కునికిపాటే మేలుకొలుపు | NDA to the UPA Government is now copy only the budjet | Sakshi
Sakshi News home page

కునికిపాటే మేలుకొలుపు

Published Sun, Jul 13 2014 1:38 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

కునికిపాటే మేలుకొలుపు - Sakshi

కునికిపాటే మేలుకొలుపు

యూపీఏ బడ్జెట్లను ఎన్డీయే కాపీ కొడుతున్నదన్న కాంగ్రెస్ మొట్టమొదటి విమర్శనాస్త్రం నమస్కారబాణంలాంటిది. అదే నిజమైతే కాంగ్రెస్ జైట్లీని ప్రశంసించి ఉండాల్సింది. లేదంటే మన్మోహన్, చిదంబరం రూపొందించిన బడ్జెట్లన్నీ చెత్త కుప్పలేననే కొత్త వైఖరిని ఇప్పుడు కాంగ్రెస్ తీసుకుందా?
 
అత్యంత ఆసక్తికరమైన ‘నిదురిస్తున్న నేత’ ఉదంతానికి సంబంధించి నా సానుభూతంతా రాహుల్ గాంధీపైనే. అలసట కలిగించే ఢిల్లీ వేసవి వేడి గాలులకు భారత ప్రజాస్వామ్య దేవాలయాంతర్భాగంలోని మహత్తరమైన లోక్‌సభ దర్బారులో నిద్ర అంటువ్యాధిలా ప్రబలిపోతుంది.  కొందరి ఉపన్యాసాలు సైతం దాన్ని అడ్డగించలేవు. రాహుల్  కంటే మెరుగైన పార్లమెంటేరియన్లు సైతం.... మధ్యాహ్న భోజనానంతర సమయంలో కడుపులోని మృష్టాన్నం మస్తు, మనస్సులోని మగత కలిసి విషంలాంటి నిద్ర మత్తు ఆవహించేట్టు చేస్తుంటే ఆవలింతలను ఆపుకోవడం కోసం తంటాలు పడాల్సివస్తుండేది.

సుదూర గతంలోనైతే ఆ సుఖవంతుల సమాజం దాని అత్యుత్తమ సాంప్రదాయాలననుసరించి ఉద్దేశపూర్వకంగానే ఆ విషయాన్ని జాగ్రత్తగా కాపాడాల్సిన రహస్యంగా భావించి దాచి ఉంచడం రివాజుగా ఉండేది. పార్లమెంటు సభ్యులకు మరింత దృశ్యమాన ఖ్యాతిని ఆర్జించిపెట్టాలని స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ సభలోని ప్రసంగాలను అప్పటికప్పుడే రికార్డు చేసి టీవీలో ప్రసారం చేయడాన్ని అనుమతించారు. బుల్లి తెర వేలుపులుగా వెలిగిపోయేందుకు లభించిన ఆ అవకాశాన్ని ఎంపీలు స్వాగతించారు. కెమెరాలకు హృదయం ఉండదు, వాటికి పనిచెప్పే కెమెరామన్లు స్వభావరీత్యానే కొంటె కోణంగులనే విషయాన్ని వాళ్లు పూర్తిగా గ్రహించలేకపోయారు. ఈ కోణంగులు సరిగ్గా తమకు కావాల్సిన సమయం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తూ ఎంతటివారినైనా ఇట్టే పట్టేస్తారు.   

 సభ ధరల పెరుగుదల సమస్యపై చర్చ సాగిస్తుండగా బొజ్జ నిండా పాలు తాగి బజ్జున్న పాపాయిలా రాహుల్ గాఢనిద్రలోకి జారిపోయి వారికి దొరికిపోయాడు. అలాంటి విపరీత దృశ్యాలను కత్తిరించేయడం కోసం రాహుల్ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖలో నమ్మకస్తులైన నౌకర్లను నియమించుకోవడం మరచినట్టుంది. ఆ శాఖ అధికారులు ఎవరూ చెప్పాల్సిన పని లేకుండానే అలాంటి సందర్భాల్లో స్క్రీన్‌ను ఖాళీగా ఉంచేసేంతటి ప్రభుభక్తి పరాయణత దేశ రాజధానిలోని అధికార యంత్రాంగపు సంస్కృతి. అయితే అది కాంగ్రెస్ అధికారంలో ఉన్న రోజులనాటి సంగతి. రాహుల్ పవళింపు సేవను చూపిన అదే శాఖ అధికారులు రాహుల్ గనుక మెడను తలపై నిటారుగా నిలిపి అత్యంత సావధానంగా తమ పార్టీ ఎన్‌డీఏకు వ్యతిరేక ఎదురుదాడికి నాయకత్వం వహిస్తూ ఉండటాన్ని చూపడానికి కూడా సిద్ధంగానే ఉంటారు. ఓటమికి అర్థాన్ని రాహుల్ పూర్తిగా గ్రహించారో లేదో నాకు తెలీదు. కానీ విషాదకరమైన ఆయన పార్లమెంటు కునుకు మాత్రం... శ్లేషాత్మకంగా చెప్పాలంటే మేలు కొలుపు హెచ్చరిక.  

ఆ మరుసటి రోజు అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించడానికి లేచినప్పుడు పార్లమెంటులో కనిపించిన దృశ్యం మనసుకు హత్తుకుంది. బిడ్డల పట్ల అత్యంత శ్రద్ధ చూపే తల్లిలాగా సోనియాగాంధీ ఇక ఎలాంటి అవకాశాలకు తావివ్వదలుచుకోలేదు. కునికిపాట్లకు దాదాపుగా అవకాశమే లేని ముందు బెంచీల్లో కొడుకును ఆమె తన పక్కనే కూచోబెట్టుకున్నారు. రాష్ట్రపతి ప్రసంగంపై జరిగిన చర్చకు ప్రధాని నరేంద్రమోడీ సుదీర్ఘ సమాధానం ఇస్తుండగా రాహుల్ మొబైల్‌ఫోన్‌ను తుడుచుకుంటూ లే దా మెరుగులు దిద్దుకుంటూ గడిపేశారు. ఈసారి మాత్రం నోట్స్ రాసుకోడం కోసం పెన్నూ, ప్యాడ్‌లతో సాయుధుడై వచ్చారు,  జైట్లీ అనర్గళోపన్యాసం సమయంలో రాహుల్ వాస్తవంగా ఏమి నోట్ చేసుకున్నారనేది తెలుసుకోవడం ఆసక్తికరమే. కానీ ప్రాచీన పత్ర భాండాగారంలో భద్రపరచడానికి ఆ డాక్యుమెంటు లభిస్తుందని అనుకోను. ఏదేమైనా, బడ్జెట్‌పై కాంగ్రెస్ ప్రతిస్పందనలు ఆ డాక్యుమెంటుకు ఏ మేరకైనా ప్రతిఫలనాలైతే... ఆ పేజీల్లో ఉన్నది పిచ్చిగీతలే అయి ఉండాలి. ప్రజాస్వామ్యం పక్షపాతంతో కూడిన వ్యవహారం. ఆ మేరకు ఎన్డీయే తొలి బడ్జెట్‌పై కాంగ్రెస్ వ్యతిరేకత ఊహించదగినది, అర్థంచేసుకోదగినది కూడా. కానీ కాంగ్రెస్ మరింత మెరుగైన దాడి వ్యూహాన్నయినా కనీసం చేపట్టాల్సింది. కానీ ప్రతిస్పందన సోమరిగానూ, అసంకల్పితమైనదిగా ఉండి ప్రతికూల ఫలితాలను కలిగించేదిగా సాగింది.

యూపీఏ బడ్జెట్లను ఎన్డీయే కాపీ కొట్టడం మాత్రమే చేస్తోందనే  దాని మొట్ట మొదటి తూటా నమస్కార బాణంలాంటిది. అది చెప్పేదే నిజమైతే కాంగ్రెస్ జైట్లీని ప్రశంసించి ఉండాల్సింది. లేదంటే మన్మోహన్‌సింగ్, చిదంబరం రూపొందించిన బడ్జెట్లన్నీ చెత్త కుప్పలేననే కొత్త వైఖరిని కాంగ్రెస్ ఇప్పుడు తీసుకుందా? దూకడానికి ముందు చూడాలి, మాట్లాడటానికి ముందు ఆలోచించాలి. ఆ పార్టీ ప్రచార యంత్రాంగం బడ్జెట్ పేదలకు వ్యతిరేకమైనదనే వాదనను ముందుగానే తయారు చేసి ఉంచడమే ఇలా కాంగ్రెస్ తూటా  తుస్సుమనిపోవడానికి కారణమై ఉండాలి. ఇది దిగ్భ్రాంతికరమైన తప్పుడు అంచనా. ఎందుకంటే పేదలలోకెల్లా అతి పేదల అవసరాలను తీర్చలేకపోతే అది ప్రభుత్వమే కాదని ప్రధాని మోడీ నిలకడగా పదే పదే చెబుతూనే ఉన్నారు. సంక్షేమ పథకాలతో  పేదలపట్ల సానుకూలమైన మొగ్గును చూపిన అత్యుత్తమమైన రాష్ట్రాలు బీజేపీ పాలిత మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ వంటి ప్రభుత్వాలే తప్ప మహారాష్ట్ర, కర్ణాటక వంటి కాంగ్రెస్ రాష్ట్రాలు కావు.  బడ్జెట్ ఆ విషయంలో బీజేపీ రాష్ట్రాలపై జరుగుతున్న దుష్ర్పచారం గుట్టు బట్టబయలు చేసింది.
 బడ్జెట్‌లో భారీ దూరచ్చదృష్టి పథకాలు లోపించాయనేది రెండో ఆరోపణ. ఇది కూడా కొంత అర్థరహితమైనదే. మోడీ బడ్జెట్‌లోని ఈ అంశాలను చూడండి: 2022 నాటికి ప్రతి భారతీయునికి సరైన గృహ వసతిని కల్పించడానికి, ప్రతి ఇంటికీ విద్యుత్తును అందించడానికి అది వాగ్దానం చేసింది. వంద కొత్త శివారు నగరాల నిర్మాణానికి ప్రారంభ మూలధన నిధులను కేటాయించింది. హౌసింగ్, రక్షణ రంగాలలో భారీ విదేశీ పెట్టుడులకు దారులు తెరిచింది, రోడ్లు, నదుల అనుసంధానాన్ని కూడా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సదుపాయాల పద్దుకు చేర్చి ఆ శాఖ వ్యయాలను విస్తరింపజేసింది, 8 లేదా 9 శాతం వృద్ధిని తిరిగి సాధిస్తామని వాగ్దానం చేసింది.  2019 నాటికి అతి పురాతనమైన గంగా నదిని శుద్ధి చేసే కార్యక్రమంతో  పరిశుభ్ర భారత్ సృష్టికి నాంది పలికారు. 2019 మహాత్మా గాంధీ 150వ జన్మదినోత్సవ వత్సరం. కాంగ్రెస్ ప్రభుత్వాలు బరి తెగించి నిర్లక్ష్యంగా చేసిన వ్యయాలతో ఖాళీయైన ఖజానాను లెక్కలోకి తీసుకోక తప్పని తొలి బడ్జెట్‌కు ఇదంతా తక్కువా?

రాజధాని ఢిల్లీలోని పెద్దల ఆలోచన విలక్షణమైనది. ప్రధానంగా అది విద్యుత్ కోతలను ఉత్పాతంగా భావిస్తుంటుంది.  కరెంటన్నదే ఎరుగని గుడిసెలోని వారి ఆలోచనకు అది భిన్నమైనది. లూట్యన్ల కాలపు మహా ప్రాసాదాల ఢిల్లీ గురించి పగటి కలలు కనే వారి ఆలోచన నిలవడానికి నీడ లేక మరణిస్తున్నవారి  ఆలోచన కంటే భిన్నమైనది. తాగు యోగ్యమైన నీరు దొరక్క గొంతెండిపోతూ ఉండటం లేదా బతికి బట్టకట్టడానికి సరిపడా మెతుకుల కోసం బానిస చాకిరీ చేయటం గాక... పగటి నిద్రకు అవకాశమున్న వారి ఆలోచనలు భిన్నమైనవి.బడ్జెట్‌లో ఢిల్లీ కంటే భిన్నంగా ఆలోచించే వారికి వాగ్దానం ఉంది. ఆ విషయాన్ని సుస్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. ఆ దృక్పథమూ ఉంది. ఇక అతి కష్టమైన భాగం ఒక్కటే.... ఈ ప్రభుత్వం దేశం కలలను నెరవేర్చాల్సి ఉండటమే.    
     
(వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు)  ఎంజే అక్బర్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement