రాహుల్‌ మిత్రుడికి రక్షణ కాంట్రాక్టు! | Rahul Gandhi denies business partner got deals during UPA | Sakshi
Sakshi News home page

రాహుల్‌ మిత్రుడికి రక్షణ కాంట్రాక్టు!

Published Sun, May 5 2019 4:34 AM | Last Updated on Sun, May 5 2019 9:53 AM

Rahul Gandhi denies business partner got deals during UPA - Sakshi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పౌరసత్వ అంశంపై కాంగ్రెస్, బీజేపీలు ఒకదానిపై మరొకటి విమర్శలు ఎక్కుపెట్టుకుంటున్న సమయంలో.. రాహుల్‌ గతంలో బ్రిటన్‌లో ఉల్రిక్‌ మెక్‌నైట్‌ అనే వ్యక్తి భాగస్వామిగా బ్యాకాప్స్‌ లిమిటెడ్‌ అనే కంపెనీని ప్రారంభించిన విషయం వెలుగులోకి వచ్చింది. అంతేకాదు మెక్‌నైట్‌ యూపీఏ ప్రభుత్వ హయాంలో విదేశీ భాగస్వామిగా రక్షణ పరికరాల కాంట్రాక్టులు పొందిన విషయం కూడా బయటపడింది. కంపెనీ మూతపడటానికి ముందు 2005 జూన్‌ 5 నాటికి బ్యాకాప్స్‌ కంపెనీలో రాహుల్‌కు 65 శాతం, మెక్‌నైట్‌కు 35 శాతం వాటా ఉంది.

ఆ తర్వాత 2011లో కూడా ఫ్రెంచి సంస్థ నావల్‌ గ్రూప్‌ నుంచి (స్కార్పీన్‌ జలాంతర్గాములకు సంబంధించి)  మెక్‌నైట్‌ కాంట్రాక్టులు పొందారు. యూపీఏ హయాంలో నావల్‌ గ్రూప్‌ విదేశీ భాగస్వామిగా.. రాహుల్‌ మాజీ వ్యాపార భాగస్వామికి చెందిన అనుబంధ సంస్థలు డిఫెన్సు కాంట్రాక్టులు పొందినట్లు ‘ఇండియా టుడే’కి లభించిన పత్రాలు స్పష్టం చేస్తున్నాయి. బ్యాకాప్స్‌ కంపెనీ పేర్కొంటున్న దాని ప్రకారం.. రాహుల్, మెక్‌నైట్‌లు ఇద్దరూ ఆ కంపెనీ వ్యవస్థాపక డైరెక్టర్లు. కాగా 2004లో దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్‌లో బ్యాకాప్స్‌ కంపెనీకి చెందిన మూడు ఖాతాల్లోని నగదుతో పాటు దాని చరాస్తుల వివరాలను కూడా రాహుల్‌ పొందుపరిచారు. కాగా ఈ కంపెనీ 2009లో మూతపడింది.

కాగా దాదాపు ఇదేవిధమైన పేరుకలిగిన బ్యాకాప్స్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే కంపెనీతో కూడా రాహుల్‌కు సంబంధం ఉన్నట్లు తెలిసింది. ఇందులో రాహుల్‌ సోదరి ప్రియాంక గాంధీ వాద్రా కో డైరెక్టర్‌గా పనిచేశారు. ఈ భారతీయ కంపెనీలో తనకు 83 శాతం వాటా ఉన్నట్లు రాహుల్‌ 2004 ఎన్నికల అఫిడవిట్‌లో తెలిపారు. రూ.2.5 లక్షల మూలధన పెట్టుబడి కూడా ఉందన్నారు. 2002లో మొదలైన ఈ కంపెనీ కూడా తర్వాత మూతపడింది. చివరిసారిగా 2010 జూన్‌లో ఈ సంస్థ రిటర్న్స్‌ దాఖలు చేసింది. అయితే రాహుల్‌ మాజీ వ్యాపార భాగస్వామి, అతని కంపెనీలు ఫ్రెంచి కంపెనీ ఇచ్చిన ఆఫ్‌సెట్‌ కాంట్రాక్టుల ద్వారా లబ్ధి పొందుతూ వచ్చాయి.  

విశాఖ సంస్థల్లో డైరెక్టర్‌గా మెక్‌నైట్‌
ముంబయిలోని మాజగాంవ్‌ డాక్‌ లిమిటెడ్‌ (ఎండీఎల్‌) వద్ద తయారయ్యే స్కార్పీన్‌ జలాంతర్గాములకు అవసరమైన కీలక విడిభాగాలు సప్లై చేసేందుకు ఫ్రెంచి సంస్థ నావల్‌ గ్రూప్‌ 2011లో విశాఖపట్నంకు చెందిన ఫ్లాష్‌ ఫోర్జ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఆరు జలాంతర్గాముల నిర్మాణానికి సంబంధించిన రూ.20 వేల కోట్ల ఒప్పందంలో భాగంగా ఎండీఎల్‌తో నావల్‌ గ్రూప్‌ కలసి పనిచేయాల్సి ఉంది. కాగా అదే ఆర్థిక సంవత్సరంలో ఫ్లాష్‌ ఫోర్జ్‌ యూకేకి చెందిన ఆప్టికల్‌ ఆర్మోవర్‌ లిమిటెడ్‌ అనే కంపెనీని కొనుగోలు చేసింది.

2012 నవంబర్‌లో ఇద్దరు ఫ్లాష్‌ ఫోర్జ్‌ డైరెక్టర్లను ఆ సంస్థలో డైరెక్టర్లుగా చేశారు. వీరు ఆ సంస్థ డైరెక్టర్లుగా బాధ్యతలు స్వీకరించిన 2012 నవంబర్‌ 8నే ఉల్రిక్‌ మెక్‌నైట్‌ను కూడా ఆ సంస్థ డైరెక్టర్‌గా చేర్చారు. అంతేకాదు ఆ సంస్థలో మెక్‌నైట్‌కు సంస్థ 4.9 శాతం వాటా కేటాయించినట్లు ఆప్టికల్‌ ఆర్మోవర్‌ 2014లో దాఖలు చేసిన పత్రాలను బట్టి తెలుస్తోంది. కాగా ఫ్లాష్‌ ఫోర్జ్‌ 2013లో యూకేకి చెందిన మరో కంపెనీ కాంపోజిట్‌ రెసిన్‌ డెవలప్‌మెంట్స్‌ లిమిటెడ్‌ అనే కంపెనీని కూడా కొనుగోలు చేసింది. అదే సంవత్సరంలో ఫ్లాష్‌ ఫోర్జ్‌ ఇద్దరు డైరెక్టర్లతో పాటు మెక్‌నైట్‌ కూడా ఆ సంస్థలో డైరెక్టర్‌గా చేరారు.

నావల్‌ గ్రూపు వెబ్‌సైట్లు పేర్కొంటున్నదాని ప్రకారం..దాని భారతీయ భాగస్వాముల్లో ఫ్లాష్‌ ఫోర్జ్, సీఎఫ్‌ఎఫ్‌ ఫ్లూయిడ్‌ కంట్రోల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఫ్లాష్‌ ఫోర్జ్, మరో ఫ్రెంచి గ్రూప్‌ కోయార్డ్‌ల జాయింట్‌ వెంచర్‌) ఉన్నాయి. దీనిపై ఇండియా టుడే మెక్‌నైట్‌ను సంప్రదించేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. నావల్‌ గ్రూపుతో ఫ్లాష్‌ ఫోర్జ్‌ ఒప్పందం కుదుర్చుకోక ముందే రాహుల్‌ గాంధీకి చెందిన భారత, యూకే కంపెనీలు మూతపడినా.. యూపీఏ హయాంలో కుదిరిన ఒప్పందాలతో ఆయన మాజీ వ్యాపార భాగస్వామి.. భారత విదేశీ భాగస్వామిగా యూరప్‌ సంస్థల ద్వారా లబ్ధి పొందినట్లు స్పష్టమవుతోంది.

రాహుల్‌ రక్షణ డీలర్‌గా బెటర్‌!
కాంగ్రెస్‌ స్పందించాలన్న కేంద్రమంత్రి జైట్లీ
రాహుల్‌æ గాంధీ సన్నిహితుడికి యూపీఏ హయాంలో రక్షణ శాఖ కాంట్రాక్టు కట్టబెట్టారని కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ ఆరోపించారు. ‘బాకాప్స్‌ నుంచి రాహుల్‌ 2009లో బయటకు రాగా, భారత్‌లోని బాకాప్స్‌ 2010లో మూతబడింది. అయితే, మెక్‌నైట్, రాహుల్‌ సంబంధాలు కొనసాగాయి. యూపీఏ హయాంలో ఫ్రాన్సు సహకారంతో జలాంతర్గాములను నిర్మించే రక్షణ శాఖ కాంట్రాక్టు మెక్‌నైట్‌కు కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టబెట్టింది’ అని జైట్లీ పేర్కొన్నారు. ప్రధాని కావాలనుకుంటున్న వ్యక్తి అసలు కథ ఇది అని పేర్కొన్నారు. ‘ఇందులో రాహుల్‌ పాత్ర ఏమిటి? రక్షణ సామగ్రి డీలర్‌ అవుదామనుకున్నారా? కాంగ్రెస్‌ దీనిపై సత్వరం స్పందించాలి. రాజకీయాల్లో రావడం కంటే కూడా ఆయన రక్షణ రంగంలో డీలర్‌ అయితే బాగుండేది’ అని అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement