లండన్: బ్రెగ్జిట్ ట్రాన్సిషన్ కాలం ముగియడంతో యూకే–ఈయూ ఒప్పందం అమల్లోకి వచ్చింది. అయితే బ్రిటిష్ పౌరులు దీని కారణంగా కొన్ని మార్పులను చవిచూడనున్నారు. అవేంటంటే..
1. ఈయూ పరిధిలోని ఇతర దేశాల్లో యూకే ప్రజలు స్థిరనివాసం ఏర్పాటు చేసుకోవాలంటే తప్పనిసరిగా ఇమ్మిగ్రేషన్ నియమాలను పాటించాల్సి ఉంటుంది. ఇతర దేశాలకు వెళ్లడానికి వీసాలు, రెడ్‌టేప్ వంటి ప్రక్రియలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కుటుంబాలు వివిధ దేశాల్లో ఉన్నవారికి ఇది ప్రధాన సమస్యగా మారే అవకాశం ఉంది.
2. గతంలో ఉన్నట్లుగా ఈయూ కూటమిలోని దేశాల్లోకి అంత సులువుగా ప్రయాణించలేరు. అయితే సెలవుల్లో వీసా–ఫ్రీ ప్రక్రియతో వెళ్లే అవకాశాలు ఉన్నాయి. బ్రిటీషర్లకు యూరోపియన్ ఆరోగ్య బీమా కార్డులు కూడా ఉండవు. కోవిడ్ ప్రయాణ నిబంధనలు కూడా జతకావచ్చు.
3. ఎరాస్మస్ ప్రక్రియ కింద బ్రిటిష్ వారు గతంలోలా ఈయూ దేశాల్లో చదువుకోవడం, పనిచేయడం, బోధించడం, శిక్షణ ఇవ్వడం వంటివి చేయలేరు. అప్పట్లో ఈయూ పథకం కింద నేర్చుకునేవారికి, చదువుకునేవారికి గ్రాంట్లు కూడా ఉండేవి.
4. యూకే వారికి ఇకపై ఫ్రీ రోమింగ్ సదుపాయం ముగిసినట్లే. దేశం దాటి ఈయూ కూటమిలో ప్రవేశిస్తే రోమింగ్ చార్జీలు ఉంటాయి. అయితే అక్కడున్న ఈఈ, ఓటూ, వొడాఫోన్ వంటి కంపెనీలు ప్రస్తుతానికి రోమింగ్ సంబంధించి ప్లాన్లేమీ లేవన్నాయి.
5. తమ వాహన లైసెన్స్‌తో బ్రిటిషర్లు.. యూరోపియన్ యూనియన్ దేశాల్లో తిరగవచ్చు. అయితే ప్రయాణసమయాల్లో గ్రీన్ కార్డును వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. వాహనం మీద జీబీ స్టిక్కర్ తప్పనిసరి.
6. యూరోపియన్ పార్లమెంట్ ఎన్నికల్లో బ్రిటన్ దేశస్తుల ప్రాధాన్యత తగ్గిపోనుంది. ఎన్నికల్లో పోటీచేసే అధికారాలు, ఓటు వేసే హక్కులు బ్రిటిషర్లకు బాగా తగ్గిపోతాయి.
7. ఈయూ భాగస్వాములతో వ్యాపారం చేయడానికి ఇకపై అధిక పేపర్ వర్క్, అదనపు రుసుములు ఉండవచ్చు.
ఫ్రెంచ్ పౌరసత్వానికి బోరిస్ తండ్రి దరఖాస్తు..
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తండ్రి స్టాన్లీ జాన్సన్ ఫ్రెంచ్ పౌరసత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. తానెల్లప్పుడూ యూరోపియన్‌గానే ఉంటానని ఫ్రెంచ్ రేడియో స్టేషన్ ఆర్టీఎల్‌లో పేర్కొన్నారు. ఈయూ నుంచి యూకే బయటికొస్తున్న వేళ ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తన తల్లి, అమ్మమ్మ ఇద్దరూ ఫ్రెంచ్ వారేనని, అందువల్ల తానూ ఫ్రెంచ్‌వాడినేనని పేర్కొన్నారు. బ్రిటిష్ ప్రజలకు యూరోపియన్లుగా ఉండాలో వద్దో వేరేవారు చెప్పలేరని అన్నారు. యూరోపియన్ యూనియన్‌తో సంబంధాలు కలిగి ఉండటం ముఖ్యమని అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment