సాక్షి, న్యూఢిల్లీ : అమెరికా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే సరకులపై సుంకం మినహాయింపు దేశాల (జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రివరెన్సెస్) జాబితా నుంచి టర్కీతోపాటు భారత్ పేరును కూడా తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ నిర్ణయం వల్ల భారత దేశానికి ఎలాంటి నష్టం ఉంటుంది ? అలాంటి నిర్ణయం భారత్ కూడా తీసుకుంటే ఆ ప్రభావం అమెరికాపై ఎలా ఉంటుంది ? ఈ నిర్ణయాల వల్ల వాస్తవానికి ఎవరు నష్టపోతారు ? ఇరు దేశాల ప్రభుత్వాలా ? లేదా ఇరు దేశాల వినియోగదారుల ? అసలు అమెరికా ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? అందుకు దారి తీసిన పరిస్థితులు ఏమిటీ?
అమెరికా సుంకం మినహాయింపు జాబితా కింద భారత దేశం నుంచి 1500 రకాల సరకుల దిగుమతులపై సుంకం విధించడం లేదు. అంటే ఎలాంటి సుంకం చెల్లించకుండానే భారత వ్యాపారులు ఆ వస్తువులను అమెరికాలో విక్రయించుకోవచ్చు. భారత్ ఎగుమతి చేస్తున్న సరకుల్లో మధుబని ప్రింట్లు, టీ షర్టుల నుంచి ఉక్కు వరకు ఉంది. అయితే ఉక్కుపైన పరిమితి పన్ను ఉంది. ఇందుకు బదులుగా అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న సోయాబిన్, ఆల్మండ్స్ నుంచి ఖరీదైన బైకుల వరకు భారత ప్రభుత్వం పన్ను మినహాయింపులు ఇస్తోంది.
సుంకం మినహాయింపు కింద భారత్ 2017–18 ఆర్థిక సంవత్సరం నుంచి 560 కోట్ల డాలర్ల సరకులను అమెరికాకు ఎగుమతి చేసింది. వీటిపై 19 కోట్ల డాలర్ల సుంకం మినహాయింపు లభించింది. వాస్తవానికి 2017–18, నుంచి 2018–19 ఆర్థిక సంవత్సరాల్లో (2018, డిసెంబర్ వరకు) భారత్ దాదాపు 8,700 కోట్ల డాలర్ల విలువైన సరకులను అమెరికాకు ఎగుమతి చేసింది. దాంతో పోల్చుకుంటే సుంకం మినహాయింపు కింద ఎగుమతి చేసిన సరకుల విలువ చాలా తక్కువ. అమెరికా ఈ రెండు ఆర్థిక సంవత్సరాల్లో భారత్‌కు దిగుమతి చేసిన సరకుల విలువ దాదాపు 5,300 కోట్ల డాలర్ల మాత్రమే.
గత జూన్ నుంచే భారత్ బెదిరింపులు
భారత్ కొత్త సుంకం విధానం కింద అమెరికా నుంచి దిగుమతి చేసుకునే 30 సరకులపై సుంకం మినహాయింపు ఇస్తోంది. వీటిపై కూడా సుంకాలను విధిస్తామని గత జూన్ నెల నుంచే అమెరికాను భారత్ హెచ్చరిస్తూ వస్తోంది. అంతకుముందే అమెరికా నుంచి పాల ఉత్పత్తుల దిగమతిని భారత్ నిషేధించింది. కారణం, అమెరికాలోని ఆవులు మాంసాహారాన్ని తింటాయి కనుక. ఇందుకు ప్రతీకారంగా గుండె రక్తనాళాల్లో అమర్చే స్టెంటుల దిగుమతిపై టారిఫ్‌లను పెంచుతామని అమెరికా హెచ్చరించింది. టారిఫ్‌లు తక్కువగా ఉండడం వల్లనే మోదీ ప్రభుత్వం స్టెంట్‌ల ధరలపై నియంత్రణ ధరలను తీసుకొచ్చింది. అయితే అమెరికా ఇప్పటి వరకు వీటిపై సుంకం టారిఫ్‌లను పెంచలేదు. 800 సీసీ పైనున్న టూ వీలర్స్, ముఖ్యంగా హార్లీ డేవిడ్సన్ వాహనాలపై భారత్ అధిక సుంకం విధించడం పట్ల ట్రంప్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేయడంతో భారత్ వాటిని తగ్గించింది.
ఈ-వాణిజ్యంలో కూడా
ఇరు దేశాల మధ్య మినహాయింపులు కేవలం సరకుల ఎగుమతులు, దిగుమతులకే పరిమితం కాలేదు. ఈ-వాణిజ్యంలో కూడా మినహాయింపులు ఉన్నాయి. అమెరికాలో ఈ-వాణిజ్య నిబంధనలను సవరించిన కారణంగానే అమెజాన్, వాల్‌మార్ట్ కంపెనీలు భారత్‌లో రిటేల్ వ్యాపారాన్ని నిర్వహించ కలుగుతున్నాయి. అయితే ఇలాంటి విదేశీ సంస్థలపై భారత్ ఆంక్షలు విధించింది. విదేశీ ఈ రిటేలర్లు ‘ఇన్వెంటరీ మోడల్’ లో సరకులను అమ్మరాదు. అంటే ముందుగా ఆర్డర్లు తీసుకొని వాటిని ఉత్పత్తి చేసి ఆ తర్వాత సరఫరా చేయడం చేయరాదు. రెడీగా ఉన్న సరకులను అమ్మాలి. రిలయెన్స్ లాంటి భారతీయ రిటేలర్స్ రెడీగా ఉన్న ఉత్పత్తులను అమ్మవచ్చు. ఇన్వెంటరీ పద్ధతిలో సరకులను సరఫరా చేయవచ్చు. భారత్ తాము ఎగుమతి చేస్తున్న ఉక్కుపై మరింత టారిఫ్‌ను తగ్గించాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోంది. ఇలా దేశాల మధ్య మార్కెట్ యుద్ధం ఎంతో కాలం నుంచి నడుస్తోంది.
మనకే నష్టం ఎక్కువ
అమెరికా ఎలాగు నిర్ణయం తీసుకున్నది కనుక, అలాంటి నిర్ణయం భారత్‌కూడా తీసుకొని అమెరికా దిగుమతి ఉత్పత్తులపై సుంకం విధించాల్సి వస్తుంది. మనమే అమెరికాతో ఎక్కువ ఎగుమతి వ్యాపారం చేస్తున్నాం కనుక మనమే ఎక్కువ నష్టపోవాల్సి వస్తోంది. ముఖ్యంగా స్టీల్ ఎగుమతి పడిపోయే ప్రమాదం ఉంది. పరస్పర సుంకాల వల్ల ప్రభుత్వ ఖజానాలకు పెద్ద నష్టం వాటిల్లక పోవచ్చు. కానీ వినియోగదారులు ఎక్కువ ధరలు పెట్టి సరకులను కొనాల్సి వస్తుంది కనుక వాళ్ల జేబులకు చిల్లులు పడుతాయి. అమెరికా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగి ఉంది, అక్కడి వినియోగదారులకు ఆదాయం ఎక్కువ. అలా చూసినా భారత వినియోగదారులే ఎక్కువ నష్ట పోవాల్సి వస్తోంది.
స్వేచ్ఛా వాణిజ్యం పేరిట ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల మధ్య ఇలా ఇచ్చి పుచ్చుకునే రాయతీలు కొనసాగడం వల్లనే గత 30 ఏళ్లల్లో ప్రపంచ స్థూల ఉత్పత్తి రేటు ఊహించనంతగా పెరిగిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment