Swiss bank accounts
-
భారత్ చేతికి 4వ విడత స్విస్ ఖాతాల వివరాలు
న్యూఢిల్లీ/బెర్న్: స్విస్ బ్యాంకుల్లో ఖాతాలున్న భారతీయులు, దేశీ సంస్థలకు సంబంధించిన మరిన్ని వివరాలు భారత ప్రభుత్వానికి అందాయి. ఆటోమేటిక్ వార్షిక సమాచార మార్పిడి (ఏవోఈఐ) ఒప్పందం కింద స్విట్జర్లాండ్ నాలుగో విడత వివరాలు (వరుసగా నాలుగో ఏడాది) వీటిని అందజేసినట్లు అధికారులు తెలిపారు. వీటిలో వందల కొద్దీ వ్యక్తిగత, కార్పొరేట్ల, ట్రస్టుల ఖాతాలు ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే, తదుపరి విచారణలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉన్నందున పేర్లు, వివరాల విషయంలో గోప్యత పాటిస్తున్నట్లు వివరించారు. తదుపరి విడత స్విస్ ఖాతాల వివరాలు మళ్లీ 2023 సెప్టెంబర్‌లో భారత్‌కు అందనున్నాయి. ఏవోఈఐ కింద ఈ ఏడాది 101 దేశాలకు 34 లక్షల ఖాతాల వివరాలు అందించినట్లు, ప్రతిగా ఆయా దేశాల నుంచి 29 లక్షల ఖాతాల వివరాలు పొందినట్లు స్విట్జర్లాండ్ ఫెడరల్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌టీఏ) వెల్లడించింది. సంపన్నులు అక్రమంగా సొమ్ము దాచుకునేందుకు స్విస్ బ్యాంకులు ఉపయోగపడుతున్నాయన్న అపప్రదను తొలగించుకునే ప్రయత్నాల్లో భాగంగా 2018 నుంచి స్విట్జర్లాండ్ ఏఈవోఐ అమలు చేస్తోంది. భారత్‌తో ఒప్పందం 2019 నుంచి అమల్లోకి వచ్చింది. -
భారత్ చేతికి స్విస్ ఖాతాల వివరాలు
న్యూఢిల్లీ/బెర్న్: విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనంపై పోరులో భారత ప్రభుత్వం మరింత పురోగతి సాధించింది. స్విస్ బ్యాంకుల్లో ఖాతాలున్న వ్యక్తులు, సంస్థలకు సంబంధించిన వివరాల రెండో సెట్‌ను అందుకుంది. ఆటోమేటిక్ సమాచార మార్పిడి ఒప్పందం (ఏఈవోఐ) కింద 2019 సెప్టెంబర్‌లో స్విట్జర్లాండ్ నుంచి మొదటి సెట్‌ను భారత్ అందుకుంది. తాజాగా ఈ ఏడాది భారత్ సహా 86 దేశాలతో ఆర్థిక ఖాతాల వివరాలను స్విట్జర్లాండ్ ఫెడరల్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌టీఏ) పంచుకుంది. ఈ దేశాలతో గతేడాది స్థాయిలోనే సుమారు 31 లక్షల అకౌంట్ల సమాచార మార్పిడి జరిగిందని ఎఫ్‌టీఏ తెలిపింది. వీటిల్లో భారతీయ పౌరులు, సంస్థల ఖాతాల సంఖ్య గణనీయంగా ఉందని పేర్కొంది. పన్ను చెల్లింపుదారులు తమ రిటర్నుల్లో ఆర్థిక వివరాలను సక్రమంగా వెల్లడించారా లేదా అన్నది పన్ను అధికారులు పరిశీలించడానికి ఈ సమాచారం ఉపయోగపడుతుంది. -
నల్లకుబేరుల జాబితా అందింది!
న్యూఢిల్లీ/బెర్న్: భారతీయ పౌరులు విదేశాల్లో దాచిన నల్లధనాన్ని వెనక్కి రప్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషి సత్ఫలితాలనిస్తోంది. తమ బ్యాంకుల్లో భారత పౌరుల ఖాతాల వివరాలతో కూడిన మొట్టమొదటి జాబితాను స్విట్జర్లాండ్ ప్రభుత్వం సోమవారం భారత్‌కు అందజేసింది. అంతర్జాతీయ ప్రమాణాలకు లోబడి ఆర్థిక లావాదేవీల సమాచారాన్ని పంచుకునేందుకు స్విట్జర్లాండ్ ప్రభుత్వ ఫెడరల్ టాక్స్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌టీఏ)తో అంగీకారం కుదుర్చుకున్న 75 దేశాల్లో భారత్ కూడా ఒకటి. రెండో జాబితాను ఒప్పందం ప్రకారం 2020 సెప్టెంబర్‌లో అందజేస్తామని ఎఫ్‌టీఏ అధికారి తెలిపారు. 2018లో కుదిరిన ఆటోమేటిక్ ఎక్సే్ఛంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్(ఏఈఓఐ) ఒప్పందం ప్రకారం ప్రస్తుతం మనుగడలో ఉన్న, 2018లో మూసివేసిన అకౌంట్ల వివరాలు ఇందులో ఉన్నాయి. అయితే, ఎన్ని అకౌంట్లు, ఆ అకౌంట్లలో ఎంతమొత్తం ఆస్తులున్నదీ వెల్లడించేందుకు ఎఫ్‌టీఏ నిరాకరించింది. ఇవి భారతీయ పౌరులుగా గుర్తింపు పొంది, వాణిజ్య, ఇతర అవసరాలకు వాడుతున్న అకౌంట్లు మాత్రమే. ఎఫ్‌టీఏ తెలిపిన వివరాల్లో చాలామటుకు వ్యాపారులతోపాటు, అమెరికా, బ్రిటన్, ఆఫ్రికా, దక్షిణ అమెరికా, ఆగ్నేయ ఆసియా దేశాల్లో స్థిరపడిన ప్రవాస భారతీయులవేనని పలువురు అధికారులు అంటున్నారు. ఈ సమాచారాన్ని భారత ప్రభుత్వం అత్యంత గోప్యంగా ఉంచాల్సి ఉంటుందని తెలిపింది. రిటర్నుల దాఖలు సమయంలో పన్ను చెల్లింపుదారులు విదేశాల్లోని తమ ఆర్థిక ఖాతాల వివరాలను సరిగ్గా సమర్పిస్తున్నారా లేదా అనేది దీని ద్వారా రూఢి చేసుకోవచ్చని ఎఫ్‌టీఏ తెలిపింది. ఎఫ్‌టీఏ అందజేసిన సమాచారంలోని.. ఖాతాదారుల డిపాజిట్లు, లావాదేవీలు, సంపాదన, పెట్టుబడులు, తదితర వివరాలుంటాయి. వీటి సాయంతో బయటకు వెల్లడించని ఆస్తులున్న వారిపై చట్ట ప్రకారం ప్రభుత్వం చర్యలు చేపట్టే అవకాశముందని నిపుణులు అంటున్నారు. కాగా, నల్లధనం వెలికితీతకు ప్రపంచదేశాలు ప్రయత్నాలు ప్రారంభించడం, స్విట్జర్లాండ్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరడంతో దాదాపు 100 మంది భారతీయ కుబేరులు 2018కి ముందే తమ ఖాతాలను రద్దు చేసుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఖాతాదారుల్లో ఎక్కువ మంది వ్యాపారులేనని అంటున్నారు. కేంద్రం ప్రత్యేకంగా ప్రస్తావించిన కొందరి ఖాతాదారుల వివరాలను అందజేసే విషయమై ఆగస్టులో స్విస్ బృందం భారత్‌కు వచ్చి, ఆయా వివరాల గోప్యతకు హామీ పొందింది. ఎఫ్‌టీఏలో భారత్ సభ్యత్వం అంతర్జాతీయ ప్రమాణాలకు లోబడి ఆర్థిక లావాదేవీల సమాచారాన్ని పంచుకునేందుకు స్విట్జర్లాండ్ ప్రభుత్వ ఫెడరల్ టాక్స్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌టీఏ)తో ఒప్పందం కుదుర్చుకున్న 75 దేశాల్లో భారత్ కూడా ఒకటి. ఎఫ్‌టీఏ కింద 65 సభ్య దేశాలకు చెందిన 31 లక్షల అకౌంట్ల వివరాలను ఇప్పటి వరకు స్విస్ ప్రభుత్వం అందజేసింది. ఆయా దేశాల నుంచి 24 లక్షల మంది ఖాతాదారుల సమాచారాన్ని సేకరించింది. -
ప్రభుత్వం చేతికి స్విస్ ఖాతాదారుల వివరాలు
న్యూఢిల్లీ/ బెర్న్: నల్లధనంపై కేంద్రం ప్రకటించిన పోరు క్రమంగా ఫలితాలనిస్తోంది. స్విస్ బ్యాంకుల్లో భారతీయ ఖాతాదారులందరి ఆర్థిక లావాదేవీల వివరాలు సెప్టెంబర్ నుంచి ప్రభుత్వం చేతికి రానున్నాయి. గత ఏడాదిలో మూసివేసిన ఖాతాల వివరాలు కూడా లభించనున్నాయి. ఆటోమేటిక్ ఎక్సే్చంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ (ఏఈవోఐ) విధానం కింద భారత ప్రభుత్వానికి ఈ వివరాలు అందజేయనున్నట్లు స్విట్జర్లాండ్ ఫెడరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్ (ఎఫ్‌డీఎఫ్) వెల్లడించింది. అటు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రివి. మురళీధరన్ కూడా ఈ విషయాలు లోక్‌సభకు తెలిపారు. తొలి సెట్ సెప్టెంబర్‌లో లభిస్తుందని, ఆ తర్వాత నుంచి వార్షిక ప్రాతిపదికన స్విస్ బ్యాంకుల్లో భారతీయ ఖాతాదారుల వివరాలు ప్రభుత్వం చేతికి వస్తాయని ఆయన వివరించారు. ఇప్పటికే ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారన్న అభియోగాలు ఎదుర్కొంటున్న దాదాపు 100 మంది వ్యక్తులు, సంస్థల సమాచారాన్ని భారత్‌కు స్విట్జర్లాండ్ అందిస్తోంది. తాజా వివరాలు దీనికి అదనంగా ఉంటాయి. ఏఈవోఐ కింద తమ ఖాతాదారుల వివరాలను బ్యాంకులు స్విట్జర్లాండ్ ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వాటిని ఆయా ఖాతాదారుల దేశాల పన్ను శాఖ అధికారులకు స్విట్జర్లాండ్ ప్రభుత్వం ఆటోమేటిక్‌గా చేరవేస్తుంది. ఇందులో ఖాతాదారు పేరు, చిరునామా, పుట్టిన తేదీ, ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నంబరు, బ్యాంకు ఖాతా నంబరు మొదలైన వివరాలు ఉంటాయి. -
నల్లకుబేరులను పట్టేయొచ్చు!
బెర్న్/న్యూఢిల్లీ: స్విస్ బ్యాంకుల్లో ఖాతాలు కలిగిన భారతీయుల సమాచారం పొందడానికి కీలక ముందడుగు పడింది. భారత్‌తో ఆటోమేటిక్‌గా ఈ వివరాలు పంచుకోవడానికి ఉద్దేశించిన ఒప్పందానికి స్విట్జర్లాండ్ పార్లమెంట్ కమిటీ ఆమోదం తెలిపింది. భారత్‌తో పాటు మరో 40 దేశాలకు వర్తించే ఈ ఒప్పందానికి స్విట్జర్లాండ్ ఎగువ సభలోని ఆర్థిక వ్యవహారాలు, పన్ను ఎగవేతల కమిషన్ పచ్చజెండా ఊపింది. సమాచార మార్పిడి జరిగిన తరువాత తలెత్తే వివాదాలను ఎదుర్కొనేలా నిబంధనలను పటిష్టం చేయాలని స్విట్జర్లాండ్ ప్రభుత్వానికి సూచించింది. వ్యక్తుల ప్రయోజనాలు పరిరక్షిస్తూనే, సమాచారం కోసం దాఖలైన న్యాయబద్ధ క్లెయిమ్ దుర్వినియోగమయ్యే అవకాశాలున్నప్పుడు వివరాలు వెల్లడించకుండా సవరణ తేవాలని ప్రతిపాదించింది. ఇక తదుపరి దశలో ఈ ఒప్పందాన్ని నవంబర్ 27 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో ఎగువ సభలో ప్రవేశపెడతారు. అక్కడ కూడా ఆమోదం లభిస్తే 2019 నుంచి ఇరు దేశాల మధ్య ఆటోమేటిక్ సమాచార మార్పిడి ప్రారంభమవుతుంది. దిగువ సభ నేషనల్ కౌన్సిల్లో ఈ ఒప్పందం సెప్టెంబర్‌లోనే గట్టెక్కింది. మొత్తం చిట్టా తెలుస్తుంది.... గోప్యతకు మారుపేరైన స్విస్ బ్యాంకుల్లో దాచిపెట్టిన నల్లధనం వివరాలను భారత్ నిరంతరం పొందడానికి ఈ ఒప్పందం దోహదపడుతుంది. ఖాతా సంఖ్య, ఖాతాదారుడి పేరు, చిరునామా, పుట్టిన తేదీ, పన్ను గుర్తింపు సంఖ్య, వడ్డీ, డివిడెండ్, బీమా పాలసీల నుంచి చెల్లింపులు, క్రెడిట్ బ్యాలెన్స్, ఆస్తుల విక్రయం నుంచి లభించిన ఆదాయం తదితర అన్ని విషయాలను పరస్పరం మార్చుకోవచ్చు. ఈ ప్రక్రియ ఎలా కొనసాగుతుందంటే...ఎవరైనా భారతీయునికి స్విట్జర్లాండ్ బ్యాంకులో ఖాతా ఉందనుకుంటే, బ్యాంకు ఆ ఖాతాదారుడికి సంబంధించిన ఆర్థిక సమాచారాన్ని అక్కడి సంబంధిత అధికారులకు సమర్పిస్తుంది. ఆ తరువాత స్విస్ అధికారులు ఆటోమేటిక్‌గా సమాచారాన్ని భారత్‌కు చేరవేస్తారు. భారత్‌లో అధికారులు ఆ వివరాలను పరిశీలించొచ్చు. ఈ ఒప్పందానికి ఆమోదం తెలిపిన ఎగువ సభ కమిటీ...భారత్, ఇతర దేశాలతో ఆటోమేటిక్ సమాచార మార్పిడికి సంబంధించి అదనపు భద్రతా ప్రమాణాలు రూపొందించాలని ప్రభుత్వానికి సూచించింది. సమాచారం పొందుతున్న భారత్ లాంటి దేశాలు నిర్దిష్ట షరతులకు కట్టుబడి ఉంటున్నాయా? లేదా? అని కేబినెట్‌కు సమానమైన ఫెడరల్ కౌన్సిల్ ఎల్లప్పుడూ పర్యవేక్షిస్తూ ఇతర పార్లమెంట్ కమిటీలతో సంప్రదింపులు జరుపుతూ ఉండాలని పేర్కొంది. సమాచారం వెల్లడించిన తరువాత సంబంధిత ఖాతాదారులు స్వదేశాల్లో వేధింపులకు గురయ్యే అవకాశాలున్నాయని కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. వారి ప్రయోజనాల రక్షణార్థం తగిన చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. ‘పనామా కంపెనీల’పై నేరారోపణలు న్యూఢిల్లీ: గతేడాది సంచలనం సృష్టించిన పనామా పేపర్లలో పేర్లు వెల్లడైన ఏడు భారతీయ కంపెనీలపై కొత్త నల్లధన వ్యతిరేక చట్టం కింద నేరారోపణలను ఆదాయపు పన్ను (ఐటీ) విభాగం మోపింది. ఇక్కడి ప్రభుత్వానికి చెప్పకుండా, విదేశాల్లో ఈ కంపెనీలు దాచిన డబ్బు, ఆస్తులను ఐటీ విభాగం గుర్తించిందనీ, వాటిపై దర్యాప్తు ప్రారంభమైందనీ, నేర విచారణ మొదలుపెడతామని అధికారులు తెలిపారు. నేరం రుజువైతే జరిమానాతోపాటు 120 శాతం పన్ను, యజమానులకు 10 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. ఈ కంపెనీలపై త్వరలోనే నగదు అక్రమ రవాణా చట్టం కింద విచారణ ప్రారంభం కానుంది. పనామా పేపర్లకు సంబంధించిన జరిపిన విచారణల్లో రూ.792 కోట్ల అప్రకటిత ఆదాయం బయటపడినట్లు ఇటీవలే కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) వెల్లడించడం తెలిసిందే. -
స్విస్ అకౌంట్లపై సర్జికల్ స్ట్రైక్స్‌కు రంగం సిద్ధం!
న్యూఢిల్లీ : పెద్ద నోట్లను రద్దు చేస్తూ దేశంలో బ్లాక్‌మనీపై సర్జికల్ స్ట్రైక్ చేస్తున్న కేంద్రప్రభుత్వం.. స్విస్ బ్యాంకుల్లో దాగిఉన్న నల్లకుబేరుల బాగోతం కూడా ఇక గుట్టురట్టు చేయనుంది. స్విస్ బ్యాంకుల్లో దాగిఉన్న భారతీయుల అకౌంట్ల ఫైనాన్సియల్ సమాచారాన్ని 2019 నుంచి ఆటోమేటిక్ రూపంలో భారత్ పొందేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు సీబీడీటీ చైర్మన్ సుశిల్ చంద్రా, ఇండియాలో స్విస్ ఎంబసీ మిషన్ డిప్యూటీ చీఫ్ గిల్లెస్ రోడ్యూట్లు ఇరుదేశాల మధ్య ఆటోమేటిక్ రూపంలో సమాచార మార్పిడికి సంబంధించిన జాయింట్ డిక్లరేషన్‌పై ఒప్పందాలు కుదుర్చుకున్నారు. దీంతో విదేశాల్లో దాగిఉన్న లక్షల కోట్ల నల్లధనాన్ని ప్రభుత్వం బయటకి రాబట్టనుంది. నేడు కుదుర్చుకున్న ఈ ఒప్పందంతో 2019 నుంచి స్విట్జర్లాండ్‌లో ఉన్న భారతీయుల ఫైనాన్సియల్ అకౌంట్ల సమాచారం ఆటోమేటిక్‌గా పొందే సౌకర్యం భారత్‌కు లభించనుందని ఆర్థికమంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సమాచార మార్పిడికి సంబంధించి జూన్ 6 ప్రధాని నరేంద్రమోది, జెనీవాలో స్విస్ అధ్యక్షుడు జోహన్ ష్నీదర్-అమ్మన్‌తో భేటీ అయ్యారు. పన్ను ఎగవేసి, స్విస్‌లో దాచుకున్న నల్లధన వివరాలతో పాటు, నల్లకుబేరుల వివరాలను ఆటోమేటిక్‌గా ఇరు ప్రభుత్వాలు మార్పిడి చేసుకునేలా అవకాశం ఉండాలనే దానిపై ఆ దేశ అధ్యక్షుడితో చర్చించారు. మోదీ భేటీ అనంతరం నుంచి సమాచార మార్పిడి ఒప్పందంపై పలు దఫాల చర్చలు జరుగుతూ వచ్చాయి. నల్లధనంపై సర్జికల్ స్టైక్ చేస్తూ దేశంలో ఉన్న పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పలు ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పించాయి. నల్లధనమంతా విదేశాల్లో దాగి ఉందని, స్విస్ బ్యాంకులపై సర్జికల్ స్టైక్ చేయాలంటూ ఉచిత సలహాలు ఇచ్చాయి. వారి విమర్శలకు కళ్లెం వేస్తూ ప్రభుత్వం స్విస్ బ్యాంకుల్లో దాగిఉన్న సమాచారాన్ని ఆటోమేటిక్‌గా రాబట్టడానికి నేడు ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. -
బ్లాక్ మనీ కేసు: ఐదుగురు భారతీయుల పేర్లు వెల్లడి
న్యూఢిల్లీ: నల్లధనం వెలికితీతకు సంబంధించి భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు స్విట్జర్లాండ్ సానుకూలంగా స్పందిస్తోంది. స్విస్ బ్యాంకుల్లో ఖాతాలున్న ఐదుగురు భారతీయుల పేర్లను స్విట్జర్లాండ్ ప్రభుత్వం వెల్లడించింది. వీరిలో ప్రముఖ వ్యాపారవేత్త యాశ్ బిర్లా, ముంబైకు చెందిన గుర్జిత్ సింగ్ కొచర్, ఢిల్లీకి చెందిన మహిళా పారిశ్రామిక వేత్త రికిత శర్మ ఉన్నారు. ఇంతకుముందు స్నేహ్లతా సాహ్నే, సంగీతా సాహ్నేసయ్యద్ పేర్లను బహిర్గతం చేసింది. స్విట్జర్లాండ్ ఫెడరల్ గెజిట్‌లో వీరి పేర్లను బహిర్గతం చేసింది. వీరి ఖాతాలకు సంధించిన సమాచారాలను స్విస్ ప్రభుత్వం భారత్‌కు వివరాలు అందజేసింది. విదేశాల్లో దాచిన నల్లధనాన్ని వెనక్కి రప్పించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కు.. తాజా పరిణామం పెద్ద విజయమని భావిస్తున్నారు. స్విస్ బ్యాంకుల్లో 340 మంది భారతీయులకు ఖాతాలున్నట్టు సిట్ గుర్తించింది. -
నల్లఖాతాలు రెట్టింపు
హెచ్ఎస్బీసీ స్విస్ బ్యాంకులో ఖాతాలున్న భారతీయులు 1,195 మంది.. వెలుగుచూసిన మొత్తం జాబితా.. ఆ ఖాతాల్లో సొమ్ము రూ. 25,420 కోట్లు జాబితాలో అంబానీలు సహా వ్యాపార దిగ్గజాలు, రాజకీయ నేతలు న్యూఢిల్లీ: నల్ల ఖాతాల తాజా జాబితా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. స్విట్జర్లాండ్‌లోని హెచ్ఎస్బీసీ బ్యాంకులో భారతీయుల నల్లఖాతాలు కుప్పలుతెప్పలుగా పెరుగుతూపోతున్నాయి. జెనీవాలోని హెచ్ఎస్బీసీ బ్యాంకు మాజీ ఉద్యోగి హెర్వె ఫాల్కియాని లీక్ చేసిన జాబితాలో 1195మంది ఖాతాదారులు ఉన్నట్లు జాతీయ ఆంగ్ల దినపత్రిక ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వెల్లడి చేయటంతో రాజకీయ వ్యాపార వర్గాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. దేశ వ్యాపార దిగ్గజాలు ముకేశ్ అంబానీ, అనిల్ అంబానీ, ఆనంద్ చాంద్ బర్మన్, రాజన్ నందా, యశోవర్ధన్ బిర్లా, చంద్రు లచ్మన్దాస్ రహేజా, భద్రష్యాం కొఠారి, శ్రావణ్‌గుప్తా, మను ఛాబ్రియా తదితర వాణిజ్యవేత్తలతో పాటు.. నారాయణ్‌రాణే, స్మితా ఠాక్రే తదితర రాజకీయవేత్తల కుటుంబ సభ్యుల పేర్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. వీరిలో చాలా మందికి రెండు అంతకన్నా ఎక్కువ ఖాతాలు ఉండటం విశేషం. 2007 నాటికి జెనీవాలోని హెచ్ఎస్బీసీ బ్యాంకు శాఖలో మొత్తం 1195 మంది భారతీయుల పేర్లతో ఉన్న ఖాతాల్లో సుమారు 4.1 బిలియన్ అమెరికన్ డాలర్లు (దాదాపు రూ. 25,420 కోట్లు) నిధులు ఉన్నట్లు ఆ పత్రిక వెల్లడించింది. కొత్త జాబితాలోని పేర్లన్నిటిపైనా దర్యాప్తు జరుపుతామని కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. కేవలం పేర్లు మాత్రమే సరిపోవని.. కోర్టులో విచారణ జరగాలంటే బలమైన ఆధారాలూ ఉండాలని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. మరిన్ని వివరాలు, ఆధారాల కోసం ఆ జాబితాను బయటపెట్టిన కార్యకర్త (హెర్వె ఫాల్కియాని)తో సంప్రదింపులు జరుపుతున్నట్లు సర్కారు తెలిపింది. మరోవైపు.. నల్లధనంపై దర్యాప్తు కోసం సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సోమవారం సమావేశమై తాజాగా వెలుగుచూసిన నల్లఖాతాల జాబితాపై చర్చించింది. ఇందులో నల్లధనం ఉన్నట్లు ఆధారాలున్న ఖాతాలన్నిటిపైనా దర్యాప్తు చేపడతామని సిట్ వైస్ చైర్మన్ అరిజిత్ పసాయత్ మీడియాతో పేర్కొన్నారు. ఇదిలావుంటే.. తాజా జాబితాలో తమ పేర్లు ఉండటంతో.. అనిల్ అంబానీ, ముఖేశ్ అంబానీ వంటి పలువురు వ్యాపారవేత్తలు, ప్రవాస భారతీయ వాణిజ్యవేత్త నరేశ్‌గోయల్, రాజకీయవేత్త నారాయణ్‌రాణె వంటి వారు తమకు విదేశాల్లో అక్రమంగా ఎటువంటి బ్యాంకు ఖాతాలూ లేవని పేర్కొన్నారు. 428 మంది ఖాతాల్లో రూ. 4,500 కోట్లు... కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ మీడియాతో మాట్లాడిన అనంతరం ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటన చేసింది. ఇంతకుముందు తమకు అందిన హెచ్ఎస్బీసీ బ్యాంకు ఖాతాల జాబితాలో 628 మంది పేర్లు ఉండగా.. అందులో 200 మంది భారత్‌లో నివసించటం లేదని, లేదా వారి వివరాలు తెలియటం లేదని పేర్కొంది. మిగిలిన 428 మందిపై చర్యలు తీసుకోవచ్చని గుర్తించామని.. ఈ ఖాతాల్లో మొత్తం రూ. 4,500 కోట్ల మేర నిధులు ఉన్నట్లు చెప్పింది. స్విస్‌లోని హెచ్ఎస్బీసీ బ్యాంకులో రహస్య ఖాతాలున్న వారి పేర్లు బయటపెట్టిన కార్యకర్తతో భారత ఆదాయ పన్ను శాఖ సంప్రదింపులు జరుపుతోందని తెలిపింది. భారతీయుల రహస్య ఖాతాలకు సంబంధించి ఆయన వద్ద ఉన్న సమాచారాన్ని అందించాల్సిందిగా కోరామని.. ఆయన స్పందన కోసం వేచిచూస్తున్నామని వివరించింది. తొలి జాబితాకు సంబంధించి గత ఏడాది డిసెంబర్ 31 వరకూ 128 కేసుల్లో పన్ను మదింపు (అసెస్మెంట్) పూర్తిచేశామని.. మిగతా కేసుల్లోనూ ఈ ప్రక్రియ తుది దశలో ఉందని, మార్చి 31 నాటికి దర్యాప్తును పూర్తిచేస్తామని పేర్కొంది. బహిర్గతపరచని విదేశీ బ్యాంకు ఖాతాల్లో దాదాపు రూ. 3,150 కోట్ల మేర అప్రకటిత ఆదాయాన్ని పన్ను పరిధిలోకి తెచ్చినట్లు చెప్పింది. పన్ను మదింపు పూర్తయిన 128 కేసుల్లో ఆదాయ పన్ను చట్టం 1961 లోని సెక్షన్ 271(1)(సి) కింద జరిమానా చర్యలు ప్రారంభించినట్లు వివరించింది. ఉద్దేశపూర్వకంగా పన్ను ఎగవేతకు ప్రయత్నించటం, ఖాతాలు, పత్రాలు సమర్పించటంలో వైఫల్యం తదితర అంశాలపై ఇప్పటివరకూ 60 విచారణలు ప్రారంభించినట్లు తెలిపింది. పెద్ద సంఖ్యలో ఇతర కేసుల్లోనూ విచారణ ప్రారంభించటానికి ముందు షోకాజ్ నోటీసులు జారీచేసినట్లు చెప్పింది. ఇక తాజాగా వెల్లడైన జాబితాలో ఉన్న పేర్లలో కొన్ని ప్రభుత్వం వద్ద ఉన్న తొలి జాబితాలో కూడా ఉన్నాయని పేర్కొంది. కొత్త కేసులన్నిటిలోనూ చట్టపరమైన నిబంధనల ప్రకారం అవసరమైన దర్యాప్తు చేపడతామని చెప్పింది. జెనీవా శాఖలోనే రూ.ఆరు లక్షల కోట్లు..! 2006-07 సంవత్సరం నాటికి హెచ్ఎస్బీసీ స్విట్జర్లాండ్ శాఖలో ఉన్న మొత్తం ఖాతాదారుల జాబితాను తాజాగా బయటపెట్టారు. ఇందులో భారత్‌తో సహా 200 పైగా దేశాల వ్యక్తుల ఖాతాలు ఉన్నాయి. వీటిలో మొత్తం 10,000 కోట్ల డాలర్లకు (రూ. 6,00,000 కోట్లు) పైగా నిధులు ఉన్నాయి. ((ఇది అదే ఆర్థిక సంవత్సరం 2006-07లో భారతదేశ వార్షిక బడ్జెట్ రూ. 5,63,000 కోట్ల కన్నా అధికం)) ఇందులో స్విట్జర్లాండ్ దేశీయుల ఖాతాల్లోనే అత్యధిక నగదు (3,120 కోట్ల డాలర్లు) ఉంటే.. రెండో స్థానంలో బ్రిటన్ (2,170 కోట్ల డాలర్లు), మూడో స్థానంలో వెనిజువెలా (1,480 కోట్ల డాలర్లు), నాలుగో స్థానంలో అమెరికా (1,340 కోట్ల డాలర్లు), ఐదో స్థానంలో ఫ్రాన్స్ (1,250 కోట్ల డాలర్లు) ఉన్నాయి. భారతీయుల ఖాతాల్లో 410 కోట్ల డాలర్లు (రూ. 25,420 కోట్లు) ఉన్నాయని తాజా జాబితా చెప్తోంది. దొంగిలించిన సమాచారం: స్విస్ తాజాగా ప్రచురితమైన హెచ్ఎస్బీసీ ఖాతాదారుల జాబితా.. దొంగిలించిన సమాచారమని, 2007 అంతకుముందలి సంవత్సరాలకు చెందినదని స్విట్జర్లాండ్ ప్రభుత్వం పేర్కొంది. అయితే.. 2009 నుంచి తమ ప్రభుత్వ ఆర్థిక విధానాలు మారాయని.. వాటి ప్రకారం నల్లధనం సమస్యపై పోరాడేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఆ ప్రభుత్వ ప్రతినిధి ఒకరు తెలిపారు. పేర్లు సరిపోవు.. ‘‘ఆ ఖాతాదారుల్లో అందరూ అక్రమం కాకపోవచ్చు. వారిలో కొందరు తమ విదేశీ వ్యాపార వ్యవహారాలను పన్ను అధికారులకు వెల్లడించారు. మరికొందరు ప్రవాస భారతీయులు. పటిష్టమైన కేసు నమోదు చేయాలంటే సాక్ష్యాధారాలు అవసరం. కోర్టులో విచారణ ప్రారంభించటానికి కేవలం పేర్లు మాత్రమే సరిపోవు. వాటికి బలమైన ఆధారాలు కావాలి. ఆధారం విశ్వసనీయంగా ఉంటేనే అది కోర్టులో నిలుస్తుంది. నేను గత నెలలో దావోస్‌లో స్విట్జర్లాండ్ ఆర్థికమంత్రితో సహా ఆ దేశ ఉన్నతాధికారులను కలిశాను. రహస్య ఖాతాలకు సంబంధించిన వివరాలను భారత్ కోరేందుకు.. సంబంధిత ఖాతాదారుల ఆదాయపన్ను మదింపును అదనపు సాక్ష్యంగా పరిగణించేందుకు ఆ సందర్భంగా అంగీకారం కుదరింది.’’ - అరుణ్‌జైట్లీ, కేంద్ర ఆర్థికమంత్రి విదేశాల్లో అక్రమ ఖాతాలేవీ లేవు: అంబానీ సోదరులు న్యూఢిల్లీ: స్విస్ బ్యాంకులో అక్రమ ఖాతాలున్న భారతీయులంటూ వెలుగుచూసిన తాజా జాబితాలో తమ పేర్లు ఉండటంపై అంబానీ సోదరులు సహా పలువురు వ్యాపార, రాజకీయ ప్రముఖులు స్పందించారు. తమకు విదేశాల్లో అక్రమ ఖాతాలేవీ లేవని పేర్కొన్నారు. ‘‘రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు కానీ, ముకేశ్ అంబానీకి కానీ ప్రపంచంలో ఎక్కడా అక్రమ బ్యాంకు ఖాతాలు లేవు’’ అని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధికార ప్రతినిధి మీడియాతో చెప్పారు. అలాగే.. అనిల్ అంబానీకి కూడా విదేశాల్లో హెచ్ఎస్బీసీ ఖాతా ఏదీ లేదని ఆయన అధికార ప్రతినిధి తెలిపారు. ‘‘అక్కడ నల్లనిది (ధనం) ఏమీ లేదు.. దాచటానికి ఏమీ లేదు.. ఆందోళన చెందటానికి ఏమీ లేదు.. నేను నియమ, నిబంధనలన్నిటినీ పాటిస్తున్నా’’ అని జెట్ ఎయిర్వేస్ చైర్మన్ నరేష్ గోయల్ ఢిల్లీలో విలేకరులతో పేర్కొన్నారు. తనకు స్విస్ బ్యాంకుల్లో ఎలాంటి ఖాతాలూ లేవని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారాయణ్‌రాణే చెప్పారు. -
నోరు విప్పనేల? గుట్టు చెప్పనేల?
టెలివిజన్ ప్రజాసామ్యం పార్టీలను ఇరకాటాల్లోకి తోసేసే పగుళ్ల మయం. రోజుకు సరిపడే సౌండ్ బైట్లకు అవసరమయ్యేటన్ని డెసిబుల్స్ శబ్దాలతో అది పర్యవసానాల ఆలోచనే రాకుండా ముంచెత్తుతుంది. కాబట్టే ప్రత్యర్థిపై దాడి అతి సునాయసంగా వారికే బెడిసికొడుతుంటుంది. స్విస్ బ్యాంకు ఖాతాలపై ఆర్థిక మంత్రి జైట్లీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ చేపట్టిన దాడి విషయంలో అదే జరిగింది. ఆయనకు దాచుకోవాల్సిందేదీ లేదని, కాపాడాల్సిన వాళ్లెవరూ లేర ని కాంగ్రెస్ విస్మరించింది. స్విస్ బ్యాంకులు వెల్లడి చేయబోయే ఏమంత గౌరవప్రదం కాని జాబితాలోతమ పార్టీకి చె ందిన గొప్ప వ్యక్తులు ఉన్నారని దానికి తెలుసు. కాబట్టే యూపీఏ ప్రభుత్వం స్విస్ ఖాతాల వెల్లడి సమస్యను ఎక్కడికీ చేర్చని నత్తనడక దారి పట్టించింది. మౌనంగా భరించడమే బాధను అనుభవించే అత్యుత్తమ మార్గమంటూ మతం చాలానే బోధిస్తుంది. దురదృష్టవశాత్తూ మౌనం ప్రజాస్వామ్య సహజ లక్షణం కాదు. ఎన్నికల్లో ఓడిన వారి మొహంలో బాధ కొట్ట వచ్చినట్టు కనబడుతున్నప్పుడు సైతం మౌనం వహించడం అంతగా కనబడదు. మరులు గొలిపే టెలివిజన్ ప్రలోభపెడుతుండగా నోరు విప్పాలా, వద్దా? అనే సందిగ్ధం మరింత పెరుగుతుంది. టీవీ ఎప్పుడూ మాట్లాడమనే శాసిస్తుంది. చట్ట విరుద్ధమైన స్విస్ బ్యాంకు ఖాతాలపై కాంగ్రెస్ మౌనం వహించడమే ఆ పార్టీ ప్రయోజనాలకు తగిన అత్యుత్తమమైన పని అయి ఉండేది. కానీ అందుకు విరుద్ధంగా అది ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి వ్యతిరేకంగా మీడియా దాడిని చేపట్టింది. జైట్లీకి దాచుకోవాల్సినదిగానీ, కాపాడాలని ఆసక్తి చూపా ల్సిన వాళ్లు గానీ లేరు. ఈ సామాన్యమైన విషయాన్ని ఆ పార్టీ, దాని మద్దతుదార్లు విస్మరించారు. భారతీయుల స్విస్ ఖాతాల సమస్యపై యూపీఏ ప్రభుత్వం స్విట్జర్లాండ్ ప్రభుత్వంతో ఒక ద్వైపాక్షిక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దాని ప్రకారం మన ప్రభుత్వం చార్జిషీట్లను దాఖలు చేసిన తర్వాత మాత్రమే స్విస్ బ్యాంకులు ఆ భారతీయ ఖాతాదార్ల పేర్లను వెల్లడించాల్సి ఉంటుంది. గత ప్రభుత్వం సృష్టించిన ఈ సాంకేతికపరమైన అడ్డంకి కారణంగా స్విస్ ఖాతాదార్ల పేర్లను వెల్లడి చేయడం కేవలం కొంత సమయం పట్టే ప్రక్రియ మాత్రమే. స్విస్ బ్యాంకులు వెల్లడి చేయబోయే ఏమంత గౌరవప్రదం కాని ఆ జాబితాలో తమ పార్టీకి చెందిన గొప్ప వ్యక్తులు ఉన్నారని కాంగ్రెస్‌కు తెలుసు. కాబట్టే అది తన మోసకారితనానికి ఈ సాంకేతిక అడ్డంకిని నిరంతర రక్షణకవచంగా వాడుకుంది. నల్లధనం సమస్యను బహు లాఘవంగా దాటవేయడం కోసం యూపీఏ ఓ అంతుబట్టని వ్యూహాన్ని అనుసరించింది. స్విస్ ఖాతాదార్ల పేర్లను వెల్లడించే ప్రక్రియను అది ఎక్కడికీ చేర్చని ఓ నత్తనడక దారి పట్టించింది. తద్వారా 2014 సార్వత్రిక ఎన్నికల వరకు గడువును సంపాదించడమే దాని ఏకైక లక్ష్యం. దిగ్భ్రాంతికరమైన ఏ మాయో జరిగి కాంగ్రెస్ గనుక ఈ ఏడాది ఎన్నికల్లో ఏదో ఒక అతుకుల బొంత కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి తగినన్ని సీట్లను దక్కించుకుని ఉంటే... ఆ నత్తనడక దారి కూడా మటుమాయమై ఉండేది. నల్లధనం బందిపోట్లు నవ్వులు చిందిస్తూ స్విస్ బ్యాంకుల బాట పట్టేవారు. అందుకు నిదర్శనం కావాలంటే, స్విట్జర్లాండ్ కేంద్ర బ్యాంకు వెల్లడించిన ఒక వాస్తవాన్ని ‘హిందుస్థాన్ టైమ్స్’ పత్రిక ఈ నెల 22న ప్రచురించింది. దాన్ని చూడండి: ‘‘స్విస్ నేషనల్ బ్యాంకు తాజా సమాచారం ప్రకారం స్విస్ బ్యాంకుల్లోని భారతీయుల ఖాతాల్లోని డబ్బు 2013లో 40 శాతం పెరిగింది. 2012లో 134 వందల కోట్ల స్విస్ ఫ్రాంకులుగా (రూ.9,514 కోట్లు) ఉన్న ఆ డబ్బు 2013లో దాదాపు రెండు వందల కోట్ల స్విస్ ఫ్రాంకులకు (రూ. 14,000 కోట్లు) చేరింది.’’ హఠాత్తుగా ఇలా చట్ట విరుద్ధ మార్గాల్లో స్విస్ ఖాతాల్లోని నల్లధనం రూ. 4,500 కోట్ల హైజంప్ చేయడానికి కారణమేమిటి? అక్రమార్జనాపరుల డబ్బులతో నిండిన బ్యాంకుల నుండి మాత్రమే వచ్చే రాబడిపై బతికే జలగల్లాంటి చిన్న చిన్న ద్వీప దేశాలు కూడా ఉన్నాయి. ఆర్థిక నేరాల వల్ల అత్యధికంగా లబ్ధిపొందేవి అవే. అలాంటి చోట్లకు ఇంకెంత డబ్బు తరలిపోయిందో మనకు తెలియదు. తాము ఖాతాదార్లకు చేసిన ప్రమాణాన్ని పాటిస్తున్నామనే సాకుతో ఆ బ్యాంకులు తమ వద్ద డిపాజిట్ చేస్తున్న డబ్బు ఎక్కడిదని అడగవు. మన దేశం నుండి డబ్బును బయటకు తరలించింది ఎవరో విద్యావంతులమైన మనం తేలికగానే ఊహించగలం. ఇందులో కొంత భాగం వ్యాపారస్తులు పంపినదై ఉంటుంది. కానీ 2013 వ్యాపారపరంగా వికాసాన్ని చవి చూసిన సంవత్సరమేమీ కాదు. పైగా తీవ్ర ఆర్థిక క్షీణత కనిపించింది. అయితే ఒక రంగం మాత్రం భారీ గెంతు వేసి మరీ వృద్ధి చెందింది... అది అవినీతి. ఈ క్రీడలో పెద్ద పెద్ద ఆటగాళ్లంతా అధికార వర్గ రాజకీయవేత్తలే. 2014 సార్వత్రిక ఎన్నికలకు నాలుగు నెలల ముందు 2013 సంవత్సరం ముగియడమనే విషయానికి ప్రాధాన్యం ఉంది. చలి కాలం వచ్చేసరికే పూర్తిగా గుడ్డివాళ్లయితే తప్ప రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి గురికానున్నదని అందరికీ సుస్పష్టంగా తెలుసు. ఇంకా ఏమైనా అనుమానాలు మిగిలి ఉంటే అవి కూడా సెప్టెంబర్‌లో నరేంద్ర మోదీని బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడంతో, ఆయన సభలకు ప్రజలు చరిత్రాత్మక స్థాయిలో విరగబడు తుండటంతో మటుమాయమై పోయి ఉంటాయి. యూపీఏ ప్రభుత్వంతో కుమ్మక్కు, భాగస్వామ్యాల సువర్ణ దశాబ్దం వేగంగా ముగింపునకు వస్తోందని కేటుగాళ్లంతా అప్పుడే గ్రహించారని, తమ అక్రమార్జనను స్విస్ (ఇంకా అలాంటి ఇతర) ఖాతాలకు బదలాయించడం ప్రారంభించారని నా అనుమానం. ఈ దోపిడీ సంపదను పట్టుకోడానికి నరేంద్ర మోదీ ఈ నాలుగు నెలల్లో, కాంగ్రెస్ పదేళ్లలో చేసిన దానికంటే ఎక్కువే చేశారు. ‘‘నేను దొంగతనం చేయను, ఎవరు దొంగతనం చేయడాన్నీ అనుమతించను’’ అంటూ ప్రధాని ఎలాంటి అస్పష్టతకు తావులేని విధంగా తమ ప్రభుత్వానికి ఒక నైతిక రేఖను గీశారు. తద్విరుద్ధంగా మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ ‘‘సంకీర్ణం ఒత్తిడులు’’ సాకుతో తన మంత్రి వర్గంలోని దొంగలు దేశాన్ని దోచేస్తుంటే మరో దిక్కుకు చూస్తూ కూచున్నారు. ఎంత తక్కువ చేసి చూసినా గానీ ఇలాంటి సాకును చూపడం సిగ్గుచేటుతనమే. అతి పలచటి ఈ ముసుగులో నమ్మశక్యం కానంతటి పెద్ద మొత్తాల్లో దొంగిలించిన సొత్తు దేశం బయటకు దాటించేశారు. దేశం నుండి ఎంత మొత్తం సంపద ఇలా మటుమాయమైందో కచ్చితంగా అంచనా కట్టడం దాదాపు అసాధ్యమే. కానీ వాషింగ్టన్కు చెందిన ‘గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటిగ్రిటీ’ సంస్థ 1947 నుండి తరలిపోయిన సంపద మొత్తాన్ని 462 వందల కోట్ల డాలర్లుగా లేదా రూ. 29 లక్షల కోట్లుగా అంచనా వేసింది. ఇందులో అత్యధిక భాగం ఇటీవలి ఏళ్లలోనే దేశం వదిలిపోయినదని భావించడం సమంజసమే. దశాబ్దకాలపు యూపీఏ హయాంలోనైతే ఆ విష యంలో తొక్కిసలాట జరిగిందని అనుకోవచ్చు. వెళ్లడానికే తప్ప తిరిగిరావడా నికి వీల్లేని వన్ వే స్ట్రీట్ లాగానే ఇంతవరకు ఈ వ్యవహారం సాగుతోంది. ఆ స్వేచ్ఛాయుత రవాణా ముసిగిపోయింది. టెలివిజన్ ప్రజాస్వామ్యం రాజకీయ పార్టీలను ఇరకాటాల్లోకి తోసేసే పగుళ్ల మయం. రోజుకు సరిపడే సౌండ్ బైట్లకు అవసరమయ్యేటన్ని డెసిబుల్స్ శబ్దాలతో అది పర్యవసానాల ఫలితాల గురించిన ఆలోచనే రాకుండా వారిని ముంచెత్తుతుంది. కాబట్టే ప్రత్యర్థిపై చేసిన దాడి అతి సునాయాసంగా వారిపైకే బెడిసికొట్టేదిగా మారుతుంటుంది. ప్రత్యేకించి అ దాడికి ఎంచుకున్న లక్ష్యం భ్రమాత్మకమైనది అయినప్పుడు బె డిసి కొట్టే దెబ్బ నుండి తప్పుకోవడం సైతం సులభం కాదు. విచక్షణను ఉపయోగించాలనుకోవడం, సహనం వహించడం మొట్టమొదట చేయాల్సిన మరింత తెలివైన పని అవుతుంది. ఎం.జె. అక్బర్ సీనియర్ సంపాదకులు