ఆంధ్రప్రదేశ్‌లో అతి పెద్ద నగరమైన విశాఖపట్నం కేంద్రంగా బీచ్ ఐటీని డెవలప్ చేయాలని సీఎం జగన్ కృతనిశ్చయంతో ఉన్నారు. విశాఖపట్నంలో ఉన్న మానవ వనరులు, ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్ట్ ఇతర ఎకో సిస్టమ్‌లు ఇక్కడ త్వరగా ఐటీ రంగం నిలదొక్కుకునేందుకు దోహదం చేస్తాయనే అంచనాలు ఉన్నాయి. వీటికి తోడు ఇక్కడ ఐటీ రంగం మరింత ఆకర్షణీయంగా ఉండేందుకు బీచ్ ఐటీ కాన్సెప్టును జోడించారు.
ప్రస్తుతం ఏపీలో రమారమి మూడు వందల ఐటీ కంపెనీలు ఉండగా ఇందులో 80 శాతం కంపెనీలు విశాఖ కేంద్రంగానే తమ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. సంఖ్యా పరంగా ఐటీ కంపెనీలు ఎక్కువగానే ఉన్నట్టు కనిపిస్తున్నా.. దిగ్గజ ఐటీ కంపెనీల కన్ను ఇంకా విశాఖ మీద పడలేదు. దీంతో ఐటీ కంపెనీలకు మరింత ప్రోత్సహాం అందిస్తూనే ఐటీ రంగానికి ఆకర్షణీయమైన డెస్టినేషన్‌గా విశాఖను మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీని కోసం ఇప్పటికే అమెరికాలో సక్సెస్ అయిన బీచ్ ఐటీ మోడల్‌ను పరిశీలిస్తున్నారు.
అమెరికాలోని అట్లాంటా తీరంలో ఉన్న వర్జీనియా అందమైన బీచ్‌లకు ప్రసిద్ధి. ఇక్కడ ఐటీ రంగాన్ని ప్రోత్సహించేందుకు అక్కడి ప్రభుత్వం బీచ్ ఐటీ విధానం తీసుకువచ్చింది. అదే తరహాలో విశాఖలోనూ బీచ్ ఐటీని ఏర్పాటు చేసే ఉద్దేశంతో ఉన్నారు. దీని ప్రకారం ఐటీ కంపెనీలు, ఐటీ ఎకోసిస్టమ్‌లో ఉన్న సంస్థలన్నీ విశాఖ సముద్ర తీరంలో కొలువుదీరేలా ప్లాన్ రెడీ చేశారు. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో బీచ్ ఐటీ కాన్సెప్టును వివరించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment