I-T dept
-
ఎలక్షన్ కమిషనర్ భార్యకు ఐటీ నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ అశోక్ లావసా కుటుంబానికి ఐటీ శాఖ ద్వారా ఎదురు దెబ్బ తగిలింది. ఆయన భార్య నోవల్ సింఘాల్. కమార్తె, కుమారుడి ఆదాయంపై ఐటీ విభాగం దృష్టి సారించింది. ఆదాయ లెక్కల్లో తేడా ఉన్నట్టుగా గుర్తించిన అధికారులు ఈ నోటీసులు జారీ చేశారు. ముఖ్యంగా అశోక్ లవాసా తనయుడు నిర్వహిస్తున్న నౌరిష్ ఫుడ్స్ ఖాతాలలో అవకతవకలపై దృష్టి సారించిన ఐటీ విభాగం ఈ నోటీసులిచ్చింది. వారి ఆదాయ, వ్యయాలను గత కొన్నిరోజులుగా ఆదాయపు పన్ను శాఖ పరిశీలిస్తోంది. 2005 వరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేసిన నుంచి నోవల్ సింఘాల్ లావాసా ముందస్తు పదవీ విరమణ తీసుకున్నారు. ఆ తర్వాత వివిధ కంపెనీలకు డైరెక్టర్‌గా వ్యవహరించారు. అప్పటివరకు నోవాల్ రిటర్నులపై ఎలాంటి సందేహాలు తలెత్తలేదు. కానీ గత కొన్ని నెలలుగా మాత్రం భారీ తేడాను ఐటీ అధికారులు గుర్తించారు. ఆదాయ, వ్యయాల్లో తేడాకు గల కారణాలపై ఇటీవల నోటీసులు కూడా జారీ అయ్యాయి. 2015 నుంచి 2017 వరకు వివిధ కంపెనీలకు స్వతంత్ర డైరెక్టర్‌గా పనిచేసిన సమయంలో అక్రమంగా ఆదాయం కూడబెట్టారా అని ఐటీ అధికారులు ఆరాతీస్తున్నారు. మరోవైపు దీనిపై నోవల్ సింఘాల్ స్పందించారు. తాను ఎలాంటి పన్నుల ఎగవేతకు, ఆదాయ అక్రమాలకు పాల్పడలేదని తెలిపారు. 28 సంవత్సరాల పాటుస్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్లాస్ వన్ ఆఫీసర్‌గా పనిచేసిన తనకు బ్యాంకింగ్ సంబంధిత వ్యవహారాల్లో అపారమైన అనుభవం ఉందని స్పష్టం చేశారు. ప్రస్తుతం స్వతంత్ర డైరెక్టర్‌గా సహా వివిధ వృత్తిపరమైన కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నానని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 5, 2019న అందుకున్న అన్ని ఐటీ నోటీసులకు తాను సమాధానం ఇచ్చాననీ, ప్రస్తుత ప్రక్రియకు కూడా సహకరిస్తున్నానని ఆమె వివరణ ఇచ్చారు. కాగా అంతకుముందు కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శిగా పనిచేసి అశోక్ గతేడాది జనవరి 23న కేంద్ర ఎన్నికల అధికారిగా బాధ్యతలు చేపట్టారు. గత లోక్‌సభ ఎన్నికల సమయంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంశంపై కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి సునీల్ అరోరా, కేంద్ర ఎన్నికల కమిషనర్ సునీల్ చంద్రతో అశోక్ విభేదించిన సంగతి తెలిసిందే. -
ఐటీ శాఖ సంచలనం: కమిషనర్లకు షాక్
న్యూడిల్లీ: ఆదాయపు పన్నుశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ఐటీ విభాగంలో ఉన్నత అధికారుల బదిలీలతో భారీగా సంస్కరణకు శ్రీకారం చుట్టింది. 'పనితీరు' మెరుగుగా లేని కమిషనర్లకు షాకిచ్చింది. ముఖ్యంగా పనితీరును పరిగణనలోకి తీసుకున్న సంస్థ దేశవ్యాప్తంగా ముఖ్యమైన స్థానాల్లో ఉన్న అధికారులను బదిలీ చేసింది. దీంతో ఇప్పటివరకు ఆదాయం పన్ను కమిషనర్లకు సంబంధించిన ఇది అతిపెద్ద మార్పుగా భావిస్తున్నారు. డైరెక్ట్ టాక్స్ సెంట్రల్ బోర్డ్ , (సీబీడీటీ) లో దేశవ్యాప్తంగా 245 కమిషనర్లను కీలక స్థానాలనుంచి బదిలీ చేసిందని తాజా నివేదికలు పేర్కొంటున్నాయి. సీబీడీటీలో నాన్-పెర్ఫామెన్స్ అధికారులతోపాటు, విజిలెన్స్ లేదా ఇతర క్రమశిక్షణా ఆరోపణలను ఎదుర్కొంటున్నవారిని, పదవిలో రెండు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాల సర్వీసు ఉన్న అధికారులకు స్థానభ్రంశం కల్పించింది. సీబీడీటీ చైర్మన్ సుశీల్ చంద్ర దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ ఐటి కార్యాలయాలకు రాసిన ఒక లేఖలో, ఈ సంవత్సరం తమ పన్ను పరిధిని గణనీయంగా విస్తరించడానికి, వారి అధికార పరిధిలోని ప్రాంతానికి సంబంధించి స్పెషల్ ప్రొఫైల్‌కు అనుగుణంగా" ప్రాంతీయ వ్యూహాన్ని "అభివృద్ధి చేయాలని కోరారు. జూలై 12 న ఉన్నత అధికారులకు జారీ చేసిన ప్రత్యేక నిర్దేశకత్వాల్లో వాణిజ్య సంస్థలు, మార్కెట్ సంస్థలు, ఇతరుల ద్వారా సమాచారాన్ని సేకరించి పన్ను ఎగవేతదారులను గుర్తించాలని ఆదేశించింది. ప్రత్యేకించి టైర్ -2 మరియు 3 నగరాల్లో పన్ను చెల్లింపులను ప్రోత్సహించే విధంగా అవగాహన సమావేశాలు, ఔట్రీచ్ కార్యక్రమాలు నిర్వభహించనున్నామని సీబీడీటీ చైర్మన్ తన లేఖలో పేర్కొన్నారు. అలాగే ప్రజా సెషన్లను నిర్వహించాలని పన్ను అధికారులకు ఆయన సూచించారు. జీఎస్టీ అమలుపై నెలవారీ నివేదికలను సిద్ధం చేయాల్సిందిగా సీనియర్ అధికారులు, జోన్ల్ హెడ్లను కోరారు. కాగా గత ఆర్థిక సంవత్సరం పన్ను మినహాయింపులో 91లక్షల మంది కొత్త పన్ను చెల్లింపుదారులను ఆదాయపన్ను శాఖ గుర్తించింది. ముఖ్యంగా చిన్ననగరాల్లో పన్ను చెల్లించగలిగి ఉండా కూడా తప్పించుకుంటున్నవారిని గుర్తించింది. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పూణే తదితర మరికొన్ని మెట్రో నగరాలతో పోల్చినపుడు టైర్ -2, టైర్ -3 నగరాలు జనాభా సాంద్రత , మానవ వనరులు కొద్దిగా తక్కువే. -
పాన్‌తో ఆధార్ అనుసంధానికి కొత్త లింక్
న్యూఢిల్లీ: పాన్ కార్డుతో ఆధార్ నెంబర్ అనుసంధానం కోసం ఆదాయపన్ను శాఖ కొత్త వెసులుబాటును (ఇ-ఫెసిలిటీ) గురువారం ప్రారంభించింది. సంస్థ వెబ్ సైట్ లో https://incometaxindiaefiling.gov.in/ పేరుతో కొత్త లింక్‌ను లాంచ్ చేసింది. ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి పాన్ నెంబరు తప్పనిసరి చేసిన నేపథ్యంలో ఈ సదుపాయాన్ని ప్రారంభించింది. పాన్ తో ఆధార్ అనుసంధాన ప్రక్రియను మరింత సులభం చేస్తూ ఆదాయ పన్నుశాఖ ఇ-ఫైలింగ్ వెబ్ సైట్ లో ఈ కొత్త లింక్‌ను పొందు పర్చింది. ఒక వ్యక్తి యొక్క రెండు ప్రత్యేక గుర్తింపులను (పాన్, ఆధార్ ) అనుసంధానించటానికి హోం పేజ్‌లో దీన్ని సృష్టించింది. అయితే పాన్, ఆధార్ లలో నమోదు చేసిన వివరాలు ఒకేలా ఉండాలని ఆదాయపన్ను శాఖ స్పష్టం చేసింది. యుఐడిఎఐ (ఇండిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) నుండి వెరిఫికేషన్ తర్వాత, ఈ లింక్ ధృవీకరిస్తుందని ఆదాయపన్ను శాఖ వెల్లడించింది. ఐటీ ఈ ఫైలింగ్ వెబ్సైట్లో లాగిన్ అవసరం లేకుండానే ఎవరైనా ఈ లింక్ ద్వారా ఆధార్, పాన్ నంబర్లను అనుసంధానించుకోవచ్చని తెలిపింది. అలాగే పాన్, ఆధార్ కార్డులలో డేట్ ఆఫ్‌బర్త్, జెండర్ తదితర వివరాలు సరిపోలాల్సి ఉంటుందని తెలిపింది. ఈ ప్రక్రియ పూర్తయిన అనంతరం రిజిస్టర్డ్ మొబైల్‌కు ఓటీపీ(వన్‌టైం పాస్వర్డ్) లేదా ఈ మెయిల్ పంపుతామని చెప్పింది. ఆర్థిక చట్టం 2017 ప్రకారం ఐటీఆర్ దాఖలుకు ఆధార్ తప్పనిసరి. అలాగే పాన్ దరఖాస్తుకు ఆధార్ నెంబర్ తప్పనిసరి అనే నిబంధన 2017 జూలై నుంచి అమలుకానుంది. -
నోట్ బ్యాన్ ఎఫెక్ట్ : 5,100 నోటీసులు జారీ
న్యూఢిల్లీ : అనుమానిత పెద్ద మొత్తంలో డిపాజిట్లపై ఆదాయపు పన్ను శాఖ కొరడా ఝుళిపించినట్టు ప్రభుత్వం పేర్కొంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత అనుమానిత డిపాజిట్లపై దాదాపు 5100 నోటీసులు జారీచేసినట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఈ నోటీసుల ద్వారా లెక్కలో చూపని నగదు రూ.5400 కోట్లకు పైనేనని గుర్తించినట్టు బుధవారం ప్రభుత్వం పార్లమెంట్ కు తెలిపింది. పెద్ద నోట్ల రద్దు అనంతరం 1,100 సెర్చ్, సర్వే ఆపరేషన్లను ఐటీ డిపార్ట్ మెంట్ చేపట్టిందని, దానిలో గుర్తించిన అనుమానిత పెద్ద మొత్తంలో డిపాజిట్లకు 5100 నోటీసులు పంపిందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ లోక్ సభకు లిఖిత పూర్వకంగా తెలిపారు. 2016 డిసెంబర్ 30తో ముగిసిన 50 రోజుల డీమానిటైజేషన్ విండోలో 17.92 లక్షల మంది ప్రజల ట్యాక్స్ ప్రొఫైల్స్ నగదు డిపాజిట్లకు అనుగుణంగా లేవని ఐటీ డిపార్ట్ మెంట్ గుర్తించినట్టు పేర్కొన్నారు. 2014 ఏప్రిల్1 నుంచి 2016 డిసెంబర్ 21 వరకు ట్యాక్స్ డిపార్ట్ మెంట్ జరిపిన ఎన్ఫోర్స్మెంట్ యాక్షన్ లో రూ.60వేల కోట్ల లెక్కలో చూపని నగదును గుర్తించిందని, రూ.2607 కోట్ల వెల్లడించని ఆస్తులను సీజ్ చేసినట్టు ఆయన లోక్ సభకు తెలిపారు. ఏప్రిల్-డిసెంబర్ కాలంలో జరిపిన సర్వేలోనూ రూ.9454 కోట్ల లెక్కలో చూపని ఆదాయాన్ని ఐటీ డిపార్ట్ మెంట్ గుర్తించినట్టు సంతోష్ కుమార్ గంగ్వార్ వెల్లడించారు. -
ఐటీకి చిక్కిన రూ.16,200 కోట్ల బ్లాక్‌మనీ
న్యూఢిల్లీ : భారతీయులు విదేశాల్లో గుట్టగుట్టలుగా నగదు దాచారనే దానిపై అంతర్జాతీయ సంస్థలు విడుదల చేసిన లీకేజీలపై ఆదాయపు పన్ను అధికారులు జరిపిన విచారణలో భారీగా బ్లాక్‌మనీ పట్టుబడినట్టు ప్రభుత్వం తెలిపింది. ఐటీ అధికారుల విచారణలో విదేశాల్లో దాగిఉన్న రూ.16,200 కోట్లకు పైగా నల్లధనం వెలికితీశామని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ మంగళవారం పార్లమెంట్‌కు చెప్పారు. ఓ క్రమ పద్ధతిలో జరిపిన దాడుల్లో రూ.8,200 కోట్ల లెక్కలో చూపని నగదు పట్టుబడిందని, హెచ్ఎస్బీసీలో వీటిని దాచారని పేర్కొన్నారు. అంతర్జాతీయ పరిశోధనాత్మక పాత్రికేయుల కూటమి (ఐసీఐజే) బయటపెట్టిన రహస్యపత్రాలకు సంబంధించిన దానిలో భారతీయులకు సంబంధించిన పలు విదేశీ అకౌంట్లను వెలికితీశామన్నారు. వీటిలో మరో రూ.8000 కోట్లు పట్టుబడిందని జైట్లీ రాజ్యసభకు తెలిపారు. అయితే ఇంకా ఎంత మొత్తంలో భారతీయుల బ్లాక్‌మనీ విదేశాల్లో దాగివుందో అధికారిక అంచనాకు రాలేదని వివరించారు. విదేశాల్లో దాచిఉంచిన భారతీయుల బ్లాక్‌మనీపై ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని చెప్పారు. -
బంగారంగా మారిన నగదెంతో తెలుసా?
న్యూఢిల్లీ : పెద్ద నోట్లు రద్దు చేస్తున్నట్టు ప్రధాని ప్రకటించిన అనంతరం నల్లధనాన్ని తెల్లగా మార్చడం కోసం బ్లాక్‌మనీ హోల్డర్స్ ఒక్కసారిగా బంగారం దుకాణాలకు పరిగెత్తిన సంగతి తెలిసిందే. ఇదే అవకాశంగా తీసుకుని బంగారం వర్తకులు మనీ లాండిరింగ్ కార్యకలాపాలు నిర్వహించారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ బంగారం వర్తకులపై కొరడా ఝళిపించడం ప్రారంభించింది. దేశరాజధాని పరిధిలోని బంగారం వర్తకులపై ఐటీ డిపార్ట్మెంట్ తాజాగా జరిపిన దాడుల్లో లెక్కల్లో తేలని రూ.250 కోట్ల బంగారం విక్రయాలు వెలుగులోకి వచ్చాయి. అంతేకాక పెద్ద నోట్లు రద్దయినప్పటి నుంచి ఐటీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ జరిపిన దాడుల్లో దేశరాజధానిలో రూ.400 కోట్లకు పైగా విలువైన లెక్కల్లో తేలని బులియన్ విక్రయాలు జరిగినట్టు వెల్లడైంది. కరోల్ బాగ్, చాందినీ చౌక్ ప్రాంతాల్లోని నలుగురు బులియన్ డీలర్స్ను శుక్రవారం ఐటీ డిపార్ట్మెంట్ విచారించింది. ఈ విచారణలో గత కొన్ని వారాల్లో రూ.250 కోట్లకు పైగా రద్దయిన నగదును మార్చిపెట్టినట్టు తెలిసింది. ఈ వర్తకులకు సంబంధించిన 12 దుకాణాలు, 8 నివాస ప్రాంతాల్లో ఐటీ డిపార్ట్మెంట్ ఇంకా దాడులు నిర్వహిస్తోంది. మొదటగా రూ.250 కోట్ల రద్దయిన నోట్లను వివిధ బ్యాంకు అకౌంట్ల ద్వారా బంగారంలోకి మార్చినట్టు గుర్తించామని ఓ సీనియర్ ఐటీ అధికారి పేర్కొన్నారు. ఈ నలుగురి ట్రేడర్ల దుకాణాలు పాత ఢిల్లీ పరిధిలోని కుచ మహాజని ప్రాంతంలో ఉన్నాయని, మరికొన్ని దుకాణాలు కరోల్ బాగ్‌లో ఉన్నట్టు అధికారులు తెలిపారు. వీరి బ్యాంకు అకౌంట్లను సైతం అధికారులు విచారిస్తున్నారు. నవంబర్ 8న పెద్ద నోట్లు రద్దయిన అనంతరం మనీ లాండరింగ్ కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే వార్తలతో కుచ మహాజని బులియన్ డీలర్స్‌పై మొదటి రైడ్ నిర్వహించామని, ఆ దాడుల్లో రూ.100 కోట్లకు పైగా గోల్డ్ బార్స్‌ను వీరు విక్రయించినట్టు తెలిసిందని అధికారులు పేర్కొన్నారు. అప్పుడే మనీ లాండరింగ్ రాకెట్ వెలుగులోకి వచ్చిందన్నారు. ఈ విషయంలో ఈడీ ఇప్పటికే ఇద్దరు బ్యాంకు మేనేజర్లను, ఇద్దరు మధ్యవర్తులను అరెస్టు చేసింది. -
పన్ను చెల్లింపుదారులకు ఐటీ హెచ్చరిక
పన్ను చెల్లింపుదారులు తమ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను ఎవరితో పంచుకోవద్దని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ హెచ్చరించింది. ఒకవేళ పాస్‌వర్డు, ఐడీ అనధికారిక వ్యక్తుల చేతులోకి వెళ్తే యూజర్ల కీలక సమాచారం దుర్వినియోగానికి పాల్పడే అవకాశముందని పేర్కొంది. టీడీఎస్ సెంట్రలైజడ్ ప్రాసెసింగ్ ఈ మేరకు హెచ్చరికలను పన్ను చెల్లింపుదారులకు జారీచేసింది. పన్ను చెల్లింపుదారులు యూజర్ ఐడీ, పాస్‌వర్డు ఎంతో కీలకమైన సమాచారం, వీటితో టీడీఎస్ సంబంధిత రహస్య సమాచారం, కీలకమైన డేటా దిద్దుబాటుకు గురయ్యే అవకాశముంటుందని పేర్కొంది. ఒకవేళ పాస్వర్డ్ హ్యాక్ అయిన లేదా దొంగతనానికి గురైనా, సమాచారం భద్రత ఉల్లంఘనకు గురయ్యే అవకాశముంటుందని వెల్లడించింది. దీనివల్ల ఎన్నో సమస్యలు తలెత్తుతాయని తెలిపింది. కనీసం ఎనిమిది క్యారెక్టర్లు ఉండేలా యూజర్లు పాస్వర్డ్లు క్రియేట్ చేసుకోవాలని, దానిలో నెంబర్లు, స్పెషల్ క్యారెక్టర్లు కూడా ఉండేలా చూసుకోవాలని సూచించింది. అయితే ఈ పాస్‌వర్డ్‌ను తమ డెస్క్‌పై ఉన్న నోట్‌ప్యాడ్స్ లేదా వైట్బోర్డులపై రాయవద్దని