నోట్ బ్యాన్ ఎఫెక్ట్ : 5,100 నోటీసులు జారీ
Published Thu, Mar 16 2017 11:28 AM | Last Updated on Tue, Sep 5 2017 6:16 AM
న్యూఢిల్లీ : అనుమానిత పెద్ద మొత్తంలో డిపాజిట్లపై ఆదాయపు పన్ను శాఖ కొరడా ఝుళిపించినట్టు ప్రభుత్వం పేర్కొంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత అనుమానిత డిపాజిట్లపై దాదాపు 5100 నోటీసులు జారీచేసినట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఈ నోటీసుల ద్వారా లెక్కలో చూపని నగదు రూ.5400 కోట్లకు పైనేనని గుర్తించినట్టు బుధవారం ప్రభుత్వం పార్లమెంట్ కు తెలిపింది. పెద్ద నోట్ల రద్దు అనంతరం 1,100 సెర్చ్, సర్వే ఆపరేషన్లను ఐటీ డిపార్ట్ మెంట్ చేపట్టిందని, దానిలో గుర్తించిన అనుమానిత పెద్ద మొత్తంలో డిపాజిట్లకు 5100 నోటీసులు పంపిందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ లోక్ సభకు లిఖిత పూర్వకంగా తెలిపారు.
2016 డిసెంబర్ 30తో ముగిసిన 50 రోజుల డీమానిటైజేషన్ విండోలో 17.92 లక్షల మంది ప్రజల ట్యాక్స్ ప్రొఫైల్స్ నగదు డిపాజిట్లకు అనుగుణంగా లేవని ఐటీ డిపార్ట్ మెంట్ గుర్తించినట్టు పేర్కొన్నారు. 2014 ఏప్రిల్1 నుంచి 2016 డిసెంబర్ 21 వరకు ట్యాక్స్ డిపార్ట్ మెంట్ జరిపిన ఎన్ఫోర్స్మెంట్ యాక్షన్ లో రూ.60వేల కోట్ల లెక్కలో చూపని నగదును గుర్తించిందని, రూ.2607 కోట్ల వెల్లడించని ఆస్తులను సీజ్ చేసినట్టు ఆయన లోక్ సభకు తెలిపారు. ఏప్రిల్-డిసెంబర్ కాలంలో జరిపిన సర్వేలోనూ రూ.9454 కోట్ల లెక్కలో చూపని ఆదాయాన్ని ఐటీ డిపార్ట్ మెంట్ గుర్తించినట్టు సంతోష్ కుమార్ గంగ్వార్ వెల్లడించారు.
Advertisement
Advertisement