సాక్షి, హైదరాబాద్: ఐటీ, పారిశ్రామిక రంగాల్లో అంతర్జాతీయ ఖ్యాతిని పొందిన హైదరాబాద్ నగరం మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సదస్సుకు వేదిక కానుంది. ఈ ఏడాది అక్టోబర్ 11, 12 తేదీల్లో జరిగే ‘వరల్డ్ డిజైన్ అసెంబ్లీ’కి ఆతిథ్యం ఇవ్వనుంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో రెండు రోజులపాటు జరిగే ఈ సదస్సు ద్వారా పారిశ్రామిక డిజైనింగ్ రంగంలో సృజనాత్మకత పెరుగుతుందని భావిస్తున్నారు. ప్రపంచస్థాయి సదస్సు నిర్వహణ ద్వారా తెలంగాణ ప్రతిష్ట మరింత ఇనుమడిస్తుందని టీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లో హర్షం వ్యక్తం చేశారు. 31వ ద్వైవార్షిక వరల్డ్ డిజైన్ అసెంబ్లీని హైదరాబాద్‌లో నిర్వహిస్తామని గతేడాది జూలైలో వరల్డ్ డిజైన్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూడీఓ) అధ్యక్షులు లూయిసా బొషిటో ప్రకటించారు. వరల్డ్ డిజైన్ అసెంబ్లీ నిర్వహణకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా పలు నగరాల నుంచి బిడ్ లు స్వీకరించారు. అంతర్జాతీయ స్థాయి సదస్సుల నిర్వహణకు ఆయా నగరా ల్లో ఉన్న అనుకూలతలను పరిశీలించిన డబ్ల్యూడీఓ హైదరాబాద్‌ను ఎంపిక చేసింది. ఈ సదస్సు నిర్వహణ తేదీలను కూడా డబ్ల్యూడీఓ ప్రకటించింది.
ఐక్యరాజ్యసమితి లక్ష్యాల మేరకు
ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యానికి అనుగుణంగా 1957లో ఇంటర్నేషనల్ కౌన్సిల్ సొసైటీస్ ఆఫ్ ఇండస్ట్రియల్ డిజైన్ (ఐసీఎస్‌ఐడీ) ఏర్పాటైంది. తొలుత 12 వృత్తి నైపుణ్యం కలిగిన డిజైన్ అసోసియేషన్లతో ఏర్పాటైన ఐసీఎస్‌ఐడీ 2015 అక్టోబర్‌లో వరల్డ్ డిజైన్ ఆర్గనైజేషన్‌గా నామాంతరం చెందింది. ప్రపంచవ్యాప్తంగా 140 డిజైన్ అసోసియేషన్లు డబ్ల్యూడీఓలో సభ్యత్వం కలిగి ఉన్నాయి. పారిశ్రామిక ఉత్పత్తుల తయారీలో సృజనాత్మకతను ప్రోత్సహించడం, నాణ్యమైన ఉత్పత్తులు, సేవలు అందిం చేలా పారిశ్రామిక నమూనాలు తయారు చేయడం తదితరాలు లక్ష్యంగా వరల్డ్ డిజైన్ ఆర్గనైజేషన్ పనిచేస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో ప్రతి రెండేళ్లకోసారి వరల్డ్ డిజైన్ క్యాపిటల్ పేరిట ఒక్కో నగరాన్ని ఎంపి క చేసి సదస్సులు నిర్వహిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment