ఈయూతో యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం Brexit trade deal reached between UK and European Union | Sakshi
Sakshi News home page

ఈయూతో యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం

Published Fri, Dec 25 2020 4:50 AM

Brexit trade deal reached between UK and European Union - Sakshi

లండన్‌: యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ) నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ కూటమితో యునైటెడ్‌ కింగ్‌డమ్‌(యూకే) భారీ ఒప్పందం కుదుర్చుకుంది. పోస్ట్‌–బ్రెగ్జిట్‌స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని(ఎఫ్‌టీఏ) ఇరు వర్గాలు గురువారం ఖరారు చేసుకున్నాయి. ఇందుకు తుది గడువు డిసెంబర్‌ 31 కాగా, వారం రోజుల ముందే ఒప్పందం కుదరడం విశేషం. ఇందుకు బెల్జియంలోని బ్రస్సెల్స్‌ నగరం వేదికగా మారింది. ఇది అతిపెద్ద ద్వైపాక్షిక ఒప్పందమని వాణిజ్య వర్గాలు చెబుతున్నాయి. ఈ అగ్రిమెంట్‌ పూర్తి వివరాలు మరికొద్ది రోజుల్లో బహిర్గతం కానున్నాయి.

ఒక స్వతంత్ర వాణిజ్య దేశంగా ఇకపై తమకు ఎన్నో కొత్త అవకాశాలు అందుబాటులోకి రానున్నాయని, ప్రపంచవ్యాప్తంగా ఇతర భాగస్వామ్య దేశాలతో మరిన్ని వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడానికి మార్గం సుగమమైందని యూకే అధికార వర్గాలు ఒక ప్రకటనలో పేర్కొన్నాయి. జీరో టారిఫ్‌లు, జీరో కోటాల ఆధారంగా ఈయూతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించాయి. దీంతో ధనం, సరిహద్దులు, చట్టాలు, వాణిజ్యం, సముద్ర జలాలపై తమ ఆధిపత్యం మళ్లీ తిరిగి వస్తుందని తెలిపాయి. ఒక్కమాటలో చెప్పాలంటే 2021 జనవరి 1వ తేదీన తాము పూర్తిగా రాజకీయ, ఆర్థిక స్వేచ్ఛ పొందుతామని స్పష్టం చేశాయి. ఇదొక పారదర్శక, బాధ్యతాయుతమైన ఒప్పందమని యూరోపియన్‌ కమిషన్‌ అధ్యక్షుడు ఉర్సులా వన్‌డెర్‌ లెయెన్‌ అభివర్ణించారు. ఈయూకు యూకే దీర్ఘకాలిక భాగస్వామ్య దేశమని గుర్తుచేశారు. ఈయూ నుంచి విడిపోవడం కొంత బాధాకరమే అయినప్పటికీ, ఇది భవిష్యత్తు వైపు దృష్టి సారించాల్సిన సమయమన్నారు.
 
ప్రధాని బోరిస్‌ హర్షం  

పోస్ట్‌–బ్రెగ్జిట్‌ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరడం పట్ల యూకే ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ‘ద డీల్‌ ఈజ్‌ డన్‌’ అంటూ ఒక మెసేజ్‌ను సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. అనంతరం 10 డౌనింగ్‌ స్ట్రీట్‌లోని తన నివాసం వద్ద ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. బ్రిటిష్‌ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నానని చెప్పారు. అతి పెద్ద ఒప్పందాన్ని నేడు ఖరారు చేసుకున్నామని, ప్రజలు కోరుకున్నదే జరిగిందని తెలిపారు. మన ఉత్పత్తులు, వస్తువులను ఇకపై ఈయూ మార్కెట్లలో ఎలాంటి టారిఫ్‌లు, నియంత్రణల భారం లేకుండా విక్రయించుకోవచ్చని అన్నారు.

తద్వారా యూకేలో కొత్త ఉద్యోగాలను, గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ జోన్లను సృష్టించావచ్చని పేర్కొన్నారు. 1973 తర్వాత తొలిసారిగా మన సముద్ర జలాలపై పూర్తి నియంత్రణతో యూకే ఒక స్వతంత్ర తీరప్రాంతం ఉన్న దేశంగా మారుతుందని తెలిపారు. సముద్ర జలాల్లో చేపల వేటపై యథాతథ స్థితి ఒప్పందం మరో ఐదున్నరేళ్లు మాత్రమే అమల్లో ఉంటుందని, ఆ తర్వాత మన జాలర్లు మన సముద్ర జలాల్లో ఎన్ని చేపలయినా పట్టుకోవచ్చని బోరిస్‌ జాన్సన్‌ వెల్లడించారు. యూకే ఎప్పటికీ యూరప్‌తో సాంస్కృతికంగా, చరిత్రకంగా, వ్యూహాత్మకంగా, భౌగోళికంగా అనుసంధానమైన ఉంటుందని ఉద్ఘాటించారు. బ్రిటిష్‌ ఎంపీలు డిసెంబర్‌ 30న సమావేశమై, ఈ ఒప్పందానికి ఆమోదం తెలుపుతారని పేర్కొన్నారు.   

Advertisement
 
Advertisement
 
Advertisement