జెనీవా : పలు రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు తలుపులు బార్లాగా తెరిచే భారత్.. సౌర శక్తి (సోలార్ ఎనర్జీ) విషయంలో మాత్రం భిన్నంగా వ్యవహరించింది. అమెరికాలో తయారయ్యే సోలార్ సెల్స్, మాడ్యుల్స్‌ల దిగుమతిపై విధించిన ఆంక్షలు ముమ్మాటికి సరైనవేనని పేర్కొంది. డబ్ల్యూటీవో నిబంధనల ప్రకారం ‘సౌరశక్తి ఉత్పత్తి పరికరాల సరఫరా’ ఒప్పందాలను భారత్ ఉల్లంఘించిందని అమెరికా ఆరోపించగా, అసలు తప్పు అమెరికాదేనని భారత్ వాదించింది. ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీవో) ఈ మేరకు సోమవారం ఒక ప్రటకనలో ఈ వివరాలను పేర్కొంది.
ఏమిటీ వివాదం? : కాలుష్యరహిత సంప్రదాయేతర ఇంధన వనరులను ఎక్కువ వినియోగంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం 2011లో సౌర విద్యుత్ విధానం(సోలార్ పవర్ పాలసీ)ని రూపొందించుకుంది. ప్రపంచ వాణిజ్య సంస్థలో సభ్యురాలైన భారత్ ఆ సంస్థ నిబంధనల ప్రకారం అమెరికాకు చెందిన సోలార్ పరికరాల సంస్థల కార్యకలాపాలకు అనుమతి ఇచ్చింది. అయితే, విదేశీ కంపెనీల పోటీ ఎక్కువ కావడంతో దేశీయ సోలార్ ఎనర్జీ కంపెనీలు, పరికరాల తయారీదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో భారత ప్రభుత్వం.. ‘సోలార్ ప్యానెళ్లలోని మాడ్యుల్స్, సెల్స్‌లు ఇక్కడ తయారుచేసినవే అయి ఉండాలని’ నిబంధన తీసుకొచ్చింది. భారత్ నిబంధనను తప్పుపడుతూ 2013లో అమెరికా.. డబ్ల్యూటీవో ఆధ్వర్యంలోని వాణిజ్య కోర్టు(జెనీవా)ను ఆశ్రయించింది. సుదీర్ఘంగా సాగిన వాదోపవాదాల్లో ఇరుదేశాలు తమతమ వాణిని వినిపించాయి. తాజాగా ‘నిబంధనలు ఉల్లంఘించినందుకు భారత్ జరిమానా కట్టాలని’ అమెరికా మెలిక పెట్టింది.
భారత్ వాదన : అమెరికా ఆరోపణలను తిప్పికొడుతూ భారత్ గట్టి వాదన వినిపించింది. ‘డబ్ల్యూటీవో నిబంధనల ప్రకారం విదేశీ సంస్థలపై ఆంక్షలు విధించే అధికారం మాకు ఉంది. అదేసమయంలో ఆంక్షల సాకు చెప్పి ఒప్పందాల నుంచి తప్పుకోవాలని చూస్తే అది అమెరికా తన పక్షపాతవైఖరిని బయటపెట్టుకున్నట్లవుతుంది. నిబంధనల విషయంలో మేం(భారత్) ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదు. కాబట్టి అమెరికా చెప్పేదాంట్లో విషయంలేదు’’ అని భారత్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment