డబ్ల్యూటీఓ చీఫ్ రొబెర్టో అజెవెడో
దావోస్: వేగంగా మారుతున్న ప్రపంచంతో పాటు మారకపోతే బహుళపక్ష వాణిజ్య వ్యవస్థలు, డబ్ల్యూటీఓ వంటి సంస్థలు కనుమరుగు కాక తప్పదని డబ్ల్యూటీఓ చీఫ్ రొబెర్టో అజెవెడో హెచ్చరించారు. దీనిని నివారించడానికి తక్షణం చర్యలు తీసుకోవాలని సూచించారు. జోరుగా వృద్ధి చెందుతున్న ఈ–కామర్స్ కోసం అంతర్జాతీయ బహుళపక్ష ఒప్పందం అవసరమన్నారు. ఇక్కడి ప్రపంచ ఆర్థిక సదస్సులో (డబ్ల్యూఈఎఫ్) ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు పెరగడం, రక్షణాత్మక విధానాలు పెరుగుతుండటం వంటి కారణాల వల్ల వాణిజ్య రంగంలో గతంలో కంటే సవాళ్లు మరింత క్లిష్టమవుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
మరోవైపు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు నిజానికి రాజకీయ సమస్య అని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుంటెరస్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలు ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉన్నాయని, వీటిని సవ్యంగా పరిష్కరించలేకపోతే పెను విపత్తు తప్పదని ఆయన హెచ్చరించారు. కాగా ఆర్థిక వృద్ధికి సంబంధించిన అంశాలను దేశాలు త్వరితంగా పరిష్కరించుకోవాలని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్‌ఎఫ్) చీఫ్ క్రిస్టీనా లగార్డ్ సూచించారు. అందుకే అం తర్జాతీయ ఆర్థిక వృద్ధి అంచనాలను తగ్గించామన్నా రు. కాగా, కృత్రిమ మేధ నియంత్రణకు నిబంధనల ను రూపొందించాల్సిన అవసరముందని మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెళ్ల వ్యాఖ్యానించారు. గోప్యతను మానవ హక్కుగా పరిగణించాలని పేర్కొన్నారు.
డిజిటల్ డిక్లరేషన్...
డిజిటల్ యుగంలో నైతికంగా, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తామనే డిజిటల్ ప్రతినకు 40కు పైగా అంతర్జాతీయ వ్యాపార ప్రముఖులు సంఘీభావం తెలిపారు. ఈ డిజిటల్ డిక్లరేషన్‌పై మన దేశానికి చెందిన భారతీ ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ తొలి సంతకం చేశారు. ఎరిక్సన్, ఐబీఎమ్, ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్, నోకియా, శామ్‌సంగ్, షార్ప్, వెరిజాన్, వొడాఫోన్, షియోమి తదితర సంస్థలు ఈ డిజిటల్ డిక్లరేషన్‌కు సంఘీభావం తెలిపాయి.
ఎలక్ట్రానిక్ వేస్ట్.. 6,200 కోట్ల డాలర్లు
ప్రతీ ఏడాదీ ఎలక్ట్రానిక్ వ్యర్థాలు(ఈ–వేస్ట్) విపరీతంగా పెరిగిపోతున్నాయని తాజా నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం 5 కోట్ల టన్నులుగా (ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా తయారైన వాణిజ్య విమానాల బరువు కంటే ఇది అధికం) ఉన్న ఈ–వేస్ట్ 2050 కల్లా 12 కోట్ల టన్నులకు పెరుగుతుందని పేర్కొంది. ఫలితంగా తీవ్రమైన ఆరోగ్య, పర్యావరణ సమస్యలు తలెత్తుతాయని వివరించింది. ఏటా పేరుకుపోతున్న ఈ–వ్యర్థాల విలువ 6,200 కోట్ల డాలర్ల మేర ఉంటుందని, ఇది మొత్తం ప్రపంచ వెండి ఉత్పత్తి విలువకు మూడు రెట్లకు సమానమని వివరించింది. ప్రతి ఏటా ఎలక్ట్రానిక్స్, ప్లాస్టిక్స్ ఉత్పత్తుల్లో 20 శాతం మాత్రమే రీసైకిల్ అవుతున్నట్లు తెలియజేసింది.
Comments
Please login to add a commentAdd a comment