Note Ban Effect
-
ఆ నిర్ణయంతో ఉద్యోగాలు ఊడాయ్..
సాక్షి, న్యూఢిల్లీ : నోట్ల రద్దు కష్టాలపై ఇప్పటికే పలు సర్వేలు, అథ్యయనాలు వెలువడగా ఈ నిర్ణయంతో ఉద్యోగాలు 2-3 శాతం మేర దెబ్బతినడంతో పాటు ఆర్థిక వ్యవస్థ మందగమనానికి దారితీసిందని తాజా అథ్యయనం స్పష్టం చేసింది. బ్లాక్ మనీ నిరోధించడం, ఉగ్ర నిధులకు కళ్లెం వేసే లక్ష్యంతో 2016 నవంబర్‌లో నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రకటించిన పెద్దనోట్ల రద్దు నిర్ణయం పెను ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే నోట్ల రద్దుతో ప్రతికూల పరిణామాలు ఎదురయ్యాయని హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన ఆర్థిక వేత్తలు గాబ్రియల్ చోడ్రో-రీచ్, ఐఎంఎఫ్‌కు చెందిన గీతా గోపినాథ్‌ల నేతృత్వంలో తాజా అథ్యయనం పేర్కొంది. నోట్ల రద్దు నిర్ణయం భారత ఆర్థిక వృద్ధిని తగ్గించడంతో పాటు 2-3 శాతం ఉద్యోగాలు ఊడిపోయాయని ఈ సర్వే స్పష్టం చేసింది. నోట్ల రద్దు నేపథ్యంలో 2016 నవంబర్, డిసెంబర్ మధ్య ఆర్థిక కార్యకలాపాలు 2.2 శాతం తగ్గాయని వీరు వెల్లడించిన పరిశోధన నివేదిక తెలిపింది. నోట్ల రద్దుకు ముందు ఆర్బీఐ పెద్దమొత్తంలో కొత్త నోట్లను ముద్రించకపోవడంతో తీవ్ర నగదు కొరత ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేసింది. -
నోట్ల రద్దు దారుణం..
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు తదితర అంశాలపై కేంద్ర మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పెద్ద నోట్ల రద్దు దారుణమైన చర్యంటూ... ద్రవ్య విధానానికి పెద్ద షాక్‌లాంటిదని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్థిక వృద్ధి రేటు మరింత వేగంగా పడిపోవడానికి ఇదే కారణమని అరవింద్ పేర్కొన్నారు. త్వరలో విడుదల కానున్న ‘ఆఫ్ కౌన్సిల్ – ది చాలెంజెస్ ఆఫ్ మోదీ– జైట్లీ ఎకానమీ‘ పేరిట రాసిన పుస్తకంలో అరవింద్ ఈ అంశాలు ప్రస్తావించారు. పుస్తకంలో దీనికోసం ప్రత్యేకంగా టూ పజిల్స్ ఆఫ్ డీమానిటైజేషన్ – పొలిటికల్ అండ్ ఎకనమిక్’ అనే అధ్యాయాన్ని కేటాయించారు. పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా ముద్రించిన ఈ పుస్తకాన్ని డిసెంబర్ 7న ముంబైలో, 9న ఢిల్లీలో ఆవిష్కరిస్తారు. నాలుగేళ్ల పాటు ముఖ్య ఆర్థిక సలహాదారుగా కొనసాగి... ఇటీవలే అరవింద్ వైదొలిగారు. ‘నోట్ల రద్దు చాలా భారీ స్థాయి దారుణమైన చర్య. ద్రవ్య విధానానికి షాక్. ఒక్క దెబ్బతో చలామణిలో ఉన్న 86 శాతం నగదును ఉపసంహరించారు. డీమోనిటైజేషన్ కన్నా ముందు కూడా వృద్ధి రేటు నెమ్మదించింది! కానీ పెద్ద నోట్ల రద్దుతో అమాంతంగా పడిపోయింది. డీమోనిటైజేషన్‌కు ఆరు త్రైమాసికాల ముందు వృద్ధి రేటు సగటున 8 శాతంగా ఉండగా.. పెద్ద నోట్ల రద్దు తరవాతి ఏడు త్రైమాసికాల్లో 6.8 శాతానికి పడిపోయింది‘ అని అరవింద్ వివరించారు. రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేస్తూ 2016 నవంబర్ 8న ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. రాజకీయంగా అసాధారణం... డీమోనిటైజేషన్ వల్ల వృద్ధి నెమ్మదించిందన్న వాస్తవాన్ని ఎవరూ కాదనలేరని.. కాకపోతే ఎంత స్థాయిలో మందగించిందన్నదే చర్చనీయమని అరవింద్ తన పుస్తకంలో తెలిపారు. రాజకీయ కోణంలో చూస్తే.. ఇటీవలి కాలంలో ఏ దేశం కూడా సాధారణ సందర్భాల్లో ఎకాయెకిన డీమోనిటైజేషన్ వంటి అసాధారణ చర్య తీసుకోలేదని స్పష్టంచేశారు. ‘‘సాధారణ పరిస్థితులున్నప్పుడు కరెన్సీని రద్దు చేయాల్సి వస్తే అది క్రమానుగతంగా మాత్రమే జరగాలి. అలాకాక యుద్ధాలు, అధిక ద్రవ్యోల్బణం, కరెన్సీ సంక్షోభం, రాజకీయ సంక్షోభం (2016లో వెనెజులా) వంటి పరిస్థితుల్లో మాత్రమే నోట్ల రద్దు వంటి అసాధారణ చర్యలు ఉంటాయి. భారత్‌లో ప్రయోగం మాత్రం ప్రత్యేకమైనది’’ అని అరవింద్ వివరించారు. డీమోనిటైజేషన్ తర్వాత యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం వెనుక గల కారణాలను కూడా ఆయన విశ్లేషించారు. నోట్ల రద్దు వల్ల పేద ప్రజానీకానికి కష్టాలు ఎదురైనా, అక్రమార్కులు.. సంపన్నులు తమకన్నా ఎక్కువ నష్టపోతారన్న ఆలోచనతో వారు ఆ ఇబ్బందులను భరించడానికి సిద్ధపడ్డారన్నారు. ‘‘నాది ఒక మేకే పోయింది. కానీ వాళ్ల ఆవులన్నీ పోయాయి కదా! అనే భావనలో ఉంటారు. ఈ సందర్భంలోనూ అదే జరిగి ఉండొచ్చు. నిజానికి పెద్ద లక్ష్యాలను సాధించే క్రమంలో సామాన్యులకు కొంత కష్టం తప్పకపోవచ్చు. కానీ ఈ సందర్భంలో తప్పించేందుకు అవకాశం ఉండేది’’ అన్నారు. ఐఎల్ఎఫ్ఎస్... నియంత్రణ సంస్థ వైఫల్యం.. నియంత్రణ సంస్థ వైఫల్యం వల్లే ఐఎల్ఎఫ్ఎస్ సంక్షోభం తలెత్తిందని అరవింద్ సుబ్రమణ్యన్ అభిప్రాయపడ్డారు. దీనికి రిజర్వ్ బ్యాంకే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. గొప్ప సంస్థగా ఆర్బీఐకి మంచి పేరున్నప్పటికీ.. ప్రతీ సందర్భంలో అది సరైన నిర్ణయాలే తీసుకుంటోందనడానికి లేదని చెప్పారాయన. ‘‘రుణాల చెల్లింపు సమస్యలు, నీరవ్ మోదీ కుంభకోణాల్లాంటివాటి తీవ్రతను అది గ్రహించలేకపోయింది. ఇటీవలి ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ సంక్షోభాన్ని బట్టి ఆర్బీఐ వైఫల్యం వాణిజ్య బ్యాంకుల నియంత్రణకే పరిమితం కాలేదని, ఎన్‌బీఎఫ్‌సీల విషయంలోనూ అలాగే ఉందని అర్థమవుతోంది’’ అని తన పుస్తకంలో అరవింద్ పేర్కొన్నారు. ఆర్బీఐ పర్యవేక్షణ సామర్థ్యాలను మెరుగుపర్చుకోవాలని, సమస్యల్లో ఉన్న ప్రభుత్వ బ్యాంకులకు కావాల్సిన మూలధనాన్ని సమకూర్చేందుకు తన వద్ద భారీగా ఉన్న నిల్వలను ఉపయోగించాలని సూచించారు. -
ఇప్పటికీ నగదు కష్టాలే!
కేంద్ర ప్రభుత్వం ఏ ముహూర్తాన పెద్ద నోట్లను రద్దుచేసిందో తెలియదు కాని, అప్పటి నుంచి జిల్లా వాసులను నగదు కష్టాలు వెంటాడుతున్నాయి. ఈ నెల 8వ తేదీకి పెద్ద నోట్లు రద్దు చేసి రెండేళ్లు ముగిసినా ఇప్పటికీ నగదు కష్టాలు తీరడం లేదు. జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 80 శాతం ఏటీఎం కేంద్రాలు మూసి ఉండడంతో పాటు, సీడీఎంలలో కూడా నగదు వేయలేని పరిస్థితి నెలకొంది. నెల్లూరు(సెంట్రల్): జిల్లాలో ప్రధానంగా మధ్య, పేద తరగతి వారిపై నగదు కష్టాలు తీవ్ర ప్రభాన్ని చూపుతున్నాయి. నగదు రహిత లావాదేవీలను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం చెప్పినా అందుకు తగ్గట్లుగా స్వైపింగ్ యంత్రాలను కూడా అందుబాటులోకి తీసుకుని రాలేని దుస్థితి. పెద్ద నోట్లను 2016 నవంబరు 8వ తేదీన రద్దుచేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటి నుంచి రెండు రోజుల తరువాత ఆ నోట్లను బ్యాంకుల్లో మార్చుకునే విధానాన్ని ప్రవేశ పెట్టింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నోట్ల కష్టాలు మాత్రం తీరడం లేదు. జిల్లాలో 623 బ్యాంక్ శాఖలు జిల్లాలో 41 బ్యాంక్‌లు ఉండగా, వాటికి అనుబంధంగా 623 శాఖలు ఉన్నాయి. వీటిలో రోజూ లావాదేవీలు జరగాలంటే కనీసం రూ.100 కోట్ల అవసరం ఉంటుందని అధికారులు చెప్పుకొస్తున్నారు. ప్రస్తు తం ఆర్బీఐ నుంచి అరకొర నగదు వస్తుండడంతో ఉన్న దాంట్లోనే సర్దుబాటు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో బ్యాంక్ అధికారులు కూడా ఏమి చేయలేకపోతున్నారనే ఆరోపణలున్నాయి. 80 శాతం ఏటీఎంల మూత జిల్లాలో నెల్లూరు, నెల్లూరు రూరల్, కావలి, కోవూరు, ఉదయగిరి, ఆత్మకూరు, గూడూరు, సర్వేపల్లి, వెంకటగిరి, సూళ్లూరుపేట నియోజకవర్గాలలో మొత్తం 482 ఏటీఎం కుఏంద్రాలు ఉన్నాయి. వీటిలో దాదాపుగా 80 శాతం పనిచేయడం లేదు. పేరుకు తీసి ఉన్నా వాటిలో నగదు లేదని మెసేజ్ వస్తుండడం గమనార్హం. ఆర్బీఐ నుంచి నగదు రాక పోవడంతోనే ఏటీఎంలలో నగదు పెట్టలేకపోతున్నట్లు బ్యాంక్ అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా పండగ రోజులు, సెలవుల దినాల్లో అయినే నగదు ఉండే ఏటీఎంల కోసం వెతుకులాడాల్సిన పరిస్థితి వస్తోంది. దీనికి తోడు క్యాష్ డిపాజిట్ మిషన్, (సీడీఎం)లను అందుబాటులో ఉంచినా వాటిలో చాలా వరకు నగదు తీసుకోవడం లేదు. కొంత నగదు తీసుకున్నా వెనక్కు వస్తుంది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. స్వైపింగ్ మిషన్ల కొరత పెద్ద నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దుచేసిన తరువాత మొత్తం నగదు రహిత లావాదేవీలు నడపాలని చెప్పింది. అందుకు తగ్గట్లుగా స్వైపింగ్ మిషన్లను మాత్రం అందుబాటులోకి తీసుకుని రాలేదు. దాదాపుగా జిల్లాలో 50 వేల మంది వ్యాపారులు ఉన్నారు. వీరిలో కేవలం ఐదు వేల లోపు వ్యాపార కేంద్రాల్లో స్వైపింగ్ పద్ధతి ఉంది. మరో రెండు వేల మంది స్వైపింగ్ మిషిన్ల కోసం దరఖాస్తు చేసుకున్నా మిషన్లను వారికి అందించలేదు. ఈ విధంగా స్వైపింగ్‌మిషన్లను సరఫరా చేయకుండా నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలని చెప్పడం ఎంతవరకు సమంజసమని వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. -
సేద్యానికి నోట్ల సెగ..
సాక్షి, న్యూఢిల్లీ : నోట్ల రద్దుతో చిన్న రైతులు చితికిపోయారని వ్యవసాయ మంత్రిత్వ శాఖ పార్లమెంటరీ కమిటీకి సమర్పించిన నివేదికలో పేర్కొంది. నోట్ల రద్దుపై విపక్షాల విమర్శలను తిప్పికొడుతూ బ్లాక్ మనీ నియంత్రించేందుకు ఇది అవసరమని ఇన్నాళ్లూ మోదీ సర్కార్ సమర్ధించగా తాజాగా నోట్ల రద్దుతో రైతులకు ఇబ్బందులు ఎదురయ్యాయని ఈ నిర్ణయం వెలువడిన రెండేళ్ల తర్వాత వ్యవసాయ మంత్రిత్వ శాఖ తేల్చిచెప్పింది. విత్తనాలు, ఎరువులు కొనేందుకు నగదుపై ఆధారపడే చిన్న రైతులు నోట్ల రద్దు నిర్ణయం ఫలితంగా సమస్యలు ఎదుర్కొన్నారని నివేదిక వెల్లడించింది. రబీ సీజన్‌కు ముందు నగదు కొరతతో లక్షలాది రైతులు విత్తనాలు, పురుగుమందులు కొనుగోలు చేయలేకపోయారని పార్లమెంటరీ కమిటీకి ఇచ్చిన నివేదికలో వ్యవసాయ మంత్రిత్వ శాఖ పేర్కొంది. నోట్ల రద్దు అమలైన సమయంలో రైతులు వారి ఖరీఫ్ దిగుబడులను అమ్ముకోలేక, రబీ పంటలను సాగుచేయలేక సమస్యల్లో కూరుకుపోయారని తెలిపింది. రైతుల చేతిలో ఉన్న నగదంతా నోట్ల రద్దుతో చెల్లుబాటు కాకుండా పోయిందని నివేదిక పేర్కొంది. ప్రభుత్వం సైతం విత్తనాలను విక్రయించలేదని, తమ పొలాల్లో పనిచేసే కార్మికులకు వేతనాలు చెల్లించాల్సి క్రమంలో పెద్ద రైతులు సైతం నగదు కొరతతో ఇబ్బందులు ఎదుర్కొన్నారని వెల్లడించింది. నగదు కొరతతో నేషనల్ సీడ్ కార్పొరేషన్‌కు చెందిన 1.38 లక్షల క్వింటాళ్ల గోధుమ విత్తనాలు విక్రయానికి నోచుకోలేదని తెలిపింది. పాతనోట్లతోనూ గోధుమ విత్తనాలు కొనుగోలు చేయవచ్చని ప్రభుత్వం తర్వాత సడలింపు ఇచ్చినా పరిస్థితి మెరుగుపడలేదని పేర్కొంది. -
‘అది అనాలోచిత నిర్ణయం’
సాక్షి, న్యూఢిల్లీ : రెండేళ్ల కిందట చేపట్టిన నోట్ల రద్దు దుష్ర్పభావాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయని మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ అన్నారు. ఆర్థిక వ్యవస్థ నేడు ఎదుర్కొంటున్న సమస్యలు నోట్ల రద్దు పర్యవసానమేనని ఆయన వ్యాఖ్యానించారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని అనాలోచిత చర్యగా ఆయన అభివర్ణించారు. భారత ఆర్థిక వ్యవస్థ, సమాజంపై నోట్ల రద్దు విరుచుకుపడిన తీరు ఇప్పుడు అందరికీ తేటతెల్లమైందన్నారు. ఆర్థిక వృద్ధిపైనా నోట్ల రద్దు ప్రభావం కనిపిస్తోందని, యువతకు ఉద్యోగాలు కొరవడటం, చిన్నతరహా పరిశ్రమలు నగదు లభ్యత లేకపోవడంతో కుదేలయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక దుస్సాహసాలు దేశంపై దీర్ఘకాల ప్రతికూల ప్రభావాన్ని ఎలా చూపుతాయో ఈ రోజు మనకు గుర్తుకుతెస్తోందని, ఆర్థిక విధాన నిర్ణయాలను అప్రమత్తతో, ఆచితూచి తీసుకోవాల్సిన అవసరాన్ని నొక్కిచెబుతున్నదని మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు. -
రోజువారీ కార్మికులు, ఉద్యోగులపై తీవ్ర ప్రభావం
పెద్ద నోట్ల రద్దు.. నల్లధనంపై యుద్ధంలా ప్రకటించిన ఈ నిర్ణయం దీర్ఘకాలికంగా ప్రయోజనం ఇస్తుందంటూ ఓ వైపు ప్రభుత్వం ప్రకటించినా.... మరోవైపు చిన్న కార్మికులు చితికిపోయారు. నోట్ల రద్దు తర్వాత చేపట్టిన ఎన్నో అధ్యయనాల్లో ఈ విషయం తేలింది. అంతేకాక ప్రభుత్వం తాజాగా చేపట్టిన సొంత సర్వేలో కూడా ఈ విషయమే వెల్లడైంది. నవంబర్‌లో ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన పెద్ద నోట్ల రద్దు తర్వాత రోజువారీ కార్మికులకు ఉద్యోగాలు కల్పించడంలో తీవ్ర ప్రతికూలం ఏర్పడిందని, కాంట్రాక్ట్ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపిందని ప్రభుత్వ సొంత సర్వే ప్రకటించింది. అయితే సాధారణ ఉద్యోగాలు వృద్ధి చెందాయని లేబుర్ బ్యూరో నిర్వహించిన అధికారిక సర్వే తెలిపింది. 2017 జనవరి-మార్చి కాలంలో మొత్తం ఉద్యోగాల సృష్టి 1,85,000 ఉందని బ్యూరో ఐదవ క్వార్టర్లీ రిపోర్టు పేర్కొంది. తయారీ, నిర్మాణ, వాణిజ్యం, రవాణా, నివాసం, రెస్టారెంట్లు, ఐటీ, విద్య, ఆరోగ్యం వంటి ఎనిమిది రంగాల్లో లేబర్ బ్యూరో సర్వే చేపట్టింది. మొత్తం 81 శాతం ఉద్యోగాలు ఈ రంగాలే కల్పిస్తున్నాయి. అయితే జనవరి-మార్చి కాలంలో మాత్రం కాంట్రాక్ట్ ఉద్యోగులు 26వేలకు తగ్గారని, ముందటి క్వార్టర్లో ఈ సంఖ్య 1,24,000గా ఉందని తెలిపింది. అదేవిధంగా రోజువారీ కూలీ అందుకునే వర్కర్లు 2016-17 క్వార్టర్లో 53వేలకు పడిపోయారని పేర్కొంది. ముందటి క్వార్టర్లో ఈ ఉద్యోగులు కూడా 1,52,000గా ఉన్నారు. రెగ్యులర్ జాబ్స్ మాత్రం 1,97,000కు పెరిగినట్టు వెల్లడైంది. అధికారిక రంగంలో ఫుల్‌టైమ్ వర్కర్లకు వేతనాలు చెక్‌లు లేదా బ్యాంకు అకౌంట్లకు చెల్లిస్తారని, కానీ కాంట్రాక్ట్, రోజువారీ కూలీలకు నగదు రూపంలోనే చెల్లించాల్సి ఉంటుందని, ఈ నేపథ్యంలో పెద్ద నోట్ల రద్దు వీరిపై తీవ్ర ప్రభావం చూపినట్టు ఐజీసీ ఇండియా సెంట్రల్ ప్రొగ్రామ్ దేశీయ డైరెక్టర్, గణాంకాల మాజీ అధికారి ప్రొనబ్ సేన్ తెలిపారు. కాంట్రాక్ట్ వర్కర్లలో తయారీ, వాణిజ్యం,ఐటీ రంగాల్లో ఉద్యోగాల సృష్టి తక్కువగా జరిగిందని, నిర్మాణం, రవాణా, విద్య, నివాసం రంగాల్లో ఉద్యోగాల కోత చూశామని పేర్కొన్నారు. అన్ని రంగాల్లోనూ కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఉద్యోగాల సృష్టి నెమ్మదించిందని చెప్పారు. -
నోట్ల రద్దు ఎఫెక్ట్: పార్లమెంటరీ కమిటీ ఆరా
సాక్షి,న్యూఢిల్లీ: నోట్ల రద్దు లక్ష్యాలు,ఈ నిర్ణయం పర్యవసానాలపై పార్లమెంటరీ కమిటీ గురువారం ఆర్థిక మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులను ప్రశ్నించింది. నోట్ల రద్దు ప్రభావాన్ని పూర్తిగా అంచనావేసేందుకు పలు మంత్రిత్వ శాఖల అధికారులను, రాష్ట్రాల ప్రతినిధులతో మాట్లాడాలని నిర్ణయించింది. గత ఏడాది నవంబర్ 8న ప్రకటించిన నోట్ల రద్దు వ్యవహారంపై మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత వీరప్ప మొయిలీ నేతృత్వంలో ఏర్పాటైన ఆర్థిక వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ పర్యవేక్షిస్తున్న విషయం తెలిసిందే. ఇక నోట్ల రద్దు పర్యవసానాలపై ఆర్థిక శాఖ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్, ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్ కుమార్, సీబీడీటీ చైర్మన్ సుశీల్ చంద్రలు పార్లమెంటరీ కమిటీకి వివరించారు. నల్లధనం నియంత్రణ, ఉగ్రకార్యకలాపాలు, డిజిటల్ లావాదేవీలపై నోట్ల రద్దు ప్రభావం గురించి పార్లమెంటరీ కమిటీ సభ్యులు అధికారులను ప్రశ్నించినట్టు సమాచారం. నోట్ల రద్దు బ్రాండ్ ఇండియా ప్రతిష్టను దెబ్బతీసిందని ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిసింది. -
నోట్ల రద్దుపై ఆ సర్వే తేల్చిందిదే..
సాక్షి,న్యూఢిల్లీ: సరిగ్గా ఏడాది కిందట ప్రధాని మోదీ ఇచ్చిన నోట్ల రద్దు షాక్‌కు సామాన్యులు విలవిలలాడారు. అవినీతి, నల్లధనం అంటూ చెలామణిలో ఉన్న నగదును చెప్పాపెట్టకుండా రద్దు చేసి బ్యాంకుల ముందు పడిగాపులు కాసేలా చేశారు. అయితే నోట్ల కష్టాలకు ఏడాది అవుతున్న సందర్భంగా ఓ సర్వే ఆసక్తికర ఫలితాలు వెల్లడించింది. నోట్ల రద్దును ప్రజలు ఇప్పటికీ స్వాగతిస్తున్నారని, మోదీ మ్యాజిక్కు వెన్నుదన్నుగా నిలిచారని ఈటీ ఆన్లైన్ సర్వే తేల్చింది. నోట్ల రద్దు విజయవంతమైందని ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 38 శాతం మంది పేర్కొనగా, 32 శాతం మంది విఫలమైందని చెప్పారు. 30 శాతం మంది మిశ్రమంగా ప్రతిస్పందించారు. ఈటీ ఆన్లైన్ సర్వేలో పదివేల మందికి పైగా తమ స్పందన తెలియచేశారు. దీర్ఘకాలంలో నోట్ల రద్దు దేశ ప్రయోజనాలను దెబ్బతీస్తుందని 26 శాతం మంది అభిప్రాయపడగా, వ్యవస్థలో పారదర్శకతను తీసుకొస్తుందని 32 శాతం మంది చెప్పారు. 42 శాతం మంది ఆర్థిక వ్యవస్థలో పారదర్శకతకు ఉపకరిస్తుందని, అయితే కొంతమేర ఎకానమీకి విఘాతం కలిగిస్తుందని అభిప్రాయపడ్డారు. ఉపాధి రంగంపై మాత్రం నోట్ల రద్దు ప్రభావంపై కొంత ప్రతికూలత ఎదురైంది. ఉద్యోగాలపై ఎలాంటి ప్రభావం ఉండదని 32 శాతం మంది పేర్కొనగా, దీర్ఘకాలంలో ఉద్యోగాలపై నోట్ల రద్దు ప్రతికూల ప్రభావం చూపుతుందని 23 శాతం మంది అభిప్రాయపడ్డారు. నోట్ల రద్దుతో పెద్దసంఖ్యలో ఉద్యోగాలు కోల్పోవలసివచ్చిందని 45 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఇక మోదీ రూ 2000 నోటును రద్దు చేస్తే నల్ల కుబేరులకు షాక్ ఇచ్చినట్టవుతుందని 56 శాతం మంది అభిప్రాయపడగా, ఆర్థిక వృద్ధికి విఘాతమవుతుందని 31 శాతం మంది పేర్కొన్నారు. ఈ నిర్ణయం నిజాయితీగా నడిచే వ్యాపారాలను దెబ్బతీస్తుందని 12 శాతం మంది చెప్పారు. -
మిస్‌ఫైర్ అయిందా..?
సాక్షి,న్యూఢిల్లీ: అవినీతి...నల్లధనం...ఉగ్రవాదం..నకిలీ నోట్లకు చెక్ పెట్టేందుకే సాహసోపేత నిర్ణయం తీసుకున్నామని గత ఏడాది నవంబర్ 8న నోట్ల రద్దు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్న క్రమంలో ఈ నిర్ణయం తీసుకుని సరిగ్గా ఏడాది అవుతోంది. ఏడాదిలో ప్రభుత్వం ఆశించిన లక్ష్యాలు నెరవేరాయా..? సగటు భారతీయుడికి ప్రయోజనాలు దక్కాయా..? ఆర్థిక వ్యవస్థ పరిస్థితి ఏంటి..? అందరి మదిలో మెదులుతున్న ఈ ప్రశ్నలకు సరైన సమాధానం దొరకడం లేదు. నోట్ల రద్దు పర్యవసానాలను బేరీజు వేసేందుకు ఏడాది సమయం స్వల్పకాలికమైనా ఈ వ్యవధిలో మోదీ నిర్ణయంతో సానుకూల ఫలితాల కన్నా ప్రతికూలతలే ఎదురయ్యాయి. చెలామణిలో ఉన్న 86 శాతం నగదు చెల్లదని ప్రకటిస్తూ మోదీ ప్రవచించిన ఉద్దేశాలు మొక్కుబడి మాటలుగా మిగిలాయి. వృద్ధి రేటు వెనక్కు... నోట్ల రద్దు నిర్ణయానికి ముందు ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఎకానమీగా పరుగులు పెట్టిన దేశ వృద్ధి రేటు నగదు కొరతతో డీలా పడింది. జీడీపీ వృద్ధి రేటు కనిష్టస్థాయికి పతనమైంది. విపక్షాలు, రాజకీయ పరిశీలకులతో పాటు ఆర్థిక నిపుణులూ నోట్ల రద్దు బెడిసికొట్టిందని విశ్లేషించారు. నల్లధనం, అవినీతి నియంత్రణ ప్రక్రియ నోట్ల రద్దుతో ముగిసేది కాదంటూ నోమురా హోల్డింగ్స్ చీఫ్ ఇండియా ఎకనమిస్ట్ సొనాల్ వర్మ స్పష్టం చేశారు. నల్లధనం కేవలం నగదులోనే ఉండదని, అది రియల్ ఎస్టేట్, బంగారం వంటి పలు రూపాల్లో ఉంటుందని వర్మ అన్నారు. నకిలీ కరెన్సీ సరిహద్దుల నుంచీ వెల్లువెత్తుతున్న నకిలీ నోట్ల ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు నోట్ల రద్దు ఉపకరిస్తుందని ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు. అతిపెద్ద నిర్ణయం ఈ దిశగానూ ఎలాంటి ఫలితాలను ఇవ్వలేదు. నోట్ల రద్దుకు ముందు చెలామణిలో ఉన్న మొత్తం కరెన్సీలో 0.07గా ఉన్న నకిలీ నోట్లు ఈ ఏడాది జూన్ 30 నాటికి 0.08 శాతానికి పెరిగాయి. మరోవైపు ఆర్బీఐ నూతనంగా ప్రవేశపెట్టిన రూ 2000 నోట్లలోనూ నకిలీలు ముంచెత్తుతున్నాయి. పెద్ద ఎత్తున రూ 2000, రూ 500 నకిలీ నోట్లు పట్టుబడుతూనే ఉన్నాయి. నల్లధనం గత ఏడాది నోట్ల రద్దు నిర్ణయం వెలువడిన వెంటనే సుప్రీం కోర్టుకు ప్రభుత్వ న్యాయవాది తెలిపిన వివరాల ప్రకారం చెలామణిలో ఉన్న రూ 15 లక్షల కోట్ల కరెన్సీలో మూడింట ఓ వంతు బ్యాంకుల్లో జమ కాదని, ఆ మేరకు పెద్దమొత్తంలో నల్లధనమంతా చెల్లుబాటు కాకుండా పోతుందని ప్రభుత్వం నివేదించింది.అయితే రద్దయిన నోట్లలో 99 శాతం నోట్లు తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థకు చేరినట్టు ఆర్బీఐ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. రద్దయిన నోట్లన్నీ బ్యాంకు డిపాజిట్ల రూపంలో నేరుగా వ్యవస్థలోకి ప్రవేశించడంతో ఇక బ్లాక్‌మనీని తుడిచిపెట్టడం ఎలా సాధ్యమని ఏబీఎన్ ఆమ్రో బ్యాంక్ సీనియర్ ఎకనమిస్ట్ అర్జెన్ డికుజెన్ విస్మయం వ్యక్తం చేశారు. డిజిటల్ లావాదేవీలు నోట్ల రద్దుకు ప్రభుత్వాన్ని ప్రేరేపించిన నగదు రహిత లావాదేవీలూ ఆశించిన మేర పుంజుకోలేదు. డిజిటల్ పేమెంట్ రంగంలో అతిపెద్ద సంస్థగా ఉన్న పేటీఎం నోట్ల రద్దు అనంతరం తన సబ్స్క్రైబర్లను భారీగా పెంచుకుని లాభాలు దండుకుంది. మ్యూచ్‌వల్ ఫండ్లలోకీ నిధులు వెల్లువెత్తాయి. ఇదే సమయంలో ఆర్థిక వ్యవస్థలోకి తిరిగి నగదు చెలామణి సాధారణ స్థితిలోకి చేరగానే డిజిటల్ లావాదేవీలు తగ్గుముఖం పట్టాయి.అయితే నోట్ల రద్దు నిర్ణయం లేకుంటే ఈ మాత్రమైనా డిజిటల్ లావాదేవీలు జరిగేవి కాదని ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుభాష్ గార్గ్ అంచనా వేశారు. ఉగ్రవాదం నోట్ల రద్దుతో ఉగ్రవాదానికి చెక్ పెట్టవచ్చని ప్రధాని మోదీ చెప్పినట్టుగా జమ్మూ కశ్మీర్లో నోట్ల రద్దు అనంతరం రాళ్ల దాడులు కొంత తగ్గుముఖం పట్టాయి. ఉగ్రవాద కార్యకలాపాలు తగ్గినా మళ్లీ క్రమంగా కశ్మీర్లో రాళ్ల దాడులు చోటుచేసుకుంటున్నాయి. నోట్ల రద్దుతో వీటికి నేరుగా సంబంధం ఉన్నదా అనేది అస్పష్టమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
నోట్ల రద్దు కష్టాలు: నవంబర్ 8 బ్లాక్‌డే
సాక్షి,న్యూఢిల్లీ: నోట్ల రద్దు మిగిల్చిన కష్టాల నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రకటించి ఏడాది అవుతున్న సందర్భంగా నవంబర్ 8న బ్లాక్ డే పాటించాలని పలు విపక్ష పార్టీలు ప్రకటించాయి. నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైన తీరును ప్రతిబింబిస్తూ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించాయి. ఈ శతాబ్ధంలోనే అతిపెద్ద కుంభకోణంగా నిలిచినందునే ఆ రోజు బ్లాక్‌డే పాటించాలని పిలుపు ఇచ్చామని కాంగ్రెస్ నేత, రాజ్యసభ విపక్ష నేత గులాం నబీ ఆజాద్ పేర్కొన్నారు. నోట్ల రద్దు నిర్ణయం పూర్తిగా తొందరపాటు చర్యని ఆయన అభివర్ణించారు.ప్రజలకు కడగండ్లు మిగిల్చిన నోట్ల రద్దు నిర్ణయానికి వ్యతిరేకంగా నవంబర్ 8న దేశవ్యాప్తంగా 18 రాజకీయ పార్టీలు నిరసన ర్యాలీలు నిర్వహిస్తాయని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయంతో ప్రజలు మరణించిన ఘటన ప్రపంచ చరిత్రలో ఇదేనని అన్నారు. నోట్ల రద్దుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని విపక్షాల భేటీ అనంతరం తృణమూల్ నేత డెరెక్ ఒబ్రెన్, జేడీయూ నేత శరద్ యాదవ్‌లు పేర్కొన్నారు.నోట్ల రద్దుకు వ్యతిరేకంగా సమైక్యంగా పోరాడాలని కాంగ్రెస్, తృణమూల్,ఎస్పీ, బీఎస్పీ, డీఎంకే, వామపక్షాలు, జేడీ(యూ) చీలిక వర్గం సహా 18 రాజకీయ పార్టీలు నిర్ణయించాయి. -
‘పారదర్శకత..అక్కడ పనికిరాదు’
వాషింగ్టన్: నోట్ల రద్దుపై అత్యంత గోప్యతను పాటించడాన్ని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమర్ధించారు. ఈ అంశంలో పారదర్శకత లేకుండా, ముందస్తు సమాచారమిస్తే నోట్ల రద్దు అక్రమాలకు నిలయమయ్యేదని చెప్పారు. ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్‌ల వార్షిక సదస్సుల్లో పాల్గొనేందుకు అమెరికాలో పర్యటిస్తున్న జైట్లీ నోట్ల రద్దు, జీఎస్టీ వంటి నిర్ణయాలు భారత ఆర్థిక వ్యవస్థను పటిష్ట స్థితిలో నిలిపేలా సాగుతాయని పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న వ్యవస్థాగత మార్పులతో రానున్న రోజుల్లో దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తి ప్రక్షాళన కావడంతో పాటు సుధృడ ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు బాటలు పడతాయని చెప్పారు. నోట్ల రద్దుపై ముందస్తు సమాచారం ఇస్తే ప్రజలు తమ చేతుల్లో ఉన్న డబ్బుతో బంగారం, డైమండ్, భూములు కొనడంతో పాటు పలు నగదు లావాదేవీలకు పాల్పడేవారని ప్రతిష్టాత్మక కొలంబియా యూనివర్సిటీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ జైట్లీ చెప్పుకొచ్చారు. ‘పారదర్శకత వినడానికి ఇది మంచి పదం..కానీ ఈ విషయంలో పారదర్శకత పాటించినట్టయితే అది తీవ్ర తప్పిదాలకు దారితీసేది’ అని వ్యాఖ్యానించారు.నోట్ల రద్దు అనంతరం ప్రజల్లో చిన్నపాటి అలజడి కూడా చోటుచేసుకోలేదని, ఇదే ఈ నిర్ణయం విజయవంతమైందనడానికి సంకేతమని జైట్లీ తెలిపారు. నోట్ల రద్దుతో ప్రజలకు తీవ్ర అసౌకర్యం ఏర్పడినా దేశ ప్రయోజనాల కోసం దీన్ని స్వాగతించారని చెప్పారు. నోట్ల రద్దు ఫలితంగా డిజిటల్ లావాదేవీలు రెట్టింపయ్యాయని, పెద్దసంఖ్యలో ప్రజలు పన్ను పరిథిలోకి వచ్చారన్నారు. -
అది అపరిపక్వ నిర్ణయమన్న శరద్ యాదవ్
న్యూఢిల్లీః నోట్ల రద్దుపై ఆర్బీఐ వెల్లడించిన గణాంకాలతో ఈ నిర్ణయం అపరిపక్వమైనదని తాను గతంలో చేసిన వ్యాఖ్యలు నిజమయ్యాయని జేడీ(యూ) నేత శరద్ యాదవ్ అన్నారు. నోట్ల రద్దు నిర్ణయం ప్రభుత్వం ఆశయాల్లో ఏ ఒక్కదాన్నీ చేరుకోలేదని విమర్శించారు. నోట్ల రద్దుతో ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో రైతులు తమ ఉత్పత్తులను తక్కువ ధరలకే అమ్ముకుని 50 నుంచి 60 శాతం వరకూ ఆదాయాలను కోల్పోయారని అన్నారు. ప్రభుత్వం ఎలాంటి ముందస్తు కసరత్తు చేపట్టకుండా తీసుకున్న నిర్ణయంతో కోట్లాది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.నోట్ల రద్దు నిర్ణయం ప్రభావం నుంచి ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ తేరుకోలేదని అన్నారు. -
నోట్ బ్యాన్ ఎఫెక్ట్ : 5,100 నోటీసులు జారీ
న్యూఢిల్లీ : అనుమానిత పెద్ద మొత్తంలో డిపాజిట్లపై ఆదాయపు పన్ను శాఖ కొరడా ఝుళిపించినట్టు ప్రభుత్వం పేర్కొంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత అనుమానిత డిపాజిట్లపై దాదాపు 5100 నోటీసులు జారీచేసినట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఈ నోటీసుల ద్వారా లెక్కలో చూపని నగదు రూ.5400 కోట్లకు పైనేనని గుర్తించినట్టు బుధవారం ప్రభుత్వం పార్లమెంట్ కు తెలిపింది. పెద్ద నోట్ల రద్దు అనంతరం 1,100 సెర్చ్, సర్వే ఆపరేషన్లను ఐటీ డిపార్ట్ మెంట్ చేపట్టిందని, దానిలో గుర్తించిన అనుమానిత పెద్ద మొత్తంలో డిపాజిట్లకు 5100 నోటీసులు పంపిందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ లోక్ సభకు లిఖిత పూర్వకంగా తెలిపారు. 2016 డిసెంబర్ 30తో ముగిసిన 50 రోజుల డీమానిటైజేషన్ విండోలో 17.92 లక్షల మంది ప్రజల ట్యాక్స్ ప్రొఫైల్స్ నగదు డిపాజిట్లకు అనుగుణంగా లేవని ఐటీ డిపార్ట్ మెంట్ గుర్తించినట్టు పేర్కొన్నారు. 2014 ఏప్రిల్1 నుంచి 2016 డిసెంబర్ 21 వరకు ట్యాక్స్ డిపార్ట్ మెంట్ జరిపిన ఎన్ఫోర్స్మెంట్ యాక్షన్ లో రూ.60వేల కోట్ల లెక్కలో చూపని నగదును గుర్తించిందని, రూ.2607 కోట్ల వెల్లడించని ఆస్తులను సీజ్ చేసినట్టు ఆయన లోక్ సభకు తెలిపారు. ఏప్రిల్-డిసెంబర్ కాలంలో జరిపిన సర్వేలోనూ రూ.9454 కోట్ల లెక్కలో చూపని ఆదాయాన్ని ఐటీ డిపార్ట్ మెంట్ గుర్తించినట్టు సంతోష్ కుమార్ గంగ్వార్ వెల్లడించారు. -
నోట్లరద్దు షాక్‌తో 'రియల్' విలవిల!
-
నోట్లరద్దు షాక్‌తో 'రియల్' విలవిల!
పెద్దనోట్ల రద్దుతో రియల్ ఎస్టేట్ రంగం చితికిపోయింది. ఉరుములేని పిడుగులా విరుచుకుపడిన నోట్లరద్దు దెబ్బకు వాణిజ్య గృహనిర్మాణ రంగంలో దాదాపు స్తంభించిపోయే పరిస్థితి నెలకొంది. 2016 సంవత్సరం ప్రథమార్థంలో (మొదటి ఆరు నెలల్లో) ఏడుశాతం వృద్ధిని నమోదుచేసిన రియల్ ఎస్టేట్ రంగం ద్వితీయార్థంలో ఏకంగా 23శాతం పతనమైంది. దేశంలోని టాప్ ఎనిమిది నగరాల్లోనూ నోట్లరద్దు దెబ్బకు రియల్ ఎస్టేట్ రంగం దారుణంగా దెబ్బతిన్నదని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా తాజా నివేదికలో వెల్లడించింది. నోట్ల రద్దు ప్రభావంతో రియల్ రంగంలో కొత్త వెంచర్లు ఏకంగా 46శాతం పడిపోయాయని పేర్కొంది. ఇక 2016 సంవత్సరంలోని చివరి త్రైమాసికంలో.. గడిచిన ఆరేళ్లలో ఎన్నడూలేనంత గడ్డు పరిస్థితిని రియల్ ఎస్టేట్ రంగం ఎదుర్కొన్నదని పేర్కొంది. గత ఏడాది చివరి మూడు నెలల్లో అమ్మకాలు 44శాతం పడిపోగా, కొత్త వెంచర్లు 61శాతం పడిపోయి.. రియల్టీ రంగం కుదులైందని నివేదిక స్పష్టం చేసింది. ఇటీవలి చరిత్రలోనే చూసుకుంటే 2016లోనే అత్యంత దారుణమైన పరిస్థితిని ఈ రంగం ఎదుర్కొన్నదని నివేదిక పేర్కొంది. అయితే, రియల్టీ రంగంలో దేశంలోని నగరాలన్నీ గడ్డు పరిస్థితిని ఎదుర్కోగా.. ఒక్క పుణె మాత్రం జూలై-డిసెంబర్ 2016 కాలంలో 29శాతం వృద్ధిని నమోదుచేయగలిగిందని నివేదిక పేర్కొంది. నోట్ల రద్దు తర్వాతి త్రైమాసికంలో ఈ నగరంలో 35శాతం పతనం నమోదైనప్పటికీ, అక్టోబర్ నెలలో అత్యధికంగా అమ్మకాలు జరగడం, కొత్త వెంచర్లు ఏర్పాటుకావడంతో ఆ ప్రభావాన్ని కొంతమేరకు నివారించగలిగాయని నివేదిక విశ్లేషించింది. నోట్ల రద్దు వల్ల రిజిస్ట్రేషన్లు పడిపోవడంతో వివిధ రాష్ట్ర ప్రభుత్వాల స్టాంప్ డ్యూటీ రూపంలో రూ. 1200 కోట్లు నష్టపోయాయని పేర్కొంది. ఇప్పుడేంటి పరిస్థితి? 2012 నుంచి ఇళ్ల ధరలు చాలామంది మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో లేకపోవడం రియల్ ఎస్టేట్ రంగాన్ని దెబ్బతీస్తున్నదని, ఈ నేపథ్యంలో పెరిగిన కొత్త ఆదాయ వర్గాలను ఆకట్టుకునేలా ధరలపై సమీక్ష చేసి ముందుకు సాగాల్సిన అవసరం డెవలపర్లపై ఉందని నివేదిక సూచించింది. అదేవిధంగా ఆర్బీఐ రానున్న మూడు నుంచి ఆరు నెలల్లో 25-50 బేసిస్ పాయింట్ల వరకు బ్యాంకు రుణాలు వడ్డీరేట్లను తగ్గిస్తే.. రియల్ రంగంలో కొనుగోళ్ల డిమాండ్ పెరిగే అవకాశముందని నివేదిక అంచనా వేసింది. రానున్న కేంద్ర బడ్జెట్ పైనా రియల్ ఎస్టేట్ రంగం భారీ ఆశలు పెట్టుకున్నదని, గృహరుణాల వడ్డీలపై పన్ను మినహాయింపు పరిమితిని బడ్జెట్లో పెంచితే అది మరింత ఊపునిచ్చే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు.