దావోస్ : వరల్డ్ ఎకనమిక్ ఫోరం వేదికగా డబ్ల్యూటీవోపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ దేశం పట్ల డబ్ల్యూటీవో న్యాయబద్ధంగా వ్యవహరించడం లేదని మండిపడ్డారు. చైనా, భారత్‌లను అభివృద్ధి చెందుతున్న దేశాలుగా చూస్తున్న అంతర్జాతీయ వాణిజ్య సంస్థ అమెరికాను మాత్రం అభివృద్ధి చెందుతున్న దేశంగా పరిగణించడం లేదని వ్యాఖ్యానించారు. తమ దేశాన్ని సరిగ్గా ట్రీట్ చేయని డబ్ల్యూటీవో తీరుపై తాను కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నానని, చైనా..భారత్‌లను అభివృద్ధి చెందుతున్న దేశాలుగా చూస్తున్న ఈ సంస్థ తమను ఎందుకు అలా చూడటం లేదని ప్రశ్నించారు.
దావోస్‌లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. తన దృష్టిలో అమెరికా సైతం అభివృద్ధి చెందుతున్న దేశమేనని, తమను ఇలా చూడకుండా, భారత్..చైనాలనే అభివృద్ధి చెందుతున్న దేశాలుగా చూడటంతో ఆ దేశాలు భారీ ప్రయోజనాలను దక్కించుకుంటున్నాయని రుసరుసలాడారు. ఆ దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలైతే తమదీ అభివృద్ధి చెందుతున్న దేశమని గుర్తించాలని అన్నారు. డబ్ల్యూటీవో ఈ దిశగా నూతన విధానం చేపట్టకపోతే..తాము ఏదో ఒకటి చేయాల్సి వస్తుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికాకు డబ్ల్యూటీవో అన్యాయం చేస్తోందని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment