డబ్ల్యూటీవో కంటే హానికరం
అభిప్రాయం
‘రెండు దశాబ్దాల క్రితం 1995 జనవరి 1న ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) ఏర్పడినప్పుడు రైతు సంఘాలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున నిర సన తెలిపాయి, ఉద్యమాలు చేసాయి. పూర్తిగా దానిని ఆపలేకపోయినా, కొంతవరకు దానిలోని ప్రజా వ్యతిరేక అంశాలను అడ్డుకోగలిగాయి. అయినా దాని దుష్ప్రభావాలు మనం ఇప్పటిదాకా చూస్తున్నాము. అయితే ఇప్పుడు డబ్ల్యూటీవో కంటే ప్రమాదకరంగా ఉన్న స్వేచ్ఛావాణిజ్య ఒప్పందాలు వస్తున్నాయి. అటువంటిదే ‘‘ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం’’ (ఆర్‌సీఈపీ) పేరుతో వస్తున్న ఈ ఒప్పందం.
ఆర్‌సీఈపీ అనేది 16 దేశాల మధ్య జరుగుతున్న స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం. దీనిలో భారత్‌తోపాటు చైనా, జపాన్, దక్షిణ కొరియాలు, సంపన్న దేశాలైన ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, ఆగ్నేయ ఆసియాలోని సింగపూరు, మలేషియావంటి పది దేశాలు ఉన్నాయి. హైదరాబాద్‌లోనే 16 దేశాల ప్రభుత్వ ప్రతినిధులు జూలై 24 నుంచి 28 దాకా ఆర్‌సీఈపీ ఒప్పందంపై చర్చించి తుది మెరుగులు దిద్దడానికి భేటీ అవుతున్నారు.
వ్యవసాయం, విత్తన రంగంపై ప్రభావం: వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులపై ఆంక్షలు, దిగుమతి సుంకాలు పూర్తిగా తీసి వేయాలన్నది ఆర్‌సీఈపీ లక్ష్యం. ప్రస్తుతం వ్యవసాయ ఉత్పత్తులపై సగటు దిగుమతి సుంకం 32.7% ఉంది. ఈ ఒప్పందం అమల్లోకి వస్తే అది ఒకేసారిగా సున్నాకి వచ్చేస్తుంది. ఇప్పటికే డబ్ల్యూటీఓ, ఆగ్నేయాసియా దేశాల సంస్థ (ఆసియాన్) సభ్య దేశాలతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాల వలన అనేక పంటల విషయంలో రైతులు దెబ్బ తిన్నారు. చవక పామోలీన్ దిగుమతితో వేరుశనగ, కొబ్బరి, ఇతర నూనె గింజల పంటల మార్కెట్ పూర్తిగా దెబ్బతిన్నది. అలాగే గతేడాది కంది దిగుమతి వలన నవంబర్‌లో కందుల ధర క్వింటాలుకి రూ. 9,000 నుంచి రూ. 4,000 వరకు పడిపోవడంతో రైతులు విపరీతంగా నష్టపోయారు.
దేశమంతా రైతులు పంటలకు గిట్టుబాటు ధరలు కావాలని ఉద్యమాలు చేస్తుండగా, సరైన ఆదాయం లేక ఆత్మహత్యలు చేసుకుంటుండగా, పంట ధరలను మరింత దెబ్బతీసే ఇటువంటి ఒప్పందాలను ముందుకి తీసుకు వెళ్ళడం దారుణం. అంతే కాదు, మన ప్రభుత్వం వరి, గోధుమ వంటి పంటలను సేకరించినప్పుడు మన రైతులు మాత్రమే గాక విదేశీ కంపెనీల వద్ద నుంచి కూడా సేకరించాలన్న ఆంక్షలు దీనిలో ఉన్నాయి. ఆర్‌సీఈపీ ఒప్పం దంలో విత్తనాలపై పేటెంట్లు తీసుకు రావాలన్న ఒత్తిడి ఉంది. ఇది విత్తన రంగంలో పూర్తి కార్పొరేటీకరణకు దారి తీస్తుంది.
పశు సంరక్షణ, పాల ఉత్పత్తిపై దెబ్బ: ఆస్ట్రేలియా, న్యూజీ లాండ్ దేశాలు అత్యధికంగా పాల ఉత్పత్తి చేసే దేశాలు. తమ అవసరాల కంటే 500 శాతం అధిక ఉత్పత్తి ఆ దేశాలలో ఉంది. వాటిని తక్కువ ధరకు మన దేశంలో దిగుమతి చేస్తే ఇక్కడి ఉత్పత్తి పూర్తిగా దెబ్బ తింటుంది. మన దేశంలో చిన్న రైతులు, ముఖ్యంగా మహిళా రైతులకి పాల ఉత్పత్తి ముఖ్య ఆదాయం ఇలాంటి 1.5 కోట్ల కుటుంబాల జీవనోపాధిపై పెద్దదెబ్బ తగిలే ప్రమాదం ఉంది.
కార్మికుల హక్కులు, పారిశ్రామిక రంగం: చవక దిగుమతుల వలన మన పారిశ్రామిక రంగం కూడా దెబ్బ తింటుంది. ఇప్పటికే ప్రతి రోడ్డు మీదా చైనా బొమ్మలే. మన దేశంలో బొమ్మల తయారీ పరిశ్రమ నాశనమై పోయింది. ఆర్‌సీఈపీ వస్తే ఉక్కు, యంత్ర పరిశ్రమలలో ఉత్పత్తి, ఉద్యోగాలు తగ్గిపోతాయి. వస్త్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, పింగాణీ పరిశ్రమలపై ప్రభావం ఉంటుంది.
మందుల ధరలు ఆకాశానికి : మన దేశం జనరిక్ మందుల తయారీకి పుట్టినిల్లు. అంటే ఒక మందుపై పేటెంట్ ఉన్న కంపెనీ మాత్రమే కాకుండా ఇతర కంపెనీలు కూడా తయారు చేయడానికి వెసులుబాటు ఉంది. ఎయిడ్స్ రోగులు విదేశీ కంపెనీల మందులు వాడుతున్నప్పుడు నెలకు లక్షన్నర రూపాయలు ఖర్చు అయ్యేది, అది జనరిక్ మందుల వలన ఒక్కసారిగా నెలకు రూ.800 లకు తగ్గిపోయింది. క్యాన్సర్, హెపటైటిస్, టీబీ వంటి రోగాలకు సంబంధించి విదేశీ కంపెనీల మందులకు, మన మందులకు వందల రెట్లు తేడా ఉంది. ఈ ఒప్పందంలో విదేశీ కంపెనీల పేటెంట్ హక్కులను కాపాడే పేరుతో జనరిక్ మందుల తయారీపై వేటు పడనుంది. మందుల ధరలు కొండెక్కుతాయి.
ఒప్పందాలకు బ్రేక్ వేయాలి, విస్తృతంగా చర్చించాలి: ఇటువంటి ఒప్పందాల వివరాలను బయట పెట్టకుండా, పార్లమెంట్లో కూడా చర్చించకుండా భారత ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. కాబట్టి రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు అందరూ కలిసి ప్రతిఘటించడానికి ముందుకు రావడం ఆశాజనకం. ఈ స్వేచ్ఛావాణిజ్య ఒప్పందాలపై విస్తృత చర్చ అవసరం.
విదేశీ కంపెనీలకు పూర్తి స్వేచ్ఛనివ్వడం, మన ప్రజల హక్కులను, ప్రభుత్వాలను కట్టడి చెయ్యడం–ఇదే స్వేచ్ఛావాణిజ్య ఒప్పందాల సారాంశం. భారత ప్రభుత్వం ఈ అంశాలను పార్లమెంట్‌లోనూ, ప్రజాసంఘాలతోనూ చర్చించకుండా ఏ మాత్రం ముందుకు వెళ్లకూడదు.
(ఆర్‌సీఈపీ స్వేచ్ఛావాణిజ్య ఒప్పందాలపై సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జూలై 23న విస్తృత ప్రజా సదస్సు, జూలై 24న నిరసన కార్యక్రమాలు జరుగుతాయి) వ్యాసకర్త రైతు స్వరాజ్య వేదిక బాధ్యుడు ‘ 97017 05743
-విస్సా కిరణ్ కుమార్