ఐటీకి చిక్కిన రూ.16,200 కోట్ల బ్లాక్మనీ
ఐటీకి చిక్కిన రూ.16,200 కోట్ల బ్లాక్మనీ
Published Tue, Feb 7 2017 7:18 PM | Last Updated on Wed, Apr 3 2019 5:16 PM
న్యూఢిల్లీ : భారతీయులు విదేశాల్లో గుట్టగుట్టలుగా నగదు దాచారనే దానిపై అంతర్జాతీయ సంస్థలు విడుదల చేసిన లీకేజీలపై ఆదాయపు పన్ను అధికారులు జరిపిన విచారణలో భారీగా బ్లాక్మనీ పట్టుబడినట్టు ప్రభుత్వం తెలిపింది. ఐటీ అధికారుల విచారణలో విదేశాల్లో దాగిఉన్న రూ.16,200 కోట్లకు పైగా నల్లధనం వెలికితీశామని ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ మంగళవారం పార్లమెంట్కు చెప్పారు. ఓ క్రమ పద్ధతిలో జరిపిన దాడుల్లో రూ.8,200 కోట్ల లెక్కలో చూపని నగదు పట్టుబడిందని, హెచ్ఎస్బీసీలో వీటిని దాచారని పేర్కొన్నారు.
అంతర్జాతీయ పరిశోధనాత్మక పాత్రికేయుల కూటమి (ఐసీఐజే) బయటపెట్టిన రహస్యపత్రాలకు సంబంధించిన దానిలో భారతీయులకు సంబంధించిన పలు విదేశీ అకౌంట్లను వెలికితీశామన్నారు. వీటిలో మరో రూ.8000 కోట్లు పట్టుబడిందని జైట్లీ రాజ్యసభకు తెలిపారు. అయితే ఇంకా ఎంత మొత్తంలో భారతీయుల బ్లాక్మనీ విదేశాల్లో దాగివుందో అధికారిక అంచనాకు రాలేదని వివరించారు. విదేశాల్లో దాచిఉంచిన భారతీయుల బ్లాక్మనీపై ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
Advertisement