తెలిపింది. ఈ-మెయిల్స్, ఫోల్డర్స్, ఫైల్స్ వంటి వాటి పాస్వర్డ్లు కూడా కంప్యూటర్లపై ఉంచుకోవడం ఇబ్బందులు కలుగజేయవచ్చని హెచ్చరించింది. ఒకవేళ యూజర్లు ఈ-మెయిల్ లేదా కంప్యూటర్ అకౌంట్ హ్యాక్ అయితే, పాస్‌వర్డ్‌లను దుర్వినియోగానికి పాల్పడే అవకాశం ఉంటుందని, మీ ఈ-మెయిల్ అకౌంట్ ద్వారా క్రెడిట్/డెబిట్ కార్డుల కీలక సమాచారం కూడా ఇతర వ్యక్తుల చేతిలోకి పోతుందని తెలిపింది. -
ఐటీకి చిక్కిన రూ.100 కోట్ల నల్లధనం
న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దుతో భారీ మొత్తంలో నల్లధనం గుట్టురట్టవుతోంది. రూ.100కోట్ల విలువైన లెక్కలో చూపించని నగదును, విక్రయాలను ఆదాయపు పన్ను శాఖ గుర్తించింది. ఐటీ శాఖ సర్వే ఆపరేషన్స్ విస్తరణలో భాగంగా పన్ను ఎగవేసిన వర్తకుల నుంచి, ఇతర ఆపరేటర్ల దగ్గర్నుంచి ఈ నగదును ఐటీ శాఖ బయటికి రాబట్టింది. ఢిల్లీ, బెంగళూరు, కోల్కత్తా, ముంబాయి నగరాల్లో ట్రేడ్ కౌంటర్స్, దుకాణాల్లో ఐటీ డిపార్ట్మెంట్ ఈ సర్వే ఆపరేషన్ చేపట్టింది. అత్యధిక మొత్తంలో నగదు, సేల్స్ డాక్యుమెంట్లు ఈ ప్రాంతాల్లో బయటపడ్డట్టు ఐటీ డిపార్ట్మెంట్ అధికారులు తెలిపారు. నోట్ల రద్దుతో వర్తకులు అక్రమంగా విక్రయాలు జరుపుతున్నారని, ఆ విలువ రూ.100 కోట్లగా ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ కేసులపై విచారిస్తున్నామని, వర్తకులు నిర్ధేశించిన సమయం లోపల తమ వివరణ ఇచ్చుకోవాలని ఆదేశించింది. అదేవిధంగా కొన్ని విక్రయ రికార్డులను తాము స్వాదీనం పర్చుకున్నామని పేర్కొన్నారు. కొంతమంది వర్తకులు, జ్యువెల్లరీ, కరెన్సీ ఎక్స్చేంజ్ ఏజెంట్స్, హవాలా డీలర్స్ డిస్కౌంట్ ధరలకు రూ.500, రూ.1,000 నోట్లను మారుస్తున్నారని తెలుసుకున్న ఐటీ డిపార్ట్మెంట్ ఈ రైడ్స్ జరుపుతోంది. అదేవిధంగా ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఓ ప్రయాణికుడు రద్దు చేసిన పెద్ద నోట్లను రూ.50 లక్షల మేర తరలిస్తుండగా టాక్స్ డిపార్ట్మెంట్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీ యూనిట్ గుట్టురట్టు చేసింది. ఈ నేపథ్యంలో పెద్ద మొత్తంలో నగదు తరలింపులపై పారామిలటరీ బలగాలు, పోలీసులు ఓ కన్నేసి ఉండాలని, ముఖ్యంగా సివిల్ ఎయిర్‌పోర్ట్స్, ఢిల్లీ మెట్రో, రైల్వే స్టేషన్లు, బస్స్టేషన్లలో రద్దుచేసిన 500, 1000 రూపాయల నోట్ల తరలింపుకు అడ్డుకట్టు వేయాలని ఆర్థికమంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీచేసింది. సర్వే యాక్షన్‌లో భాగంగా పన్ను అధికారులు ట్రేడ్, ఆపరేటర్ల బిజినెస్ ప్రాంతాలలో రైడ్స్ నిర్వహిస్తున్నారు.