'దమ్ముంటే నల్లకుబేరుల జాబితా వెల్లడించు'
న్యూఢిల్లీ : దమ్ముంటే నల్లకుబేరుల జాబితాలోని పేర్లు వెల్లడించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి దిగ్విజయ్ సింగ్ గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి సవాల్ విసిరారు. నల్లధనం జాబితాలో పేర్లు ఉన్నాయంటూ కాంగ్రెస్ పార్టీలోని కొందరి పేర్లు లీక్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కావాలనే కుట్ర చేస్తుందని ఆయన ఆరోపించారు. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా వ్యవహారిస్తుందని దిగ్విజయ్ సింగ్ విమర్శించారు.
విదేశాల్లో నల్లధనం దాచిన వారి వివరాలు వెల్లడైతే కాంగ్రెస్ పార్టీ వారికి ఇబ్బందులు తప్పవంటూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. గత యూపీఏ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన కేంద్ర మంత్రి పేరు ఆ జాబితాలో ఉందంటూ జైట్లీ ఈ సందర్భంగా సంకేతాలిచ్చి సంచలనం సృష్టించారు. ఈ నేపథ్యంలో అరుణ్ జైట్లీ వ్యాఖ్యలపై స్పందిస్తూ నల్లధనం జాబితాలో పేర్లు దమ్ముంటే బహిర్గతం చేయాలని జైట్లీకి సవాల్ విసిరారు.