమెరికా ఇలా సొంత నిర్ణయాలు తీసుకుం టోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం జరిగినప్పుడే ప్రపంచ దేశాల చేతుల్లో అమెరికా ఎలా మోసపోతున్నదో, ఎంత నష్టపోతున్నదో ట్రంప్ ఏకరువు పెట్టేవారు. తాను అధ్యక్ష పీఠం అధిష్టిం చిన వెంటనే దీన్నంతటినీ సరిచేస్తానని చెప్పేవారు. ఏడాదిన్నరగా ట్రంప్ ఈ సుంకాల రణం తీవ్రతను పెంచారు. నిరుడు చైనాపైనా, 28 సభ్య దేశాలున్న యూరప్ యూనియన్(ఈయూ) పైనా ట్రంప్ అదనపు సుంకాలు విధించగా... దానికి ప్రతీకారంగా అటు చైనా, ఇటు ఈయూ కూడా అమెరికాకు అదే భాషలో జవాబిచ్చాయి. నిరుడు జూన్‌లో మనం ఎగుమతి చేసే ఉక్కుపై 25 శాతం, అల్యూమినియం ఉత్పత్తులపై 10 శాతం చొప్పున అమెరికా సుంకాలు పెంచిన ప్పుడు...ఆ వెంటనే మన దేశం కూడా అమెరికా నుంచి వచ్చే పప్పులు, ఇనుము, ఉక్కు, యాపిల్స్ తదితర 29 ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు పెంచుతామని ప్రకటించింది. కానీ అలా ప్రకటించ డమే తప్ప మన దేశం ఇంతవరకూ ఆ నిర్ణయాన్ని అమలు చేయలేదు. సుంకాలు పెంచే నోటిఫికే షన్ అమలును తరచు వాయిదా వేస్తూ పోతోంది. గత నెలాఖరునే ఈ నిర్ణయం మరోసారి వాయిదా పడింది. అయినా అమెరికా ఎక్కడా సంతృప్తి పడింది లేదు. మన ఉక్కు, అల్యూమి నియం ఉత్పత్తులపై ఆ దేశం పెంచిన సుంకాల అమలు అప్పట్లోనే మొదలైంది. ఇప్పుడు తాజా ప్రతిపాదన సైతం రేపో మాపో అమల్లోకి రావడం ఖాయం. స్వేచ్ఛా వాణిజ్యం పేరిట, ప్రపంచీ కరణ పేరిట ప్రపంచ దేశాలను నయానా భయానా లొంగదీసుకున్న అమెరికా నుంచి ఇలాంటి పరిణామాలను ఎవరూ ఊహించరు. కానీ డోనాల్డ్ ట్రంప్ వచ్చాక ఇది రివాజుగా మారిపోయింది. ఇప్పుడు జీఎస్పీ కింద భారత్‌కు కల్పిస్తున్న వెసులుబాట్లు రద్దు చేయాలన్న ట్రంప్ సూచన అమల్లోకొస్తే మన దేశం నుంచి అక్కడి మార్కెట్‌కు ఎగుమతయ్యే దుస్తులు, యంత్ర పరికరాలు, ఇతర వస్తువులు వేరే దేశాల ఉత్పత్తుల నుంచి గట్టి పోటీ ఎదుర్కొనవలసి ఉంటుంది. మన దేశం నుంచి అమెరికాకు ఎగుమతయ్యే సరుకుల్లో దాదాపు 12 శాతం ఈ జీఎస్పీ కిందికి వస్తాయి. ఇది దాదాపు 560 కోట్ల డాలర్లు ఉండొచ్చునని అమెరికా అంచనా వేస్తుంటే...మన అధికారులు మాత్రం 19 కోట్ల డాలర్లు మించదని చెబుతున్నారు. మన దేశానికి నష్టం కలిగించి దారికి తెచ్చుకోవడమే ట్రంప్ నిర్ణయాల సారాంశం గనుక ఇవి ఇంతటితో ఆగవు. అనుకున్న స్థాయిలో భారత్‌కు నష్టం చేకూర్చలేకపోతున్నామనుకుంటే వాటిని మరింత పెంచడానికి ట్రంప్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఇరు దేశాల మధ్యా ద్వైపాక్షిక వాణిజ్య లోటు 2,000 కోట్ల డాలర్లు ఉందని ఆయన ఎప్ప టినుంచో చెబుతున్నారు. దీన్ని గణనీయంగా తగ్గించడమే ధ్యేయమంటున్నారు. ఆయన తాజా నిర్ణయం వెనక అమెరికాకు చెందిన రెండు లాబీలు గట్టిగా పనిచేశాయని కథనాలు వినిపిస్తు న్నాయి. వైద్య పరికరాల పరిశ్రమ, పాడి ఉత్పత్తుల సంఘాలు మన దేశంపై చేస్తున్న ఫిర్యాదుల ఫలితంగానే ట్రంప్ భారత్‌పై తరచు కారాలు మిరియాలూ నూరుతున్నారు. గుండె రక్త నాళాల్లో ఏర్పడే అవరోధాలకు వాడే స్టెంట్లు, మోకాళ్లలో వాడే ఇంప్లాంట్స్ వగైరాల ధరల్ని గణనీయంగా తగ్గించడం అమెరికా వైద్య పరికరాల పరిశ్రమలకు కంటగింపుగా ఉంది. పశువులకు దాణా బదులు మాంసాహారాన్ని అందించి రాబట్టే పాడి ఉత్పత్తుల్ని అనుమతించకూడదని పదేళ్లనాడు మన దేశం విధించిన నిబంధన పాడి పరిశ్రమకు ఆగ్రహం కలిగిస్తోంది. ఈ రెండింటి విషయంలో సడ లింపులు ఇవ్వడానికి మన దేశం నిరాకరించడంతోపాటు అమెజాన్, వాల్‌మార్ట్, ఫ్లిప్‌కార్ట్ తదితర సంస్థల్ని ప్రభావితం చేసే ఈ–కామర్స్ కొత్త నిబంధనలు అమెరికాకు నచ్చడం లేదు. అలాగే మాస్టర్‌కార్డ్, వీసా తదితర సంస్థలు తమ డేటా సర్వర్లను భారత్‌కు తరలించాలని మన ప్రభుత్వం కోరడం ఆ దేశానికి ఆగ్రహం తెప్పిస్తోంది. వెరసి ఇవన్నీ ట్రంప్ తాజా ప్రతిపాదనలకు దారితీశాయి. అయితే ఏ దేశమైనా తనకు అనువైన, లాభదాయకమైన వాణిజ్య విధానాలు రూపొం దించుకుంటుంది. వాటిపై అభ్యంతరాలుంటే తగిన వేదికలపై ఫిర్యాదు చేయాలి తప్ప ఇష్టాను సారం వ్యవహరిస్తానంటే చెల్లదు. 90వ దశకానికి ముందు మన సుంకాలు బాగా అధికంగా ఉండేవి. అయితే ఆర్థిక సంస్కరణలు ప్రారంభమయ్యాక అవి క్రమేపీ తగ్గడం మొదలుపెట్టాయి. 1991–92లో వ్యవసాయేతర ఉత్పత్తులపై అత్యధికంగా 150 శాతంమేర సుంకాలుంటే... అవి 1997–98నాటికి 40 శాతానికి పడిపోయాయి. 2004–05 నాటికి 20 శాతానికి వచ్చాయి. ఆ తర్వాత మరో మూడేళ్లకు 10 శాతానికి చేరుకున్నాయి. వాస్తవానికి డబ్ల్యూటీఓ గణాంకాలనుబట్టి మన సగటు సుంకం 13శాతం మించడం లేదు. అమెరికా ప్రారంభించిన ఈ సుంకాల రణం అనూహ్య పరిణామాలకు దారితీస్తుంది. ప్రభావిత దేశాలు తమ వంతుగా ప్రతీకార చర్యలకు దిగితే అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపుతుంది. కనుక ట్రంప్ విజ్ఞతతో మెలగి సమస్యల్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలి. -
ట్యాక్స్‌మెన్ నుంచి వన్ సొల్యూషన్ జీఎస్టీ సాఫ్ట్వేర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీఎస్టీ సువిధ ప్రొవైడర్లలో (జీఎస్పీ) ఒకటైన ట్యాక్స్‌మెన్ సంస్థ... బుధవారమిక్కడ జీఎస్టీ వన్ సొల్యూషన్ సాఫ్ట్‌వేర్‌ను ఆవిష్కరించింది. దీన్ని కేవలం జీఎస్టీకే కాకుండా.. ఆదాయ పన్ను, టీడీఎస్ సంబంధిత అంశాలన్నింటికీ అనుసంధానించి తయారు చేశామని కంపెనీ సీఈఓ సీఎస్ పీయూష్ కుమార్ చెప్పారు. సాఫ్ట్‌వేర్‌ను మార్కెట్లోకి విడుదల చేసిన సందర్భంగా సంస్థ హెడ్ (గ్రోత్ అండ్ అలయెన్సెస్) అన్‡్ష భార్గవతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ వన్ సొల్యూషన్‌ను చార్టర్డ్ అకౌంటెట్స్, కంపెనీ సెక్రటరీలు, అడ్వకేట్లు, జీఎస్టీ నిపుణులు, ఎస్ఎంఈల కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేశామని, ఏడాదికి గాను రూ.8,500 చార్జీ ఉంటుందని తెలియజేశారు.