హైదరాబాద్‌ నగరం నలువైపులా ఐటీ! | IT Should Develop In Hyderabad Plan BY KCR | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ నగరం నలువైపులా ఐటీ!

Dec 11 2020 4:16 AM | Updated on Dec 11 2020 12:48 PM

IT Should Develop In Hyderabad Plan BY KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, నానక్‌రాంగూడ వంటి పశ్చిమ ప్రాంతాల్లో మాత్రమే కేంద్రీకృతమై ఉన్న ఐటీ రంగాన్ని నగరం నలువైపులా విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు హైదరాబాద్‌ గ్రిడ్ ‌(గ్రోత్‌ ఇన్‌ డిస్పెర్షన్‌) పాలసీని తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రకటిస్తూ రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. దాదాపు 30 శాతానికి పైగా ఐటీ నిపుణులు తూర్పు హైదరాబాద్‌లో నివాసముంటూ పశ్చిమ హైదరాబాద్‌కు వెళుతున్నారు. దీనివల్ల వారి ప్రయాణానికి అధిక సమయం పడుతుండటంతోపాటు నగరం ఇరుకుగా మారుతోంది. ఈ నేపథ్యంలో నగరంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న వివిధ పారిశ్రామిక ప్రాంతాలను ఐటీ పార్కులుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

కొత్త ఐటీ పార్కులివే..
కూకట్‌పల్లి, గాంధీనగర్, బాలపూర్, మల్లాపూర్, మౌలాలి, సతన్‌నగర్‌ ఇండస్ట్రియల్‌ ఏరియా, ఉప్పల్, నాచారం, పటాన్‌చెరు (పాక్షికంగా), కాటేదాన్‌ ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ ఏరియా, ఏఐఈ రామచంద్రాపురం కలిపి మొత్తం 11 పారిశ్రామిక ప్రాంతాలను ఐటీ పార్కులుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటికి అదనంగా కొంపల్లిలో ఐటీ టవర్‌ ఏర్పాటు చేయాలని, కొల్లూరు/ఉస్మాన్‌సాగర్‌లో ఐటీ పార్కును నిర్మించనుంది. తొలి విడతగా ఉప్పల్, పోచారం, నాచారం, కొంపల్లి, కొల్లూరు/ఉస్మాన్‌సాగర్, కాటేదాన్, శంషాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ఐటీ పార్కులను ఏర్పాటు చేస్తారు. కొత్త ఐటీ విధానంలో ఇప్పటికే ఐటీ పరిశ్రమలు ఉన్న పశ్చిమ ప్రాంతాలకు మినహా నగరంలోని మిగిలిన ప్రాంతాల్లో ఏర్పాటయ్యే ఐటీ పరిశ్రమలకు ప్రోత్సాహకాలివ్వనుంది.

రాయితీ, ప్రోత్సాహకాలు ఇవీ..
– కమర్షియల్‌ కేటగిరీ నుంచి పారిశ్రామిక కేటగిరీకి విద్యుత్‌ కనెక్షన్‌ను మార్పిడి చేస్తారు. 
– ఐదేళ్ల పాటు ఏడాదికి రూ.5 లక్షలకు మించకుండా పారిశ్రామిక విద్యుత్‌ టారిఫ్‌లో యూనిట్‌కు రూ.2 చొప్పున అదనపు రాయితీ. 
– ఏడాదికి రూ.10లక్షకు మించకుండా ఐదేళ్ల పాటు 30శాతం వరకు లీజు అద్దెలో సబ్సిడీ
– టీఎస్‌ఐఐసీ/ఐలాకు సంబంధించిన పారిశ్రామిక భూముల్లో కనీసం 50 శాతం నిర్మిత ప్రాంతాన్ని ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు వినియోగిస్తే, సదరు డెవలపర్‌కు రాయితీ, ప్రోత్సాహకాలు వర్తిస్తాయి. మొత్తం భూమికి సంబంధించిన కనీస రిజిస్ట్రేషన్‌ విలువలో 30 శాతాన్ని కన్వర్షన్‌ ఫీజుగా ఇండస్ట్రీయల్‌ డెవలప్‌మెంట్‌ ఆథారిటీకి చెల్లించాల్సి ఉంటుంది. వీటికి నాలా చార్జీలు వర్తించవు. 


పశ్చిమ ప్రాంత వెలుపల సంస్థలకూ రాయితీలు..
పశ్చిమ ప్రాంతం వెలుపల ఇప్పటికే ఏర్పాటైన ఐటీ పరిశ్రమలు/డెవలపర్లకు సైతం ప్రభుత్వం రాయితీ, ప్రోత్సాహాకాలు ప్రకటించింది. అయితే, ఇప్పుడున్న స్పేస్‌కు అదనంగా స్పేస్‌ తీసుకుంటేనే ఐటీ యూనిట్లకు లీజు అద్దె, విద్యుత్‌ టారిఫ్‌ రాయితీలు వర్తిస్తాయి. కొత్తగా తీసుకునే అదనపు స్పేస్, ఇప్పటికే ఉన్న స్పేస్‌ మధ్య ఉండే నిష్పత్తి మేర లీజు/విద్యుత్‌ చార్జీల్లో రాయితీ, ప్రోత్సాహకాలు ఇస్తారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement