►మీరు తీసుకున్న ఒక్క నిర్ణయమైనా చెప్పండి?: కాంగ్రెస్‌కు జైట్లీ సవాల్
►నోట్ల సమస్యలకు డిసెంబర్ 30 కల్లా పరిష్కారం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అవినీతి, నల్లధనాన్ని అరికట్టేందుకు నోట్లరద్దు పథకాన్ని అమలు చేయటంపై విపక్షాలు చేస్తున్న రాద్ధాంతంపై కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ మండిపడ్డారు. పదేళ్లు అధికారంలో (యూపీఏ-1,2 హయాంలో) ఉన్నప్పుడు అవినీతి ని అరికట్టేందుకు కాంగ్రెస్ తీసుకున్న ఒక్క చర్యనైనా చూపాలని సవాల్ విసిరారు. లోక్‌సభలో నిధుల విడుదలపై సప్లిమెంటరీ డిమాండ్లపై చర్చ సందర్భంగా జైట్లీ విపక్ష విమర్శలపై ఘాటుగా స్పందించారు. నల్లధనం ఉన్నవారు 50 శాతం పన్ను చెల్లించి మిగిలిన డబ్బును చెలామణిలోకి తెచ్చుకునేలా కేంద్రం నిబంధనలు సడలిస్తోందన్న కాంగ్రెస్ విమర్శలను తిప్పికొట్టారు.
‘నల్లధనంపై పదేళ్ల అధికారంలో కాంగ్రెస్ తీసుకున్న ఒక్క నిర్ణయాన్నైనా చూపించమని సవాల్ చేస్తున్నా. 50 శాతం నల్లధనాన్ని వైట్ చేసుకునే అవకాశం ఇచ్చామన్నది సరికాదు. ఇలాంటి మొత్తంపై 65 శాతం పన్ను ప్రభుత్వానికి దక్కుతుంది. ఇది స్వచ్చంద ఆదాయ వెల్లడి పథకం కన్నా 8 శాతం అధికం’ అని జైట్లీ తెలిపారు. నోట్లరద్దుతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రధాని మోదీ చెప్పినట్లుగా డిసెంబర్ 30 కల్లా సాధారణ స్థితికి వస్తాయన్నారు. కాగా, లోక్‌సభలో గురువారం కూడా నోట్లరద్దుపై విపక్షాల ఆందోళన కొనసాగినా.. మూజువాణీ ఓటుతో పలు అనుబంధ పద్దులను ప్రభుత్వం ఆమోదింపజేసుకుంది. కాగా, అధికార, విపక్షాల మధ్య వాగ్యుద్ధంతో రాజ్యసభ పూర్తిగా స్తంభించింది.
పదేళ్లలో అవినీతిపై ఏం చేశారు?
Published Fri, Dec 9 2016 3:06 AM | Last Updated on Wed, Apr 3 2019 5:16 PM
Advertisement