IT Industry Development
-
బీచ్ ఐటీ @ వైజాగ్ వయా దావోస్
ఆంధ్రప్రదేశ్‌లో అతి పెద్ద నగరమైన విశాఖపట్నం కేంద్రంగా బీచ్ ఐటీని డెవలప్ చేయాలని సీఎం జగన్ కృతనిశ్చయంతో ఉన్నారు. విశాఖపట్నంలో ఉన్న మానవ వనరులు, ఇంటర్నేషన్ ఎయిర్పోర్ట్ ఇతర ఎకో సిస్టమ్‌లు ఇక్కడ త్వరగా ఐటీ రంగం నిలదొక్కుకునేందుకు దోహదం చేస్తాయనే అంచనాలు ఉన్నాయి. వీటికి తోడు ఇక్కడ ఐటీ రంగం మరింత ఆకర్షణీయంగా ఉండేందుకు బీచ్ ఐటీ కాన్సెప్టును జోడించారు. ప్రస్తుతం ఏపీలో రమారమి మూడు వందల ఐటీ కంపెనీలు ఉండగా ఇందులో 80 శాతం కంపెనీలు విశాఖ కేంద్రంగానే తమ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. సంఖ్యా పరంగా ఐటీ కంపెనీలు ఎక్కువగానే ఉన్నట్టు కనిపిస్తున్నా.. దిగ్గజ ఐటీ కంపెనీల కన్ను ఇంకా విశాఖ మీద పడలేదు. దీంతో ఐటీ కంపెనీలకు మరింత ప్రోత్సహాం అందిస్తూనే ఐటీ రంగానికి ఆకర్షణీయమైన డెస్టినేషన్‌గా విశాఖను మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీని కోసం ఇప్పటికే అమెరికాలో సక్సెస్ అయిన బీచ్ ఐటీ మోడల్‌ను పరిశీలిస్తున్నారు. అమెరికాలోని అట్లాంటా తీరంలో ఉన్న వర్జీనియా అందమైన బీచ్‌లకు ప్రసిద్ధి. ఇక్కడ ఐటీ రంగాన్ని ప్రోత్సహించేందుకు అక్కడి ప్రభుత్వం బీచ్ ఐటీ విధానం తీసుకువచ్చింది. అదే తరహాలో విశాఖలోనూ బీచ్ ఐటీని ఏర్పాటు చేసే ఉద్దేశంతో ఉన్నారు. దీని ప్రకారం ఐటీ కంపెనీలు, ఐటీ ఎకోసిస్టమ్‌లో ఉన్న సంస్థలన్నీ విశాఖ సముద్ర తీరంలో కొలువుదీరేలా ప్లాన్ రెడీ చేశారు. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో బీచ్ ఐటీ కాన్సెప్టును వివరించనున్నారు. చదవండి: దావోస్‌లో సీఎం జగన్‌కు ఘన స్వాగతం -
ఐటీ మౌలిక వసతుల కల్పనపై దృష్టి: గౌతమ్‌రెడ్డి
సాక్షి, విజయవాడ: ఐటీ పరిశ్రమ విస్తరణ కోసమే సీఎక్స్ఓ సదస్సు నిర్వహిస్తున్నామని ఐటీ శాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలతో ఐటీ రంగాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు. పాదయాత్రలో సీఎం జగన్ ప్రజల సమస్యలు తెలుసుకున్నారని.. అందుకే నాణ్యమైన విద్య, వైద్యం అందించేలా సంస్కరణలు తెచ్చారన్నారు. విద్యారంగంలో విద్యాకానుక పథకం సహా అనేక పథకాలు తెచ్చారని.. ప్రతి పౌరుడికి నాణ్యమైన విద్య,వైద్యం కోసం పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. వ్యవసాయ అభివృద్ధి, నాణ్యమైన మానవ వనరుల తయారీకి కృషి చేస్తున్నామన్నారు. కోవిడ్ వల్ల తీవ్ర ఇబ్బందులు వచ్చాయని.. అలాంటి సమయంలో ఎంఎస్ఎంఈ పరిశ్రమలను ఏపీ ప్రభుత్వం ఆదుకుందన్నారు. జగనన్న తోడుతో చిన్న వ్యాపారులకు ఉపాధి అవకాశాల కల్పనకు సహకరించామని మంత్రి గౌతమ్‌రెడ్డి తెలిపారు. ప్రతి పథకాన్నినేరుగా లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తోందన్నారు. ప్రభుత్వ నిర్వహణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని, ఐటీ మౌలిక వసతులు కల్పించడంపై దృష్టి పెట్టామని పేర్కొన్నారు. రెండు వేల ఎకరాలలో 3 కాన్సెప్ట్ సిటీలను నిర్మించ బోతున్నామని వెల్లడించారు. ఫైబర్ నెట్ ద్వారా ప్రతి గ్రామానికి 2024 నాటికి ఇంటర్నెట్ అందిస్తామన్నారు. ప్రతి గ్రామంలో డిజిటల్ లైబ్రరీ, డిజిటల్ బ్రాడ్ బ్యాండ్ ఏర్పాటు చేస్తామని మంత్రి గౌతమ్‌రెడ్డి వెల్లడించారు. చదవండి: పాలకులం కాదు.. మనం సేవకులం: సీఎం జగన్ జగనన్నను కలిశాకే.. ఈ కాళ్లకు చెప్పులు -
హైదరాబాద్ నగరం నలువైపులా ఐటీ!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, నానక్‌రాంగూడ వంటి పశ్చిమ ప్రాంతాల్లో మాత్రమే కేంద్రీకృతమై ఉన్న ఐటీ రంగాన్ని నగరం నలువైపులా విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు హైదరాబాద్ గ్రిడ్ (గ్రోత్ ఇన్ డిస్పెర్షన్) పాలసీని తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రకటిస్తూ రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. దాదాపు 30 శాతానికి పైగా ఐటీ నిపుణులు తూర్పు హైదరాబాద్‌లో నివాసముంటూ పశ్చిమ హైదరాబాద్‌కు వెళుతున్నారు. దీనివల్ల వారి ప్రయాణానికి అధిక సమయం పడుతుండటంతోపాటు నగరం ఇరుకుగా మారుతోంది. ఈ నేపథ్యంలో నగరంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న వివిధ పారిశ్రామిక ప్రాంతాలను ఐటీ పార్కులుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్త ఐటీ పార్కులివే.. కూకట్పల్లి, గాంధీనగర్, బాలపూర్, మల్లాపూర్, మౌలాలి, సతన్‌నగర్ ఇండస్ట్రియల్ ఏరియా, ఉప్పల్, నాచారం, పటాన్చెరు (పాక్షికంగా), కాటేదాన్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏరియా, ఏఐఈ రామచంద్రాపురం కలిపి మొత్తం 11 పారిశ్రామిక ప్రాంతాలను ఐటీ పార్కులుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటికి అదనంగా కొంపల్లిలో ఐటీ టవర్ ఏర్పాటు చేయాలని, కొల్లూరు/ఉస్మాన్‌సాగర్‌లో ఐటీ పార్కును నిర్మించనుంది. తొలి విడతగా ఉప్పల్, పోచారం, నాచారం, కొంపల్లి, కొల్లూరు/ఉస్మాన్‌సాగర్, కాటేదాన్, శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో ఐటీ పార్కులను ఏర్పాటు చేస్తారు. కొత్త ఐటీ విధానంలో ఇప్పటికే ఐటీ పరిశ్రమలు ఉన్న పశ్చిమ ప్రాంతాలకు మినహా నగరంలోని మిగిలిన ప్రాంతాల్లో ఏర్పాటయ్యే ఐటీ పరిశ్రమలకు ప్రోత్సాహకాలివ్వనుంది. రాయితీ, ప్రోత్సాహకాలు ఇవీ.. – కమర్షియల్ కేటగిరీ నుంచి పారిశ్రామిక కేటగిరీకి విద్యుత్ కనెక్షన్‌ను మార్పిడి చేస్తారు. – ఐదేళ్ల పాటు ఏడాదికి రూ.5 లక్షలకు మించకుండా పారిశ్రామిక విద్యుత్ టారిఫ్‌లో యూనిట్‌కు రూ.2 చొప్పున అదనపు రాయితీ. – ఏడాదికి రూ.10లక్షకు మించకుండా ఐదేళ్ల పాటు 30శాతం వరకు లీజు అద్దెలో సబ్సిడీ – టీఎస్ఐఐసీ/ఐలాకు సంబంధించిన పారిశ్రామిక భూముల్లో కనీసం 50 శాతం నిర్మిత ప్రాంతాన్ని ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు వినియోగిస్తే, సదరు డెవలపర్‌కు రాయితీ, ప్రోత్సాహకాలు వర్తిస్తాయి. మొత్తం భూమికి సంబంధించిన కనీస రిజిస్ట్రేషన్ విలువలో 30 శాతాన్ని కన్వర్షన్ ఫీజుగా ఇండస్ట్రీయల్ డెవలప్మెంట్ ఆథారిటీకి చెల్లించాల్సి ఉంటుంది. వీటికి నాలా చార్జీలు వర్తించవు. పశ్చిమ ప్రాంత వెలుపల సంస్థలకూ రాయితీలు.. పశ్చిమ ప్రాంతం వెలుపల ఇప్పటికే ఏర్పాటైన ఐటీ పరిశ్రమలు/డెవలపర్లకు సైతం ప్రభుత్వం రాయితీ, ప్రోత్సాహాకాలు ప్రకటించింది. అయితే, ఇప్పుడున్న స్పేస్‌కు అదనంగా స్పేస్ తీసుకుంటేనే ఐటీ యూనిట్లకు లీజు అద్దె, విద్యుత్ టారిఫ్ రాయితీలు వర్తిస్తాయి. కొత్తగా తీసుకునే అదనపు స్పేస్, ఇప్పటికే ఉన్న స్పేస్ మధ్య ఉండే నిష్పత్తి మేర లీజు/విద్యుత్ చార్జీల్లో రాయితీ, ప్రోత్సాహకాలు ఇస్తారు. -
హైదరాబాద్‌లో వరల్డ్ డిజైన్ అసెంబ్లీ
సాక్షి, హైదరాబాద్: ఐటీ, పారిశ్రామిక రంగాల్లో అంతర్జాతీయ ఖ్యాతిని పొందిన హైదరాబాద్ నగరం మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సదస్సుకు వేదిక కానుంది. ఈ ఏడాది అక్టోబర్ 11, 12 తేదీల్లో జరిగే ‘వరల్డ్ డిజైన్ అసెంబ్లీ’కి ఆతిథ్యం ఇవ్వనుంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో రెండు రోజులపాటు జరిగే ఈ సదస్సు ద్వారా పారిశ్రామిక డిజైనింగ్ రంగంలో సృజనాత్మకత పెరుగుతుందని భావిస్తున్నారు. ప్రపంచస్థాయి సదస్సు నిర్వహణ ద్వారా తెలంగాణ ప్రతిష్ట మరింత ఇనుమడిస్తుందని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సామాజిక మాధ్యమం ట్విట్టర్లో హర్షం వ్యక్తం చేశారు. 31వ ద్వైవార్షిక వరల్డ్ డిజైన్ అసెంబ్లీని హైదరాబాద్‌లో నిర్వహిస్తామని గతేడాది జూలైలో వరల్డ్ డిజైన్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూడీఓ) అధ్యక్షులు లూయిసా బొషిటో ప్రకటించారు. వరల్డ్ డిజైన్ అసెంబ్లీ నిర్వహణకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా పలు నగరాల నుంచి బిడ్ లు స్వీకరించారు. అంతర్జాతీయ స్థాయి సదస్సుల నిర్వహణకు ఆయా నగరా ల్లో ఉన్న అనుకూలతలను పరిశీలించిన డబ్ల్యూడీఓ హైదరాబాద్‌ను ఎంపిక చేసింది. ఈ సదస్సు నిర్వహణ తేదీలను కూడా డబ్ల్యూడీఓ ప్రకటించింది. ఐక్యరాజ్యసమితి లక్ష్యాల మేరకు ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యానికి అనుగుణంగా 1957లో ఇంటర్నేషనల్ కౌన్సిల్ సొసైటీస్ ఆఫ్ ఇండస్ట్రియల్ డిజైన్ (ఐసీఎస్‌ఐడీ) ఏర్పాటైంది. తొలుత 12 వృత్తి నైపుణ్యం కలిగిన డిజైన్ అసోసియేషన్లతో ఏర్పాటైన ఐసీఎస్‌ఐడీ 2015 అక్టోబర్‌లో వరల్డ్ డిజైన్ ఆర్గనైజేషన్‌గా నామాంతరం చెందింది. ప్రపంచవ్యాప్తంగా 140 డిజైన్ అసోసియేషన్లు డబ్ల్యూడీఓలో సభ్యత్వం కలిగి ఉన్నాయి. పారిశ్రామిక ఉత్పత్తుల తయారీలో సృజనాత్మకతను ప్రోత్సహించడం, నాణ్యమైన ఉత్పత్తులు, సేవలు అందిం చేలా పారిశ్రామిక నమూనాలు తయారు చేయడం తదితరాలు లక్ష్యంగా వరల్డ్ డిజైన్ ఆర్గనైజేషన్ పనిచేస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో ప్రతి రెండేళ్లకోసారి వరల్డ్ డిజైన్ క్యాపిటల్ పేరిట ఒక్కో నగరాన్ని ఎంపి క చేసి సదస్సులు నిర్వహిస్తోంది. -
నలుదిశలా ఐటీ
సాక్షి, హైదరాబాద్: రాజధాని హైదరాబాద్‌లో నలుదిశలా ఐటీ పరిశ్రమను విస్తరింపజేసేందుకు ప్రయత్నిస్తున్నామని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. భాగ్యనగరంలో ఐటీ పరిశ్రమల విస్తరణపై మంగళవారం ఇక్కడ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం నగరంలో ఉన్న ఐటీ క్లస్టర్లకు తోడుగా ఉప్పల్, నాగోల్, సనత్‌నగర్, మేడ్చల్, కొంపల్లి వంటి కొత్త ప్రాంతాలకు ఐటీ పరిశ్రమలను తీసుకెళ్తామన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఐటీ ఉత్పత్తుల ఎగుమతుల్లో హైదరాబాద్ నగరం జాతీయ సగటును మించి వృద్ధిని నమోదు చేసిందన్నారు. ఐటీ ఎగుమతుల విలువ త్వరలో రూ. లక్ష కోట్లకు చేరుకోనుందన్నారు. వృద్ధి చెందుతున్న ఐటీ పరిశ్రమకు అనుగుణంగా నగరంలో మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేటీఆర్ చెప్పారు. పోలీసు, ట్రాఫిక్, విద్యుత్, ఆర్ అండ్ బీ, జీహెచ్ఎంసీ, మెట్రో రైలు, హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు. ఐటీ పరిశ్రమలను కలిగి ఉన్న గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ తదితర ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు స్వల్పకాలిక లక్ష్యాలతో చేపట్టాల్సిన పనులకు ప్రణాళికలు రూపొందించాలని టీఎస్ఐఐసీ అధికారులను మంత్రి అదేశించారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న రాజేంద్రనగర్, బుద్వేల్ ఐటీ క్లస్టర్లలో ఇప్పటి నుంచే అన్ని వసతులు కల్పించాలని పేర్కొన్నారు. కొత్తగా ఏర్పాటు చేసే క్లస్టర్లతోపాటు విస్తరించనున్న క్లస్టర్లలోనూ రోడ్ల విస్తరణ, మురికి కాల్వల నిర్మాణం, విద్యుత్, నీటి సరఫరా తదితర అంశాలపై పూర్తిస్థాయి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. ఎన్నో సంస్థలు ముందుకొస్తున్నాయి... రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు ఆకర్షితులై నగరంలో ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు ఎన్నో సంస్థలు ముందుకు వస్తున్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. కొత్త ఐటీ కంపెనీల ఏర్పాటుతో రానున్న ఐదేళ్లలో లక్షల సంఖ్యలో కొత్త ఐటీ ఉద్యోగాలు వస్తాయన్నారు. ఈ పెరుగుదల అంతా ఒక వైపే కేంద్రీకృతం కాకుండా నగరంలోని నలుమూలలకూ విస్తరిస్తే భవిష్యత్తులో ట్రాఫిక్ వంటి ఇబ్బందులు తలెత్తవని, సమ్మిళిత అభివృద్ధికి అవకాశం కలుగుతుందన్నారు. కొత్త ప్రాంతాలకు ఐటీ పరిశ్రమల విస్తరణలో భాగంగా అవసరమైన పోలీసు స్టేషన్లు, అగ్నిమాపక కేంద్రాలతోపాటు సాధ్యమైన ప్రాంతాల్లో మెట్రో రైలు, ఎంఎంటీఎస్ స్టేషన్ల సదుపాయం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రాజేంద్రనగర్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో చేపట్టాల్సిన భూసేకరణ వంటి విషయాల్లో రెవెన్యూ, టీఎస్ఐఐసీ, రంగారెడ్డి జిల్లా యంత్రాంగం క్రియాశీలకంగా పని చేయాలన్నారు. -
పీపీపీకి సర్కార్ ప్రోత్సాహం
బాబు సర్కార్ కొత్త ఐటీ విధానం పారిశ్రామికవేత్తలకు రారుుతీలు, పన్ను మినహారుుంపులతో ఊతం రూ.30 వేల కోట్లకు పైగా పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యం హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం 2014-20 సంవత్సరాలకు కొత్త ఐటీ పాలసీని ప్రకటించింది. రాష్ట్రంలో ఐటీ పరిశ్రమాభివృద్ధికి విధివిధానాలను, చర్యలను వెల్లడించింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ముందుకెళ్లాలని నిర్ణయించింది. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించడంతో పాటు, రాయితీలు ఇస్తామని, మౌలిక సదుపాయాల కల్పలనలో మెరుగైన విధానాలు అనుసరిస్తామని పేర్కొంది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఐటీ విద్యకు బీజం వేయాలని భావించింది. 2020 సంవత్సరం నాటికి రూ.30 వేల కోట్లకు పైగా (5 బిలియన్ డాలర్లు) పెట్టుబడులు ఆకర్షించాలని, 4 లక్షల కొత్త ఉద్యోగాలను ఐటీ సెక్టార్లో అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 5 వేల కంపెనీలు, ఔత్సాహికులను తయారు చేయడం ఐటీ పాలసీ లక్ష్యం. 10 లక్షల చదరపు అడుగుల్లో ఐటీని అభివృద్ధి చేస్తారు. ఈ దిశగా 18 అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని విధానపత్రంలో స్పష్టం చేసింది. వచ్చే ఐదేళ్ళలో రూ. 30 వేల కోట్లకు పైగా పెట్టుబడుల ఆకర్షణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో ఎలక్ట్రానిక్ హబ్‌లు, హార్డ్‌వేర్ పార్కులు, జోన్ లు ఏర్పాటు చేసి, ఏపీఐఐసీ పర్యవేక్షణలో మౌలిక వసతులను కల్పిస్తారు. ఐదేళ్ళ పాటు విద్యుత్ రాయితీలు, మరో ఏడేళ్ళపాటు అమ్మకం పన్ను మినహాయింపు ఇస్తారు. నిరంతర విద్యుత్ సరఫరా చేస్తారు. వ్యాట్, రిజిస్ట్రేషన్ నుంచి మినహాయిం పు ఉంటుంది. మెగా ప్రాజెక్టులకు ప్రభుత్వ భూమిని షరతులకు లోబడి కేటాయిస్తారు. ఈ ప్రాజెక్టులు ఐదేళ్ళలో కనీసం 2 వేల మందికి ఉపాధి కల్పించాలి. 20 ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్‌ను ఏర్పాటు చేసి, 50 శాతం సబ్సిడీ అందిస్తారు. అనుమతులను సింగిల్ విడో పద్ధతిలో క్లియర్ చేస్తారు. గృహ సంబంధమైన ఐటీ ఉత్పత్తులకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తారు. మెగా ఎలక్ట్రానిక్ హబ్‌లు విశాఖపట్నాన్ని మెగా ఎలక్ట్రానిక్ హబ్‌గా గుర్తించారు. ఐటీ ఉత్పత్తుల ప్రోత్సాహం, అభివృద్ధి కోసం ఇక్కడ ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేస్తారు. పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన అనుమతులన్నీ 4 వారాల్లో ఇచ్చేలా చర్యలు తీసుకుంటారు. కాకినాడలో ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ పార్క్ ఏర్పాటు చేస్తారు. ఇక్కడ అన్నిరకాల మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తారు. విశాఖపట్నం-చెన్నై కారిడార్‌ను ఏర్పాటు చేసి, అవసరమైన ఉపకరణాలు తెప్పించుకునే వీలు కల్పిస్తారు. విజయవాడ, విశాఖపట్నంలలో కొత్తగా ఎలక్ట్రానిక్ బజార్లను విశాలమైన స్థలంలో ఏర్పాటు చేయాలని, అందులో కొత్త ఉత్పత్తులను అమ్మకానికి ఉంచాలని ప్రతిపాదించారు. పరిశ్రమకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చేందుకు ప్రభుత్వం పలు దేశాల ప్రతినిధులను రప్పించి రోడ్ షోలు ఏర్పాటు చేస్తారు. ఐటీ రంగంలో నిపుణులను తయారు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటారు. ఐటీఐ, పాలిటెక్నిక్‌లలో ప్రత్యేక స్కిల్ డెవలప్మెంట్ పాఠ్య ప్రణాళికలను రూపొందిస్తారు. 2017 నాటికి ఏటా 8 వేల మంది విద్యార్థులను ఐటీ రంగానికి అందించాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. యూనివర్శిటీల్లోనూ ప్రత్యేక ఐటీ ప్రాధాన్యత గల కోర్సులను ప్రవేశపెడతారు.