నల్లఖాతాలు రెట్టింపు | Govt, SIT widen black money probe as new HSBC list emerges | Sakshi
Sakshi News home page

నల్లఖాతాలు రెట్టింపు

Published Mon, Feb 9 2015 11:58 PM | Last Updated on Wed, Apr 3 2019 5:16 PM

నల్లఖాతాలు రెట్టింపు - Sakshi

నల్లఖాతాలు రెట్టింపు

హెచ్‌ఎస్‌బీసీ స్విస్ బ్యాంకులో ఖాతాలున్న భారతీయులు 1,195 మంది..
వెలుగుచూసిన మొత్తం జాబితా..
ఆ ఖాతాల్లో సొమ్ము రూ. 25,420 కోట్లు  
జాబితాలో అంబానీలు సహా వ్యాపార దిగ్గజాలు, రాజకీయ నేతలు


న్యూఢిల్లీ: నల్ల ఖాతాల తాజా జాబితా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. స్విట్జర్లాండ్‌లోని హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకులో భారతీయుల నల్లఖాతాలు కుప్పలుతెప్పలుగా పెరుగుతూపోతున్నాయి. జెనీవాలోని హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకు మాజీ ఉద్యోగి హెర్వె ఫాల్కియాని లీక్ చేసిన జాబితాలో 1195మంది ఖాతాదారులు ఉన్నట్లు జాతీయ ఆంగ్ల దినపత్రిక ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వెల్లడి చేయటంతో రాజకీయ వ్యాపార వర్గాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. దేశ వ్యాపార దిగ్గజాలు  ముకేశ్ అంబానీ, అనిల్ అంబానీ, ఆనంద్ చాంద్ బర్మన్, రాజన్ నందా, యశోవర్ధన్ బిర్లా, చంద్రు లచ్మన్‌దాస్ రహేజా, భద్రష్యాం కొఠారి, శ్రావణ్‌గుప్తా, మను ఛాబ్రియా తదితర వాణిజ్యవేత్తలతో పాటు.. నారాయణ్‌రాణే, స్మితా ఠాక్రే తదితర రాజకీయవేత్తల కుటుంబ సభ్యుల పేర్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. వీరిలో చాలా మందికి రెండు అంతకన్నా ఎక్కువ ఖాతాలు ఉండటం విశేషం. 2007 నాటికి జెనీవాలోని హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకు శాఖలో మొత్తం 1195 మంది భారతీయుల పేర్లతో ఉన్న ఖాతాల్లో సుమారు 4.1 బిలియన్ అమెరికన్ డాలర్లు (దాదాపు రూ. 25,420 కోట్లు) నిధులు ఉన్నట్లు ఆ పత్రిక వెల్లడించింది.

కొత్త జాబితాలోని పేర్లన్నిటిపైనా దర్యాప్తు జరుపుతామని కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. కేవలం పేర్లు మాత్రమే సరిపోవని.. కోర్టులో విచారణ జరగాలంటే బలమైన ఆధారాలూ ఉండాలని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. మరిన్ని వివరాలు, ఆధారాల కోసం ఆ జాబితాను బయటపెట్టిన కార్యకర్త (హెర్వె ఫాల్కియాని)తో సంప్రదింపులు జరుపుతున్నట్లు సర్కారు తెలిపింది. మరోవైపు.. నల్లధనంపై దర్యాప్తు కోసం సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సోమవారం సమావేశమై తాజాగా వెలుగుచూసిన నల్లఖాతాల జాబితాపై చర్చించింది. ఇందులో నల్లధనం ఉన్నట్లు ఆధారాలున్న ఖాతాలన్నిటిపైనా దర్యాప్తు చేపడతామని సిట్ వైస్ చైర్మన్ అరిజిత్ పసాయత్ మీడియాతో పేర్కొన్నారు. ఇదిలావుంటే.. తాజా జాబితాలో తమ పేర్లు ఉండటంతో.. అనిల్ అంబానీ, ముఖేశ్ అంబానీ వంటి పలువురు వ్యాపారవేత్తలు, ప్రవాస భారతీయ వాణిజ్యవేత్త నరేశ్‌గోయల్, రాజకీయవేత్త నారాయణ్‌రాణె వంటి వారు తమకు విదేశాల్లో అక్రమంగా ఎటువంటి బ్యాంకు ఖాతాలూ లేవని పేర్కొన్నారు.

428 మంది ఖాతాల్లో రూ. 4,500 కోట్లు...
కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ మీడియాతో మాట్లాడిన అనంతరం ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటన చేసింది. ఇంతకుముందు తమకు అందిన హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకు ఖాతాల జాబితాలో 628 మంది పేర్లు ఉండగా.. అందులో 200 మంది భారత్‌లో నివసించటం లేదని, లేదా వారి వివరాలు తెలియటం లేదని పేర్కొంది. మిగిలిన 428 మందిపై చర్యలు తీసుకోవచ్చని గుర్తించామని.. ఈ ఖాతాల్లో మొత్తం రూ. 4,500 కోట్ల మేర నిధులు ఉన్నట్లు చెప్పింది.

స్విస్‌లోని హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకులో రహస్య ఖాతాలున్న వారి పేర్లు బయటపెట్టిన కార్యకర్తతో భారత ఆదాయ పన్ను శాఖ సంప్రదింపులు జరుపుతోందని తెలిపింది. భారతీయుల రహస్య ఖాతాలకు సంబంధించి ఆయన వద్ద ఉన్న సమాచారాన్ని అందించాల్సిందిగా కోరామని.. ఆయన స్పందన కోసం వేచిచూస్తున్నామని వివరించింది. తొలి జాబితాకు సంబంధించి గత ఏడాది డిసెంబర్ 31 వరకూ 128 కేసుల్లో పన్ను మదింపు (అసెస్‌మెంట్) పూర్తిచేశామని.. మిగతా కేసుల్లోనూ ఈ ప్రక్రియ తుది దశలో ఉందని, మార్చి 31 నాటికి దర్యాప్తును పూర్తిచేస్తామని పేర్కొంది.

బహిర్గతపరచని విదేశీ బ్యాంకు ఖాతాల్లో దాదాపు రూ. 3,150 కోట్ల మేర అప్రకటిత ఆదాయాన్ని పన్ను పరిధిలోకి తెచ్చినట్లు చెప్పింది. పన్ను మదింపు పూర్తయిన 128 కేసుల్లో ఆదాయ పన్ను చట్టం 1961 లోని సెక్షన్ 271(1)(సి) కింద జరిమానా చర్యలు ప్రారంభించినట్లు వివరించింది. ఉద్దేశపూర్వకంగా పన్ను ఎగవేతకు ప్రయత్నించటం, ఖాతాలు, పత్రాలు సమర్పించటంలో వైఫల్యం తదితర అంశాలపై ఇప్పటివరకూ 60 విచారణలు ప్రారంభించినట్లు తెలిపింది. పెద్ద సంఖ్యలో ఇతర కేసుల్లోనూ విచారణ ప్రారంభించటానికి ముందు షోకాజ్ నోటీసులు జారీచేసినట్లు చెప్పింది. ఇక తాజాగా వెల్లడైన జాబితాలో ఉన్న పేర్లలో కొన్ని ప్రభుత్వం వద్ద ఉన్న తొలి జాబితాలో కూడా ఉన్నాయని పేర్కొంది. కొత్త కేసులన్నిటిలోనూ చట్టపరమైన నిబంధనల ప్రకారం అవసరమైన దర్యాప్తు చేపడతామని చెప్పింది.

జెనీవా శాఖలోనే రూ.ఆరు లక్షల కోట్లు..!
2006-07 సంవత్సరం నాటికి హెచ్‌ఎస్‌బీసీ స్విట్జర్లాండ్ శాఖలో ఉన్న మొత్తం ఖాతాదారుల జాబితాను తాజాగా బయటపెట్టారు. ఇందులో భారత్‌తో సహా 200 పైగా దేశాల వ్యక్తుల ఖాతాలు ఉన్నాయి. వీటిలో మొత్తం 10,000 కోట్ల డాలర్లకు (రూ. 6,00,000 కోట్లు) పైగా నిధులు ఉన్నాయి. ((ఇది అదే ఆర్థిక సంవత్సరం 2006-07లో భారతదేశ వార్షిక బడ్జెట్ రూ. 5,63,000 కోట్ల కన్నా అధికం)) ఇందులో స్విట్జర్లాండ్ దేశీయుల ఖాతాల్లోనే అత్యధిక నగదు (3,120 కోట్ల డాలర్లు) ఉంటే.. రెండో స్థానంలో బ్రిటన్ (2,170 కోట్ల డాలర్లు), మూడో స్థానంలో వెనిజువెలా (1,480 కోట్ల డాలర్లు), నాలుగో స్థానంలో అమెరికా (1,340 కోట్ల డాలర్లు), ఐదో స్థానంలో ఫ్రాన్స్ (1,250 కోట్ల డాలర్లు) ఉన్నాయి. భారతీయుల ఖాతాల్లో 410 కోట్ల డాలర్లు (రూ. 25,420 కోట్లు) ఉన్నాయని తాజా జాబితా చెప్తోంది.

దొంగిలించిన సమాచారం: స్విస్
తాజాగా ప్రచురితమైన హెచ్‌ఎస్‌బీసీ ఖాతాదారుల జాబితా.. దొంగిలించిన సమాచారమని, 2007 అంతకుముందలి సంవత్సరాలకు చెందినదని స్విట్జర్లాండ్ ప్రభుత్వం పేర్కొంది. అయితే.. 2009 నుంచి తమ ప్రభుత్వ ఆర్థిక విధానాలు మారాయని.. వాటి ప్రకారం నల్లధనం సమస్యపై పోరాడేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఆ ప్రభుత్వ ప్రతినిధి ఒకరు తెలిపారు.

పేర్లు సరిపోవు..
‘‘ఆ ఖాతాదారుల్లో అందరూ అక్రమం కాకపోవచ్చు. వారిలో కొందరు తమ విదేశీ వ్యాపార వ్యవహారాలను పన్ను అధికారులకు వెల్లడించారు. మరికొందరు ప్రవాస భారతీయులు. పటిష్టమైన కేసు నమోదు చేయాలంటే సాక్ష్యాధారాలు అవసరం. కోర్టులో విచారణ ప్రారంభించటానికి కేవలం పేర్లు మాత్రమే సరిపోవు. వాటికి బలమైన ఆధారాలు కావాలి. ఆధారం విశ్వసనీయంగా ఉంటేనే అది కోర్టులో నిలుస్తుంది. నేను గత నెలలో దావోస్‌లో స్విట్జర్లాండ్ ఆర్థికమంత్రితో సహా ఆ దేశ ఉన్నతాధికారులను కలిశాను. రహస్య ఖాతాలకు సంబంధించిన వివరాలను భారత్ కోరేందుకు.. సంబంధిత ఖాతాదారుల ఆదాయపన్ను మదింపును అదనపు సాక్ష్యంగా పరిగణించేందుకు ఆ సందర్భంగా అంగీకారం కుదరింది.’’
- అరుణ్‌జైట్లీ, కేంద్ర ఆర్థికమంత్రి

విదేశాల్లో అక్రమ ఖాతాలేవీ లేవు: అంబానీ సోదరులు
న్యూఢిల్లీ: స్విస్ బ్యాంకులో అక్రమ ఖాతాలున్న భారతీయులంటూ వెలుగుచూసిన తాజా జాబితాలో తమ పేర్లు ఉండటంపై అంబానీ సోదరులు సహా పలువురు వ్యాపార, రాజకీయ ప్రముఖులు స్పందించారు. తమకు విదేశాల్లో అక్రమ ఖాతాలేవీ లేవని పేర్కొన్నారు. ‘‘రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు కానీ, ముకేశ్ అంబానీకి కానీ ప్రపంచంలో ఎక్కడా అక్రమ బ్యాంకు ఖాతాలు లేవు’’ అని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధికార ప్రతినిధి మీడియాతో చెప్పారు.

అలాగే.. అనిల్ అంబానీకి కూడా విదేశాల్లో హెచ్‌ఎస్‌బీసీ ఖాతా ఏదీ లేదని ఆయన అధికార ప్రతినిధి తెలిపారు. ‘‘అక్కడ నల్లనిది (ధనం) ఏమీ లేదు.. దాచటానికి ఏమీ లేదు.. ఆందోళన చెందటానికి ఏమీ లేదు.. నేను నియమ, నిబంధనలన్నిటినీ పాటిస్తున్నా’’ అని జెట్ ఎయిర్‌వేస్ చైర్మన్ నరేష్ గోయల్ ఢిల్లీలో విలేకరులతో పేర్కొన్నారు. తనకు స్విస్ బ్యాంకుల్లో ఎలాంటి ఖాతాలూ లేవని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారాయణ్‌రాణే చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement