న్యూఢిల్లీ/బెర్న్: భారతీయ పౌరులు విదేశాల్లో దాచిన నల్లధనాన్ని వెనక్కి రప్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషి సత్ఫలితాలనిస్తోంది. తమ బ్యాంకుల్లో భారత పౌరుల ఖాతాల వివరాలతో కూడిన మొట్టమొదటి జాబితాను స్విట్జర్లాండ్ ప్రభుత్వం సోమవారం భారత్‌కు అందజేసింది. అంతర్జాతీయ ప్రమాణాలకు లోబడి ఆర్థిక లావాదేవీల సమాచారాన్ని పంచుకునేందుకు స్విట్జర్లాండ్ ప్రభుత్వ ఫెడరల్ టాక్స్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌టీఏ)తో అంగీకారం కుదుర్చుకున్న 75 దేశాల్లో భారత్ కూడా ఒకటి.
రెండో జాబితాను ఒప్పందం ప్రకారం 2020 సెప్టెంబర్‌లో అందజేస్తామని ఎఫ్‌టీఏ అధికారి తెలిపారు. 2018లో కుదిరిన ఆటోమేటిక్ ఎక్సే్ఛంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్(ఏఈఓఐ) ఒప్పందం ప్రకారం ప్రస్తుతం మనుగడలో ఉన్న, 2018లో మూసివేసిన అకౌంట్ల వివరాలు ఇందులో ఉన్నాయి. అయితే, ఎన్ని అకౌంట్లు, ఆ అకౌంట్లలో ఎంతమొత్తం ఆస్తులున్నదీ వెల్లడించేందుకు ఎఫ్‌టీఏ నిరాకరించింది. ఇవి భారతీయ పౌరులుగా గుర్తింపు పొంది, వాణిజ్య, ఇతర అవసరాలకు వాడుతున్న అకౌంట్లు మాత్రమే.
ఎఫ్‌టీఏ తెలిపిన వివరాల్లో చాలామటుకు వ్యాపారులతోపాటు, అమెరికా, బ్రిటన్, ఆఫ్రికా, దక్షిణ అమెరికా, ఆగ్నేయ ఆసియా దేశాల్లో స్థిరపడిన ప్రవాస భారతీయులవేనని పలువురు అధికారులు అంటున్నారు. ఈ సమాచారాన్ని భారత ప్రభుత్వం అత్యంత గోప్యంగా ఉంచాల్సి ఉంటుందని తెలిపింది. రిటర్నుల దాఖలు సమయంలో పన్ను చెల్లింపుదారులు విదేశాల్లోని తమ ఆర్థిక ఖాతాల వివరాలను సరిగ్గా సమర్పిస్తున్నారా లేదా అనేది దీని ద్వారా రూఢి చేసుకోవచ్చని ఎఫ్‌టీఏ తెలిపింది. ఎఫ్‌టీఏ అందజేసిన సమాచారంలోని.. ఖాతాదారుల డిపాజిట్లు, లావాదేవీలు, సంపాదన, పెట్టుబడులు, తదితర వివరాలుంటాయి.
వీటి సాయంతో బయటకు వెల్లడించని ఆస్తులున్న వారిపై చట్ట ప్రకారం ప్రభుత్వం చర్యలు చేపట్టే అవకాశముందని నిపుణులు అంటున్నారు. కాగా, నల్లధనం వెలికితీతకు ప్రపంచదేశాలు ప్రయత్నాలు ప్రారంభించడం, స్విట్జర్లాండ్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరడంతో దాదాపు 100 మంది భారతీయ కుబేరులు 2018కి ముందే తమ ఖాతాలను రద్దు చేసుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఖాతాదారుల్లో ఎక్కువ మంది వ్యాపారులేనని అంటున్నారు. కేంద్రం ప్రత్యేకంగా ప్రస్తావించిన కొందరి ఖాతాదారుల వివరాలను అందజేసే విషయమై ఆగస్టులో స్విస్ బృందం భారత్‌కు వచ్చి, ఆయా వివరాల గోప్యతకు హామీ పొందింది.
ఎఫ్‌టీఏలో భారత్ సభ్యత్వం
అంతర్జాతీయ ప్రమాణాలకు లోబడి ఆర్థిక లావాదేవీల సమాచారాన్ని పంచుకునేందుకు స్విట్జర్లాండ్ ప్రభుత్వ ఫెడరల్ టాక్స్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌టీఏ)తో ఒప్పందం కుదుర్చుకున్న 75 దేశాల్లో భారత్ కూడా ఒకటి. ఎఫ్‌టీఏ కింద 65 సభ్య దేశాలకు చెందిన 31 లక్షల అకౌంట్ల వివరాలను ఇప్పటి వరకు స్విస్ ప్రభుత్వం అందజేసింది. ఆయా దేశాల నుంచి 24 లక్షల మంది ఖాతాదారుల సమాచారాన్ని సేకరించింది.
నల్లకుబేరుల జాబితా అందింది!
Published Tue, Oct 8 2019 4:43 AM | Last Updated on Tue, Oct 8 2019 7:56 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment