ఆమ్‌స్టర్‌డ్యామ్ : మంచి మార్కులు రాలేదనో.. కోరుకున్న కాలేజిలో సీటు రాదనో.. అమ్మ మందలించిందనో.. నాన్న కోప్పడ్డాడనో కారణాలేవైనా సరే.. క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుంటోంది నేటి యువత. అందరు ఇలానే ఉన్నారని చెప్పలేము. కానీ చాలా దేశాల్లో యువత మాత్రం ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొంటున్నారు. అయితే ఈ విషయం గురించి అధ్యాయనం చేసిన కొన్ని సంస్థలు మాత్రం నేటి యువతకు తగిన దేశం నెదర్లాండ్ అని ముక్త కంఠంతో తేల్చేశాయి.
ఎందుకంటే నెదర్లాండ్ యువత తమ టీనేజ్‌ను చాలా సంతోషకరమైన పరిస్థితులు మధ్య గడుపుతున్నట్లు ఈ సర్వేలో తెలిసింది. ప్రపంచ సంపన్న దేశాల్లో సంతోషం, ఆరోగ్యం, మంచి విద్య వంటి పలు అంశాల గురించి చేసిన సర్వేలో నెదర్లాండ్ మిగతా దేశాలను వెనక్కి నెట్టి ప్రథమ స్థానంలో ఉన్నట్లు సర్వేలు తెలిపాయి.
యూనిసెఫ్ సర్వేలోనూ ప్రథమం...
ఐక్యరాజ్యసమితి ముఖ్య విభాగం యూనిసెఫ్ 2017 సంవత్సరానికి గాను నిర్వహించిన సంతోషకరమైన దేశాల సర్వేలో నెదర్లాండ్ ప్రథమ స్థానంలో నిలిచింది. అంతేకాక మరో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే ప్రపంచ వ్యాప్తంగా ఆడపిల్లల పట్ల హింస పెరిగిపోతున్న ఈ కాలంలో, నెదర్లాండ్ ఆడపిల్లలు మాత్రం చాలా అంటే చాలా తక్కువ శాతం మంది మాత్రమే ఏవో చిన్న చిన్న విషయాల్లో మాత్రమే బాధపడినట్లు సర్వేలో తెలిసింది.
అలానే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు విడుదల చేసిన సర్వేలో స్థూలకాయం బారిన పడుతున్న వారి సంఖ్య మిగతా సంపన్న దేశాలతో పోలిస్తే నెదర్లాండ్‌లో చాలా తక్కువగా ఉన్నట్లు గుర్తించింది.
అసలు రహస్యం ఇదే...
నెదర్లాండ్ దేశ ప్రజలు ఇంత సంతోషంగా ఉండటానికి కారణం వారి పని వేళలు అంటున్నారు నిపుణులు. డచ్ ప్రజలు(నెదర్లాండ్ ప్రజలనే డచ్ ప్రజలు అంటారు) రోజులో 16 గంటల సమయాన్ని తినడం, నిద్రపోవడం, కుటుంబంతో గడపడం వంటి వాటికే కేటాయిస్తారు. వారంలో కేవలం 30.3 గంటలు మాత్రమే పనిచేస్తారు. కేవలం 0.5శాతం మంది మాత్రమే ఎక్కువ గంటలు పనిచేస్తారని నివేదికలు తెలుపుతున్నాయి.
నెదర్లాండ్ ప్రజలు కుటుంబ సభ్యులతో గడపడానికి ఎక్కువ ఇష్ట పడతారు. దాంతో అక్కడి యువత తల్లిదండ్రులతో చాలా మంచి అనుబంధాన్ని కల్గి ఉంటారు. వారి తల్లిదండ్రులతో అన్ని విషయాలు చర్చిస్తారని నివేదికలు తెలుపుతున్నాయి. ఇవే డచ్ యువత సంతోషానికి ప్రధాన కారణమంటున్నాయి సర్వేలు.
Comments
Please login to add a commentAdd a comment