న్యూఢిల్లీ : భారత్‌లోని తమ రాయబారులు వేధింపులకు గురవుతున్నారంటూ ఆరోపించిన పాకిస్తాన్.. ఇందుకు నిరసనగా న్యూఢిల్లీలో జరగబోయే ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీవో) సమావేశాలకు హాజరుకావడం లేదని స్పష్టం చేసింది. భారత్, పాకిస్థాన్ మధ్య గత కొన్ని రోజులుగా దౌత్యపరమైన ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే.
ఈ మేరకు ఆ దేశ దౌత్య వర్గాలు భారత్‌కు సమాచారం అందించాయి. ఈ నెల 19, 20 తేదీల్లో న్యూఢిల్లీ వేదికగా డబ్ల్యూటీవో సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి హాజరుకావాలని పాక్ వాణిజ్య శాఖ మంత్రి పర్వేజ్ మాలిక్‌కు గత నెలలో భారత్ ఆహ్వానం పంపింది. సదస్సుకు రాకూడదని పాక్ చివరి నిమిషంలో నిర్ణయం తీసుకుందని.. దీనిపై తాము స్పందించబోమని భారత అధికారులు చెబుతున్నారు.
భారత్‌లో తాము వేధింపులకు గురవుతున్నామంటూ పాకిస్తాన్ హైకమిషన్ సిబ్బంది ఫిర్యాదు చేశారు. పాకిస్తాన్ మీడియాలో కథనాల ద్వారా ఈ విషయం బయటపడింది. వెంటనే స్పందించిన భారత్ దీనిపై విచారణ చేపడుతామని హామీ ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment